ఒకే ఒక్క‌డు

  • 249 Views
  • 3Likes
  • Like
  • Article Share

తెలుగు సాహితీలక్ష్మి ముమ్మారు జ్ఞానపీఠాన్ని అధిరోహించింది. మన సాహితీస్రష్టలెందరో పద్మ పురస్కారాలను, సాహిత్య అకాడమీ గౌరవాలను అందుకున్నారు. అయినా ఏదో లోటు! దానికోసం మూడు దశాబ్దాలుగా ఎదురుచూపులు. ఆ ఒక్కటీ అందనిద్రాక్షే అవుతోందే అన్న బాధ! అదే... ‘భారతీయ జ్ఞానపీఠం’ వారి ‘మూర్తిదేవీ పురస్కారం’. భారతీయ తాత్వికతనూ, సాంస్కృతిక వారసత్వాన్నీ ప్రతిబింబిస్తూనే సమున్నత ఆదర్శాలు, మానవీయ విలువలతో వచ్చిన ఓ సమకాలీన రచనను దేశం మొత్తం మీద నుంచి ఎంచి ఈ పురస్కారాన్ని అందిస్తారు. ఎందుకో గానీ, తెలుగు సాహిత్యానికి ఇప్పటి వరకూ ఈ గౌరవం దక్కలేదు. ఇప్పుడు ఆచార్య కొలకలూరి ఇనాక్‌ సృజనాత్మక కృషి ఆ లోటు తీర్చింది. ‘అనంత జీవనం’ నవలకుగానూ ఆయన ఇటీవలే 29వ ‘మూర్తిదేవి పురస్కారం’ (2015 సంవత్సరానికి గానూ) స్వీకరించారు.
      ప్రాచీన భారతీయ భాషల్లోని అరుదైన సాహిత్యాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ఫిబ్రవరి 18, 1944న ‘భారతీయ జ్ఞానపీఠ్‌’ పేరిట ఓ ‘పరిశోధన, సాంస్కృతిక ధర్మనిధి’ (రీసెర్చి అండ్‌ కల్చరల్‌ ట్రస్టు) ఏర్పాటైంది. దీని వ్యవస్థాపకులు సాహూ శాంతిప్రసాద్‌ జైన్‌. ఆయన యాభయ్యవ పుట్టినరోజును  పురస్కరించుకుని 1961లో ‘జ్ఞానపీఠ్‌’ పురస్కారాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత నాలుగేళ్లకు ఆ పురస్కార ప్రదానం ప్రారంభమైంది. భారతీయ సాహితీరంగంలో అత్యున్నత పురస్కారంగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. అయితే... సమకాలీన సృజనాత్మక సాహిత్యాన్నీ ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో... శాంతిప్రసాద్‌ మాతృమూర్తి పేరిట ‘జ్ఞానపీఠం’ బాధ్యులు 1983లో ‘మూర్తిదేవి పురస్కారాన్ని’ ప్రకటించారు. ఏడాదికి ఓ రచనను ఎంపిక చేసి దీన్ని అందిస్తున్నారు. ఈ 33 ఏళ్లలో హిందీ, రాజస్థానీ, గుజరాతీ, ఒడియా, మరాఠీ, కన్నడ, మలయాళ, ఉర్దూ సాహిత్యాలకు చెందిన 28 మంది రచయితలు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. తాజాగా ఇనాక్‌ సాధించిన ఘనతతో తెలుగు సాహిత్యానికీ ఈ గౌరవం దక్కినట్లయింది.
      ‘‘పీడనకు గురవుతున్న వాళ్లకి ధైర్యం చెప్పడమే నా రచనల ఉద్దేశం’’ అనే ఆచార్య కొలకలూరి ఇనాక్‌ రెండేళ్ల కిందటే ‘పద్మశ్రీ’ బిరుదాంకితులు అయ్యారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి అయిన ఆయన, వివిధ సాహితీ ప్రక్రియల్లో దాదాపు 90 పుస్తకాలు వెలువరించారు. ఇప్పుడు ‘మూర్తిదేవి పురస్కారాన్ని’ సాధించిపెట్టిన ‘అనంతజీవనం’ నవల రాయలసీమ సాంఘిక పరిస్థితులు, సామాన్య ప్రజాజీవనంలోని ఆటుపోట్లకు అద్దం లాంటిది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో నవంబరు 19, 1996 నాడు ప్రారంభమై ఏకధాటిగా 36 గంటలపాటు కురిసిన వర్షాలు, అవి వెంటబెట్టుకొచ్చిన వరదలు దీనికి నేపథ్యం. నీటిచుక్కకు ముఖం వాచి కరవులతో అల్లాడే సీమ మీదికి ఒక్కసారిగా పోటెత్తిన నీళ్లు ఏం మిగిల్చివెళ్లాయో ఇందులో హృద్యంగా ఆవిష్కరించారు ఇనాక్‌. 
      ఈ నవలలో నీళ్లతో పాటు సమాంతర ప్రవాహాలుగా నేలగల్లు పాళెగార్ల జమిందారీ పోకడలు, బడుగు బలహీనవర్గాల నిస్సార జీవితాలు కనిపిస్తాయి. అయితే, సమైక్య బాట పట్టిన తర్వాత ఈ జీవితాలద్దుకునే చైతన్య కాంతులనూ ఇనాక్‌ కలం ప్రభావవంతంగా అక్షరీకరించింది. పండమేరు, బుక్కరాయ సముద్రాలు ఉరుముతుంటే... తమను తాము రక్షించుకోవడానికి అట్టడుగు జీవులు చేసే సాహసాలు ఒళ్లు జలదరింపచేస్తాయి. ప్రకృతి వైపరీత్యాలకు కారణభూతమవుతున్న మనిషి చేతలనూ ఈ నవల తూర్పారబడుతుంది. ‘‘విశిష్టమైన ఇనాక్‌ జీవితానుభవాలకు, తెలుగు భాష మీద ఆయనకు ఉన్న అధికారానికీ ఈ రచన ఓ ప్రతిబింబం’’ అని పురస్కార ఎంపిక సంఘం అధ్యక్షుడు ఆచార్య సత్యవిరాట్‌ శాస్త్రి ప్రశంసించారు. తెలుగునాట నవలలకు అంతగా ఆదరణ లభించట్లేదు, నవలా రచయితలు తగ్గిపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్న దశలో... సీమ జనజీవనానికి పట్టం కట్టిన నవల జాతీయస్థాయిలో ఉత్తమ రచనగా నిలవడం... తెలుగు నవలకు కొత్త ఊపిరిలూదే సందర్భమే. 


వెనక్కి ...

మీ అభిప్రాయం