బ్రహ్మవేదమంటే ఏంటి?

  • 306 Views
  • 12Likes
  • Like
  • Article Share

పోటీ పరీక్ష ఏదైనా వైదిక సాహిత్యం నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు ఎదురవుతుంటాయి. గ్రూప్స్, డీఎల్, జేఎల్‌ తదితర పరీక్షల జనరల్‌ స్టడీస్‌లో ‘వేద విజ్ఞానం’ మీద గతంలో ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలో వేదజ్ఞానానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం.
వేద
శబ్దం ‘విద్‌ జ్ఞానే’ అన్న ధాతువు నుంచి పుట్టింది. సమస్త విజ్ఞానానికి వేదాలు స్రోతస్సులని ఓ నమ్మకం. వేదాలు ప్రభుసమ్మితాలు. ఇవి అపౌరుషేయాలని ప్రతీతి. అంటే వేదాలని వ్యక్తులు రాయలేదు. వేదాలు, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తులు, వేదాంగాలు ఇవన్నీ వైదిక సాహిత్యంలో భాగం. 
      వేదాలకు ‘శ్రుతులు’ అనే పేరుంది. వేద విజ్ఞానాన్ని రుషులు పరమాత్మ నుంచి విన్నారు కాబట్టి ఆ పేరొచ్చిందని కొందరంటారు. అయితే పూర్వకాలంలో వేదాలు శ్రవణ రూపంలోనే ప్రచారంలో ఉన్నందువల్ల ఆ పేరొచ్చిందని మరికొందరంటారు. వేదాలు మంత్రరూపంలో ఉన్నాయి. మంత్ర సంకలనాలను ‘సంహిత’లుగా పిలుస్తారు. వేదాలు నాలుగు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం. ఒక్కో వేదంలో నాలుగు విభాగాలున్నాయి. అవి... 
1.సంహిత
2. బ్రాహ్మణం 
3. ఆరణ్యకం 
4. ఉపనిషత్తులు. రుగ్వేదానికి 21, యజుర్వేదానికి 101, సామవేదానికి 1000, అధర్వణవేదానికి 9 శాఖలున్నాయని పతంజలి పేర్కొన్నాడు.
      కృష్ణద్వైపాయనుడు వేదాలను విభజించాడు కాబట్టి ఆయనకి వేద వ్యాసుడు అనే పేరొచ్చిందంటారు. వ్యాసుడు రుగ్వేదాన్ని పైలునికి, సామవేదాన్ని జైమినికి, యజుర్వేదాన్ని వైశంపాయనునికి, అధర్వణవేదాన్ని సుమంతునికి చెప్పాడంటారు. వేదాలు నాలుగైనా వాటిని రుక్కు, యజస్సు, సామగీతిగా విభజించి ‘త్రయీ’ అంటారు.
రుగ్వేదం
వేదాల్లో మొదటిది. దీనిలోని మంత్రాలను రుక్కులంటారు. ఇవన్నీ రెండు, మూడు, నాలుగు పాదాలు గల ఛందస్సుల్లో ఉన్నాయి. రుగ్వేదంలో త్రిష్టుపు, అనుష్టుపు, గాయత్రి, బృహతీ, పంక్తి ఛందస్సులు కనిపిస్తాయి. శ్యౌక మహర్షి ప్రకారం రుగ్వేదంలో 10,580 రుక్కులున్నాయి. అక్షరాల సంఖ్య 1,53,826. రుగ్వేదం మొత్తం ఎనిమిది అష్టకాలుగా విభజితమైంది. ఒక్కొక్క అష్టకానికి ఎనిమిది అధ్యాయాల చొప్పున మొత్తం 64 అధ్యాయాలు. అవి 10 మండలాలుగా వింగడితమయ్యాయి. యాస్కాచార్యుడు లాంటి వారు రుగ్వేదాన్ని ‘దశతయీ’ అని పిలిచారు. ఈ పది మండలాల్లో 85 అనువాకాలు, 1017 సూక్తాలున్నాయి. పతంజలి ప్రకారం రుగ్వేదానికి 21 శాఖలున్నాయి. వాటిలో శాకల, వాష్కల, అశ్వలాయన, శాంఖాయన, మాండూకాయన అనే అయిదు శాఖలు ప్రముఖమైనవని చరణ వ్యూహకారుడు పేర్కొన్నాడు. రుగ్వేదంలో ఔషధులు, భిషక్కుల ప్రసక్తి కూడా ఉంది. ఇంకా దానమహిమ, దానం ఆవశ్యకతలు కూడా వర్ణితమయ్యాయి. 
యజుర్వేదం
ఇందులో ప్రధానంగా దేవతలను ఆహ్వానించే, యజ్ఞవిధులను తెలియజేసే మంత్రాలున్నాయి. యజుస్సుల కూర్పు కలది యజుర్వేదం. రుక్కు, సామవేదాల కన్నా ఇది భిన్నమైంది. గద్యాత్మక మంత్రాల్నే యజుస్సులని పేర్కొన్నారు. ఇందులో కృష్ణ, శుక్ల యజుర్వేదాలనే రెండు భేదాలున్నాయి. కృష్ణ యజుర్వేదంలో ఛందోబద్ధమైన మంత్రాలు, గద్యం రెండూ ఉన్నాయి. శుక్లలో కేవలం ఛందోబద్ధమైన మంత్రాలున్నాయి. శుక్ల యజుర్వేద సంహితకు వాజసనేయసంహిత అనే పేరు కూడా ప్రసిద్ధంగా కనిపిస్తోంది. యాజ్ఞవల్క్యుని ద్వారా వాజసేని పుత్రుడు దర్శించడం వల్ల ఆ పేరు వచ్చిందంటారు.
సామవేదం
‘సాచ అమశ్చేతి తత్సామ్నః సామత్వమ్‌’ అని బృహదారణ్యకోపనిషత్తు పేర్కొంది. ‘సా’ అంటే రుక్కు అని అర్థం. ‘అమ’ అంటే గాంధారాది స్వరాలు. దీన్ని బట్టి ‘సామ’ అంటే రుక్కుల స్వర ప్రధానమైన గానం అని అర్థం. సామవేదంలో రుగ్వేదంలోని మంత్రాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందులోని స్వతంత్ర మంత్రాలు కేవలం 75. మొత్తంగా సామవేదంలో 1875 మంత్రాలున్నాయి. శ్రీకృష్ణుడు తనను ‘వేదానాం సామవేదోస్మి’ అని భగవద్గీతలో చెప్పుకున్నాడు. సామవేద ప్రశంస రుగ్వేదంలో, అధర్వణవేదంలో కనిపిస్తుంది. వేదాల్లో మూడు రకాల మంత్రాలున్నాయి. 1. రుక్కు, 2. యజుస్సు, 3. సామగీతి. సామవేదంలో రుక్కును ‘ఆర్చిక’ అని, యజస్సును ‘స్తోక’ అని అంటారు. రుక్కుల్నే గానం చేసినప్పుడు ‘సామం’ అంటారు. యజ్ఞయాగాది కర్మల్లో ఉద్గాత అనే రుత్విజుడు సామవేదాన్ని గానం చేస్తాడు. అంగిరస మహర్షి శ్రీకృష్ణునికి వేదాంతోపదేశం చేస్తూ మొదట సామవేదగాన విధి నేర్పాడని, దాన్ని ‘ఛాలిక్య విధి’ అని అంటారు.
అధర్వణవేదం
ఇందులో యజ్ఞ, బ్రహ్మవిద్యా సంబంధ విషయాలు కూడా ఉండటం వల్ల దీనికి బ్రహ్మవేదం అని కూడా పేరు. ఆముష్మిక ఫలాన్నిచ్చే వేదాలు రుగ్వేదాదులైతే, ఐహిక ఫలాన్నిచ్చే వేదం అధర్వణవేదం. అధర్వుడనే రుషి పేరుతో దీనికి ఈ పేరొచ్చిందని అంటారు. బ్రహ్మ సృష్టి ఉత్పత్తి కోసం తపస్సు చేశాడని, అప్పుడు బ్రహ్మ శరీరం నుంచి అధర్వన్, అంగిరసులు జన్మించారని, ఆ వంశజులే దర్శించినందు వల్ల దీనికి అధర్వణవేదం లేదా అధర్వాంగిరస వేదం అనే పేరు ఏర్పడిందని గోపథ బ్రాహ్మణం పేర్కొంది. భృగుమహర్షి శిష్యుడు అధర్వుడు, అతని 20 మంది పుత్రులు 20 కాండాలను నిర్మించారని చెబుతారు. అధర్వణవేదంలో 20 కాండలు, 760 సూక్తాలు, 5987 మంత్రాలున్నాయి. ఈ వేదానికి 9 శాఖలున్నాయని పతంజలి పేర్కొన్నాడు.
బ్రాహ్మణాలు
శతపథ బ్రహ్మణంలో ‘బ్రహ్మవై మంత్రః’ అని ఉండటాన్ని బట్టి, ‘బ్రహ్మ’ శబ్దాన్ని ‘మంత్రం’ అనే అర్థంలో ఇక్కడ ఉపయోగించవచ్చు. ‘బ్రహ్మ’ శబ్దానికి ‘యజ్ఞం’ అనే మరొక అర్థం కూడా కనిపిస్తుంది. యజ్ఞ విధులని వీటిలో వివరించినందువల్ల బ్రాహ్మణాలు అనే పేరొచ్చింది. అలాగే వైదిక మంత్రాలను వివరించేవి కాబట్టి వీటికి బ్రాహ్మణాలనే నామం వచ్చిందని కొందరంటారు. 
ఆరణ్యకాలు
‘అరణ్యాల్లో పఠించేవి’ కాబట్టి ఆరణ్యకాలు అని ఐతరేయబ్రాహ్మణంలో సాయణాచార్యులు నిర్వచించాడు. వానప్రస్థులకు యజ్ఞయాగాది విధానాలను చెప్పేవి ఆరణ్యకాలు. వీటిలో ఆధ్యాత్మిక తత్త్వాలు కూడా ఉన్నాయి.
ఉపనిషత్తులు
ఆరణ్యకాల్లో భాగమే ఉపనిషత్తులు. వేదాలకు అంతిమ భాగాలు కాబట్టి ‘వేదాంతం’ అని పిలుస్తారు. ఉపనిషత్తుల్ని మానవ ఆధ్యాత్మిక జ్ఞానానికి అంతిమ రూపాలుగా భావిస్తారు. ‘సద్‌’ అనే ధాతువుకి ఉప, ని అనే ఉపసర్గలు చేరి ‘ఉపనిషద్‌’ శబ్దం ఏర్పడింది. ఉప+ని అంటే కూర్చొని సంపాదించే జ్ఞానమని, గురుచరణాల సమీపంలో కూర్చుని సంపాదించే జ్ఞానం పరంగా వాటికి ఆ పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఉప- వ్యవధానం లేకుండా, ని- సంపూర్ణంగా, షద్‌- జ్ఞానప్రాప్తిని కలిగించేవి కాబట్టి ఉపనిషత్తులని ఇంకో అర్థం కూడా చెబుతారు. ముక్తకోపనిషత్తు ప్రకారం మొత్తం ఉపనిషత్తులు 108. అయితే 10 ఉపనిషత్తులే ప్రాచీన, ప్రామాణికమైనవిగా గుర్తింపు పొందాయి. అవి... ‘‘ఈశకేన కఠ ప్రశ్న ముండ మాండుక్య తైత్తిరిః/ ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకందశ’’! ఈ పది ఉపనిషత్తులకే శంకరాచార్యుడు భాష్యం రాశాడు. కౌషీతకి, శ్వేతాశ్వతర, మైత్రాయిణి ఉపనిషత్తులను కూడా ప్రామాణికమైనవిగా భావిస్తారు. ఉపనిషత్తుల్లో యజ్ఞయాగాది కర్మల ప్రసక్తి, వివరణలు లేవు. వీటిలో తత్త్వజ్ఞాన సంబంధ విద్యకే ప్రాధాన్యత ఇచ్చారు. రుగ్వేద సంబంధమైనవి 10, శుక్లయజుర్వేదం 19, కృష్ణయజుర్వేదం 32, సామవేదం 16, అధర్వవేదానికి 31 ఉపనిషత్తులున్నాయి.
వేదాంగాలు
వైదిక కార్యకలాపాలను ప్రతిపాదించే సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక గ్రంథాలను ఇంకా బ్రహ్మవిద్యను బోధించే ఉపనిషత్తులను తెలుసుకోవడంలో ఉపయుక్తమయ్యేవి వేదాంగాలు. ఇవి ఆరు. 1. శిక్ష, 2. కల్పం, 3. వ్యాకరణం,
4. ఛందస్సు, 5. నిరుక్తం, 6. జ్యోతిషం. బ్రహ్మస్వరూపమైన వేదాలకు ఈ ఆరు వేదాంగాలు ఆరు శరీరాంగాల లాంటివని పాణిని పేర్కొన్నాడు. ఆ వేద భగవానునికి.. శిక్ష- ముక్కు, కల్పసూత్రాలు- చేతులు, వ్యాకరణం- నోరు, నిరుక్తం- చెవులు, ఛందస్సు- కాళ్లు, జ్యోతిషం- కళ్లుగా పేర్కొన్నారు. 
సాధన ప్రశ్నలు
1. రుగ్వేదాన్ని ఎన్ని మండలాలుగా విభజించారు? 
    అ. 4     ఆ. 6     ఇ. 10   ఈ. 12
2. ‘అపౌరుషేయాలు’ అని ప్రసిద్ధి కలిగిన రచనలు? 
    అ. వేదాలు   ఆ. పురాణాలు   ఇ. ఇతిహాసాలు    ఈ. నాటకాలు
3. అధర్వుడు ఏ మహర్షి శిష్యుడు? 
    అ. భృగు  ఆ. పైలుడు  ఇ. వశిష్ఠుడు  ఈ.విశ్వామిత్రుడు
4. ఏ వేదానికి బ్రహ్మవేదమని పేరు? 
    అ. రుగ్వేదం      ఆ. యజుర్వేదం 
    ఇ. సామవేదం    ఈ. అధర్వణవేదం
5. రుగ్వేదాన్ని సాయణ భాష్యంతో, విమర్శనాత్మక పీఠిక టిప్పణులతో తొలిసారి ప్రచురించిందెవరు? 
    అ. వేబర్‌        ఆ. మాక్స్‌ముల్లర్‌    
    ఇ. ష్రాయిడర్‌     ఈ. గ్రాస్‌మన్‌
6.    ‘వేద సాహిత్య చరిత్ర’ గ్రంథాన్ని 1846లో రచించిన జర్మన్‌ పండితుడు? 
    అ. రుడాల్ఫ్‌ రోథ్‌    ఆ. కోల్‌బ్రూల్‌    ఇ. గ్రాస్‌మన్‌    ఈ. ఓల్డన్‌ బెర్గ్‌
7. వ్యాసుడు రుగ్వేదాన్ని ఎవరికి చెప్పాడంటారు? 
    అ. సుమంతునికి    ఆ. వైశంపాయనునికి   ఇ. పైలునికి   ఈ. జైమినికి
8. పతంజలి ప్రకారం యజుర్వేద శాఖలెన్ని? 
    అ. 21    ఆ. 101      ఇ. 1000    ఈ. 9
9. సుందర సుఖకర వచనమని అర్థం కలిగిన శబ్దం? 
    అ. రుక్‌   ఆ. యజుస్సు   ఇ. సామ   ఈ. ఆధర్వ
10. ఆధర్వణవేదంలోని సూక్తాలెన్ని? 
    అ. 108    ఆ. 216      ఇ. 760    ఈ. 5987
11.    మంత్రాలను ఉచితమైన రీతిలో సక్రమంగా ఉచ్చరించడానికి సృష్టించిన గ్రంథాలు?  
    అ. శిక్ష   ఆ. నిరుక్తం     ఇ. జ్యోతిషం    ఈ. కల్పం
12.    ప్రాతిశాఖ్య గ్రంథాలలో చర్చించే అంశం? 
    అ. ఉచ్చారణ    ఆ. స్వరవిధానం     ఇ. సంధి విధానం    ఈ. అన్నీ
13.    వేదాంగాల్లో వేద భగవానుడికి నోరు లాంటిది ఏది? 
    అ. శిక్ష   ఆ. వ్యాకరణం   ఇ. నిరుక్తం   ఈ. ఛందస్సు
14.    ‘మహాభాష్యం’ కర్త? 
    అ. పాణిని    ఆ. పతంజలి    ఇ. వరరుచి  ఈ.భద్రబాహుడు
15.    ‘సర్వానుక్రమణి’ కర్త? 
    అ. మాధవభట్టు  ఆ. కాత్యాయనుడు  ఇ. గర్గుడు   ఈ. లగధుడు
16.    వేదాంగాలలో జ్యోతిషం ఎన్నోది? 
    అ. అయిదు    ఆ. ఆరు    ఇ. మూడు   ఈ. రెండు
17.    వ్యాసుడు జైమినికి చెప్పిన వేదం? 
    అ. రుగ్వేదం    ఆ. యజుర్వేదం       ఇ. సామవేదం    ఈ. అధర్వణవేదం
18. ఏ వేదంలో ప్రధానంగా దేవతలను ఆహ్వానించే, యజ్ఞవిధులను చెప్పే మంత్రాలున్నాయి?
    అ. అధర్వణవేదం    ఆ. సామవేదం     ఇ. రుగ్వేదం  ఈ. యజుర్వేదం
19.    సామవేదానికి ఉన్న బ్రాహ్మణాలెన్ని? 
    అ. 4     ఆ. 6    ఇ. 9    ఈ. 12
20.    ముక్తకోపనిషత్తు ప్రకారం మొత్తం ఉపనిషత్తులు? 
    అ. 100    ఆ. 108   ఇ. 179     ఈ. 184


వెనక్కి ...

మీ అభిప్రాయం