తెలుగు పుస్త‌కాలు కావ‌లెను!

  • 742 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। ఎ.ఎ.ఎన్‌.రాజు

  • విశ్రాంతాచార్యులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం
  • హైదరాబాదు
  • 9491869540
డా।। ఎ.ఎ.ఎన్‌.రాజు

విజ్ఞానజ్యోతుల వెలుగులో సమాజ భవిష్యత్తుకు పసిడి బాటలు పరిచేవి గ్రంథాలయాలే. సమర్థులైన గ్రంథపాలకుల సారథ్యంలోనే ఆమేరకు అవి రాణించగలవు. కానీ, ప్రస్తుతం గ్రంథాలయ సమాచారశాస్త్ర విద్యార్థుల చదువుల్లో ఆంగ్లమాధ్యమానిదే ఆధిపత్యం! దీనికి కారణమేంటో తెలియాలంటే, ముందు ఈ శాస్త్రానికి సంబంధించిన తెలుగు సాహిత్యం లోతుపాతులను పరిశీలించాలి. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల (నవంబరు 14- 20) సందర్భంగా ఈ దిశగా సింహావలోకనమిది...
తెలుగులో
గ్రంథాలయ సమాచారశాస్త్రం (గ్రం.స.శా) ఆవిర్భావం దేశ స్వాతంత్య్రానికి ముందే జరిగింది. అయ్యదేవర కాళేశ్వరరావు, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి, అయ్యంకి వేంకట రమణయ్య తదితరులు వందేమాతర ఉద్యమ ప్రభావంతో తెలుగునాట గ్రంథాలయాల స్థాపనకు పూనుకున్నారు. హైదరాబాదులో 1901లో ప్రారంభమైన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం... తెలంగాణలోనే కాదు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ గ్రంథాలయోద్యమ వ్యాప్తికి ఎనలేని కృషి చేసింది. బెజవాడలో 1914లో స్థాపితమైన ‘ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం’ దేశంలోనే మొదటి గ్రంథాలయ సంఘం. ఇదే 1957లో ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘంగా రూపుదిద్దుకుంది. గ్రంథాలయోద్యమంలో దీని పాత్ర అనన్య సామాన్యం. 
      పందొమ్మిదో శతాబ్ది చివరి దశకం నుంచి తెలుగులో ముద్రణ పుంజుకుంది. వివిధ పత్రికల ప్రారంభంతో తెలుగు భాషా, సాహిత్యాల అభివృద్ధికి కొత్త బాటలు పడ్డాయి. జాతీయోద్యమంతో పాటు కందుకూరి, గురజాడ, గిడుగుల సాంఘిక, సాంస్కృతిక, భాషా సాహిత్యోద్యమాలు గ్రంథాలయోద్యమానికి తోడయ్యాయి. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచార సాహిత్యానికి ప్రాణంపోశారు నాయకులు. ఫలితంగా ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో గ్రంథాలయోద్యమం, వయోజన విద్యా సంబంధిత ప్రచురణలు వచ్చాయి. తెలుగులో ‘గ్రం.స.శా’ సాహిత్యాభివృద్ధికి అలా అంకురారోపణ జరిగింది. 
శాస్త్ర సాహిత్యమంటే...
వాఙ్మయ సూచీలు, పుస్తకాలు, మోనోగ్రాఫులు, సాధారణ గ్రంథాలయ శాస్త్రం, గ్రంథాలయోద్యమ చరిత్ర, గ్రంథాలయాల ప్రగతి, వాటి నిర్వహణ, యాజమాన్యం, గ్రంథాలయ వర్గీకరణ, సూచీకరణ, ఆచూకీ/సమాచార సేవలు, వాఙ్మయ సూచీకరణ నియంత్రణ, గ్రంథాలయ చట్టం, దర్శినులు, జీవిత, స్వీయ చరిత్రలు, అభినందన గ్రంథాలు, సదస్సులు, సమావేశాల ప్రచురణలు, సర్వస్వాలు, కోశాలు, వ్యాస సంకలనాలు, గ్రంథాలయ సమాచార సాంకేతిక శాస్త్ర రచనలు ‘గ్రం.స.శా’ సాహిత్య పరిధిలోకి వస్తాయి. వీటిలో వాఙ్మయ సూచీలు... మన భాషలో ప్రచురితమైన వివిధ పుస్తకాల వివరాలను తెలుసుకోవటానికి ఉపయోగపడతాయి. ‘ఆంధ్రగ్రంథములు’ పేరిట మొదటి జాబితాను 1945లో ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం ప్రచురించింది. ఇందులో 250 మంచి పుస్తకాల వివరాలున్నాయి. జీవీ వెంకటప్పయ్య సంపాదకత్వంలో వచ్చిన ‘ఆంధ్రవాఙ్మయ సంగ్రహసూచి’, ‘ఆంధ్ర గ్రంథసూచి’, ‘తెలుగు నిఘంటు వికాసం’, ‘రిఫరెన్సు గ్రంథాలు’, ‘బాలసాహితి’లతో పాటు ఇంకొన్ని సూచీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇక 1863- 1965 నాటి తెలుగు విజ్ఞానశాస్త్ర పుస్తకాల సమాచారాన్ని అందించేది ‘శాస్త్రీయ వాఙ్మయ సూచి’. దీని సంకలనకర్త వి.వెంకటప్పయ్య. పుస్తకంలోని ‘విషయం’ ఆధారంగా తయారుచేసే ఇలాంటి వాటిని ‘విషయ వాఙ్మయ సూచీ’లు అంటారు.   
      తెలుగులో ‘గ్రం.స.శా’ సాహిత్యాన్ని విరివిగా సృజించిన వాళ్లలో పాతూరి నాగభూషణం, అయ్యంకి వేంకటరమణయ్య, వి.వెంకటప్పయ్య ముఖ్యులు. ఎ.ఎ.ఎన్‌.రాజు, పి.యస్‌.జి.కుమార్, ఎల్‌.ఎస్‌.రామయ్య, పి.విజయకుమార్, పి.కామయ్య తదితరులూ కొన్ని పుస్తకాలను రచించారు. పాతూరి నాగభూషణం ‘గ్రంథాలయ శాస్త్ర ప్రథమ పాఠాలు’ (1947) తొలి తెలుగు గ్రంథాలయ శాస్త్ర రచన. ‘ఆంధ్రదేశ గ్రంథాలయ చరిత్ర’ పేరిట 1914, 1916ల్లో వచ్చిన రెండు పుస్తకాలు తొలితరం గ్రంథాలయ చరిత్రలు. వి.వెంకటప్పయ్య ‘ప్రసిద్ధ గ్రంథాలయాలు’తో సహా ఇలాంటివి ఇంకొన్ని వచ్చాయి. 
ఉద్యమ స్ఫూర్తికి జోతలు
సురవరం ప్రతాపరెడ్డి ‘గ్రంథాలయోద్యమము’, పాతూరి ‘ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయోద్యమం’, అయ్యంకి ‘గ్రంథాలయ జ్యోతి’ తదితరాలు తెలుగునాట గ్రంథాలయోద్యమం పుట్టుపూర్వోత్తరాలను వివరిస్తాయి. ఈ వరసలో ‘నూరేళ్ల ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం’ (2013) ఇటీవలి పుస్తకం. వందేళ్ల సంఘం వార్షిక మహాసభల్లో మహామహులు చేసిన అధ్యక్షోపన్యాసాల్లో ఎంపిక చేసిన వాటిని ‘గ్రంథాలయ ప్రగతి’ శీర్షికన నాలుగు సంపుటాలుగా ప్రచురించారు. గ్రంథాలయోద్యమ చరిత్రకు, ప్రగతికి ఇవి అద్దంపడతాయి. వెలగా వెంకటప్పయ్య ‘తెలంగాణ గ్రంథాలయోద్యమం’, ‘ఆంధ్ర- తెలంగాణ గ్రంథాలయ ప్రగతి’, జె.కృష్ణాజీ సంపాదకత్వం వహించిన ‘తెలుగు సీమలో గ్రంథాలయ ప్రగతి’ ఈ కోవలోవే. 
      ‘సార్వజనిక గ్రంథాలయములు’, ‘ధర్మగ్రంథాలయము’ (ఆం.ప్ర.గ్ర.సంఘం), ‘గ్రంథాలయ సూత్రాలు’, ‘పఠన మందిరాలు’ (పాతూరి), ‘సంచార గ్రంథాలయములు’ (గాడిచర్ల), ‘గ్రంథాలయములు- సమాజం’ (పి.కామయ్య) తదితరాలు పొత్తపుగుడుల నిర్వహణ, యాజమాన్యం లాంటి వాటిని అర్థంచేసుకోవడంలో తోడ్పడతాయి. గ్రంథాలయ వర్గీకరణ, సూచీకరణల మీద భారత గ్రంథాలయ సమాచార శాస్త్ర పితామహుడు ఎస్‌.ఆర్‌.రంగనాథన్‌ ఆంగ్లంలో ఎన్నో రచనలు చేశారు. వాటి ఆధారంగా తెలుగులో కొన్ని పుస్తకాలు వచ్చాయి. అయ్యంకి, పాతూరి, వి.వెంకటప్పయ్య, విజయకుమార్, ఎ.ఎ.ఎన్‌.రాజు, పి.ఎస్‌.జి.కుమార్, లక్ష్మీనారాయణ ఈ దిశగా కృషిచేశారు. గ్రంథాలయ పుస్తక సంపదను చదువరులు సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా నిర్వాహకులు ‘ఆచూకీ/ సమాచార సేవ’లను అందిస్తారు. ఈ సేవలు ఎలా ఉండాలో చెబుతూ ‘ఆచూకీ సేవ’ (పాతూరి), ‘సమాచార విజ్ఞానము’ (వి.వెంకటప్పయ్య), ‘సంప్రదింపు సమాచార సేవలు- ఆధారాలు’ (జి.వి.ఎస్‌.ఎల్‌.నరసింహరాజు, వి.చంద్రశేఖరరావు) తదితర పుస్తకాలు వచ్చాయి. 
కొద్దిపాటి రచనలే!
వాఙ్మయ అన్వేషణకు ‘వాఙ్మయ సూచికలు’ చాలా ఉపయోగపడతాయి. ఓ పద్ధతి ప్రకారం తయారుచేసే గ్రంథాల, వ్యాసాల జాబితాలివి. శాస్త్రజ్ఞులు, అధికారులు, సాహితీవేత్తలు... ఎవరైనా సరే ఈ సూచికల మీదే ఆధారపడతారు. కానీ, ఈ అంశం మీద ‘వాఙ్మయ సూచీకరణము’ (పాతూరి), ‘వాఙ్మయ నిర్వహణ- నియంత్రణ’ (ఎల్‌.ఎస్‌.రామయ్య, వెలగా వెంకటప్పయ్య) లాంటి కొన్ని పుస్తకాలే వచ్చాయి. ఇక గ్రంథాలయోద్యమ రథసారథుల జీవితచరిత్రలు నవతరానికి స్ఫూర్తిపాఠాలు. ఈ కోణంలో మాడపాటి, గాడిచర్ల, సురవరం, అయ్యంకి, పాతూరి, భూపతిరాజు తిరుపతిరాజు, వెలగా వెంకటప్పయ్యల జీవిత చరిత్రలను రచయితలు ఆవిష్కరించారు. అయితే, గ్రంథాలయోద్యమానికి సంబంధించిన వ్యక్తుల స్వీయచరిత్రలు చెప్పుకోదగినంతగా రాలేదు. కోదాటి నారాయణరావు లాంటి కొద్దిమంది మాత్రమే రాశారు. గ్రంథాలయాల ప్రగతి, ‘గ్రం.స.శా’ సాహిత్యాభివృద్ధికి కృషిచేసిన ప్రముఖుల గౌరవార్థం ప్రచురించే అభినందన సంపుటాలు, పుస్తకాలూ కొన్నే వచ్చాయి. అయ్యంకి, గాడిచర్ల, మాడపాటి, పాతూరి, కోదాటి, వావిలాలల మీదే ప్రత్యేక సంచికలు వెలువడ్డాయి. 
‘గ్రం.స.శా’ సాహిత్య విషయాల మీద ఎన్నో సదస్సులు, సమావేశాలు జరిగాయి. జరుగుతున్నాయి. కానీ, తెలుగు మాధ్యమంలో వీటి సంఖ్య తక్కువే. డిసెంబరు, 1987లో ‘గ్రంథాలయ వనరులు- సమష్టి సమీకరణ’ మీద సదస్సు జరిగింది. ఇందులో ఆహూతులు సమర్పించిన పత్రాలను ‘గ్రంథాలయ వనరులు’ పేరిట ఎం.శంకరరెడ్డి, ఎం.వి.వేణుగోపాల్‌ సంకలనం చేశారు. ‘సగటు మనిషి- సమాచారం’, ‘గుంటూరు సదస్సు పత్రాలు’ లాంటివి మరికొన్ని పత్ర సంకలనాలు. పత్రికా వ్యాస సంకలనాల్లో ‘గ్రంథాలయములు’ (అయిదు సంపుటాలు- సంకలనకర్త పాతూరి), ‘ప్రజాజీవనంలో గ్రంథాలయాలు’ (జీవీఎస్‌ఎల్‌ నరసింహరాజు), ‘గ్రం.స.శా. వ్యాసాలు’ (ఎల్‌.ఎస్‌.రామయ్య), ‘గ్రం.స.శా. అవలోకనం’ (ఎ.ఎ.ఎన్‌.రాజు) పేర్కొనదగినవి. ఇక తెలుగునాట ఉన్న పొత్తపుగుడుల వివరాలను అందించేవి గ్రంథాలయదర్శినులు. ‘ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయాల పట్టిక’ పేరిట 1939లో పాతూరి ఓ దర్శినిని రూపొందించారు. ఆ తర్వాత వి.వెంకటప్పయ్య సంపాదకత్వంలో 1968లో ‘గ్రంథాలయ దర్శిని’ ప్రచురణ ప్రారంభమైంది. ఆరు ప్రచురణల తర్వాత 1973లో ఇది ఆగిపోయింది. 
బోధనా వనరులేవీ?
సమాచార సాంకేతిక శాస్త్ర (ఐటీ) ప్రభావం నేడు అన్ని రంగాల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మానవ జీవితాలను అదెంతో ప్రభావితం చేస్తోంది. గ్రంథాలయ సమాచార కేంద్రాల్లో కూడా ఈమేరకు మార్పుచేర్పులు జరిగాయి. స్నాతక, స్నాతకోత్తర స్థాయుల్లో గ్రంథాలయ సమాచార సాంకేతిక శాస్త్ర సంబంధిత కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఈ శాస్త్రానికి సంబంధించి తెలుగులో ఒకే ఒక్క పుస్తకం వచ్చింది. అదీ ఇరవై ఏళ్ల కిందట! ‘సమాచార సాంకేతిక విజ్ఞానం: కంప్యూటర్లు’ పేరిట వి.వెంకటప్పయ్య సంపాదకత్వంలో అది రూపొందింది. డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఎల్‌ఐఎస్సీ కోసం ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: ప్రాథమిక అంశాలు’ అనే కోర్సు మెటీరియల్‌ తయారుచేసింది. మొత్తమ్మీద ఈ శాస్త్ర సంబంధిత అంశాల మీద రావాల్సిన పుస్తకాలు చాలా ఉన్నాయి.  
      గ్రంథాలయ శాస్త్రాలు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నాయి. వీటికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ కోర్సులు నడుస్తున్నాయి. కానీ, మాధ్యమ సమస్య ఉంది. బీఎల్‌ఐఎస్సీ పరీక్షలు తెలుగులో రాయటానికి అనధికారంగా అనుమతిస్తున్నారు. అర్థవృత్తి స్థాయిలో వృత్తి సంఘాలు, సంస్థలు నిర్వహించే సీఎల్‌ఎస్సీ కోర్సుల బోధన తెలుగు మాధ్యమంలో సాగుతోంది. విద్యార్థులు అమ్మభాషలోనే పరీక్షలు రాస్తున్నారు. తెలుగు అకాడమి బీఎల్‌ఐఎస్సీ పాఠ్యపుస్తకాలు ప్రచురించింది. ఇదే కోర్సుకు సంబంధించిన తెలుగు మెటీరియల్‌ను బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చింది. అయితే, స్నాతకోత్తర స్థాయిలో పాఠ్యపుస్తకాలు, పరామర్శ గ్రంథాలు, మోనోగ్రాఫులు రావాల్సి ఉంది.
వాటిలో వెనుకంజ
నిర్ణీత ప్రమాణాలతో కూడిన ఆంగ్ల పాఠ్యపుస్తకాలను తెలుగులోకి అనువదించడానికి... ఆంగ్లం, ఇతర భాషల నుంచి ఆలోచనలు, సూత్రాలు, సిద్ధాంతాలను గ్రహించి తెలుగులో రాయడానికి ప్రామాణిక పారిభాషిక పదకోశాలు చాలా అవసరం. కానీ, ఇప్పటి వరకూ తెలుగులో చెప్పుకోదగినంతగా సర్వస్వాలు, పదకోశాలు రాలేదు. ఈ దిశలో చొరవ తీసుకున్న వ్యక్తి వి.వెంకటప్పయ్య. ‘గ్రంథాలయ విజ్ఞాన సర్వస్వం, సమాచార విజ్ఞాన కోశం’లకు ఆయన గ్రంథకర్తృత్వం వహించారు. మరోవైపు, పి.సోమరాజు ‘గ్రంథాలయ సమాచార శాస్త్ర పదకోశం’, ఎ.ఎ.ఎన్‌.రాజు ‘గ్రంథాలయ వర్గీకరణ పదకోశం’ అందుబాటులో ఉన్నా, పదకోశాల విషయంలో అనుకున్న ప్రగతి సాధించలేదు. 
      తెలుగునాట గ్రంథాలయ సమాచార శాస్త్రంలో స్నాతకోత్తర స్థాయి బోధన ఆంగ్ల మాధ్యమంలో జరుగుతోంది. ఈ స్థాయిలో తెలుగు మాధ్యమంలో బోధనకు ఇప్పటివరకూ ప్రచురితమైన ‘గ్రం.స.శా’ సాహిత్యం ఏమాత్రం ఉపయోగపడదు. గ్రంథాలయ వ్యవస్థాపన, పరిపాలన, సమాజం, గ్రంథాలయ వర్గీకరణ, సూచీకరణ, ఆచూకీ/ సమాచార సేవలు, గ్రంథాలయ సమాచార వ్యవస్థలు, అనుక్రమణీకరణ, సారాంశీకరణ, గ్రంథాలయ డిజిటలీకరణ, అంతర్జాలం తదితరాలకు సంబంధించి అవసరమైన సాహిత్యం లేదు. ఈ పరిస్థితి మారాలి. స్నాతకోత్తర స్థాయిలో తెలుగులో గ్రంథాలయ సమాచార శాస్త్ర బోధనకు తగిన వనరులు అందుబాటులోకి రావాలి. 
      భారతీయ భాషల్లో ఉన్నత విద్యను అందించడం ప్రభుత్వ విధానం. ఆయా రాష్ట్రాల్లోని అకాడమీల ఏర్పాటు ద్వారా నాణ్యమైన పాఠ్య, పరామర్శ గ్రంథాల ప్రచురణకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అలా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు అకాడమీని స్థాపించారు. గ్రంథాలయ సమాచార శాస్త్రానికి సంబంధించినంత వరకు ఈ అకాడమీ డిగ్రీ స్థాయి పాఠ్యపుస్తకాలను మాత్రమే ప్రచురించింది. స్నాతకోత్తర స్థాయిలో తగిన కృషి జరగలేదు. నిపుణుల సంఘం తయారుచేసిన ‘గ్రం.స.శా’ పారిభాషిక పదావళి ఇప్పటివరకూ ముద్రణకు నోచుకోలేదు. ఉత్సాహవంతులైన కొంతమంది గ్రంథకర్తలు ఆయా విషయాల మీద స్నాతకోత్తర స్థాయిలో పాఠ్యపుస్తకాలు రాయడానికి చొరవ తీసుకున్నా, ప్రచురణకర్తలు పెద్దగా స్పందించట్లేదు. తెలుగులో బోధన ప్రారంభమైతేనే ఈ స్థాయి పుస్తకాలకు ఆదరణ లభిస్తుంది. ఈ దిశగా విశ్వవిద్యాలయాలు, తెలుగు అకాడమి, ఇతర ఉన్నత విద్యాసంస్థలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రంథాలయ సంఘాలు, ఇతర వృత్తి సంఘాలు చొరవ తీసుకోవాలి. అన్ని స్థాయుల్లో అవసరమైన పాఠ్య, పరామర్శ పుస్తకాల రచనకు అర్హులైన రచయితలను ప్రోత్సహించాలి. అప్పుడే తెలుగులో గ్రంథాలయ సమాచార శాస్త్ర సాహిత్యం వికసిస్తుంది. భావితరం గ్రంథపాలకుల్లో వృత్తినైపుణ్యం ఇనుమడించాలంటే ఈ సాహితీ వికాసంతోనే సాధ్యం.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  గ్రంథాలయాలు