చెమటానా నీ బొట్టు వెండల్లే మెరిసేను!

  • 142 Views
  • 1Likes
  • Like
  • Article Share

    పోలవరపు లక్ష్మణకుమార్‌

  • జీవిత బీమా సంస్థ ఏజెంట్
  • ‌కావలి, నెల్లూరు.
  • 9652408805

నిండైన తెలుగుదనానికి మెండైన ఉదాహరణలు మన పల్లెలు. అక్కడి ఆప్యాయతానురాగాలు సుమగంధాలను అద్దుకుని సురగంగా ప్రవాహంలా సాగిపోయే పదాల అల్లికలు మన జానపదాలు. కాలం గడిచేకొద్దీ మనుషుల మధ్య ఆపేక్షలతో పాటు మనవైన భాషాసంస్కృతుల మీదా చీకట్లు కమ్ముకున్నాయి. వాటిని చీల్చుకుంటూ నాటి జానపద జనజీవన సౌందర్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఆ ప్రయత్నం వెలుగురేఖలా పల్లవిస్తుంది!
మా
సొంతూరు నెల్లూరు జిల్లా జలదంకి మండలం చామదల. మేము హరిజనులం. అచ్చమైన తెలుగు పల్లెటూరి సంప్రదాయాలకు మాత్రమే కాదు... మంచి దానశీలురకు, చతురులకు, పనీపాటలకు, పాడిపంటలకు, కళలకు, రాజకీయాలకు అతీతమైన అనుబంధాలకూ మా ఊరు దచ్చాది(దక్షిణాది) పరగణాలలో పెట్టింది పేరు. చుట్టూ చెరువులు, డొంకలు, వాగులు, వనాలు, తోపులు, మాగాణి బీళ్లు. చల్లదనానికీ, కూటికీ, నీళ్లకూ దిగుల్లేని ఊరు. పౌరుష ప్రతాపాల్లోనూ తక్కువేంకాదు. ఏ వర్ణం వాళ్ల ఆత్మగౌరవం ఆ వర్ణం వాళ్లలో ఉండనే ఉంది మరి! అయినా బ్రాహ్మలు, వైశ్యులు, రెడ్లు తదితరులు మా మీద ఎంతో ఆదరాభిమానాలు చూపించేవాళ్లు. ఆ అభిమానాలు ఆత్మీయతలన్నీ సంప్రదాయాల చాటున ‘దూరం దూరం’ అంటూనే ఉన్నా, ఏదో తెలియని అపేక్ష ఉండేది ఒకరిపట్ల ఒకరికి. ‘అరే, ఒరే’ అని అంటూనే, ‘‘మీ అయ్య ఎట్టున్నాడురా? వాడేడి, వీడేడిరా? తిన్నారట్రా, ఏంకూరాకురా?’’ అని పెద్దలు మమ్మల్ని అడిగేవాళ్లు. అలా ఈ కులం అనే శక్తి మాటున ఊరు పదిలంగానే ఉండేది. పెత్తనంలో వాటాలో మాకూ నోరుందని, మేమూ మనుషులమేనని, పరిపాలనలో మేమూ ఉంటామని మా కుల పెద్దలు రాజకీయాల్లోకి దూరేటప్పుడు, ఆ రెడ్లూ, బ్రాహ్మలు కక్కాలేక మింగలేకన్నట్టు ఉండేవారు. పెద్ద పెద్ద కమతాలు గలవాళ్లు ఒక్కొక్కరు. పూర్వం ప్రకాశం జిల్లా ఉలవపాడుకు చెందిన ఓ పెద్ద రెడ్డి జమిందారుకు చెందిన వేల ఎకరాల భూమిలో మా ఊరూ ఓ భాగం. పాతపేరు ‘శ్యమాదల’. ఎన్నో ఏళ్లకోసారి అప్పుడప్పుడు వడ్డెర్లకు, మాదిగలు గొల్లలు, ముదిరాజులకు మధ్య గుడి, దేవుడు, తిరునాళ్లు, నీళ్లు- భూపందేరం, కోడి పందేలు తదితర విషయాల్లో గొడవలు జరిగితే జరిగుండొచ్చు కానీ, మా ఊరు జాతర్లకు భలే కోలాహలమైన ఊరు. ఆ కక్షలు, కార్పణ్యాలు అన్నీ మరిచిపోయి, మళ్లీ అందరూ హాయిగా, ఆప్యాయంగా జీవిస్తున్న ఊరు.
