అది వాళ్ల ఆత్మగౌరవం

  • 768 Views
  • 7Likes
  • Like
  • Article Share

హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్లు, తిరుపతి... తెలుగునాట ఏ నగరంలోని పేరున్న హోటల్‌/ రెస్టరెంటులోనైనా ఆహారపదార్థాల పట్టిక (మెనూ కార్డు) తెలుగులో ఉంటుందా? ఉండదు. వాటిలో నూటికి తొంభైఅయిదు శాతం తెలుగువాళ్ల ఆధ్వర్యంలో నడిచేవే కదా. అవి ఆహారాన్ని అందించేది కూడా తెలుగువాళ్లకే కదా. మరి తెలుగులో ఎందుకు రాయరు? ఇతర భాషల వాళ్లూ ఉంటారు కదా అనుకుంటే... తెలుగుతో పాటు ఆంగ్లంలో రాయవచ్చు. కానీ, ఆంగ్లం మాత్రమే ఎందుకు వాడుతున్నారు? సమాధానం దొరకదు. అదే మరి చైనీయులను చూడండి... ఎక్కడ ఉన్నా వాళ్లభాషను మాత్రం మర్చిపోరు. ఉదాహరణకు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ‘వోకానో’ అని ఓ చైనీస్‌ రెస్టారెంట్‌ ఉంది. దానిలో లభించే ఆహారపదార్థాలకు సంబంధించిన పట్టిక చిత్రమిది. మొదట చైనీస్‌లో రాసిన తర్వాతే ఆంగ్లంలో రాశారు కదా. చిత్రం మధ్యలో కనిపిస్తున్న తెల్ల కాగితం మీది రాత ఏంటంటే విక్టర్‌ మేయర్‌ అనే వినియోగదారుడు తీసుకురమ్మన్న ఆహారపదార్థాల పేర్లు. వాటిని ఆ రెస్టారెంట్‌లో పనిచేసే వెయిటర్‌ అలా తమ చైనీస్‌ భాషలో రాసుకున్నాడు. విక్టర్‌ మేయర్‌కు ఇది స్ఫూర్తిదాయకంగా అనిపించి... ఆ పట్టికను, వెయిటర్‌ కాగితాన్ని చిత్రం తీసి అంతర్జాలంలో ఉంచాడు. ఇక ఆ రెస్టారెంట్‌ భవనం చూడండి... నామఫలకాల్లో చైనీస్‌ భాష తర్వాతే ఆంగ్లం కనిపిస్తోంది కదా. ఇలా అమెరికాలో సైతం తమ మాతృభాషలోనే పనిచేసుకుంటున్న చైనీయులతో పోల్చితే మన స్థానం ఎక్కడ?


ముద్దుమాటలు... మాతృభాషకు బాటలు!
పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాతే భాష నేర్చుకుంటారని చాలామంది అభిప్రాయం. కానీ పసిపిల్లలు కూడా తమ చుట్టూ వినపడేభాషను చాలా శ్రద్ధగా ఆలకిస్తారనీ, దాన్ని అనుకరించేందుకు ప్రయత్నిస్తారనీ ఎన్నో పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఈ వాదనకు బలం చేకూర్చే మరో పరిశోధన అమెరికాలోని మిస్సోరీ విశ్వవిద్యాలయంలో జరిగింది. పిల్లలు ఎనిమిది నెలల వయసుకు వచ్చేసరికి తాతా, దాదా లాంటి శబ్దాలు చేయడం మనకి తెలిసిందే. భాషను నేర్చుకునే ప్రక్రియలో భాగంగానే పిల్లలు ఇలాంటి శబ్దాలు చేస్తూ ఉంటారట. తాము చేసిన శబ్దాలను వింటూ ఉండటం కూడా వాళ్ల వికాసంలో ఓ భాగమేనంటున్నారు పరిశోధకులు. ఒకరకంగా చెప్పాలంటే అచ్చులు, హల్లులు పలికేందుకు అవి అభ్యాసాలన్న మాట! ఈ పరిశోధనలో భాగంగా పుట్టుకతోనే వినికిడి సమస్యలు ఉన్న కొందరు పిల్లలను పరిశీలించారు. ఆ పిల్లలు ఎలాంటి శబ్దాలు చేయకపోవడాన్ని పరిశోధకులు గమనించారు. కానీ ఎప్పుడైతే ఆ పిల్లలకు వినికిడి యంత్రాలను అమర్చారో, వాళ్లు ‘తాతా, దాదా’ అంటూ ముద్దు మాటలను మొదలు పెట్టారట! కాబట్టి పిల్లల సమక్షంలో సాధ్యమైనంత వరకూ అమ్మభాషలో మాట్లాడితే... వాళ్లూ దాన్ని సులువుగా నేర్చుకోగలరు.


ఇప్పుడు కేరళలో కూడా...
తమిళనాట ఇతర భాషలకి ఏమాత్రం స్థానం లేకుండా చేసేందుకు నిర్బంధ తమిళ విద్య అమలు తెలిసిందే! ఇప్పుడు కేరళ కూడా ఇదే బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. విద్యారంగంలోని వివిధ స్థాయుల్లో మలయాళాన్ని తప్పనిసరి చేస్తూ, ‘మలయాళ భాషా చట్టాన్ని’ తీసుకురానుందట అక్కడి ప్రభుత్వం. మలయాళాన్ని కేవలం ఓ పాఠ్యాంశంగా చేరుస్తున్నారా లేదా మాలయాళ మాధ్యమాన్నే తప్పనిసరి చేస్తున్నారా అనే విషయాలు ఆ చట్టం బయటికి వస్తే కానీ తేలదు. అయితే దీని రూపకల్పనలో... తమిళనాట అమలవుతున్న చట్టాన్ని పరిశీలనలోకి తీసుకుంటారట. ఈ మాటలు వింటుంటే, కేరళలోని ఇతర భాషల గురించి ఆందోళన కలగకమానదు. ప్రస్తుతానికి ఈ చట్టం ముసాయిదా తుదిరూపానికి చేరుకుందనీ, దాన్ని త్వరలోనే శాసనసభలో ప్రవేశపెడతామని కేరళ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జె.సి.జోసఫ్‌ చెప్పారు. సొంతభాషలను పరిరక్షించుకునే ప్రయత్నాలు అభినందనీయమే కానీ, ఆ క్రమంలో ఇతర భాషీయుల గొంతు నొక్కడం మంచిది కాదు. ప్రస్తుతం తమిళనాడులోని తెలుగువారికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. కేరళ నాయకులు ఈ బాటలో నడవరని ఆశిద్దాం.


మన బతుకు చిత్రం!
భాషంటే పరస్పర అవగాహన కోసం తోడ్పడే ఒక ఉపకరణం మాత్రమే అని కొందరి భావన. కాబట్టి అది ఏ భాష అయితేనేం అన్నది వాళ్ల ప్రశ్న! అయితే, భాషంటే కేవలం సంస్కృతి మాత్రమే కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక ప్రాంతంలో మాట్లాడే భాషకీ, అక్కడి వాతావరణ పరిస్థితులకీ అవినాభావ సంబంధం ఉందంటున్నారు. ఈ భావన కొత్తదేమీ కాదు. ఏ ప్రాంతంలో ఉండే జీవి అక్కడి వాతావరణానికి అనుగుణంగా తన స్వరాన్ని మార్చుకుంటుందని విజ్ఞానశాస్త్రం ఏనాడో ధ్రువీకరించింది. దీన్ని ‘సౌండ్‌స్కేప్‌ ఎకాలజీ’/ ‘ఎకౌస్టిక్‌ అడాప్షన్‌’ అంటారు. అయితే ఇది మనుషులకు ఎంతవరకూ వర్తిస్తుందో తెలుసుకునేందుకు ఇటీవల ఓ పరిశోధన జరిగింది.
న్యూ మెక్సికో విశ్వవిద్యాలయానికి చెందిన ఇయాన్‌ మేడిసన్‌ దీని మీద విస్తృతమైన పరిశోధనలు నిర్వహించారు. ఇందుకోసం ఒకటికాదు రెండు కాదు... 600కి పైగా భాషలను అధ్యయనం చేశారు. ఒక్కో భాషా ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు ఎలా ఉంటాయో నమోదు చేశారు. అక్కడ ఉష్ణోగ్రతలు, సముద్రమట్టం నుంచి ఎత్తు, అటవీ ప్రాంతాలు అన్నింటినీ సేకరించారు. చివరికి తేలిందేమంటే... మనం ఉండే భౌగోళిక పరిస్థితులకీ మాట్లాడే భాషలకీ మధ్య కచ్చితమైన సంబంధం ఉంది. ఉదాహరణకు చెట్టూచేమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేవారు ‘ప, ఖ, ఠ’ లాంటి హల్లులను ఉచ్ఛరించేటప్పుడు... ఆ శబ్దాలు, దార్లో ఉన్న అవరోధాల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది. చెట్టూచేమలని ఎదుర్కొన్న శబ్దాలు చెదిరిపోవడమో, ప్రతిధ్వనించడమో జరుగుతుంది. అందుకని సున్నితంగా, స్పష్టంగా ఉండే శబ్దాలనే వారు పలకాల్సి వస్తుంది.
ఇదే సూత్రం అన్ని ప్రాంతాలకూ వర్తిస్తుందని తన అధ్యయనంలో తేల్చారు మేడిసన్‌. పొడి వాతావరణంలో ఉండేవారు ఒకలా, చలి ప్రదేశాల్లో ఉండేవారు మరోలా, కొండ ప్రాంతాల్లో ఉండేవారు ఇంకోలా... తమ పరిస్థితులకు అనుగుణంగా భాషని ఏర్పరచుకుంటారట.


