ప్రపంచం ముందుకు సాగుతున్న కొద్దీ కొన్ని భాషలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కారణాలు ఏవైనా అవి అంతరించే దశకు చేరుకుంటున్నాయి. కానీ, భాష అంటే కేవలం భావాలను పంచుకునే మాధ్యమం మాత్రమే కాదనీ... ప్రతి భాషా ఓ సంస్కృతికి ప్రతిబింబమనీ గుర్తించిన రోజున ప్రపంచంలోని ప్రతి భాషనూ కాపాడుకోవాలన్న ఆశయం పురుడుపోసుకుంటుంది. అలాంటి ఉన్నతాశయమే ఉంటే భాష పరిరక్షణకు తగిన ఉపాయం దానికదే కనిపిస్తుంది. ఆదిమభాషల సముద్దరణకు పాటుపడుతున్న కెనడాలోని ఓ సంస్థకూ అలాంటి ఉపాయమే ఒకటి తట్టింది.
బ్రిటిష్ కొలంబియా కెనడా దేశంలోని ఓ ముఖ్య భాగం. కెనడా పశ్చిమతీరాన ఉండే ఈ ప్రాంతానికి పది వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అయితే వలసపాలన వల్లా, ప్రపంచీకరణ వల్లా ఆ ఘన చరిత్రలో భాగమైన ఆదిమ భాషలెన్నో అంతరించిపోయే స్థితికి వచ్చాయి. ఈ పరిస్థితిలో రవ్వంతైనా మార్పు తెచ్చేందుకు బ్రిటిష్ కొలంబియా ప్రభుత్వం 1990లో ‘ద ఫస్ట్ పీపుల్స్ కల్చరల్ కౌన్సిల్’ను ఏర్పాటుచేసింది. అది ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ, అదృష్టవశాత్తూ చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఆదిమ సంస్కృతినీ, వాళ్ల భాషలనీ పరిరక్షించేందుకు నిర్విరామంగా కృషి చేస్తోంది. ఈ నెల ఆ సంస్థ ఒక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే...
‘ఫస్ట్ వాయ్సెస్ కీబోర్డ్’
అంతర్జాలంలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉన్న ఈ యాప్ సాయంతో వందకు పైగా భాషల్లో టైప్ చేయవచ్చు. ఆదిమ భాషల్లో ఉండే ప్రత్యేక సంకేతాలు, అక్షరాలు చాలా మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉండవు. కానీ ప్రస్తుత యాప్లో ఇలాంటి అరుదైన సంకేతాలు, అక్షరాలు అన్నీ ఉన్నాయి. దీని ద్వారా కెనడాలోని ముఖ్యమైన 60 ఆదిమ భాషలతో పాటుగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికాలకు చెందిన భాషల్లోనూ టైప్ చేయవచ్చు. అలా ఈ యాప్ ద్వారా ఆయా భాషలన్నింటిలోనూ సంక్షిప్త సందేశాలను పంపించుకునే అవకాశం లభిస్తుందన్న మాట. కేవలం సందేశాలను పంపడం వరకే దీని ఉపయోగం పరిమితం కాలేదు. ఈ యాప్ ద్వారా ఆదిమ భాషల్లోనేే ఈమెయిళ్లు, పత్రాలను రూపొందించుకోవచ్చు. ఇందుకోసం యాపిల్ లేదా ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే ఫోన్/ఐపాడ్ ఉంటే చాలు.
అయితే ఏంటట!
సందేశాలను పంపుకునేందుకు ఓ యాప్ను రూపొందించినంత మాత్రాన ఆదిమభాషలు అంతరించిపోకుండా ఉంటాయా? అన్న సందేహం రావచ్చు. దానికి ఈ సంస్థ దగ్గర ఉన్న కొన్ని గణాంకాలే తగిన సమాధానం చెబుతున్నాయి. వీటి ప్రకారం... ప్రస్తుతం బ్రిటిష్ కొలంబియాలోని ఆదిమ భాషలను కేవలం నాలుగంటే నాలుగు శాతం ప్రజలు మాత్రమే ధారాళంగా మాట్లాడగలుగుతున్నారు. ఈ నాలుగు శాతం మందిలో కూడా ఎక్కువమంది 65 ఏళ్లు పైబడినవారే. అంటే... ఆదిమజాతుల యువత నిదానంగా తమ మాతృభాషలకు దూరమవుతోందన్న మాట. అలాంటి యువత వెళ్లే సాంకేతిక దారిలోనే వారికి మాతృభాషను చేరువ చేయడంతో, సత్ఫలితాలు వస్తాయన్నది సంస్థ నమ్మకం.
నమ్మకం బలపడుతోంది!