      నెల్లూరు జిల్లా మొదట చోళ మండలంలో ఉండి తర్వాత రేనాటిసీమ కిందకు వచ్చింది. ఆంగ్లేయుల కాలానికి ‘కోస్తా సర్కారు జిల్లా’ అయింది. ప్రజల్ని ఉత్తరాది వాళ్లనీ, దక్షిణాది వాళ్లనీ పిలుచుకునేవాళ్లు. నెల్లూరు పరగణాలకు పడమరన వెలసిన వేదగిరి నరసింహ స్వామి, జొన్నవాడ కామాక్షమ్మ, సుదూరానగల సంగమేశ్వరుడు, తూర్పు ఈశాన్యాన పవళించిన శ్రీపంటరంగడు ఈ జిల్లాకు మూలవిరాట్టులు. ఇక్కడి అన్ని ఊళ్లవాళ్లు, అన్ని శాఖలవాళ్లు పాడుకునే పాటల్లో తమ ఊరిపేర్లు వచ్చేట్టుగా మూలగీతాలను మార్పుచేసుకునే వారు. అందువల్ల ఆ ‘రంగడు’ అందరివాడూ అయినాడు.
      మా ఊళ్లోని రామ, కృష్ణ, శివాలయాల్లో పొద్దుపొద్దున్నే పూజలు జరిపి హారతులిచ్చేవారు. ఆ జేగంటల శబ్దం మంగళకరంగా శ్రవణానందంగా ఊరికి దూరంగా, పాత చెరువుకట్టను ఆనుకుని దిగువన ఉండే మా వాడలోకి వినవచ్చేది. ఆ గుడి గంటల శబ్దం వినడం మాకెంతో ఇష్టం. మాగాణిలోకి, చుట్టూ పచ్చిక బీళ్లు, వనాల్లోకి పోవాలంటే మా వాడ నడిమధ్యగల బాట (బళ్లబాట) మీదుగానే పోవాలి. కాబట్టి, మా వాడ వచ్చీపోయే జనంతో సందడిగా ఉండేది. తూర్పుసందెన పచ్చిక బయళ్లలోకి మళ్లిన గోవుల అంబారాలు, పక్షుల కిలకిలారావాలు, గోధూళి, ఎరువుల బళ్లు, పేడతట్టలతో అటూ ఇటూ తిరిగే పురుషులు, బిందెలు, కావిళ్లతో నీళ్లకు, ఇతర పనీపాటలకు పరుగులు తీసే స్త్రీలు!! ఆహా! ఇలా విరబూసిన నందనవనంలా ఉండే మా ఊరు... 
నామగడ్డలజొన్న నగరీ కూరపాడు
పక్కాన ఉర్వకొండ పైన తాడీకొండా
అందుట్లో కలిసింది కనిగీరి తాలూక
ఆమడ దూరాన కందుకూరు, కరేడు
ఆవల్ల పురమూ విక్రమ సింహాపురము, 
        బహుదొడ్డ రాజ్జేము
పేరైన పాటూరు సరి ఊరు శ్యామాదల
పక్కన్న కావలీ పరగణాలు పేట మాదొకటి
మేటైన పేటా పేట పేరు రంగనాయకుల పేటా
పురమూ, విక్రయ సింహాపురమూ 
బహుదొడ్డ రాజ్జేము!!
