సేదదీరెడి వాడె శ్రీరంగ శిశువు

  • 218 Views
  • 4Likes
  • Like
  • Article Share

    జ్ఞానప్రసూన

తెలుగు జానపద సాహిత్యంలో లాలి పాటలది ప్రముఖస్థానం. శిశువును నిద్ర పుచ్చేందుకు, ఏడుస్తున్నప్పుడు ఊరడించేందుకు తల్లినోటి నుంచి ఆశువుగా వచ్చేవే లాలి, జోలపాటలు. ఊయలను ఊపుతూ పాడేవి ఊయల పాటలు. తల్లి భుజం మీద వేసుకునో, ఒళ్లో పడుకో బెట్టుకునో, ఊయలను ఊపుతూనో ‘ళ్లొళ్లొళ్లొ... ఆయీయీ’ అనో పాడుతూంటే పరవశించి నిద్రలోకి జారుకోని పసిపాపలు ఉంటారా?
      అయితే లాలిపాట ఉద్దేశం పాపాయి నిద్రపోవడమో, ఊరకుండటమో కాదు. ఆ పాట శిశువుకు అమ్మకు బంధం బలపడేలా చేస్తుంది. తల్లిని ఇతరుల నుంచి భిన్నంగా చూసేందుకు దోహదకారి అవుతుంది. ఇంకా చెప్పాలంటే, శిశువు వికాసానికి బాటలు వేస్తుంది. లాలిపాటల్లో ఉండే శ్రావ్యత శిశువును ఆకర్షిస్తుంది. వీటిలో ప్రధానంగా ఉండేవి వీరగాథలు, దేవుని గుణగణాల వర్ణన. లాలిపాటల తొలి ఆధారాలు మానవ పరిణామంతోపాటే కనిపిస్తాయంటారు మానవ శాస్త్రవేత్తలు.
      ఈ లాలిపాటలు ఎప్పుడు పుట్టాయంటే మాత్రం చెప్పలేం. తెలుగులో లాలలు, జోలలు, ఉయ్యాలలు, జంపాలలుగా చెప్పుకునే వీటిని ఆంగ్లంలో లలబీ, హిందీలో లోరీ అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా, అది ఏ సమాజమైనా అంతటా తల్లిప్రేమ ఒక్కటే కదా! కొండల తిమ్మయ్య మీద ‘వేంకట’ముద్రతో వేల సంకీర్తనలు రాసిన అన్నమయ్య పాటల్లో లాలి పాటలది ప్రత్యేక వర్గం. ‘జో అచ్యుతానంద జోజో ముకుంద’, ‘అలర చంచలమైన ఆత్మలందుండ’, ‘ఉయ్యాల బాలునూచెదరు’, ‘లాలనుచు నూచేరు’ ఇలా ఎన్నో పాటల్లో పసిబాలుడైపోయాడు పరమాత్ముడు. అన్నమయ్య తన సంతానమైన నరసింగన్న, పెద తిరుమలయ్య, నరసమ్మ, తిరుమలమ్మల బాల్యదశలో లాలిపాటలు రాసి ఉంటాడంటారు పండితులు. రోజూ తిరుమలేశుడి పవళింపుసేవలో పాడేది అన్నమయ్య లాలిపాటే. అలాంటి వాటిలో ఒకటి ఈ పాట.
తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన
చెల్లుబడి నూగేని శ్రీరంగ శిశువు
కలికి కావేరి తరగల బాహులతలనే
తలగకిటు రంగ మధ్యపు తొట్టెలను
పలుమారు దనునూచి పాడగా నూగేని
చిలుపాల సెలవితోడ శ్రీరంగ శిశువు
అదివో కమలజుడు తిరువారాధనంబనగ
అదన కమల భవాండమను తొట్టెలను
ఉదధులు తరంగముల నూచగా నూగీని
చెదరని సిరులతోడ శ్రీరంగ శిశువు
వేదములే చేరులై వెలయంగా శేషుడే
పాదుకొను తొట్టెలై పరగగాను
శ్రీదేవితో గూడి శ్రీవేంకటేశుడై
సేదదీరెడి వాడె శ్రీరంగ శిశువు

