హాస్యవీరుడి వీరంగం

  • 44 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శంక‌ర‌

తెలుగుసాహిత్యంలో హాస్యం అనగానే మొట్టమొదట గుర్తుకువచ్చే కవి తెనాలి రామలింగడు, అలియాస్‌ తెనాలి రామకృష్ణుడు. ఈ విషయంలో ఆయనకు సాటిగానీ పోటీగానీ ఇంకొకరు లేరు. చిత్రమేమిటంటే ఇంతటి హాస్యమూర్తి తిక్కరేగితే ఉగ్రనరసింహుడవుతాడు. వీరంగమాడతాడు. ఏమాత్రం ముందూ వెనకా ఆలోచించడు.
      ‘కవయః నిరంకుశాః’ అన్నారు. ఆ నిరంకుశత్వం తెనాలి రామకృష్ణుడి మాటల్లో ‘నోటికి నోరుపాళ్లు’ కనిపిస్తుంది. అందరి మీద ఒంటికాలి మీద లేచే తెనాలి రామకృష్ణుడు ఎవరైనా తన జోలికొస్తే వారిమీద ఇష్టమొచ్చిన మాటవేస్తాడు. తాట తీస్తాడు. ‘‘ఒకని కవిత్వమందెనయ నొప్పులు తప్పులు నా కవిత్వమం/ దొకనికి తప్పు బట్ట పని యుండదు కాదని తప్పు బట్టినన్‌/ మొకమటు క్రిందుగా దిగిచి ముక్కలు వోవ నినుంప కత్తితో/ సిక మొదలంట గోయుదును చెప్పున గొట్టుదు మోము దన్నుదున్‌’’ అనేశాడు. అంతటివాడు ఇంతమాట అన్న తర్వాత ఆయన కవిత్వాన్ని వేలెత్తి చూపడానికి ఎవరు సాహసిస్తారు?
      తెనాలి రామకృష్ణుడి ఆగ్రహానికి ప్రెగడరాజు నరస కవి కూడా బలయిపోయాడు. ‘‘తెలియని వన్ని తప్పులని దిట్ట తనాన సభాంతరంబునన్‌/ పలుకగ రాకురోరి పలు మారు పిశాచపు పాడె గట్ట నీ/ పలికిన నోట దుమ్ము వడ భావ్య మెఱుంగక పెద్దలైన వా/ రల నిరసింతువా ప్రగడ రాణ్ణరసా విరసా తుసా బుసా!!’’ అంటూ బుసకొట్టేశాడు. ఇంకా తిట్లు మిగిలి ఉన్నాయేమో ‘ప్రజానిఘంటువు’ తిరగేసినా దొరక్కపోవచ్చు! అప్పుడు నరస కవి ఎంతగా వణికిపోయాడో, ఆయన పాత్రను నటించిన వారిని చూసి తెలుసుకోవాల్సిందే తప్ప ఊహించనలవి కాదు.
      తెనాలి రామకృష్ణుడు తనకు గిట్టని సాటి కవులను ఏమాత్రం సహించేవాడుకాడు. ఉదాహరణకు ‘వసుచరిత్రము’ రాసిన రామరాజభూషణుణ్ని కూడా ‘‘చీపర పాపన తీగల/ చేపల బుట్టల్లినట్లు చెప్పెడు నీయీ...’’ అంటూ హీనంగా తిట్టేశాడు. అంతేకాదు! ఇతర కవులను తనతో పోల్చడం, పద్యం బాంబు పేల్చడం హాస్యఉగ్రకవికి నిత్యకృత్యం. ‘‘కెంగాల రామకృష్ణుని/ బంగరు కడియంబులుండ బండితుడగునా!/ జంగులు జంగులు కలిగిన/ సింగారపు టూరకుక్క సింగంబగునా!’’ అన్నాడో సారి. ఆగ్రహం అనండి.. కుళ్లు అనండి.. ఏది వచ్చినా రామలింగడి దూకుడును ఆపడం ఎవ్వరి తరమూ కాదు.
      పెద్దల ప్రోద్భలంతో ద్వారపాలకుడొకడు తెనాలి రామకృష్ణకవికి ‘కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్‌’ అన్న సమస్యను ఇచ్చాడు. దాంతో రామకృష్ణుడు పిచ్చిపట్టినట్టు రెచ్చిపోయాడు. ‘‘గంజాయి త్రాగి...’’ అంటూ పూరించి సంస్కారానికి దహనసంస్కారం చేశాడు. ఆ తర్వాత ‘తీవ్రత’ను గ్రహించాడు. సమయానుకూలంగా రాయలవారి సమక్షంలో పద్యం మార్చేశాడు. రాజాశ్రయం కోసం తన ‘మతం’ మార్చుకున్నవాడికి ఇది లెక్కేమిటి? రామకృష్ణుడు సమస్యను సంస్కారవంతంగా పూరించిన ఆ పద్యమిది.
రంజన చెడి పాండవులరి
భంజనులై విరటుకొల్వ పాల్వడిరకటా
సంజయ! విధినేమందును
కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్‌
 
      పనికట్టుకుని శత్రువుల్ని తయారు చేసుకుని, వాళ్లమీద దూర్వాసునికి మించి కోపం ప్రదర్శించే తెనాలి రామకృష్ణుడే మన హాస్యకవితా పితామహుడు! ఎంత చిత్రం!


వెనక్కి ...

మీ అభిప్రాయం