మరోసారి ఇంటికి రారాదూ...

  • 91 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తులసీబృంద జంపన

  • హైదరాబాదు.
  • 9959966768
తులసీబృంద జంపన

ఒరేయ్‌ మారూ! ఎలా మర్చిపోతాం రా నిన్ను! మాకు దక్కాల్సిన ముద్దులో ముప్పాతిక భాగం నీదేగా. అన్న తెచ్చే అప్పల్లో అధికభాగం నీకేగా! మాకెవరికీ లేని సౌకర్యాలన్నీ అనుభవించింది నువ్వే! మా అందరికంటే ఎక్కువ అనిపించిందీ నువ్వే. 
      నువ్వొచ్చాక.. మనింట్లో పెసరపప్పు ముద్దపప్పు లేని రోజుందా! జారుగా నెయ్యిపోసి తినిపిస్తేనేగదరా ముద్ద మింగేవాడివి. ఇంకేం పెట్టినా మూతి ముడుచుకుని మూలకు పోయేవాడివి. అప్పటికప్పుడు పెసరపప్పు పొయ్యిమీదకి ఎక్కేది కాదూ!
      ఏమాటకామాటే.. తెల్లగా, అమాయకంగా ఎంత ముద్దొచ్చేవాడివిరా! నీకు స్నానం చేయించి, బొట్టుపెట్టి చొక్కా వేసి ఎంత మురిసిపోయేవాళ్లం!. 
      దీపావళంటే ఎంత భయంరా నీకు. అప్పుడు మాత్రం అన్నయ్య ఉన్నాడా సరేసరి! లేదంటే ఎవరో ఒకరం కావాల్సొచ్చేది. పక్కన చేరి మునగదీసేవాడివి. శబ్దాలు వినపడకూడదని తలుపులు వేసి మరీ కాపలా కాసేవాళ్లంగా.
      బయటికి తిప్పితే ఎంత సరదారా నీకు! నిన్ను షికారుకి తీసుకెళ్లేందుకు పోటీ పడేవాళ్లం. అదో గొప్ప మాకు. కానీ బయట వాళ్లెవరినీ ముట్టుకోనిచ్చేవాడివా అసలు. అప్పుడు మాకెంత గర్వంగా ఉండేదో! 
      నిద్రొస్తే అన్నయ్య గుండెల మీదో, బావ గుండెల మీదో హాయిగా నిద్రపోయేవాడివి? సరే పక్కకు చేర్చి పడుకోబెడదాం అంటే.. కదిపితే కస్సుమనేవాడివి. ఎంత రాజభోగం రా నీది.
      అవునురా..! వదినంటే ఎంత కోపం నీకు? వదిన ఇంట్లో కొచ్చిన నాటినుంచి నీ చిర్రుబురులు ఎక్కువైపోయాయ్‌! బహుశా! అన్నయ్య.. వదినకు చేరువగా ఉంటున్నాడనే  అక్కసు కాబోలు. వదిన నీ పక్క నుంచి వెళ్తే జుత్తుపట్టుకు లాగేసే వాడివి కదూ!. వదిన ఎంత కోప్పడేవారు!  
      క్షమించరా మారూ! నీకేలోటూ లేకుండా పెంచుతున్నాం అనుకున్నామే గానీ! నీకూ మనసుంటుందని, నీ వాళ్లతో బతకాలనుకుంటావని గ్రహించలేకపోయాంరా... నిన్ను వీధిలోకి తీసుకెళ్లి పెద్ద పొరపాటే చేసేశాం. అందుకేనా.. నెల తిరక్కుండానే మా అందరికీ పెద్ద శిక్షే వేసేశావు.  
      ఛ! అంతా ఆ కోతులాడించే వాడి వల్లే! వాడే గనక రాకపోయుంటే మాతోనే ఇంకొన్నాళ్లు ఉండేవాడివేమో! వాడి దగ్గరున్న కోతిని చూశాక కదూ! నువ్వొక కోతి వన్న విషయం నీకూ, మాకూ గుర్తొచ్చింది. మేమెంత ప్రాణంగా పెంచినా.. నీకు అన్నాళ్లూ జరిగిన లోటేమిటో తెలిసొచ్చింది. అప్పట్నుంచే కదూ.. పున్నమి చంద్రుడిలా ఉండే నువ్వు.. రోజు రోజుకీ శుష్కించిపోతూ అమావాస్య చీకటిలా తయారయావు. తిరిగి పౌర్ణమినాడు మా అందరి దగ్గరా శాశ్వతంగా సెలవు తీసుకున్నావు. మాకు తీరని దుఃఖాన్ని మిగిల్చి వెళ్లిపోయావు!  
      ఒకటి చెప్పరా.. వదినంటే అణువణువునా నీకు కోపమే! కానీ.. కన్నుమూసే ముందు దగ్గరకు రమ్మని మరీ.. ఒళ్లో చేరి, వదిన మొహంలోకే చూస్తూ శాశ్వత నిద్రలోకి జారుకున్నావు చూడూ... అలా ఎందుకో ఇప్పటికీ మాకు అర్థం కాదురా మారూ! ఏడేళ్లు నువ్వు మాతో కలిసిమెలసి పెరిగావు. ఏడేడు జన్మలకూ మరువలేని జ్ఞాపకంగా మిగిలే ఉన్నావు. నువ్వు తిరిగి రాలేవని తెలిసినా.. మళ్లీ వస్తే బాగుండనిపిస్తావు.  

నీ చిన్నక్క...


వెనక్కి ...

మీ అభిప్రాయం