ఇంగువ కట్టిన గుడ్డలం

  • 895 Views
  • 5Likes
  • Like
  • Article Share

జోగు
ఇదో పెద్ద తెరచాప ఓడ. వెదురుబద్దలు, వేప బెత్తాలను పేర్చి తెరచాపలు అల్లుతారు. మూడు నుంచి పన్నెండు దాకా తెరచాపలను అమర్చిన ఓడను ‘జోగు’ అంటారు. ‘‘సుడివడ్డ ముత్యాల జోగివోలె’’ అని కాశీఖండంలో శ్రీనాథుడి ప్రయోగం ఒకటుంది. ‘జోంగ్‌’ అనే జావనీ, మలయా భాషలకు చెందిన ‘జోంగ్‌’ అనే పదం దీనికి మూలం. ఈ ఓడల్ని చైనీయులు మొదట తయారు చేశారట! అవసరం లేనప్పుడు దీని తెరచాపలను దింపి, చుట్టగా చుట్టి ఓడ కంబాలకు కట్టేస్తారు. నాటు పడవలు, మామూలు ఓడలను కొయ్యచీలలు, కొబ్బరిపీచు పురులతో బిగిస్తారు. జోగులను మాత్రం కొయ్య పలకలు, ఇనుప చీలలతో బిగించి బలిష్ఠంగా నిర్మించేవారు. పద్నాలుగో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇబన్‌ బతూతా, రషీదుద్దీన్‌ ఈ జోగుల గురించి తమ రచనల్లో ప్రస్తావించారు.


తాలవ్యీకరణం
ప్రాచీన ద్రావిడ కకారం తెలుగులో చకారంగా మారడమే తాలవ్యీకరణం. ఇది క్రీ.పూ.300, క్రీ.శ తొలి శతాబ్దాలకూ మధ్యకాలంలో జరిగి ఉంటుందని బరో అన్నారు. మూల ద్రావిడంలోనే ఈ మార్పు జరిగి ఉంటుందని కోరాడ రామకృష్ణయ్య అభిప్రాయపడ్డారు. దక్షిణ ద్రావిడం నుంచి తెలుగు విడిపోయే కాలంలోనో.. క్రీ.శ 5వ శతాబ్దానికి ముందో ఇది ఆరంభమై తెలుగులో సాహిత్యం ఏర్పడటానికి ముందున్న ప్రాచీనాంధ్రకాలానికి పూర్తయి ఉంటుందని భద్రిరాజు కృష్ణమూర్తి భావించారు. క్రీ.శ 395- 410 నాటి పెదవేగి శాసనంలో కనిపించే ‘కమ్బురాఞ్చెరువు, చెఞ్చెఱువు’ మాటల్లోని ‘చెఱువు’.. మూలద్రావిడ శబ్దం ‘కెఱయ్‌’ నుంచి వచ్చింది. కాబట్టి ఆనాటికే తాలవ్యీకరణం భాషలో స్థిరపడినట్లే! కిరాత శబ్దభవమైన చిలాత శబ్దం క్రీ.శ 3వ శతాబ్దం నాటి నాగార్జున శాసనంలో ఉంటుంది.


హరిగోలు
తెప్ప, ఏరు దాటించు పుట్టి అనే అర్థాలున్నాయి. పది పన్నెండుగురు కూర్చునేటట్టు గట్టిగా, గుండ్రంగా కట్టి, దానిపై దళసరి తోలు కప్పుతారు. ఇది పెద్ద కొప్పెరలాగా ఉంటుంది. అరుగుగోలు/ అరిగోలు అనీ పేరు. 


నాగలి
పొలందున్నే పనిముట్టు. ‘నాఙ్గేల్‌’ దీనికి మూలరూపం. నాగేలు/ నాగేల/ నాంగలి/ మడక అనేవి పర్యాయపదాలుగా వివిధ ప్రాంతాల్లో వాడుకలో ఉన్నాయి. వీటిల్లో మడక తప్ప మిగిలినవన్నీ అన్యోన్య రూపాంతరాలే. అంటే ఒకే చారిత్రక శబ్దం నుంచి పుట్టినవి.


ఇంగువ కట్టిన గుడ్డలం
ఇంగువ అనేది ఒనానొక చెట్టు జిగురు. హింగువు, రామఠం అని నిఘంటువు అర్థాలు. ఇంగువ లేకపోయినా ఆ పరిమళం దాన్ని చుట్టిపెట్టిన గుడ్డకు అట్టిపెట్టుకుని ఉంటుంది. ‘‘కఱియ జీలకర్ర గఱివేము గురుజయింగువ ప్రవర్జనీయకోటి అగుట..’’ అని భారతం- అనుశాసనిక పర్వంలో ఓ ప్రయోగం కనిపిస్తుంది. తనకి స్వయంగా ప్రతిభ లేకపోయినా.. తనవారి వల్ల కాస్తో కూస్తో ప్రతిభ కనబరిస్తే- ‘ఇంగువకట్టిన గుడ్డ కదా’ అని వ్యవహరించడం ఉంది. ‘మేం వాళ్లంత గొప్పవాళ్లం కాకపోయినా వాళ్లతో తిరిగాం కదండీ! ఇంగువ కట్టిన గుడ్డలం!’ అనడమూ పరిపాటి. 