బుడ్డీ చెంబుతో నీళ్లు భూ చక్ర గొడుగుల్లు
అల్లేలు మల్లేలు అరటిపళ్లు తేనె మామిడి పప్పు
టెంకాయ వడపప్పు తెచ్చారు భూసురులు నీకూ
మంగళం మంగళం జయ మంగళం శ్రీరంగరంగా
మంగళం మంగళం 
నిత్య శుభ మంగళం!!

      అలాంటి మా మంచి ఊళ్లో.. మా హరిజనవాడలో ఓ ఇంట్లో పెళ్లి జరుగుతోంది. అది వరుడి ఇల్లు. ముందు నలుగులు, మంగళస్నానం, తర్వాత డోలు-సన్నాయి మేళాలతో, చీని చామరాల కింది కొండకు ఎదురుకోలు నడవటం, పెళ్లికొడుకు పెళ్లికూతురి మెళ్లో ఆ మూడుముళ్లూ వేసి శోభనానికి వెళ్లేంత వరకూ పొలిమేర దాటకుండటం, చుట్టాలూ పక్కాలూ సరదాలు ఇదీ వరస మా పల్లెలో! పచ్చని మామిడాకుల తోరణాలు, తాటాకు పందిళ్లు, రంగు రంగుల కాగితాల తాళ్లతో పందిరి... ఆ రోజుల్లో అలంకరణ. ‘చిరునవ్వుల తొలకరిలో మరుమల్లెల చినుకులలో’ అంటూ ఎన్టీఆర్‌ పాటతో అదరగొడ్తోంది గ్రామఫోను రికార్డు. ఇంటి ముందు పందిట్లో, నేలమీద పరచిన ఈతాకుల సన్నచాపలపై బంతి! అరటి ఆకుల మీద భోజనాలు. గోగాకు పచ్చడి తప్పనిసరి. ఎంత సందడి!! ఏం సందడి!! ఆఖర్న ఆకూ వక్కా ప్రదానం, చదివింపులు. పెళ్లికూతురు విడిదికి- వరుడింటికి తరలివచ్చినాక వియ్యంకుల ఎదురుకోలు తర్వాత, పెళ్లిపందిట్లో తతంగం. బాసికాలు, కంకణాలు తొడిగి పీటల మీద కూర్చోబెట్టి ‘ఓం, శుక్లాంబరధరం, మమ’! అనిపించినాక దేవీ దేవుళ్లు, సప్తరుషుల పుణ్యావహం చేశారు. కులం వాళ్లందరికీ శుభసంకల్పం వినిపించారు. మంగళసూత్రాన్ని పసుపు కుంకుమ పూలతో అర్చించి, కొబ్బరికాయకు పసుపురాసి, వధూవరుల వేళ్లు తొక్కించి, మూడు మార్లు ప్రదక్షిణ జరిపించినాక, చివర్న అందరకీ అక్షింతలు పంచారు. సన్నాయి డోలు వాద్యఘోష మధ్య సూత్రధారణ, తలంబ్రాలు, అరుంధతీ దర్శనం. దీవెన్లు, చదివింపులు.... నవ్వులు, కోలాహలం, ఏదో తెలీని హడావుడి అందరిలోనూ...! 
      మాకు జంగందేవర్లే పెళ్లి పెద్దలు. పల్నాటి యుద్ధకాలం చరిత్ర గడిచిపోయిన మరో మూడు నాలుగు తరాలకు దిగువ కులాల్లో అలాంటి మార్పులు చేర్పులు జరిగాయి. మాకు చదువురాదని మంత్రాలేమీ చదివించరు కానీ ఈ తతంగాలన్నీ మాత్రం జరుపుతారు. వీటన్నింటికీ ముందు.... అత్తలు, వదినెలు, మరదళ్లు ఇతర వరసైనవాళ్లు పెళ్లికొడుకు చెవులుపట్టి లాగిమెలేస్తూ, జుట్టు పట్టుకుని రోలు తిప్పినట్టు తలను అటూ ఇటూ తిప్పి ఆడిస్తూ, ఆనందంగా ఏడిపిస్తూ నలుగు పెడతారు. 
ఎగువ వేదగిరి దిగువ జొన్నాడ/ నడిమి పెన్నాదేవి నడిచీరావమ్మా/ ఏవమ్మా జొన్నాడి కామాక్షమ్మా, పేదలను రక్షింప నీ భారమమ్మా మంగళం।। మంగళం।।/ గుర్రాము నెక్కేటి చెంగత్తులేసేటి, గుర్రాపు రద్దూలే/ కకాలదోసి ఏవమ్మా జొన్నాడి కామాక్షమ్మా పేదలను/ రక్షింప నీ భారమమ్మా మంగళం మంగళం శుభ మంగళం/ నెల్లూరి పెన్నాలో నెలకొన్న శ్రీరంగ విరిమాల సరిజూడు/ ఓ పాండురంగ ఉల్లాపనోబ్జాల శ్రీ పాండురంగా/ కాచీకాపాడర కావేటిరంగా  మంగళం, మంగళం/ దిక్కులూ చూసేవు  దిగజారబోయేవు/ చక్కగా నా ముఖము చూడరన్నా కొంగు చెరగునా/ రెండు పచ్చన్ని వరహాలు విప్పీనా పెళ్లెంలో పోయరన్నా మంగళం, మంగళం!!/ చిన్న చెంబుతో నీళ్లు శీకాయ ఉదకములు/ అల్లేలు మల్లేలు అరటిపండ్లు తేనె మామిడి పప్పు/ టెంకాయ వడపప్పు తెచ్చారు వెంకటేశ్వర్లు నీకూ మంగళం!! మంగళం!!/ మిరప వన్నెల ధోతీ మెతువుగా కట్టుకుని/ రెపరెపా పచ్చులారైక దొడిగి వీధినా బొయ్యేటి/ వీరమాయన్నలకు జగదంపుగొడుగులు జల్లెళ్లతో/ జయరాఘవులు నీకూ మంగళం, జయమంగళం/ పెసర బేడలుతెచ్చి బసవన్నపై జల్లి/ దిరిశెనపూ తెచ్చి దండకూర్చి వీధినా బొయ్యేటి/ వీరమాయన్నలు జగదంపు గొడుగులు తంగేటితాళ్లు/ తెచ్చారు నీకు శ్రీ రంగస్వామీ మంగళం, జయమంగళం !!
      ఇలా పాడి కొండకు ఎదురెళ్లారు. ఇక్కడ ‘రద్దులు’ అంటే కాలిగుర్తులు. గుర్రపు జాడలు తొలగిపోయేంత వేగంగా వచ్చి జొన్నవాడ కామాక్షమ్మ దీవించిపోవాలని భావన. అంతేనా! ఆనందంతో వచ్చే ఉద్వేగాన్ని ఆపలేమట(ఉల్లాపనోబ్జాల)! ఇక అడ్డిగలంటే గంగాళాల వంటి పాత్రలు. పూల దండల అల్లికలే ‘అల్లేలు’. 
      భగవంతుడే పెళ్లికొడుకు. భగవతి పెళ్లికూతురు. వారిది నిత్యకళ్యాణం పచ్చతోరణం. ఆ భావంతో భగవంతుడిచ్చే సకల శుభాలనూ కొత్త దంపతులు అందుకోవాలనే తలంపుతో, వాళ్లని భగవతీ భగవంతుల ప్రతినిధులుగా భావించిన తెలుగువారు ధన్యులు! స్వామి నిరుపేదలకు పెన్నిధి. దేవళం అందరిదీనూ! వరుడి మీద ఈ నలుగు పాట చూడండి... రారా! పండరి రంగా రారా/ నా స్వామి చెయిదీర/ కుందనంపు పీటమీద కూర్చున్నావయా/ పాండురంగడు కొలువుకూరాగ, కోటి దేవతలు/ జయమని పొగడగ పతిత పావనుడు పాండు/ రంగడు వరుస దెలిపి తాంబూల మందెనట ।। రారా।।/ జిగిన టొక్కపొడిన మరినయాకులు/ ఆణిముత్యముల తీరినసున్నము/ వీణగాయకులు విడెములు తీసి/ యాలకులు లవంగాలతో  జాజి జాపత్రీలతో/ మెట్టీ స్థలములు లక్ష్మీదేవికి, వనమాలికల ఘుమఘుమలు/ నిన్ను చూసి ఆ చంద్రుని కళలు నిన్ను చూసి ఆ కన్నె/ వరించుట కళ్యాణానికి కాచి ఉన్నదట ।।రారా।।
      ఇక ఆ తర్వాత వధువు ఇంట్లో ఆ నలుగు సందడికి ఈ పాట అద్దంపడుతుంది...  రమ్మనరే నలుగుకు నాతితోడ వేగమిపుడె/ అక్రుడా వరదుడు చెలియా దీనరాయుడు/ అక్రుడు వరదుడు చెలియ దీనరాయడు/ అందరు జూడంగ అత్తరూ పూద్దాము/ మంగళాకారుడే చెలి మదనాగోపాలుడే/ మంగళాకారుడు మదనగోపాలుడు అందరు జూడంగ నత్తరు/ పూద్దాము, శ్రీరఘురాముడు సీతమ్మనాథుడు శిగనిండ/ మల్లె జుట్టి రమ్మనీ పెళ్లాడ ।।రమ్మనరే।।
      ఇలా నలుగు స్నానాలు, కొండకెదురుకోలు తతంగం పూర్తయింది. ఇక పెళ్లిపందిట్లో ఒకటే కోలాహలం, నవ్వులు, వరసైన వాళ్ల సరసాలు. ఆ సందట్లోనో వధువు మెళ్లో ఆ మూడుముళ్లూ కాస్తా ముడిపడ్డాయి. ఇక పెళ్లిపీటల మీద తలంబ్రాల తతంగం మొదలైందో లేదో, అక్కడ బయట పెళ్లిజనంలో పూనింది ఒక్కసారిగ వసంతాల పూనకం. 
      మాలో వసంతాలు పోసుకునే ఆచారం ఉంది. స్త్రీ పురుషుల్లో  చిన్నా పెద్దా అనీ, పెళ్లయినవాళ్లు, కానివాళ్లనీ తారతమ్యం లేదు. కేవలం వరసుంటే చాలు. కేవలం ఆ పెళ్లిళ్లలో ఆ వసంతాల రూపంలో మాత్రమే లభించే ఆ స్వేచ్చ... ఓ హుషారైన కళతో కనిపించే ఓ గుంభనమైన శృంగారం. స్త్రీలు  పసుపు రాసే నెపంతోను, పురుషులు అది తప్పించుకునే అవకాశంతో కిందామీదా పడుతుంటారు. అక్కడ ఎవరు ఎవర్ని తాకినా తప్పు కాదు, ఏ దోషమూ లేదు. కాబోయే జంటల  మనసులు మాట్లాడుకోవడానికి అదో చక్కని అవకాశం. 
      అట్లా ఆ వివాహ కార్యం పూర్తయింది. అరుంధతీ దర్శనం అయినాక, ఇంటి గుమ్మం తోరణాల ముందు కొత్త దంపతులను నిలబెట్టారు ముత్తయిదువలు, హారతులివ్వటం కోసమని... ‘‘శ్రీదేవి భూదేవి చెలియాలిద్దరు కూడి/ చేతికీ పసుపందరే - మా రుక్మిణీ చేతికి పసుపందరే’’ అంటూ ముందు పెళ్లికూతురికి హారతిచ్చారు. తర్వాత ‘‘ఊరూరి జనులంతా నీ వాడకొచ్చేరు/ సందడీ సంబారం మురిసీ జరిపేరు’’ అని వరుడికి హారతులిచ్చి, కాళ్ల మీద పసుపు నీళ్ల బిందె కుమ్మరించి, దిష్టితీసి లోపలికి తీసుకెళ్లారు. ఆ మర్నాడు రాత్రికి శోభనం! మామగారొచ్చి అల్లుడూ కూతుళ్లను తమ ఇంటికి తీసుకెళ్లాక, అక్కడి సందడి చెప్పనలవి కాదు...  
చిలుకా నీళ్లుతోడె జలకామాడెదను
హంసా అన్నమూపెట్టే ఆరగించెదను
నీళ్లుతేవె మంచి పళ్లూతేవె
అనపత్రీ తేవె, ఆకుతేవె పాకుతేవె అనపత్రీతేవె
సున్నపాకు తేవె ముడుపుచుట్టీయవె
చిట్టి చిలకా ముడుపు చుట్టీయవె ।।చిలుకా।।

      సంతానం కలగక పోవడం వల్ల దంపతులు పడే క్షోభను ‘అన’ అని అంటారు. ఆ ఇబ్బంది రాకుండా శోభనం నాటి నుంచీ అనపత్రి సేవించటం అలవాటు చేస్తారు. అదో గొప్ప వాజీకరణ ఔషధి! ‘అన’ అంటే అడ్డుకట్ట, సంకట పరిస్థితి అనే అర్థాలూ ఉన్నాయి. అలా శోభనం పూర్తయింది. కొత్త పెళ్లికూతురు అత్తారింటి వాతావరణానికీ, అన్ని పనీపాటలకు మెల్లమెల్లగా అలవాటు పడింది. ఊరిజనంతో మంచి అనిపించుకుంది. ఇలా కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. 
కానీ, దళితుల జీవితాల్లో ఎక్కడి సింగారాలు, ఎక్కడి వైభోగాలు? ఆరుగాలం కష్టమే! ముప్పాతిక భాగం దళిత జనబాహుళ్యం జీవితాలు చేలల్లోనే తీరిపోతాయి. ఏ కష్టాలూ కన్నీళ్లూ లేని దళిత జీవన సౌభాగ్యం ఇక ఏ యుగానికో! అలా ఆనాడు పెళ్లయిన జంట ఈనాడు చేలో పనీ పాటలు చేసుకుంటూ ఎలా ఉన్నారో చూడండి, దళితుల జీవితాల్లో నిరాడంబరత ఏంటో తెలుస్తుంది ఈ పాట ద్వారా...
నడిజాము గడిచేనే ఓ చెలియా రాడాయెనా స్వామి
నడిమేను అడల దినరేడు వడి చూడు ।।నడి।।
నడిపొద్దు గగనాన శిగ జారిపోయె
శిగలోని నాగమల్లి పువ్వాడిపోయె
శంభూ శంకరనాథా నిను నమ్మినామురా
నిను నమ్మినామురా మముబ్రోవవేరా
చేలూ చెలకలు పిట్టల్లు పీసుల్లూ
కసుగాయల పసిబిడ్డల కాచి కాపాడర ।।నడి।।
దుక్కీ దున్నగ నీవు అలసీ సొలసేవు
మడికీ చాల్లకి బారు అంగల్లు వేసేవు
చుట్టూ నాటు పరలా పచ్చంగా నవ్వేవు
చెమటానా నీబొట్టు వెండల్లే మెరిసేను
కందీ నీమోము కసురాడి పోయేను
శిగ జారి పోయె నాగమల్లీ పువ్వాడిపోయె
నినునమ్మినామురా ముముబ్రోవ వేరా
శంభూ శంకరనాథా మముబ్రోవవేరా.... 

      అని బురదకయ్యలో కాళ్లు కదుపుతూ భార్యతో అంటున్నాడు ఆ భర్త. పని, దేవుడు అని రెండు వేర్వేరు విషయాలు లేవు. పనిలో దేవుడున్నాడు... చేసే పనే దైవం అని భావించి నేలతల్లిని, మట్టిని నమ్ముకుని బతికే దళితులు మంచివాళ్లే కదా! ఇక ఆ చేను పంటఫలం, ఆయమ్మ పుణ్యఫలం.


వెనక్కి ...

మీ అభిప్రాయం