‘ఫస్ట్ వాయ్సెస్ కీబోర్డ్’ యాప్ను విడుదల చేసిన కొద్దిరోజులకే అది ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. వేల మంది ఈ యాప్ను వాడటం మొదలుపెట్టారు. తమ మాతృభాషలో టైప్ చేసుకోవడం చాలా తృప్తిగా ఉందంటూ చాలామంది సంతోషపడుతున్నారు కూడా. ఆదిమ భాషల్లో విద్యను అందించే పాఠశాలల్లో ఈ యాప్ను విస్తృతంగా వాడటం మొదలుపెట్టేశారు. పిల్లలకు ఆదిమభాషను పరిచయం చేసేందుకు, అందులో పాఠాలను బోధించేందుకు దీని సాయాన్ని తీసుకుంటున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలో భావాలను వ్యక్తీకరించేందుకు ఈ యాప్ను వాడమంటూ ఓ ప్రచారోద్యమాన్ని చేపట్టింది సంస్థ.
మొదలూ కాదు... చివరా కాదు!
యాప్ల ద్వారా ఆదిమభాషలను కాపాడే ప్రయత్నం చేయడం ఈ సంస్థకు కొత్తేమీ కాదు. ఇప్పటికే సంస్థ సెంకెటెన్, నిస్గా వంటి అనేక ఆదిమభాషలకు సంబంధించిన నిఘంటువులను యాప్ రూపంలో అందించింది. 2012లోనే గూగుల్ చాట్ ద్వారా సంభాషించుకునేందుకు, ఆదిమభాషల్లో ఒక యాప్ను రూపొందించింది. తాజాగా ‘ఫస్ట్ వాయ్సెస్ కీబోర్డ్’ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ప్రయత్నం ఇంకా సంపూర్ణం కాలేదు. సంస్థ అందిస్తున్న యాప్లో తమ భాష లేదంటూ కొందరు అప్పుడే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ‘ద ఫస్ట్ పీపుల్స్’ సంస్థ మున్ముందు ఆదిమభాషను సాంకేతికతకు చేరువ చేసే ప్రతి ఒక్క అవకాశాన్నీ సుసాధ్యం చేస్తుందని ఆశిద్దాం.
సుదూర లక్ష్యం
కెనడాలో ఆదిమభాషలను పరిరక్షించేందుకు ఇటు ప్రజాసంఘాలు, అటు ప్రభుత్వ సంస్థలు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఇంకా సాధించాల్సిన లక్ష్యం సుదూరంగానే ఉంది. ఆదిమభాషలను ఆయా ప్రాంతాల్లో అధికారిక భాషలుగా గుర్తిస్తేనే వాటి ఉనికి సాధ్యపడుతుందంటూ ఓ వాదన ఊపందుకుంటోంది. మాతృభాషకి దూరం కావడానికీ, ఆత్మహత్యలకు పాల్పడటానికీ మధ్య సంబంధం ఉందని మొన్నా మధ్య ఓ కెనడా పరిశోధన తేల్చి చెప్పడంతో... భాష కేవలం ఓ సమాచార సాధనం కాదనీ, మనిషి అస్తిత్వానికి ఓ చిహ్నమనీ తేలిపోయింది. కెనడా ప్రధాని ట్రూడో సైతం ఆ మధ్య ఓ సమావేశంలో మాట్లాడుతూ ఈ పరిశోధనను ఉట్టంకించారు. కానీ ఆదిమభాషలను అధికారిక భాషలుగా గుర్తించాలన్న అభ్యర్థనను మాత్రం దాటవేశారు. (ఆ పరిశోధన వివరాలకు ‘తెలుగు వెలుగు’ జూన్ సంచిక చూడవచ్చు)
ఫస్ట్వాయిసెస్.కాం
ఆదిమజాతి ప్రజల మధ్య వారధిగా నిలిచేందుకు జాన్ ఎలియట్, పీటర్ బ్రాండ్ అనే ఇద్దరు ఉపాధ్యాయులు చేసిన ఆలోచనే firstvoices.com. ఈ దానికి ‘ద ఫస్ట్ పీపుల్స్’ సమాఖ్య ఆర్థికసాయంతో పాటుగా తగిన అండదండలను అందించడంతో తన లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ఈ వెబ్సైట్ ద్వారా దాదాపు 50 ఆదిమభాషలను ఆటలు, కథలు, పాటల రూపంలో సులువుగా నేర్చుకోవచ్చు. అంతేకాదు! ఆయా భాషలకు చెందిన జానపద గీతాలను, పదాల ఉచ్చారణను కూడా వినవచ్చు. ఆయా సమాజాల చరిత్ర, కళలను గురించి తెలుసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కెనడా ఆదిమ భాషలకి ఈ వెబ్సైట్ ఒక మూలనిధిగా మారుతోంది.
ఇదొక్కటే ప్రయత్నం కాదు
యాప్ల ద్వారా ఆదిమభాషలకు మరింత బలాన్ని అందించే ప్రయత్నాలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రభుత్వాల సాయంతో, కొన్ని సాంకేతిక సంస్థల ఆధ్వర్యంలో... కొన్ని ఉచితంగా, మరికొన్ని నామమాత్రపు రుసుముతోనూ చాలా యాప్లే అందుబాటులో ఉన్నాయి. మచ్చుకి కొన్ని..