      లాలి పాటలు అంటే కృష్ణుడు, రాముడు మీద ఉన్నవే ఎక్కువ. అలాగే ‘కస్తూరి రంగరంగ/ మాతండ్రి కావేటి రంగరంగ’ అన్న శ్రీరంగనాథుడి కీర్తనా ప్రసిద్ధమే. రంగనాథుడి కోవెల తమిళనాడులోని శ్రీరంగంలో ఉంది. ఈ గుడి సప్త ప్రాకారాల మధ్య నెలవైంది. భారతదేశంలో అతిపెద్ద దేవాలయ సముదాయం శ్రీరంగమే. ఇది కావేరి, ఆ నది చీలిక అయిన కొల్లడం నదుల మధ్యలో ఉంటుంది. తిరుపతి తర్వాత 108 దివ్య తిరుపతుల్లో శ్రీరంగానిది రెండోస్థానం. ఇక్కడ ప్రధానదైవం విష్ణుమూర్తి రూపమైన శ్రీరంగనాథుడు. ఆయన స్వయంభువు. ఆయనను మొదట బ్రహ్మదేవుడు పూజించాడట. తర్వాత ఇక్ష్వాకు వంశస్థులకిచ్చాడట. ఇక్ష్వాకు కులతిలకుడైన శ్రీరాముడు దాన్ని విభీషణుడికిచ్చాడట. ఆయన లంకకు తీసుకువెళ్తూ మార్గమధ్యంలో ఆగి, స్వామిని భూమిమీద ఉంచాడు. అంతే స్వామి అక్కడే స్థిరంగా నిలిచిపోయాడు. ఇప్పటికీ పన్నెండేళ్లకోసారి విభీషణుడు రంగనాథస్వామిని పూజించేందుకు వస్తాడని కథ ప్రచారంలో ఉంది. స్వామివారి దేవేరి రంగనాయకి. ఇక్కడ స్వామి శయనమూర్తి. ఆ పవళించిన విగ్రహధారిని ఎంచుకుని రాసిన జోలపాట ఈ ‘తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన’. 
శ్రీరంగశాయికి ఉయ్యాల
ప్రళయం వచ్చి భూమి జలమయమైనప్పుడు మర్రాకు మీద శ్రీమహావిష్ణువు శిశువురూపంలో మార్కండేయ మహామునికి దర్శనమిచ్చాడట. ఆయనే వటపత్రశాయి. అలా సముద్రంలో మర్రాకు మీద తేలుతున్న శిశువుగా- విష్ణువు అలల తాకిడికి ఊగుతూ కనిపిస్తున్నాడు. ఆకుమీద తేలుతున్న దృశ్యమే ‘మర్రాకు తొట్టెల’గా అన్నమయ్య పాటలో అమరింది. ఆ ఊయలూగడం మామూలుగా కాకుండా, చెల్లుబడి, అంటే ఆ అధికారం తనకే ఉంది అన్నట్లుగా ఊగుతున్నాడట ఆ శ్రీరంగశిశువు. ఇక్కడ శ్రీరంగశిశువు... అంటే శ్రీరంగంలో వెలసినవాడు లేదా... శ్రీరంగనాథుణ్నే బాలునిగా ఊహించుకున్న రూపమూ అన్న రెండర్థాలు తీసుకోవచ్చు.
శ్రీరంగం కావేరి నది మధ్యలో వెలసిన ద్వీపం. అందుకే కలికి కావేరి... కావేరి అనే స్త్రీ తన అలలనే బాహువులనే తీగలుగా, శ్రీరంగం దీవినే తొట్టెలగా చేసుకుందట. చేతుల మీద శిశువును పడుకోబెట్టుకుంటే పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే తలగక+ ఇటు అంటే తొలగకుండా, పడిపోకుండా ఆ రంగ మధ్యపు తొట్టెలను తన అలలనే బాహులతలతో పట్టుకుందట! రంగమధ్యపు తొట్టెల అంటే శ్రీరంగనాథుడు పవళించిన చోటు. తన అలలనే బాహువుల మీద రంగణ్ని పడుకోబెట్టుకుని పలుమారు ఊపుతూ, తన ప్రవాహ సవ్వడి అనే జోలపాట పాడుతూంటే శ్రీరంగశిశువు ఊయలూగాడట! అదీ ఎలా...? చిలుపాల సెలవితోడ- చిట్టిచిట్టి పాలపెదవులతో! మర్రాకు మీద పెదవులపై చిరునవ్వు చిందాడుతోంటే... ప్రశాంతంగా నిదురపోతున్న ఆ వేదవేదాంత వర్ణితుణ్ని ఊహించుకోండి!
పరమాత్ముడు సృష్టికర్తకు తండ్రి. అందుకని బ్రహ్మదేవుడు తన నాన్నగారికి తిరువారాధనం (అర్చన/ పూజ) చేస్తున్నాడట. అప్పుడు బ్రహ్మాండమనే (కమలభవుడు అంటే బ్రహ్మ; కమలభవాండం అంటే బ్రహ్మాండం) తొట్టెలను సముద్రాలు అలలతో ఊపుతూంటే... చెదరని సంపదలతో ఊగుతున్నాడట శ్రీరంగశిశువు.
      స్థూలంగా చెప్పుకోవాలంటే, శ్రీరంగనాథుడు పవళించేది శేషపానుపు మీద. శ్రీరంగం గర్భాలయంలో విగ్రహం శేషశయన మూర్తే. ఇది విష్ణువు పాలకడలిలో శయనించిన దానికి ప్రతీక. పరమాత్ముడు పవళించిన శేషుణ్ని ఊయలతో పోలుస్తున్నాడు అన్నమయ్య. ఆ శేషుడు ఊయలయ్యాడు సరే! ఇక కావాల్సింది నాలుగు తాళ్లు. మరి అన్నమయ్య కట్టిన తాళ్లేంటో తెలుసా? వేదాలు. అవును నాలుగు వేదాలను తాళ్లుగా తన పదంలో ఉపయోగించుకున్నాడు పదకవితా పితామహుడు. ఆ వేదాలు తమంతట తామే తాళ్లుగా వెలశాయట. వేదాలు తాళ్లు, శేషుడు తొట్టెల కాగా... శ్రీదేవితో కలిసి శ్రీవేంకటేశ్వరస్వామిగా శ్రీరంగంలో సేద దీరుతున్నాడు శ్రీరంగశిశువు.
      శయనమూర్తిగా ఉన్న రంగనాథుణ్ని నాయకుడిగా చేసి లాలిపాట రాయడం అన్నమయ్య సద్యస్స్ఫూర్తికి నిదర్శనం. అన్నమయ్య కదిరి, అహోబిలం, కంచి, వాయల్పాడు తదితర ప్రదేశాలు దర్శించాడు. తన క్షేత్ర సందర్శనలో భాగంగా శ్రీరంగమూ దర్శించాడు. అలా కోవెలలో ఓ సాయంత్రం వేళ శ్రీరంగనాథస్వామిని పసిపాపడిగా భావించి అప్పటికప్పుడు ‘తొల్లియును మర్రాకు తొట్టెలను...’ ఆలపించి ఉంటాడు.
      రానురాను జీవితాలు యాంత్రికంగా మారిపోతున్నాయి. శిశువులు ఊయల సామ్రాజ్యంలో గడుపుతున్న కాలం ఒకప్పటితో పోలిస్తే తక్కువైపోయింది. మూడేళ్లకే ‘నర్సరీ’రాజ్యాలకు తరలిపోతున్నారు పిల్లలు. తల్లి ఒడి, ఊయల ఈ రెండింటికి దూరమైన పసివాళ్లకు లాలిపాటలు, జోలపాటలు ఎలా తెలుస్తాయి. అమ్మభాష పట్ల అభిమానం ఎలా ఏర్పడుతుంది?


వెనక్కి ...

మీ అభిప్రాయం