అమ్మభాషతో స్పష్టత!
చాలా సందర్భాల్లో మనం ఏదన్నా కొత్త పదాన్ని విన్నప్పుడు, దాన్ని వినడం అదే మొదటిసారి అయినా సరే... దాని అర్థం ఫలానా అని వూహించగలుగుతాం. ఒక్కోసారి ఆ వూహ నిజమవుతుంది కూడా! ‘దీని వెనక ఏదన్నా శాస్త్రీయత ఉందా?’ అన్న అనుమానం కలిగింది న్యూయార్క్‌కు చెందిన కెయిత్‌లీన్‌ బేంకర్స్‌, జూలియా సిమ్నెర్‌ అనే మనస్తత్వ శాస్త్రవేత్తలకి. వెంటనే ఓ పరిశోధన నిర్వహించారు. కొంతమంది వ్యక్తులను ఒక చోటకు చేర్చిన ఈ ఇద్దరు శాస్త్రవేత్తలూ, వాళ్లు ఏమాత్రం వినని ఓ పది భాషల నుంచి 400 విశేషణాలను వినిపించారు. వాటిని విన్నవారు ఆశ్చర్యకరంగా చాలా పదాలకు అర్థాలను గ్రహించగలిగారు. ఈ పరిశోధనతో మళ్లీ ‘సౌండ్‌ సింబాలిజమ్‌’ (శబ్ద ప్రతీకాత్మకత) అన్న వాదనకు బలం చేకూరింది.
ఒక విషయాన్ని గురించి వర్ణించేటప్పుడు, మనకి తెలియకుండానే దాని విశేషణాలకు తగినట్లుగా శబ్దాలను అనుకరిస్తాం. ఉదాహరణకు ‘చాలా చిన్న, భయంకరమైన, గుండ్రం’ లాంటి పదాలను పలికేటప్పుడు మన స్వరపేటిక మన భావానికి తగిన విధంగా శబ్దాన్ని అందించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే భాష పరిణామం చెందే కొద్దీ ఈ శబ్దాల్లో కూడా కొంతమార్పు వచ్చే అవకాశం లేకపోలేదు. శబ్దాలను బట్టి భావాన్ని గ్రహించగలిగే శక్తి మన మెదడులో నిక్షిప్తమై ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. అయితే ఈ పరిశోధన సందర్భంగా మాతృభాష ప్రాముఖ్యం గురించి కూడా కొంత సమాచారం వెలుగులోకి వచ్చింది. పసిపిల్లలు మొదట్లో ఏ రకమైన శబ్దానికైనా ప్రతిస్పందిస్తుంటారు. కానీ మాతృభాషకు అలవాటుపడే సమయంలో వాళ్ల ప్రతిస్పందనల్లో ఓ స్పష్టత వస్తుంది. ఏది తన భాష, ఏది పరాయి శబ్దం అన్న గ్రహింపు వాళ్లలో ఏర్పడుతుంది. మొత్తానికి చిన్నతనంలో మాతృభాషకి అలవాటు పడటం వల్ల మన గ్రహింపులో స్పష్టత వస్తుందనీ ఈ పరిశోధనతో తేలింది.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం