నువ్వొస్తావనీ...
 

  • 273 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఎస్‌.రవీంద్ర

  • హైదరాబాదు.
  • 9959248634
ఎస్‌.రవీంద్ర

ప్రియమైన మేఘమా...!
ఎక్కడున్నావు? ఎప్పుడొస్తావు? నీకోసం ఎదురుచూస్తున్నా! నీ స్నేహం కోసమే  పడిగాపులు పడుతున్నా. ఇంతలా ఎందుకు ఎదురుచూస్తున్నానో తెలుసా! కలిసి ఆడుకోవడానికి నాకంటూ ఎవరూ స్నేహితులు లేరు కాబట్టి. ఓసారి నేను ఏడుస్తుంటే, ‘ఎందుకమ్మా ఏడుస్తున్నావు?’ అంది అమ్మ. ‘నాకు తోడు ఎవరూ లేరుగా! దిగులుగా ఉంది’ అని చెప్పాను. ‘అయ్యో పిచ్చిపిల్ల, నీతో ఆడుకోవడానికి చెట్టు, చెలిమె, చినుకు, మేఘాలు... వీళ్లంతా ఉన్నారు కదా!  వాళ్లందరూ నీ స్నేహితులే, వాళ్లతో ఎంచక్కా ఆడుకో’ అని బుజ్జగించింది అమ్మ. అప్పుడు కానీ నా ఏడుపు ఆగలేదు. మనమంతా కలిసి కొన్నాళ్లు ఆడుకున్నాం. కానీ ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. తిరిగి రమ్మన్నా... నువ్వు లేనిదే మిగిలిన వాళ్లు రారాయే! అందుకే నీకోసం ఎంతో ఇదిగా ఎదురు చూస్తున్నా! 
      ఒక్కసారి మధుర జ్ఞాపకాల్లోకి వెళ్దాం! రెండు నెలల కిందటి వరకూ నేనూ, ప్రకృతి, వసంతం కలిసి సంతోషంగా ఆడుకున్నాం. ఆ పచ్చిక బయళ్లలో, లేలేత చిగుళ్లలో ఆడుకుంటూ ఎన్నిసార్లు ప్రకృతి ఒడిలో హాయిగా నిద్రపోయానో లెక్కేలేదు. కానీ గ్రీష్మం వచ్చి మమ్మల్ని వేరుచేసింది. ఆ బాధతో స్నేహితులు లేరని ఏడోరాగం మొదలెట్టాను! అన్నం తిననని మారాం చేశాను. అప్పుడు... అమ్మ ‘చందమామ రావే! జాబిల్లి రావే! బండెక్కిరావే! బత్తాయిలు తేవే! ఒలిచిన పండ్లు చేత్తో పట్టుకుని, ఒలవని పండ్లు ఒళ్లో వేసుకుని, పైడిగిన్నెలో పాలు పోసుకుని, వెండిగిన్నెలో పెరుగు వేసుకుని తెచ్చి మా బుజ్జాయికియ్యవే!’ అని పాడుతూ ‘చందమామ’ను పరిచయం చేసింది. చందమామ రోజూ కొంచెం కొంచెం పెరిగి పెద్దవడంతో భలే ముచ్చటేసేది. పదిహేను రోజులకు పున్నమి జాబిలి పరిచయమయ్యాడు. భలే అనుకుంటూ కొత్త స్నేహితుడితో కొన్నిరోజుల వరకూ కులాసాగానే గడిపేశాను. కానీ ఆ తర్వాత నా నేస్తం రోజురోజుకూ  నా నుంచి దూరంగా వెళ్లిపోవడం ప్రారంభించాడు. కొన్ని రోజులైతే దూరంగానైనా కనిపించే వాడు... ఇంకొన్నాళ్లకు పూర్తిగా కనిపించడమే మానేశాడు. మళ్లీ నా దగ్గరికి రావడానికి ప్రయత్నించాడు. మళ్లీ వెళ్లిపోయాడు. ఇదంతా నాకు ఇబ్బందనిపించింది. అందుకే అమ్మ దగ్గరికెళ్లి మళ్లీ బుంగమూతి పెట్టాను. ‘అది వాడి రాతమ్మా! మనం మార్చలేం. అమావాస్య వస్తే చాలు, చందమామ కనిపించడు. మాయమైపోతాడు. పౌర్ణమి వస్తే మాత్రం తను నిండుగా నవ్వుతాడు’ అని బుజ్జగించింది. 
      చూడు నేస్తం! అమ్మ ఇంతగా చెప్పిన తర్వాత మరి నేనెలా చందమామతో స్నేహం చేయగలను? నువ్వే చెప్పు! అందుకే నువ్వే రా! మనిద్దరం ఆడుకుందాం. మనిద్దరం ఎప్పుడూ కలిసి ఉండాలని ఎందరు దేవుళ్లకు మొక్కానో తెలుసా! 
      అసలు నువ్వంటే ఎందుకంత ఇష్టమో చెబుతాను... వింటావా! 
      నువ్వొచ్చేటప్పుడు తోడుగా వాన చినుకులను తీసుకొస్తావు. అవంటే నాకు చాలాచాలా ఇష్టం. వాళ్లతో కలసి ఆడుకోవాని కోరికగా ఉంది. కానీ నువ్వేమో ఎంతకీ రావాయే! నువ్వొస్తేనే కదా అవీ వచ్చేది! నేనంటే మీకెందుకంత కసి! నువ్వూ వచ్చి సరదాగా నాతో ఆడుకోవచ్చు కదా!  
      నువ్వూ, వానమ్మా కలిసి ‘‘చిటపటా’’ అని కురుస్తుంటే, ‘‘జలజలా’’ అని పారుతుంటే వినడానికి ఎంత బాగుంటుందో తెలుసా! సంగీతం నీనుంచే పుట్టినట్టు అనిపిస్తుంది. నువ్వు సరదాగా నా మీద వడగళ్లను విసురుతుంటే అబ్బో! చక్కిలిగింతలు పెట్టినట్లనిపిస్తుంది. చల్లని నీ తుంపర్లతో నా మేనిని తడిపేస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో! ఇక్కడ నీకోసం నేనొక్కదాన్నే కాదు! కొండలూ, కోనలూ నదీనదాలు అందరం ఎదురుచూస్తున్నాం!
      ‘‘ఢమ ఢమా ఢమా’’ అని ఆకాశంలో నీ పరుగులు విన్న ప్రతిసారీ నువ్వొస్తున్నావేమోనని ఆశపడతాను. కానీ అవన్నీ ఎప్పటికప్పుడు అడియాసలే అవుతున్నాయి. ఓయ్‌! నీ మీద ప్రేమతో చిరు కవిత రాశా! వింటావా! 
      ‘‘ఉరుములతో స్వాగతం పలికి/ మెరుపులతో హారతి ఇచ్చి/ చినుకులతో ఈ భువికి వచ్చి/ నాతో ఆటలాడవే ఓ మేఘమా!’’... బాగుందా! ఇది నచ్చినా... నచ్చకపోయినా నువ్వు తప్పకుండా వస్తావు కదూ! అంతా నీలోనే ఉంది! కాగితపు పడవలతో నీ రాకకోసం ఎదురుచూస్తూ... 

ఇట్లు... నీ ప్రియ నేస్తం
పుడమి


వెనక్కి ...

మీ అభిప్రాయం