అంతా అరణ్యరోదనేనా!?

  • 605 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘‘నరవర నీచే నాచే- వరమడిగిన కుంతిచేత వాసవుచేతన్‌- ధరచే, భార్గవుచేతన్‌ అరయంగా- కర్ణుడీల్గె ఆర్గురి చేతన్‌’’ ఇలా లెక్కెట్టుకుంటూ పోతే కర్ణుడి చావుకు కారణాలెన్నో! అలాగే నానాటికి తీసికట్టు చందంగా తెలుగు మలగడానికీ ప్రభుత్వాలు, ప్రజలు, విద్యాసంస్థలు, ఇలా అందరూ తలా ఓ చెయ్యీ వేస్తున్నారు. ఈ సంగతి ఇవాళ కాదు, డెబ్బయి సంవత్సరాల కిందటే మల్లాది అవధాని అనే రచయిత మొర పెట్టుకున్నారు.
‘‘తెలుగునాట కూలీలవలె సాహిత్యకారులు పనిచేస్తున్నారు. సాహిత్యపు పంటలు పండిస్తున్నారు. కాని వారి కాదరం లేదు. తెలుగులో జీవభాషను గురించిన నిఘంటువులు లేవు. తెనుగు గ్రంథాలను యితరభాషల్లోకి అనువదించే సంస్థలు లేవు. తెనుగుభాషను యితరదేశీయులు నేర్చుకుందుకు తగిన స్వబోధినులు లేవు...’’ ఇంకా చాలా చాలా లేవంటూ 1940 ఫిబ్రవరి ‘ఆంధ్రి’ సంచికలో ‘తెలుగును వెలిగించండం’టూ అవధాని పెట్టుకున్న మొర ఇది. తెలుగు పరిస్థితి ఈనాటికీ పెద్దగా ఏమీ మారలేదు. ఆనాడు తెలుగు భాషాభివృద్ధికి ఆటంకాలుగా ఉన్న కొన్ని అంశాలను మల్లాది అవధాని పేర్కొన్నారు. అవి... ‘‘తెనుగు రచయితలు రాసే ఉత్తమగ్రంథాలను బహూకరించి కొనే ప్రచురణాలయాలు లేవు. తెనుగులో సాహిత్యచరిత్రలు లేవు. తెనుగు గ్రంథకారుల జీవితాలు గాని, డైరీలుగాని అచ్చుపడలేదు. ఇంగ్లిషు, ఫ్రెంచ్‌, జర్మన్‌, రష్యన్‌, స్విజ్‌, నార్వీజియన్‌, పోలిష్‌ మొదలయిన సమస్త భాషల్లోని ఉత్తమ సనాతన నవీనగ్రంథాల అనువాదాలు తెలుగులో వెలువడలేదు. తెలుగులో సాహిత్య విమర్శనలు వెలువడలేదు. మన భావాలను పూర్తిగా వ్యక్తపరిచేందుకు చాలిన శబ్దజాలం తెనుగులో లేదు’’!
      ఏడు దశాబ్దాల నాటి లోపాలే ఈనాటికీ మన భాషాభివృద్ధిని కుంటుపరుస్తున్నాయి. ఇప్పటికీ తెలుగు సాహిత్యచరిత్రలు, మన రచయితల ఆత్మకథలు, ప్రపంచస్థాయి గ్రంథానువాదాలు, సాహితీ విమర్శలు చాలా కొద్దిసంఖ్యలోనే ఉన్నాయి. దీనికి తోడు కొత్తగా వచ్చిపడిన ముప్పు... పాఠశాల స్థాయిలో కూడా భావిపౌరులకు తెలుగును నేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడకపోవడం! దీంతో అమ్మభాష పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారైంది.
ఆంగ్లం అలా నిలిచింది!
పదిహేడో శతాబ్దం మొదటిరోజుల్లో ఇంగ్లండు ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తాండవం చేస్తోంది. పదకొండో శతాబ్దంలో ఆ దేశాన్ని ఫ్రెంచి ప్రభువులు ఏలారు. ఆ ప్రభావం వల్ల ఫ్రెంచి ఆ దేశానికి అధికారభాషగా మారింది. స్వాతంత్య్రం సిద్ధించి పరదేశీయుల పాలన ముగిసిపోయినా, ఆ భాష అదే హోదాలో కొనసాగింది. ఫ్రెంచిభాష ఆనాటి ఆంగ్లేయుల ఇళ్లలోకీ, కార్యాలయాల్లోకి చొచ్చుకుపోయి, స్థిరపడింది. మినిస్టర్‌, కోర్ట్‌, కౌన్సిల్‌, ప్రిన్స్‌, ప్రిన్సెస్‌, అడ్వకేట్‌, డ్యూక్‌ తదితర కొన్నివేల ఫ్రెంచి మాటలు ఇంగ్లిషులోకి దిగుమతి అయ్యాయి. ఆఖరికి దైనందిన వ్యవహారాల్లో కూడా ‘డ్రెస్‌, గార్మెంట్‌, బటన్‌, బూట్‌, డిన్నర్‌, టోస్ట్‌, క్రీం, లెమన్‌’ లాంటి ఫ్రెంచి పదాల వాడకం విడదీయలేనంతగా పెనవేసుకుపోయింది. ఈ పరిణామానికి మాతృభాషాభిమానులు ఉలిక్కిపడ్డారు. తమ దేశంలోని భాషావేత్తలు, మేధావులను కూడగట్టుకుని... ఇతరభాషలనుంచి వచ్చిచేరిన పదాలను ప్రామాణీకరించారు. నిఘంటువులను రూపొందించి, సమస్యను అతిసులభంగా పరిష్కరించుకున్నారు. అలా ఆంగ్లం- వ్యక్తీకరణకు ఒదగని అతిక్లిష్టమైన భావాలను కూడా పదాల్లోకి మార్చగల సామర్థ్యాన్ని సంతరించుకుంది. తమదైన జాతి సంకల్పబలంతో విశ్వభాషగా వికసించింది.
      సరిగ్గా ఇదే మాదిరిగా తెలుగు మీద సంస్కృతం, ఇంగ్లిష్‌, ఉర్దూ పదాలు దురాక్రమణ చేశాయి. క్రమంగా ఆ పదాలకు దీటైన తెలుగు పదాలను మరచిపోయేట్లు చేశాయి. ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులు, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రాతకోతలన్నీ క్రమంగా ఇంగ్లీషు పదాల కోరల్లో విడదీయలేనంతగా చిక్కుకుపోయాయి. ప్రపంచీకరణ తర్వాత తెలుగును వెనక్కినెట్టి, విద్యాలయాల్లో ఆంగ్లం వేళ్లూనుకుంది. ఫలితంగా మన నవతరానికి సొంత భాషలో చదవడం, రాయడం రావట్లేదు. ఈ పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లుగా కొత్తగా నిత్యవ్యవహారాల్లోకి దూసుకువస్తున్న కంప్యూటర్‌ భాషాభారం కూడా పడింది. ఆ సాంకేతిక పదజాలాన్ని కూడా ప్రామాణీకరించుకోగలగాలి. ఈ పదజాలం మనం వ్యవహారంలో వాడుతున్న పదాల మాదిరిగా తెలుగుదనంతో నిండి ఉండాలి. పిల్లలు, పెద్దలు ఈ పదజాలాన్ని సులభంగా పలకగలగాలి. చిన్నచిన్న పదాల రూపంలో జనజీవనంలోకి చొచ్చుకుపోగలగాలి. తెలుగులో రూపొందించే సాఫ్ట్‌వేర్లకు డేటాబేస్‌ సాధనాలు, స్ప్రెడ్‌షీట్‌ అనువర్తనలు, స్పెల్‌చెక్‌, సింటాక్స్‌చెక్‌, థిసారస్‌ లాంటి భాషాశాస్త్ర వనరులు, అంతర్జాల ఆధారిత విద్య- తెలుగు సమాచార సామగ్రి... ఇలాంటి సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించగలిగితేనే కంప్యూటరును సంపూర్ణంగా తెలుగులోకి తీసుకురాగలం. ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయి? ఈలోగా భాషపరంగా ఇంకెంత నష్టం మూటగట్టుకోవాల్సి వస్తుంది? జవాబు దొరకని ప్రశ్నలివి!
ఇప్పుడూ అవే బాధలు..
తెలుగు భాషాసాహిత్యాలను మనవాళ్లతో పాటు ఇతర ప్రాంతాల వాళ్లూ ఆదరించే పరిస్థితిని తీసుకురావటానికి మల్లాది అవధాని ఆనాడే ఆంధ్ర విశ్వవిద్యాలయానికీ, ఆంధ్రమహాసభకూ సూచనలు చేశారు. అవి... ‘‘గ్రంథ ప్రచురణసంస్థలను స్థాపించాలి. వివిధ సారస్వతశాఖలకు చెందిన గ్రంథాలను అచ్చువేసి అందరికీ అందుబాటులో ఉండే ధరలకు అమ్మాలి. తద్వారా జనానికి గ్రంథ, పత్రికా పఠనలను అలవాటు చెయ్యాలి. గ్రాంథికపదాలు, వ్యావహారికపదజాలం, వివిధమాండలిక పదజాలం, వైద్య, నాటకీయ, వైజ్ఞానిక, పారిశ్రామిక, శాస్త్ర పదజాలాన్ని నిఘంటువులలో చేర్చాలి. సనాతన, నవీన రచయితల జీవితచరిత్రలను సంగ్రహంగానైనా ప్రకటించి తీరాలి. సంస్కృతం, పాళీ, ప్రాకృతం, పాశ్చాత్య భాషల్లోని ఉత్తమ గ్రంథాలను, నోబెల్‌ బహుమతి పొందిన పుస్తకాలను, క్లాసిక్స్‌ను తెలుగులోకి అనువదించాలి. విమర్శ అంటే వ్యాఖ్యానించటమని విమర్శకులు గమనించాలి. తెనుగులో మూలపడిన పదాలను చీకట్లోంచి బయటికి తేవాలి. వ్యావహారికంలోని పదజాలాన్ని బహిష్కరించకూడదు’’! ఇన్నేళ్ల తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లోని సాహితీవేత్తలు, మేధావులు కాస్త అటూఇటుగా ఇవే సూచనలను ఇంకా చేయాల్సి రావడమే దౌర్భాగ్యం.
      ఈనాటికీ విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాల పారిభాషిక పదకోశాలు తెలుగులో పూర్తిస్థాయిలో లేవు. కన్నడిగులు, తమిళులు రూపొందించుకున్నట్లుగా, పారిభాషిక పదకోశాల తయారీలో మనమింకా వెనకబడే ఉన్నాం. ‘‘తెలుగులో విస్తృతమైన పదకోశాలు అవసరం. తెలుగును పటిష్టపరుచుకోవాలంటే.. ప్రజల వాడుకలో ఉన్న పదాలన్నింటినీ నిఘంటువుల్లోకి తేవాల’’ంటారు అనువాద రచయిత డా॥ లంకా శివరామకృష్ణప్రసాద్‌. తెలుగు మాండలిక వృత్తిపదకోశాలను (సుమారు ఎనిమిది) తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. వీటిలో చాలా పదకోశాలవల్ల ఈతరానికి ప్రయోజనం అంతంతమాత్రమే. కంప్యూటర్‌, ఇ-వ్యాపారం లాంటి ఆధునిక వృత్తుల పదకోశాలు, వివిధ శాస్త్ర, సాంకేతిక పదాల నిఘంటువులు అవసరం. విశ్వవిద్యాలయాలు పూనుకుని ఇలాంటి బృహత్కార్యాలను చేపట్టాలి.
సంప్రదింపు గ్రంథాల కరవు
ఇంజనీరింగ్‌, వైద్యం, భౌతిక, రసాయన గణిత, గణాంక శాస్త్రాల విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లోని విషయాంశాలను విపులంగా అర్థం చేసుకోవటానికి వీలుకల్పించే సంప్రదింపు (రిఫరెన్స్‌) పుస్తకాలు ఆంగ్లంలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. తెలుగులో కూడా అలా ఉంటే విద్యార్థులు ఎంత కష్టమైన అంశాన్నయినా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇతర భాషల్లో ఇలాంటి పుస్తకాలను ఆయా విషయనిపుణులే రాస్తుండటంతో పుస్తకాల సంఖ్య ఎక్కువగా ఉంది. మన దగ్గర విషయ నిపుణులకు తెలుగు మీద పట్టు లేకపోవటం వల్ల శాస్త్ర, సాంకేతిక విషయాల మీద రచనలకు వాళ్లు పెద్దగా పూనుకోవట్లేదు. విషయనిపుణులతో విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను ప్రత్యేకంగా రాయించి, తెలుగు పండితులతో భాషాసవరణలు చేయించి ప్రచురిస్తే విద్యార్థులకు మేలు జరుగుతోంది. ఇలాంటి గ్రంథాలు వెలువడాలంటే ప్రభుత్వ జోక్యం తప్పనిసరి. తమిళ విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా విజ్ఞానశాస్త్ర విషయాంశాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని తమిళంలోకి తెచ్చుకునే ప్రయత్నాలకు ఇప్పటికే నడుంకట్టింది. దీనికోసం ప్రత్యేకంగా ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ తమిళ్‌ అండ్‌ తమిళ్‌ డెవలప్‌మెంట్‌’నూ నెలకొల్పింది. ఈ విభాగం వృత్తివిద్యాకోర్సుల కోసం శాస్త్రవిజ్ఞాన పాఠ్యపుస్తకాలను తమిళభాషలో రాయించి ముద్రిస్తోంది. భౌతిక, రసాయన, గణిత, జీవ శాస్త్రాలు, ఇంకా ఇంజనీరింగ్‌ మొదలైన సాంకేతిక శాస్త్రాలకు చెందిన పదాలను తమిళంలో సంసిద్ధం చేయటం, విజ్ఞాన శాస్త్రాలను, శాస్త్రపరిశోధనల ప్రగతిని అమ్మభాషలో ప్రజల దగ్గరికి తీసుకుపోవటం లాంటి లక్ష్యాలతో పనిచేస్తోంది. ఇదే దిశలో తెలుగు అకాడమీ కూడా ప్రయత్నిస్తే సంప్రదింపు గ్రంథాల కొరత తీరుతుంది.
విశ్వవిద్యాలయాలేం చేస్తున్నాయి?
తెలుగు రాష్ట్రాలలో విశ్వవిద్యాలయాలకు, సమాజానికీ అసలు అనుసంధానం లేదు. భాషాసాహిత్యాల మీద విశ్వవిద్యాలయ స్థాయిలో జరుగుతున్న పరిశోధనల గురించి ప్రజలకు ఎలాంటి సమాచారమూ ఉండదు. విశ్వవిద్యాలయాలు ఏటా వందల సంఖ్యలో ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ పట్టాలను ప్రదానం చేస్తూ ఉంటాయి. ఈ పరిశోధనల్లో తేలుతున్న వివరాలేంటో, ఇన్నేళ్లలో ఇలాంటి పరిశోధనల వల్ల తెలుగు భాషా సాహిత్యాలకు ఒరిగిన లాభమేంటో, చోటు చేసుకుంటున్న మార్పులేంటో ఆ వివరాలేవీ ప్రజలకు వెల్లడి కావట్లేదు. ప్రతి సంవత్సరమూ ఈ పరిశోధనల వివరాలను తప్పనిసరిగా ప్రజలకు వెల్లడించాలి. ప్రజల సొమ్ముతో నడుస్తున్న విశ్వవిద్యాలయాలు ఆమాత్రం బాధ్యతను చూపించటం అవసరం. తెలుగులో సాహిత్య విమర్శలు ఎక్కువగా లేవన్న అపవాదు కూడా ఇలాంటి చర్యల వల్ల సమసిపోతుంది.
      మరోవైపు, తెలుగులో రచయితల జీవితచరిత్రల రాశీ తక్కువే. దృశ్య ప్రసార మాధ్యమాలకు ఆదరణ పెరిగిన నేపథ్యంలో లబ్ధప్రతిష్ఠులైన రచయితలు, కవులు, భాషావేత్తలతో ముఖాముఖిలు నిర్వహించాలి. వాళ్ల సాహితీపరిశ్రమను నమోదు చేయాలి. ఈమేరకు తెలుగు విశ్వవిద్యాలయం కొంత కృషిచేస్తోంది. ఆచార్య నాయని కృష్ణకుమారి, ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, వేదాంతం సత్యనారాయణశర్మ, డా॥ శ్రీపాద పినాకపాణి, సినారెల అనుభవాలను దృశ్యకథనాల రూపంలో భద్రపరిచింది.
అనువాదాలకు అవరోధాలు
‘‘మనకున్న మంచి అనువాదకుల సంఖ్య చాలా తక్కువ. ఉన్నవారి అనువాదాలను వెలుగులోకి తెచ్చే సంస్థలు ఎక్కువ లేవు. కేంద్రసాహిత్య అకాడమీ, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ లాంటి సంస్థలు తెలుగు అనువాదాలకు అంత ప్రాధాన్యం ఇవ్వవు. శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన పారిభాషిక పదకోశాల సంఖ్య చాలా తక్కువ. తెలుగులో ఆణిముత్యాల్లాంటి కథలను ఇతరభాషల్లోకి అనువదిస్తే, వాటి ప్రచురణకు సంస్థలనుంచి ఆర్థికసాయం దొరకదు. మనం శరత్‌బాబును ఆదరించినట్లు బెంగాలీలు ఆదరించే తెలుగురచయిత ఒక్కరూ లేరే!’’ అంటూ ఇప్పటికీ అనువాద రచయితలు ఎదుర్కొనే సమస్యలను ఏకరవుపెడతారు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత రామవరపు శాంతసుందరి. ఇవన్నీ ఎప్పటికీ తీరతాయి?
      ఎన్ని సంవత్సరాలుగా ఎంతమంది ఎన్ని సూచనలను చేసినా, ఎన్ని సభలు నిర్వహించినా, ఇవే ప్రతిపాదనలను తిప్పితిప్పి చెప్పటం తప్ప ఆచరణ మాత్రం పూజ్యం. ఆరాటం ముందు ఆటంకాలు నిలవలేవు. అభివృద్ధి పథంలో అసంభవమనేదే ఉండదు. ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, మేధావులూ, రచయితలూ గట్టిసంకల్పంతో కృషి చేస్తేనే తెలుగు వెలుగుతుంది. రాబోయే తరాల భవితను వెలిగిస్తుంది.

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం