అడుగడుగునా ఉజ్వల చరిత!

  • 644 Views
  • 1Likes
  • Like
  • Article Share

    సిద్ధినేని భావనారాయణ

  • విశ్రాంత ఆంగ్ల ఆచార్యులు
  • హైదరాబాదు. sbn7hills@gmail.com
సిద్ధినేని భావనారాయణ

శ్రీశైల శిఖరాన శివమెత్తి ఆడింది
ఆ నంది కొండల్లో సంద్రమై పొంగింది
పల్నాటిసీమలో బ్రహ్మనాయని ఇంట
కులదైవమై చాపకూడు వడ్డించింది
తెలుగింటికే రాణి మా కృష్ణవేణి
మా అన్నపూర్ణమ్మ పసుపుపారాణి।।

      కృష్ణాతీర చారిత్రక వైభవాన్ని కీర్తిస్తూ వేటూరి సుందరరామమూర్తి గానం ఇలా సాగిపోతుంది! ఇదే గానాన్ని మహాబలేశ్వరం దగ్గర మొదలుపెడితే కృష్ణాపరివాహక ప్రాంత వైభవోపేతమైన చరిత్ర కళ్లముందు కదలాడుతుంది.  
‘కృష్ణవేణీ కోవెల’... మహాబలేశ్వరంలోని ఈ పురాతన దేవాలయంలోని గోముఖం నుంచే చిన్న జలధారగా ప్రారంభమవుతుంది కృష్ణానది. నల్లరాతితో నిర్మితమైన ఈ ఆలయ అందం చూపుతిప్పుకోనివ్వదు. అసలు మొత్తం మహాబలేశ్వరమే ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఛత్రపతి శివాజీ వీరత్వాన్ని గుర్తు చేసే ప్రతాప్‌గఢ్‌ కోట ఇక్కడికి సమీపంలోనే ఉంటుంది. ఒలింపిక్స్‌లో మన దేశానికి తొలిసారి వ్యకిగత పతకాన్ని అందించిన మల్లయోధుడు కేడీ జాదవ్‌ పుట్టిపెరిగింది కృష్ణమ్మ ఒడిలోనే. సతారా జిల్లాలోని (మహాబలేశ్వరమూ ఈ జిల్లాలోనిదే) ఆయన స్వగ్రామం గోలేశ్వర్‌ కృష్ణానదిని ఆనుకునే ఉంటుంది.
      ఇక కృష్ణ ఉపనది తుంగభద్ర తీరంలో వెలసిన విజయనగర సామ్రాజ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సమయంలో హంపి ప్రాంతం తెలుగు సమాజాలకు సాంస్కృతికంగానూ నాయకత్వం వహించింది. సాహిత్యం, శాస్త్రీయసంగీతం, శిల్పకళా, వాస్తు, నృత్యం అభివృద్ధి చెందాయి. విజయనగర శైలి పేరుతో గొప్ప శిల్పం నిలదొక్కుకుంది. విస్తృతంగా నిర్మాణాలు జరిగాయి. పెద్దన, ధూర్జటి, భట్టుమూర్తి, తిమ్మన లాంటి సాహిత్యవేత్తలూ, బండారు లక్ష్మీనారాయణ, కల్లినాథ వంటి సంగీతజ్ఞులూ ఈ కేంద్రాలకు చేరారు. తుంగభద్ర కృష్ణలో కలిసే అలంపురం దగ్గర నిర్మాణమైన నవబ్రహ్మాలయాలు పశ్చిమ చాళుక్య తొలిపాలకుల నిర్మాణాలు. పశ్చిమ చాళుక్య శైలిలోని మూడుదశల నిర్మాణాలకూ తుంగభద్ర పరివాహక ప్రదేశమే ఆలవాలం. పశ్చిమ చాళుక్య శైలిలోని మలిదశని ‘లక్కుండి శైలి’గా పిలుస్తారు. పాశ్చాత్య కళావిమర్శకులు మాత్రం ఈ శైలిని ‘గదగ్‌ శైలి’ అంటారు. గదగ్‌ జిల్లా లక్కుండి గ్రామంలోని కాశీవిశ్వేశ్వరాలయం, అక్కడే నిర్మాణమైన భారీ సోపాన పుష్కరిణీ ఈ శైలికి తిరుగులేని ఉదాహరణలు.
      బళ్లారి జిల్లాలోని కారవట్టి మల్లికార్జునాలయం, గదగ్‌జిల్లా దంబాల్‌ దొడ్డబసప్ప దేవాలయం, హవేరి జిల్లా సిద్ధేశ్వరాలయం చాళుక్య శైలి రెండోదశ నిర్మాణాలు. వీటి నిర్మాతలు కల్యాణి చాళుక్యులు. వీరి రాజధాని కల్యాణిలోనే బసవణ్ణ తన కేంద్రస్థానాన్ని ఏర్పాటు చేసుకుని వీరశైవాన్ని ప్రబోధించాడు. పశ్చిమ చాళుక్య శైలిలో మూడో దశ ‘తుంగభద్ర శైలి’. తర్వాత కాలంలో దక్కన్‌లో ప్రభవించిన హోయసల, కాకతీయ, హంపీ శైలులన్నింటి మీద ఈ తుంగభద్ర శైలి బలమైన ముద్రవేసింది. స్థూలంగా చూస్తే అలంపురం చేరేవరకూ తుంగభద్ర రెండు తీరాలూ, శిల్పకళ క్రమవికాసాన్ని కడుపులో పెట్టుకొన్నాయి. 
కందూరునాడు ఘనత
పశ్చిమ చాళుక్య పాలకుడు త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యుడి శాసనంలో అలంపురం ప్రస్తావన కనిపిస్తుంది. కృష్ణ, తుంగభద్రలు సంగమించే ఈ ప్రాంతం రాతినేల. కృష్ణానదికి ఇరువైపులా విస్తరించిన ఈ ప్రాంతం శాతవాహనుల కాలం నుంచీ కీలకంగానే ఉండేది. మొదట వర్ధమానపురగానూ, తర్వాత కందూరునాడుగానూ పిలిచారు. గద్వాల చౌరస్తా నుంచి హైదరాబాదు వెళ్లే రహదారిని అనుకుని ఉండే బ్రిడ్జి రంగాపూర్‌లో పురాతన శివాలయ శిథిలాలున్నాయి. క్రీ.శ. మొదటి శతాబ్దికి చెందిన నిర్మాణమిది. మత చరిత్రల్లోనూ, దేవాలయ వాస్తులో వచ్చిన పరిణామాల్లో కీలక సాక్ష్యాలిస్తుందీ శివాలయం.
కందూరునాడుగా పేరుపడ్డ ఈ ప్రాంతం కందూరు చోళుల కింద ఉండేది. నల్లగొండ జిల్లా పానగల్లు పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయం వీళ్ల నిర్మాణాలే. కర్నూలు- హైదరాబాదు రహదారి మీద మూసాపేట నుంచి రెండు మైళ్లు లోపలున్న కందూరు వీరి మొదటి రాజధాని. తర్వాత వర్ధమానపురకూ, ఆ పైన తర్వాత పానగల్లుకూ మారింది. నాగర్‌కర్నూలు, కల్వకుర్తి, పాలమూరు, నల్లగొండ, మిర్యాలగూడ ప్రాంతాలు వీరి రాజ్యంలో భాగాలు. కాకతి రుద్రదేవుడి దండయాత్రకు ముందు వీళ్లు కల్యాణి చాళుక్యులకు సామంతులు. ఈ దాడి సమయంలోనే రుద్రదేవుడికి తమ ఆడపడుచు పద్మావతినిచ్చి పెళ్లి చేసి సంధి కుదుర్చుకున్నారు. అప్పటివరకు కందూరు చోళుల అధీనంలో ఉన్న పెద్ద వజ్రాన్ని, వధువుతోబాటు రుద్రదేవుడికి ఇచ్చారంటారు. తర్వాత ఆ వజ్రానికి ‘కోహినూర్‌’ అనే పార్శీ పేరు స్థిరపడింది. 
నల్లగొండ, పాలమూరు ప్రాంతాలు మెట్ట భూములు. పురాతన కాలం నుంచీ నీటి బెట్ట. కందూరు చోళుల కాలంలోనే చాలా తటాకాలు తవ్వించి, బోదుల వ్యవస్థ ఏర్పరిచారు. పానగల్లు ‘ఉదయసముద్రం’ వీళ్లు నిర్మించిందే. మల్లేశ్వరం, నెక్కొండ, తుమ్మేడు, సిరికొండ, జూపల్లి, పేరూరు, ఎండబెట్ల, వర్ధమానపురం, సోమశిల,  మామిళ్లపల్లి, రాచూరు, పాములపాడుల్లోని ఆలయాలూ వీళ్ల నిర్మాణాలే. దేవాలయానికి అనుబంధంగా సాగునీటి చెరువు తవ్వడం కందూరు చోళుల ప్రత్యేకత. పానగల్లు పచ్చల సోమేశ్వరాలయం గొప్ప శిల్పకళకు నెలవు. నంది మండపం నాలుగు స్తంభాల మీద సూక్ష్మ వివరాలతో లలిత సుందరంగా కనిపించే కమనీయ శిల్పం... మధ్యయుగాల తెలుగు కళాభినివేశానికి ఎత్తిన జయ పతాక.
తర్వాతి కాలంలో కాకతీయ సేనాని గోన బుద్ధారెడ్డి ప్రాంతీయ పాలకుడిగా ఉన్నాడు. అతని రాజధాని వర్ధమానపురం. ఇప్పటి వడ్డెమాను. 1518లో కుతుబ్‌షాహీల వశమై గోల్కొండ రాజ్యంలో కలిసిపోయింది. 18, 19 శతాబ్దాల్లో గద్వాల సంస్థానం తెలుగు సాహిత్యాన్ని పోషించింది. ఇక వనపర్తి సంస్థానపు చివరి వారసుడు రాజా రామేశ్వరరావు ‘ఓరియంట్‌ లాంగ్‌మన్‌’ అనే పెద్ద ప్రచురణ సంస్థ స్థాపించారు. ఇప్పుడది ‘ఓరియంట్‌ బ్లాక్‌స్వాన్‌’గా నడుస్తోంది. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ నిర్మాత సురవరం ప్రతాపరెడ్డి, హైదరాబాదు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పాలమూరు వాసులే. 
శ్రీశైలం నుంచి సాగర్‌ వరకూ...
శ్రీశైలంలో చరిత్ర పూర్వయుగానికే ఒక ఆరాధనాలయం ఉంది. అయితే కాకతీయులతోనే శ్రీశైలప్రభ ఉచ్ఛస్థితికి వచ్చింది. అంతకుముందు విష్ణుకుండినులు, తూర్పుచాళుక్యులు, కందూరు చోళులు; ఆ తర్వాత దేవరకొండ పాలకులు, కొండవీటి పాలకులు విరివిగా దానాలు చేశారు. వీరశైవంలో ప్రధానవ్యక్తులు అల్లమప్రభు, అక్కమహాదేవి, పాల్కురికి సోమనాథుడు... ఈ ముగ్గురూ శ్రీశైలంతో అనుబంధం ఉన్నవారే. కాకతీయ రెండో బేతరాజుకి శైవదీక్ష ఇచ్చిన రామేశ్వరపండితుడు శ్రీశైలంలోని మల్లికార్జున మఠాధిపతి. గణపతిదేవుడికి శివదీక్ష నిచ్చిన గురువు విశ్వేశ్వర శంభు గోళకీ మఠాధిపతి. భిక్షావృత్తి మఠం, విబూదిమఠం, నందిమఠం వంటి ధనిక సంస్థలకు శ్రీశైలం నిలయం. శ్రీనాథుడు ‘శివరాత్రి మాహాత్మ్యాన్ని’ శాంతభిక్షావృత్తి మఠాధిపతి పవ్వుల శాంతయ్యకు అంకితమిచ్చాడు. 
      ఇక శ్రీపర్వతానికి సింహళం, టిబెట్టు, సయాంల నుంచి బౌద్ధ భిక్షువులు వచ్చేవారు. శూన్యవాద దర్శనం, లౌకిక శాస్త్రాల్లో శిక్షణ పొందేవారు. ఈ ప్రాంతానికి ఈ ఘనతను సంపాదించిపెట్టిన ఆచార్య నాగార్జునుడు మహాయాన శాఖకు మూలపురుషుడు. నిశితమేధో వైభవంతో విలసిల్లిన మహాదార్శనికుడు. ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఎన్నో పురాతన నిర్మాణాలు బయటపడ్డాయి. వాటిని నాగార్జునకొండ మీద భద్రపరిచారు. ఇదే నల్లగొండ జిల్లాలో కృష్ణ ఉపనది మూసీ పారే ప్రాంతాలు భూస్వామ్య వ్యతిరేక సాయుధ పోరాటాలతో, కొంతవరకూ సాంఘిక సంస్కరణలు సాధించినవి.
అమరావతీ నగర అపురూప శిల్పాలు
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ధనంబోడుగా పిలిచే శిథిల బౌద్ధ స్తూపం ఉంది. అమరావతి శైలిలోని శిల్ప శకలాలు ఇప్పటికీ అక్కడ బయటపడుతూనే ఉన్నాయి. ఇక్కడినుంచి తూర్పుగా వంద కిలోమీటర్ల వరకూ శిథిలాలు కనిపిస్తాయి. ఖమ్మం జిల్లాలోని దక్షిణ భాగాల్లోనూ ఆనవాళ్లు కనిపిస్తాయి. నేలకొండపల్లిలో కూడా బౌద్ధ స్తూపం అవశేషాలున్నాయి.  
ఇక అమరావతి... క్రీ.పూ రెండో శతాబ్ది నుంచి క్రీ.శ. మూడో శతాబ్ది మధ్య వరకూ బౌద్ధ ధర్మానికి ముఖ్య కేంద్రం. ఆచార్య నాగార్జునుడు ఇక్కడా, శ్రీపర్వతం దగ్గరా బోధనలు చేశాడు. తెలుగువాడి అపూర్వ కళాసృజన అమరావతి శిల్పశైలి. సౌకుమార్యం, లాలిత్యం ఈ శిల్పం ప్రధాన లక్షణాలు. సూక్ష్మ వివరాలనూ, ముఖ కవళికలనూ కళాత్మకంగా ఆవిష్కరిస్తుందీ శిల్పం. భంగిమలోనూ, ముఖంలోనూ ఉద్వేగాలను సైతం వ్యక్తీకరించిన ప్రతిభ. రూపకల్పనలో సమతూకం, వివరాల్లో స్పష్టతా కనపడుతుంది. చట్రం మొత్తం శిల్పంతో నింపి వ్యక్తీకరణలో చిక్కదనం చూపిస్తుందీ శిల్పశైలి. దక్షిణభారత శిల్ప శైలులన్నింటికీ అమరావతి మాతృక. 
నాటి బెజవాడ
విజయవాడలో జైనబౌద్ధాలు రెండూ విలసిల్లాయి. మల్లికార్జునాలయాలూ చాలా ఉండేవి. ఈ నగరం అప్పట్లో విష్ణుకుండిన రెండో మాధవవర్మ రాజధాని. రథం వేగంగా నడిపి బ్రాహ్మణ బాలుడి మరణానికి కారకుడైన రథచోదకుడు మాధవవర్మ కొడుకే. విచారణ జరిపిన మాధవవర్మ యువరాజుకి మరణ శిక్ష వేశాడనీ, రాజు ధర్మనిరతికి మెచ్చి ఇంద్రకీలాద్రి మీదున్న దుర్గమ్మ కనకవర్షం కురిపించిందనీ అంటారు. అందుకే ఆమె పేరు కనకదుర్గగా మారిందనీ కథనం. బ్రాహ్మణవీధి ఇప్పుడు ఇరుకుసందు.
      యుద్ధమల్లుడి బెజవాడ శాసనాన్ని మధ్యాక్కరల రూపంలో కనకదుర్గ ఆలయ మండపం స్తంభాల మీదనే చెక్కారు. విష్ణుకుండినుల పెద్ద శివాలయం కొండ కింద, ఇప్పటి జమ్మిదొడ్డిలో ఉండేదట. ఇప్పుడు పునాదులు మాత్రమే కనిపిస్తున్నాయి. అక్కన్నమాదన్న గుహలూ ఇక్కడే ఉన్నాయి. చాళుక్య రెండో అమ్మరాజు పినమల్లూరు గ్రామాన్ని కనకదుర్గాలయానికి దానంగా ఇచ్చిన శాసనంలో అనేక శివాలయాల ప్రస్తావనలు కనిపిస్తాయి. ఇప్పుడు పాత శివాలయం, అనంతర కాలానికి చెందిన విజయేశ్వరాలయం మాత్రమే ఉన్నాయి. మొగల్రాజపురం, జమ్మిదొడ్డి, ప్రజాశక్తి నగర్, జర్నలిస్టు కాలనీ గుహాలయాలు విష్ణుకుండిన, శాలంకాయన కాలాలకు చెందినవి కావచ్చునంటారు. ఉండవల్లి మూడంతస్తుల గుహాలయాల సముదాయం మొదట బౌద్ధారామం. తర్వాత అనంతపద్మనాభ స్వామి గుడిగా మారింది కాబోలు. రెండో మాధవవర్మ బౌద్ధం నుంచి వైదికవాదిగా మారి యాగాలు చేశాడు. పండిత త్రయంలోని శ్రీపతి పండితుడు పదమూడో శతాబ్దంలో బెజవాడ కేంద్రంగానే బోధనలు చేశాడు.
మహామహులకు నెలవు
తోట్లవల్లూరు దగ్గర కృష్ణానది భారీగా ఉంటుంది. ఈ గట్టు నుంచి అవతలిగట్టు వల్లభాపురానికి అయిదున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ వల్లభాపురం నుంచి పైకి తెనాలి. తెలుగు వచనాన్ని ఆధునికత వైపు మళ్లించిన కొడవటిగంటి కుటుంబరావు, గుడిపాటి వెంకటచలం ఇక్కడివాళ్లే. త్రిపురనేని రామస్వామి సూతాశ్రమానికి ఇక్కడ గట్టిదన్ను. కళావిమర్శకుడు సంజీవదేవ్‌ చివరి వరకూ తెనాలి దగ్గరి తుమ్మపూడిలోనే ఉన్నారు. 
కాస్త ముందుకు వెళ్తే శ్రీకాకుళానికి ఎదురుగా నదికి పడమటి తీరాన కొల్లూరు ఉంటుంది. ఆ పక్కనే కోటిపల్లి, వెల్లటూరు, పెదపులివర్రు. కవి తిక్కన తాత భాస్కరమంత్రి స్వగ్రామం వెల్లటూరు అంటారు. ఇంకా పడమరగా చదలవాడ ఉంటుంది. కవిత్రయంలోని ఎర్రాప్రగడ ఈ గ్రామాన్ని దానంగా పొందాడు. కొంతకాలం నివాసమూ ఉన్నాడు. తర్వాత ఆయన వారసుల ఇంటిపేరు చదలవాడగా మారింది. పెదపులివర్రు శ్రీవైష్ణవ పండితుల గ్రామం. సముద్రాల రాఘవాచార్యులు ఇక్కడివారే. 
      శ్రీకాకుళంలో మధ్యయుగాల నుంచీ సంగీత, నృత్యాలతో సంబంధం ఉన్న దేవదాసి సంప్రదాయం ఉండేది. తంజావూరు, మధురైలకు ఇక్కడినుంచి వలసలూ సాగాయట! వేటూరి సుందర రామమూర్తి ‘సిరికాకొలను చిన్నది’ సంగీత రూపకం ఈ ఊహనుంచే పుట్టింది. కృష్ణాతీరంలోని ఐలూరు నుంచి బార్లపూడి మీదుగా కూచిపూడి ఏడెనిమిది కిలోమీటర్లు. 
కూచిపూడి అడుగులు
తెలుగువారి ప్రదర్శన కళకు జయపతాక కూచిపూడి. నాగార్జునకొండ శిథిలాలలోని ఒక శిల్పంలో కచ్ఛప అనే వాద్యంతో ఉన్న స్త్రీమూర్తి శిల్పం దొరికింది. ఇది క్రీ.శ. రెండు మూడు శతాబ్దాలది కావచ్చు. అమరావతి శిల్పాల్లో లెక్కకు మిక్కిలిగా నాట్య భంగిమలు కనిపిస్తాయి. సిద్ధేంద్రయోగీ, తీర్థనారాయణుడూ కూచిపూడి నృత్యనాటకాల సంప్రదాయాన్ని బహుశా పదిహేనో శతాబ్దంలో ప్రారంభించారు. భరతుడి సంక్లిష్ట నృత్య శాస్త్రమూ, సంప్రదాయ శాస్త్రీయ సంగీతమూ సమాగమం చెంది, కొన్ని స్థానిక లక్షణాలతో కూచిపూడి శైలి ఆవిర్భవించింది. 1590 ప్రాంతాల్లోనే 45 కుటుంబాలు తంజావూరు వలసపోయి, అచ్యుతరాయపురం అగ్రహారంగా దానం పొందారు. అదే నేటి మేలట్టూరు. 1674లో గోలకొండ పాలకుడు అబుల్‌హసన్‌ తానీషా కూచిపూడి గ్రామాన్ని భాగవతుల కుటుంబాలకు దానం చేశాడు. కూచిపూడివారు విశేషంగా వాడడం వల్ల ఆనంద భైరవి రాగం తెలుగువారి సొంతంగా కనిపిస్తుంది.   
      కూచిపూడి నుంచి ఈశాన్యంగా పదికిలోమీటర్ల దూరంలో శ్రీనాథుడి అత్తగారి ఊరు దగ్గుపల్లి వస్తుంది. దుగ్గన స్వగ్రామం కూడా అదే. శ్రీనాథుడు పుట్టిన కలపటం అక్కడినుంచి ఇంకొంచెం ఆగ్నేయం. కూచిపూడికి దిగువన రెండు కిలోమీటర్లలో మొవ్వ. అలరులు నిండిన జాను తెనుగును సంగీత నృత్యాలతో మేళవించి శృంగార సృజన సాగించిన క్షేత్రయ్యది ఈ ఊరే అంటారు. కానీ, ఇక్కడి వేణుగోపాలస్వామి గుడి ప్రాచీనం కాదు. 1902 నాటి నిర్మాణం. ప్రాచీనమైన వేణుగోపాలస్వామి గుడి ఇంకా దిగువన హంసలదీవిలో ఉంది.
ఎన్నెన్ని గుర్తులో!
కృష్ణతో కలిసి కొంచెం ముందుకు వెళ్తే చల్లపల్లి వస్తుంది. దానికి కొద్దిగా దిగువన పెదప్రోలు. కాసుల పురుషోత్తమ కవి సొంతూరు. ‘చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్యభావ, హతవిమతజీవ శ్రీకాకుళాంధ్ర దేవ!’ మకుటంతో ఆంధ్రనాయక శతకం రాసిన 18వ శతాబ్దపు కవి. హంసల దీవి వేణుగోపాల శతకమూ ఆయనదే. నడకుదురుకు ఎదురుగా పడమటి తీరాన ఓలేరు ఉంటుంది. ఓలేరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో భట్టిప్రోలు వస్తుంది. తెలుగు లిపి మూలాలుగా చెప్పే అక్షరాలున్న భరిణ దొరికింది ఇక్కడి బౌద్ధస్తూపం పునాదుల్లోనే. వసుచరిత్రను సృజించిన కవి, సంగీత సిద్ధాంతవేత్త భట్టుమూర్తి స్వగ్రామమూ ఇదే. ఈయన ప్రత్యర్థిగా ముద్రపడ్డ ప్రౌఢకవి తెనాలి రామలింగయ్య పూర్వుల స్వస్థలం గార్లపాడు కూడా ఇక్కడికి సమీపమే. తెలుగువారి మత చరిత్ర మీద సాధికార సిద్ధాంతం చేసిన పండితుడు బి.యస్‌.ఎల్‌.హనుమంతరావుదీ భట్టిప్రోలే.
      వెలనాటి చోళుల రాజధాని చందోలు ఇక్కడికి పడమరగా పదిహేను కిలోమీటర్లు. మల్లికార్జున పండితారాధ్యుడు ఇక్కడి వెలనాటి రాజసభలో చోళరాజ్యాన్ని శపించాడని చెబుతారు. మంచనకవి వెలనాడులో, అదీ చందోలులోనే ఉన్నాడు. కేయూర బాహుచరిత్రలో చందోలు వర్ణనల్లో పూరిల్లు, మట్టికుండలను ఈ సీమ ప్రజలు ఎరగరని చెప్పాడు. ఆయనది పదమూడో శతాబ్దం.
      పదిహేనో శతాబ్దంలో శ్రీనాథుడు అనేకసార్లు ఈ ప్రాంతంలో కృష్ణను దాటి ప్రయాణించాడు. ఇంకా సేద్యం కూడా, నదికి బాగా అంచుల మీద చేసినట్టు ఉన్నాడు. నిందాపూర్వకంగా కృష్ణవేణిని, పెదపులివర్రునీ ప్రస్తావించాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే కృష్ణానది తూర్పుపాయ తూర్పు ఒడ్డున పెదకళ్లేపల్లి ఉంది. ఇది వేటూరి ప్రభాకరశాస్త్రి, సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రులు లాంటి పండితుల గ్రామం. 
చైతన్య జ్వాల
ఉల్లిపాలెం దగ్గర రేవుదాటి 15 కిలోమీటర్లు వెళ్తే మచిలీపట్నం వస్తుంది. 18, 19 శతాబ్దాల్లో ఈ పట్టణం యూరోపియన్‌ వర్తకానికి గవాక్షం. తెలుగువారి సాంస్కృతిక రాజధాని. పత్రికలకు కేంద్రం. విద్యలకు నెలవు. సైనిక కేంద్రం. విదేశీ వ్యాపారానికీ, మక్కాయాత్రకీ కీలకమైన ఓడరేవు. రాజకీయోద్యమాలకు నెలవు. పట్టాభి సీతారామయ్య, తోట నరసయ్య, గొట్టిపాటి బ్రహ్మయ్యలు కార్యకలాపాలు సాగించిన పట్టణం. తెలుగునాట జరిగిన సంస్కరణా ధోరణీ, ఆలోచనా చైతన్యం బందరులో గాఢంగా ఉండేవి. బ్రహ్మ సామాజికుడు రఘుపతి వెంకటరత్నం నాయుడుది ఈ ఊరే. గోరా ఇక్కడి నోబెల్‌ కళాశాలలో పనిచేసే సమయంలోనే నాస్తికోద్యమం నడిపారు. నాస్తిక కేంద్రాన్ని ముదునూరులో ప్రారంభించి, తర్వాత విజయవాడకు మార్చారు. ఓ శతాబ్దం పాటు ఉన్నతవిద్యకు మచిలీపట్నమే కేంద్రస్థానం. 
       కాకతీయ గజసేనాని జాయప పుట్టింది ఇక్కడి తలగడ దీవి గ్రామంలోనే. 1235 నాటి చేబ్రోలు శాసనం దేవదాసీ కళాకారిణులకు జాయప నిర్మించి ఇచ్చిన రెండంతస్తుల గృహ సముదాయం గురించి చెబుతుంది. కూచిపూడి భాగవతులు నర్తించే మండూక శబ్దం జాయప రచనగా చెబుతారు. అవనిగడ్డ చోళనారాయణాలయంలోని దేవదాసి బృందానికి భూదానం చేసిన శాసనం నాట్య, సంగీతాల పోషణ గురించి చెబుతుంది. ఇక దివిసీమలోని టేకులపల్లిలో బయల్దేరి మోపిదేవిలో రెండేళ్లు ఉండి, పెదపులివర్రు మీదుగా మద్రాసు చేరి సినిమా సంగీతంలో విశేషకీర్తి పొందిన ఘంటసాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
తెలంగాణ రైతాంగ పోరాటానికి డెల్టా ప్రాంత ప్రజానీకం హార్దిక, ఆర్థిక సాయాలందించింది. జగ్గయ్యపేట, తిరువూరు ప్రాంతాల్లో శిబిరాలు నడిపి, ఆశ్రయం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి సమాంతరంగా డెల్టాలోనూ కమ్యూనిస్టు ఉద్యమాలు నడిచాయి. దేవరకోట జమీ మీద జరిగిన సాయుధ ఉద్యమాలు సామాన్య జనాన్ని చైతన్యవంతం చేశాయి. చండ్ర రాజేశ్వరరావు వంటి జాతీయ నాయకుణ్ని అందించాయి. ప్రభుత్వ వ్యవస్థ తుపాకి బలంతో ఉద్యమాలను అణచివేసింది. చల్లపల్లి నారాయణరావు, గోగినేని తాతయ్య వంటి వారు పోలీసుల చేతుల్లో బలయ్యారు. కప్తానుపాలెం దగ్గరున్న అమరస్తూపం మీద పోలీసులు కాల్చివేసిన 47 మంది కమ్యూనిస్టు కార్యకర్తల పేర్లు కనిపిస్తాయి. ఇలా అటు చారిత్రక వైభవానికీ, ఇటు ఉద్యమ చైతన్యానికీ ప్రతీకగా నిలిచిందీ కృష్ణాతీరం. 


వెనక్కి ...

మీ అభిప్రాయం