నుడికారం నిండుకుంటోంది!!

  • 1874 Views
  • 309Likes
  • Like
  • Article Share

    దినకర్

  • నంద్యాల
  • 9985101420

మన తెలుగు భాష ఓ పుష్పక విమానం. ఎందరు కూర్చున్నా మరొకరికి ఆ విమానంలో చోటున్నట్లు ఎన్ని అన్యదేశాలు తనలో చేరినా, మరో అన్యదేశ్యమూ కలిసేందుకు ఈ భాషలో తావు ఉంటుంది. అలా అనేకాన్యదేశాలు కలిసి ‘తెలుగు నుడికారం’ సొంపునే నింపుకున్నాయి కాబట్టి ఈ భాషకింత తియ్యదనం! ఇంత లెస్సతనం. నన్నయ్య నుంచి నారాయణరెడ్డి దాకా తెలుగులో సంస్కృత, ప్రాకృత తదితరనేక భాషల సంగమం నిత్యోత్సవంలా జరుగుతూనే ఉంది. అయినా తెలుగు ప్రజలు తమదైన నుడికారం ప్రయోగాల్ని ఏనాడూ విడిచిపెట్టనూ లేదు; మరచిపోనూ లేదు. కొద్దిమంది అనుకుంటున్నట్లు, సంస్కృతమేమీ తెలుగును మరణశయ్యకు చేర్చలేదు. నిజానికి సంస్కృతం అచ్చ తెనుగుకు సంజీవనిగానే సహకరించింది.  విద్యారంగం ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లిన తర్వాతే తెలుగువాళ్లలో ఆంగ్ల వ్యామోహం ఎక్కువైంది. అప్పటి నుంచే తెలుగు నుడికారం మసకబారడం మొదలైంది. ఓ రెండు మూడు దశాబ్దాల కిందటి వరకూ కూడా గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ పాలు, పెరుగు, కూరగాయలు, పూలు లాంటి వాటిని ‘వర్తన’గా (‘వతను’ అని కొన్ని ప్రాంతాల్లో వాడుకలో ఉండేది) పెట్టుకున్న ‘వృత్తి జీవనులు’ తమ వృత్తులకే, కుటుంబాలకే సహజమైన తెలుగు నుడికారంతోనే మాట్లాడుతూ ఉండేవారు. అసలీనాడు ‘వర్తన’ అనే మాట ఎంతవరకు తెలుసు?
‘కుంటు’ లేకుండా నెలల తరబడి పాలో, పెరుగో, పూలో తెచ్చియిచ్చేందుకు కుదుర్చుకున్న ఒప్పందమే ‘వర్తన’. అంటే, రోజూ లీటరో, అర లీటరో పాలు పోసే ఒప్పందం- నెలాఖరున పైకం వసూలు చేసుకోవడం. ‘కుంటు’ కూడా అలాంటి నుడికారమే. మధ్యలో ఎగరగొట్టకుండా తేవడమని అర్థం. ఇలాంటి అనేకం తెలుగు నుడికారాలు ఇటీవల బాగా కను(విను)మరుగై పోతున్నాయి. నిర్మాణరంగ శ్రమజీవి కూడా మనమేదైనా ‘ఒట్టు మొత్తం’ పని అప్పజెప్పితే ‘అడ్వాన్సు’ అడుగుతున్నాడు. అతని నోట ‘అడ్వాన్స్‌’ అన్న మాటే వస్తోంది తప్ప, ‘బయానా, సంచకరువు, సంచకారం, అగావు, ముని(ను)మొత్తం, మునిగుత్తా’ అనే ఒకప్పటి నుడికారాలు వినపడట్లేదు. అసలు ఆ మాటలు ఇప్పుడు ఎవరికీ గుర్తులేవు కూడా!
ఇక వ్యాపారం చేసుకునే కొట్లకు సంబంధించి కూడా ‘గుడ్‌విల్‌’ అంటూ ఆంగ్లాన్నే పట్టుకునే పాకులాడుతున్నారు. కానీ, ‘ఉదారు’ అనే తెలుగు నుడికారాన్ని మర్చేపోయారు. ‘నానార్థాలు’ అనగానే కేవలం సంస్కృత పదాలకే ఉంటాయన్నది మనకున్న ఓ గట్టి నమ్మకం. కానీ తెలుగు నుడికారాలలోనూ ఇలాంటి అనేకార్థ ద్యోతకాలైన చక్కటి పదాలున్నాయి. ఉదాహరణకి ‘కొట్టు’ అచ్చమైన తెలుగు నుడే. ‘అంగడి’ అనే అర్థంలో వినిపించే ఈ పదం ‘తన్నుము’ అని అర్థం వచ్చే ‘విధ్యర్థక క్రియా వాచకం’గానూ ప్రయోగంలో ఉంది. పొడి లేదా ముక్కలు చేయడం (దంచడం) అనే అర్థం అదనం. రాళ్లను పగలగొట్టడం, నూకలు కొట్టటం లాంటి ప్రయోగాలు బోలెడు.
‘కాటు’ కూడా ఓ అద్భుతమైన నుడికారం. ఈనాడది ఇంచుమించు మాయమైపోయింది. ‘కాటు- పాముకాటు’, ‘పిల్లవాడు కాటు పడ్డాడు’ (తప్పిపోయా డనీ), ‘పులికాటు’ (అతిపులుపని), ‘పులుసు కాటుపోయింది’ (అడుగంటిందని), ‘అన్నం కాడెక్కింది’ (మాడిందని), ‘చూడు కాటు పడింది’ (చిన్నగా గీచుకుపోయిందని), ‘వాడికి కాటెక్కువలే’ (పొగరు, నీల్గుడు అని)... ఇలా ఎన్నెన్ని మాటలుండేవి! కళ్లకు పెట్టే ‘కాటుక’ కూడా ఈ ‘కాటు’ నుంచి వచ్చిందే- రేఖలా, గీరలా, సన్నగా, గుర్తుగా రెప్పకు రాసుకునేది అనే అర్థంలో. మరీనాడు ఈ నుడికారం ఎన్ని తెలుగు లోగిళ్లలో వాడకంలో ఉంది? ‘‘ఎక్కడో మిస్సయ్యారు! ఏదో బ్యాడ్‌స్మెల్‌’’ వంటి ఆంగ్ల పదాల్ని నేడు గృహిణులు వాడుతున్నారు అంటే లోపం ఎవరిది?
అమంగళ సూచకాలనీ మంగళార్థ ద్యోతకంగా ప్రయోగించడమనే ఓ చక్కటి సంప్రదాయం తెలుగు నుడికారాలకు ఉంది. యాచకుడు వచ్చి ‘తల్లీ! బిచ్చం’ అని అడిగాడు. ఈనాడు ఎవరి నోటైనా ఏం వినిపిస్తోంది?‘పో!పో!’ లేదా ‘ఏంలేవుపో’ ఇంతే! లేవని చెప్పడమే అమంగళమని, చీదరించుకోవడమనీ భావించిన పెద్దలు ‘నిండుకున్నాయి నాయనా!’ అనేవారు. ‘నిండుకున్నాయి’కి ‘నిండా ఉన్నాయి’ అనేది అసలు అర్థం. ‘ఏమీ లేవు’ అనేది సూచితార్థం. ఇంట్లో కూడా వంటకు బియ్యం అయిపోతే, ‘బియ్యం నిండుకున్నాయి’ అనే అనేవారు. ఇలాంటి దివ్య భావనలని అందించే తెలుగు నుడికారం తెరమరుగైపోయింది.
నూనె, కొవ్వొత్తి దీపాలు కరిగిపోయే వరకూ వెలిగి తర్వాత ‘మలుగుతాయి’. ఈ ‘మలుగుతాయి, మలుగు, మలిగె’ పదాలన్నీ చిక్కటి తెలుగు నుడికారాలే. ‘వెలుగు’ అంటే ‘ప్రకాశించు’ అనీ, ‘మలుగు’ అంటే ఆరిపోవటమనీ అర్థం. ‘మలిగె’కు ‘కొట్టు’ అనే అర్థమూ తెలుగు వాచకమే! ఈనాడైతే చాలామంది ‘లైట్లార్పు, దీపాలార్పు’ అనే మాటల్నే యథేచ్ఛగా వాడుతున్నారు. పూర్వం పెద్దలు అలా అనేవారు కాదు; అననిచ్చే వారు కాదు. ‘దీపం ఆరిపోవటం, దీపాన్ని ఆర్పటం’ అంటే పెద్ద అమంగళార్థకం. ఇంటి పెద్దదిక్కు మరణిస్తేనే ‘ఇంటి దీపం ఆరిపోయింది’ అనేవారు. అలా ‘దీపం ఆరడం, ఆర్పడం’ మృతి సంకేతాలు కాబట్టి వాటికి బదులు ఇతర ప్రయోగాలను ఎంత అర్థవంతంగా వాడేవారో! ‘దీపం కొండెక్కింది’ అనేది ఆ చక్కటి భావం నింపుకున్న చిక్కటి నుడికారం. ప్రమిదలో వెలిగే దీపశిఖనీ, కరిగిపోతూ చివరి మెట్టుకు వచ్చిన కొవ్వొత్తి దీపశిఖనీ గమనించండి! అది కింద నుంచి పైకి పాములా అలా అలా కదలి అదృశ్యమైపోతుంది. అలా పైకి వెలుగుతూ పోవడాన్ని ‘కొండెక్కింది’ అని భావగర్భితంగా అనేవారు. ఈరోజుల్లో మాత్రం ‘దీపాలార్పేవారే’ కనిపిస్తున్నారు.
నూరుశాతం ‘నల్లపూసలల్లిన తాళి’ ఆనాటి సాంప్రదాయం. నేడూ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది. అప్పట్లో దారాన్నే నల్లపూసల్లోకి ఎక్కించేవారు. అది నీళ్లకి చెమచి నాని ఎప్పుడో ‘పుటుక్కు’ మంటుంది. ఇప్పటితరం అమ్మాయిలైతే ‘తాళి (తాడు) తెగింది’ అనే పుటుక్కున అనేస్తున్నారు ఇదెంత అమంగళ సూచక వాక్యం! కాబట్టే పూర్వికులు ఎంతో సమంజసమైన అర్థవంతమైన చక్కటి నుడికారంతో ఈ అమంగళార్థాన్ని తోచకుండా ప్రయోగించేవారు. పూసల్లోని దారం తెగగానే నల్లపూసలన్నీ సర్రున నలువైపులా చెదరి జారుతాయి, ఎవరో చల్లినట్లు. అందుకే అర్ధాంతరంగా, అనుకోకుండా పూసల్లో దారం తెగిన సందర్భాల్లో ‘నల్ల పూసలు చెరిగాయి’ అనేవారు. ఇదే అర్థంలో ఇప్పటికీ పెద్దవాళ్ల నోటి వెంట వినిపించే మరో ప్రయోగం ‘సూత్రం పెరిగింది’!
ప్రతి భాషలోనూ ఇలాంటి నుడికారాలు, పదబంధాలు ఉంటాయి. ఆంగ్లంలో ‘అతను చనిపోయాడు’ అనే దాన్ని ‘హి కిక్‌డ్‌ ద బకెట్‌’ అంటూ చమత్కరిస్తారు. దీన్నే మనవాళ్లు ‘బాల్చీ తన్నేశాడు’ అనే కొత్త నుడికారంగా చలామణిలోకి తెచ్చుకున్నారు. కానీ, అంతకుమునుపే ఈ ‘మృతుడి’ గురించి శోభాయమానంగా చెప్పేందుకు పెద్దలు ఎన్నో నుడికారాలను సృష్టించారు. ‘పాపం అతను పోయాడట, అతను కాలం చేశాడు, కాలమయ్యాడు, వారు మనకిక లేరు’ లాంటివే కాకుండా ‘కీర్తిశేషులయ్యారు, పరమపదించాడు, దివంగతుడయ్యాడు, శివైక్యం చెందాడు, తిరిగిరాని లోకాలకి వెళ్లాడు’ వంటి సంస్కృత వాసనలనీ తెలుగువారు తమవేనన్నంత ధాటిగా వాడుకుంటూనే ఉన్నారు.
అయితే ఈ ‘వాసనలు’ వంటబట్టించు కున్నాక అసలైన మూలద్రవ్యాలని వదిలివేస్తూ ఉండటమే బాధాకరం. అచ్చమైన తెలుగు నుడికారాలు మరుగున పడిపోతూ, మన తెలుగు పదాలకోసమే నిఘంటువులని తడుముకునే దుస్థితిలోకి రావడం మరీ విషాదకరం. అలా వెతుక్కోవడమూ బరువై, ‘పోనీద్దూ! ఇవి సులువు కదా’ అని, వ్యవహారంలో ‘కూరగాయలమ్మే అమ్ములు’ (అమ్మి- అమ్ములు) కూడా ఆంగ్ల శబ్దాల్నే తోడేసుకుంటూ ఉండటం చూస్తూ కూడా ఏమీ చేయలేని గడ్డు (గొడ్డు) పరిస్థితి దాపురించడమే వ్యథాకారణం! తెలుగు భాషను తెలుగువాళ్లే రక్షించుకొందురు గాక!

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం