చిటారుకొమ్మన మిఠాయి పొట్లం

  • 687 Views
  • 12Likes
  • Like
  • Article Share

    సాహితీసుధ

జాతి వికాసానికి,  సామాజిక చైతన్యానికి ప్రతిబంధకంగా మారి, తరాల వెనుకబాటుతనానికి కారణమైన అనేక సామాజిక రుగ్మతల్లో  బాల్యవివాహాలు ఒకటి.  ఆనాటి సాంఘికాచారాల స్థితిగతులకు, సామాజిక పోకడలకు అద్దం పట్టే పాట‌లు సాహిత్యంతో పాటూ చలనచిత్రాల్లోనూ సమాంతరంగా ప్రయాణించాయి. కన్యాశుల్కం చిత్రం కోసం మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన ‘‘చిటారుకొమ్మను మిఠాయిపొట్లం’’ పాట ఆ కోవలోదే!
చుక్కలవలె,
కర్పూరపు ముక్కలవలె నీదుకీర్తి ముల్లోకములన్‌ క్రిక్కిరిసి పిక్కటిల్లేటట్టుగా జీవితం ఉండాలంటే విధవావివాహం చేసుకుని కీర్తి గడించాలనుకుంటాడు కన్యాశుల్కం నాటకంలో గిరీశం. గురజాడ గిరీశం పాత్రద్వారా ఆనాటి లోకం పోకడనీ, దురాచారాలు దుస్థితినీ, కళ్లకు కడితే, లేలేత పదమంజీరాలతో పాట ద్వారా మనసులో బొమ్మకట్టిస్తారు గీత రచయిత మల్లాది.
      శిష్యుడు వెంకటేశానికి చదువు చెప్పే మిషతో అగ్నిహోత్రావధాన్లు ఇంటికి వస్తాడు గిరీశం. విధవరాలైన బుచ్చమ్మను చూస్తాడు. విడో అయితేనేం! కుందనపుబొమ్మలా ఉందని మోహంలో పడతాడు. ‘‘కాముని విరి శరములబారికి నే నేమని సహింతునే చెలి! యేమని సహింతునే!’’ అనుకుంటూ.. ఆమెను తలచుకుంటూ వియోగగీతాలు పాడుకుంటాడు. కాని ఏం ప్రయోజనం! పట్నంలో వేసిన వేషాలుగానీ, మధురవాణి మీద ప్రయోగించిన బాణాలు గానీ ఆమె ముందు పనికిరాకుండా పోతాయి.
      ఈ బుచ్చమ్మను చేసుకుని నా విధవామహోత్సవం కథ పేపర్లో పడితే ఎంతకీర్తి! ఈ  కొమ్మను ఎలాగైనా మంచి చేసుకుని దారికి తెచ్చుకోవాల్సిందే! అనుకుంటాడు. సరసంగా ఏం మాట్లాడినా తెల్లబోయి చూస్తుంటుంది.
      రాత్రుళ్లు అరేబియాన్‌ నైట్స్, కాశీమజిలీలు, మధన కామరాజు కథలు చెబుతుంటే వింటోంది కాబట్టి అదేపనిగా విడో మ్యారేజీ విషయం గురించి కూడా చెవిలో ఊదితే నా పాచిక పారినట్టేననుకుంటాడు. నిజానికి గిరీశం మాటల్లో ఉదాత్తత ఎంత ఉన్నా ఆడపిల్లలని వంచన చేయడం, కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేయడం అతని నైజం. ఈ విషయాన్ని కరటకశాస్త్రి ముందుగానే పసిగట్టి ఇతగాడిని పెందరాళే తోవపట్టించకపోతే మొదటికే మోసం వస్తుంద నుకుంటాడు.
      బుచ్చమ్మను తన దారిలోకి తెచ్చుకునేందుకు గిరీశం పడే ప్రయాస అంతా ఇంతా కాదు. అవకాశం చిక్కినప్పుడల్లా వెంకటేశానికి పాఠం చెప్పే వంకతో పుస్తకాల్లో లేనివీ ఉన్నవీ కల్పించి, ఆమెకు చక్కలిగింత కలిగించేందుకు తపన పడతాడు. తన కవ్వింపు మాటలతో బుచ్చమ్మలో కదలిక రావాలి. జీవితం పట్ల కొత్త ఆశను కలిగించాలి. అందుకోసం గీరీశం ఏ చిన్న అవకాశం కుదిరినా వదులుకోడు. నాటకంలో అగ్నిహోత్రావధాన్ల లోగిలీ, పెరటి చెట్టు.. చెట్టు మీద కూర్చుని గిరీశం వెంకటేశానికి పాఠం చెప్పే సన్నివేశాన్ని నేపథ్యంగా చేసుకుని మల్లాది రాసిన పాట మూలానికి అతికినట్టు ఉంటుంది.
      గురజాడ కన్యాశుల్కం నాటకానికి స్వల్ప మార్పులతో 1955లో అదే పేరుతో పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆ చిత్రంలో మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన పాటకి ఘంటసాల వెంకటేశ్వరరావు స్వరకల్పన చేశారు. గురజాడ గిరీశాన్ని మనసులో నిలుపుకుని, ఆతని మార్మిక బుద్ధిని అవగతం చేసుకుని సాగే ఈ పాటలో తేటతెలుగు పదాలు అబ్బురం కలిగిస్తాయి.
చిటారు కొమ్మన మిఠాయి పొట్లాం
చేతికందదేం గురుడా! 
వాటంచూసి ఒడుపు చేసి వంచను కొమ్మను నరుడా!
పక్కన మెలిగే చక్కని చుక్కకు 
చక్కిలిగింత లేదేం గురుడా! 
కంచు మోతగా కనకం మోగదు

నిదానించరా నరుడా! అనే ఈ పాటలో అక్కడక్కడ రసగుళికల్లాంటి ద్వంద్వార్థాలు సొగసుగా కనిపిస్తాయి. కొమ్మ అంటే స్త్రీ, తరు శాఖ అని రెండర్థాలు కదా! ఛాందసంతో చెట్టెక్కి కూర్చున తండ్రి మాటని కాదని బుచ్చమ్మ పెళ్లికి ఒప్పుకోదు. అటువంటి స్త్రీకి జీవితం పై ఆశలు కలిగించడం అంత తేలికేం కాదు. సంప్రదాయాన్ని తోసిరాజని కదిలే మనిషికాదు, పూటకూళ్లమ్మ, మధురవాణి వంటి స్త్రీల మాదిరిగా లోకం పోకడ ఎరుగని మనిషి కాబట్టే కంచు మోతగా కనకం మోగదు అంటాడు మల్లాది.
      గిరీశం, వెంకటేశం జామచెట్టు ఎక్కి కూర్చుంటారు. బుచ్చమ్మ నీళ్లకోసమని బావి దగ్గరికి వస్తుంది. ఇదే తగిన తరుణమని పాఠాలు చెబుతూ మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నలు వేస్తుంటాడు వెంకటేశాన్ని... బుచ్చమ్మకి వినపడేటట్టుగా. క్రియేషన్‌ అంటే ఏమిట్రా! అని అడుగుతాడు. మళ్లీ తనే! ప్రపంచం ఎలా ఉన్నదీ! ‘కపిద్దాకర భూగోళ’ అని మను ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా! కపిద్దమంటే, నారింజపండు. భూమి నారింజ పండులా ఉందట. ‘‘యింతులు బదరీ ఫలములు యింతులు మారేడు పళ్లు యీడుకు జోడై బంతులు తామరమొగ్గలు దంతీకుచ కుంభములబోలు తరుణీ కుచముల్‌’’ అంటూ... అమరం లోని విషయాలని ఏకరువు పెడతాడు. ఇంకేమున్నాయీ ప్రపంచంలో అంటే దేశంలో ఒక దురాచారం ఉంది. ఏళ్లు ముదిరి కీళ్లు సడలిన ముసలాడికి ముక్కు పచ్చలారని పసి పిల్లలనిచ్చి పెళ్లిచేయడం. కాటికి కాళ్లుచాచుకునే వాళ్లతో పెళ్లి చేస్తే ఆ ఆడపిల్ల నిండు జీవితం నాశనమైపోదా! ఇది అన్యాయం కాదా!  ఈ తర్వాత ఎంత సొగసున్నా మంచి గుడ్డ కట్టుకోనివ్వరు. సరకు పెట్టుకోనివ్వరు. చంద్రబింబం వంటి ముఖంపైన ఇంత కుంకుమ బొట్టున్నా తట్టుకోలేరని బుచ్చమ్మను చూస్తూ అంటాడు. విధవలు పెళ్లడటం తప్పుకాదనేందుకు పరాశర స్మృతి ఆధారమని, వేదం కూడా దీనికి వత్తాసు పలికిందంటాడు గిరీశం.
పండంటి పిల్లకి పసుపు కుంకుం
నిండుకున్నదేం గురుడా! 
దేవుడు చేసిన లోపాన్ని నీవు దిద్దుకురారా నరుడా! 
కొంచెం హద్దుమీరరా నరుడా!

      కాసుకులోనై తల్లీదండ్రీ, నెనరూ న్యాయం విడనాడీ, పుత్తడిబొమ్మ పూర్ణమ్మను ఒక ముదుసలి మొగుడికి ముడివేస్తే జరిగే పరిణామాలేంటో సమాజానికి తెల్సు. అక్కడ పూర్ణమ్మ ఆత్మత్యాగం చేసుకుంటుంది. ఇక్కడ బుచ్చమ్మ బలిపశువవుతుంది. లోకం తప్పుడు తోవలో వెళుతుంటే ఆ తోవ నుంచి మళ్లించి మంచి తోవలో పెట్టడం సంఘసంస్కరణ. ఏమిటా తప్పుడు తోవ అంటే ముసలివాళ్లకి చిన్న పిల్లల్నిచ్చి పెళ్లిచేయడం, డబ్బుకి పిల్లల్ని అమ్ముకోవడం. ఇలా చేస్తే.. అత్తారు బెత్తంగా పెంచుకున్న పిల్లలకి ఇంత పసుపు కరువై, నెత్తిన ఇంత ముసుగు రాదా! మరి దేవుడు చేసిన లోపాన్ని దిద్దుకురావాలంటే గిరీశం అన్నట్టు లోకాన్ని మరమ్మత్తు చేయడానికి కంకణం కట్టుకోవాలి. 
విధవలందరికి శుభకార్యాలు 
విధిగా చెయమంటావా గురుడా
విధిగా చెయమంటావా
అవతారం నీదందుకోసమే ఆరంభించరా నరుడా
వాటం చూసి ఒడుపుచేసి వంచను కొమ్మను నరుడా!
 
      ‘‘పూర్వులాదియందు అతిబాల్యవివాహమన్న పేరే ఎరిగియుండలేదు. అస్వాభావికమైన యీ అతిబాల్యవివాహపీడ ఆచార పిశాచావేశ బలముచే వచ్చినదే కానీ విధి విహితమైనది’’ కాదంటారు కందుకూరి తన స్వీయచరిత్రలో. ఇదంతా ఆచారం పేరిట మనకు మనం చేసుకుంటున్న మోసం అని గుర్తించారు కాబట్టే స్త్రీ పునర్వివాహం విషయమై 1879లో రాజమహేంద్రవరం బాలికా పాఠశాల మందిరంలో తన ప్రసంగాన్ని చదివినప్పుడు... సనాతన హిందువులనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్ల మనసు మార్చడానికి అస్త్రంలా ప్రయోగిస్తానని కరటక శాస్త్రితో గిరీశం చెప్పేదీ ఈ ఉపన్యాసం గురించే.
      బాల్యవివాహాల నిర్మూలన అనేది భారతదేశానికే ప్రత్యేకమైన సమస్య. సంఘ సంస్కరణలో ఒక భాగంగా చేసుకుని పోరాడటంలో వీరేశలింగం ఎన్నో అగచాట్లు పడ్డారు. బంధువులు వెలివేశారు. జాతి భ్రష్టునిగా చూశారు. 1881 డిసెంబర్‌ 5 రాత్రి రాజమహేంద్రవరంలో మొదటి స్త్రీ పునర్వివాహం జరిగినప్పుడు వీధి పొడవునా రక్షక భటులూ.. విద్యార్థులు రక్షణగా ఉండాల్సివచ్చింది.
      అచ్చతెలుగు పదాలతో సలక్షణ భావ ప్రసరణ అందిస్తూ సాగే ఈ పాటలో కన్యాశుల్యం ప్రధాన కథాసూత్రం ఇమిడిఉంది. పాటలోనే కాదు పదాల పొందికలోనూ లోతైన ఆలోచన సరళి ఉంది. పాడుకుంటే పాట ఇది. అవలోకిస్తే ఒకనొకకాలపు దుష్ట సంప్రదాయపు నీడ. వేయి ఆలోచనల సంఘర్షణకి, లక్ష భావాల చైతన్యానికి ఊపిరులూదే పాట ఇది.


వెనక్కి ...

మీ అభిప్రాయం