అల్మారియో!
సామగ్రిని ఉంచడానికి గోడలో ఏర్పరచే బీరువా. గోడబీరువా అనీ అంటారు. అరమర/ అరమార/ అరమాలు/ అలమర/ అలమార / అల్మార/ ఆల్మారా/ అల్మారు.. ఇన్ని రూపాంతరాలున్న ఈ పదం ‘అల్మారియో’ అనే స్పానిష్‌ మాట నుంచి పుట్టింది. అల్మారిగా వాడుకలోకి వచ్చింది. ఫ్రెంచ్‌లో ఇదే ‘అర్‌మూర్‌’గా వ్యాప్తిలోకొచ్చింది.


దొండముక్కు
‘ఱెక్కప్రాసంగు దొండముక్కువడియె’, ‘బలుసుల్‌ పండెను దొండముక్కువడియెన్‌ బ్రాసంగుజేల్‌’ అంటూ కాశీఖండం, శివరాత్రి మాహాత్మ్యాల్లో రెండు ప్రయోగాలు కనిపిస్తున్నాయి. ‘దొండముక్కువడు’ అంటే ‘దొండముక్కులా ఎర్రబడటం’ అని శబ్దరత్నాకరం చెబుతోంది. శ్రీనాథుని రచనలో కనిపించే ఈ నుడికారం పాలమూరు ప్రాంతంలో ఈనాటికీ వాడుకలో ఉంది. అయితే.. ‘తొండముక్కువారు’ అంటే కంకికొస గింజలు ఎర్రబడటం. నిజానికి దీని శబ్దస్వరూపం ‘తొండముక్కే’ కానీ, దొండముక్కు కాదని అర్థమవుతుంది. ముదిరిన తొండ ముక్కు ఎర్రగా ఉండటం లోకప్రసిద్ధం. పదాదిలో సరళాదేశం రావడంతో తొండముక్కు కాస్తా దొండముక్కు అయిపోయింది.


చెప్పుకోండి చూద్దాం!
వంగతోటనుండు వరిమళ్లలోనుండు
జొన్నచేలనుండు చోద్యముగను
తలుపుమూలనుండు తలమీదనుండును
దీని భావమేమి తిరుమలేశ
ప్రశ్నలోనే సమాధానం ఇమిడి ఉండే ఉత్తరాలంకారం లాంటిదీ పొడుపుకథ. వంగ ఉండేది తోటలో. వరి- మళ్లలో ఉంటుంది. అలాగే, జొన్న- చేలల్లో; తలుపు- మూలలో; తల- శరీరంపైన కదా ఉండేది! ఇలా పొడుపులోనే విడుపు ఉండటం దీని ప్రత్యేకత.


రేగు
రేగి, రేణి, రేనె రూపాంతరాలు. ఇది పొలాలకు కంచెగా వేసే ముళ్లచెట్టు. పళ్లు చిన్నగా ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. వీటి ఆకులను పట్టు పురుగులకు ఆహారంగా ఉపయోగిస్తారు. వీటిలో ‘గంగరేగు, కాకిరేగు, కామరేగు, కాశీరేగు, కొండరేగు’ అనే రకాలున్నాయి. గంగరేగును మేలు జాతిగా ఎంచుతారు. దీన్నే ‘గంగిరేగు, గంగరేనే’ అనీ పిలుస్తారు. గంగరావీ ఇదీ ఒకటే అని పెద్దలు అంటారు. కానీ, గంగరావి పండ్లు తినరు.


పరస్పరాశ్రితం
అరై స్సందార్యతే నాభిః
నాభౌ చ ఆరాః ప్రతిష్ఠితాః
స్వామి సేవకయో రేవం
వృత్తి చక్రం ప్రవర్తతే!
‘‘మనింట్లో పెట్టెబండి, ఒంటెద్దుబండి, రెండెడ్ల బండి ఉన్నాయి కదా! వాటి చక్రాలు దినమూ చూస్తున్నావు కదా! ఎలా ఉన్నాయి.. చక్రాలు! చక్రం గుండ్రంగా ఉంది. దాని మధ్యన లావుపాటి తూము ఉంది. ఆ తూమును బండికంటి తూము అనీ, కుంభీ అని అంటారు. దాని చుట్టూ కర్రలు బిగించి ఉంటాయి. వాటిని ఆకులు అంటారు. సంస్కృతంలో వీటికి అర అని పేరు. చక్రం కుంభీకీ ఆకులు బిగిస్తారు. ఆ ఆకులతో కుంభీ నిలబడుతుంది అని శ్లోక అర్థం అన్నారు మా తాతగారు. ప్రపంచంలో ప్రతిదీ అన్యోన్యాశ్రితం. జీవయాత్ర సవ్యంగా జరగాలంటే ప్రతివ్యక్తీ ఇతరులతో సామరస్యంగా మెలగాలి. ఒక్క కొలువే కాదు ప్రతి పనీ పరస్పరాశ్రితమే. ఇది లోక సహజం. ఇది తెలీక అహంకరిస్తే పరిణామం సవ్యంగా ఉండదు అన్నారు మా తాతగారు’’

 - ‘హంపీ నుంచి హరప్పా దాకా’లో తిరుమల రామచంద్ర


ఎకసెక్కాలు
వెకచెకాలనీ అంటారు. పరిహాసపు మాటలని అర్థం. ‘‘వాడిపని పట్టిస్తాను. నాతో వెకాస్యాలా! వైదీకపగుంటడి వెకాస్యాలు నిజం అనుకుంటావేంటీ!’’ అని కన్యాశుల్కంలో గురజాడ ప్రయోగం. వెకిలి హాస్యాలే.. వెకాస్యాలు అయ్యిందనే వాదన ఉంది. ‘వెకసెక్కెం’ అనేది ప్రాచీన రూపం. తమిళంలో ఎక్కసెక్కమ్, మలయాళంలో ఎక్కచ్చెక్కమ్, కన్నడంలో ఎకసక్క, తుళులో ఎక్కచక్క అనే మాటలు వాడుకలో ఉన్నాయి. చేమకూర వేంకటకవి విజయవిలాసంలో అర్జునుణ్ని వర్ణిస్తూ... ‘‘చక్కెరవింటిరాజు ఎకసెక్కములాడగజాలు..’’ అనే పద్యంలో దీన్ని వాడాడు. 


మధుకరం - మాధుకరం
మధుకరాలంటే తేనెటీగలు. ఇవి ప్రతి పూవ్వునూ చుట్టాడుతూ ఏ కొంచెం తేనె దొరికినా పీలుస్తూ తర్వాత దాన్ని ఓ చోట కూడబెడతాయి. ఇలా మధుకరాల్లా ఇల్లిల్లూ తిరిగి అన్నం సంపాదించుకునే పనిని మాధుకరం అని, మధుకర వృత్తి అని అంటారు. పరాయి ప్రాంతాల్లో ఇలా మధుకరం చేసుకుని చదువుకున్న వాళ్లలో చాలామంది తర్వాత ప్రసిద్ధులయ్యారు.


అవన్నీ జానపద నిరుక్తులు
నిరుక్తి అంటే వ్యుత్పత్తి. ప్రతి వస్తువుకు, మనిషికి పేర్లున్నట్టే స్థలాలకు కూడా పేర్లు ఏర్పడుతుంటాయి. స్థలనామం ఏర్పడటానికి కారణం ఒకటైతే అది మరుగునపడి జానపద వ్యుత్పత్తి కొన్ని చోట్ల అధిక ప్రాధాన్యం పొందుతూ ఉంటుంది. ఉదాహరణకు ‘మధురవాడ’ ఇప్పుడు విశాఖ నగరంలో భాగమే. నిజానికి విశాఖపట్టణానికి ‘మదురు’గా కొంత దూరంలో ఉన్న ఊరు కాబట్టి ‘మదురవాడ’ అయ్యింది. తర్వాత సంస్కృతీకరణ ప్రభావంతో మధురవాడగా మారింది. అలాగే, సింహాచలం కొండకు దిగువన ఉన్న ప్రదేశం అడవివరం. ‘అడివారం’ అంటే కొండ దిగువ భూమి అని అర్థం. అదే అడివివరంగా మార్పు చెందింది. ఇదే జిల్లాలోని అనకాపల్లికి సమీప గ్రామం కసంకోట. ఇక్కడి కోటను ఖాసిం అనే వ్యక్తి పాలించాడు కాబట్టి ‘ఖాసింకోట’ అని పేరు వచ్చి, క్రమంగా కసింకోటగా మారిందని జానపద నిరుక్తి. అయితే ‘కసిమి’ అంటే బురద. కోట చుట్టూ ఉన్న కందకంలో బురద ఉండటం వల్ల ‘కసిమికోట’ అనే పేరు ఏర్పడి అదే క్రమంగా ‘కసింకోట’గా మారిందనేది వాస్తవం. ఇలా చాలా ప్రాంతాల్లో జానపద నిరుక్తులుగా ప్రచారంలో ఉన్నాయి.


ఎన్ను
వెన్ను నుంచి వచ్చింది. వరి తదితరాదుల కంకి. ‘చెఱకువెన్ను పుట్టి చెఱపదా తీపెల్ల; చెఱకు తుదవెన్ను పుట్టిన చెఱకున తీపెల్ల చెఱచు’ అన్న మాటలను వేమన, సుమతీ శతకాల్లో చూడవచ్చు. ‘జొన్న వెన్ను విడుస్తున్నది’ అని విలియం బ్రౌన్‌ నిఘంటవు ప్రస్తావిస్తే (సీపీ బ్రౌన్‌) ఉదహరించింది. కోలామీ, పర్జీ భాషల్లో వరికంకి అనే అర్థంలో ‘చెన్‌’ అనే పదం ఉంది. గోండీ, నాయకీ భాషల్లో ఇదే ‘శెన్‌’ అవుతుంది. గదబ భాషలో మాత్రం ‘చెన్ను’ అంటే నది. 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం