వస్తావట్టిది... పోతావట్టిది

  • 298 Views
  • 7Likes
  • Like
  • Article Share

    సత్యభారతి

  • జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా

ఎంత తినాలి? ఎంత సంపాదించాలి? ఎన్ని తరాల కోసం కూడబెట్టాలి? ఈ ఆలోచనలతోనే కొంతమంది జీవితాలు ముగిసిపోతాయి. తరాలు కూర్చుని తిన్నా తరగని సంపదను వెనకేసి కూడా ఇంకా ఏదో పేరాశతో పరిగెత్తేవారు చివరికి మిగుల్చుకునేదేంటి? నేను, నావాళ్లు, నాది, నాకోసం... ఇలా ‘నకారం’ చుట్టూ పరిభ్రమించేవారు మరచిపోతున్న విషయాలేంటి? ఇవిగో ఈ రెండు తత్వాలనూ తరచి చూస్తే ఈ ప్రశ్నలకూ సమాధానాలు దొరికేస్తాయి.
ఓ సామెత
ఉంది... ‘బతుకులెన్నాళ్లు- భాగ్యాలెన్నాళ్లు’ అని! ఇంకోటి కూడా వినపడుతుంది... ‘బతుకంత భయం లేదు- చావంత కష్టం లేదు’ అని! అసలు బతుకే ఓ అబద్ధం అంటారు కొందరు తత్వవేత్తలు. ఈ తత్వాన్ని తలకెక్కించుకున్నవారెవరూ తల ఎగరేసి బతకరు. భోగభాగ్యాల రాకపోకలకు పొంగిపోరూ, కుంగిపోరు. బతుకు పరిమితులను అర్థం చేసుకుని అర్థవంతమైన జీవితం గడుపుతారు. అవును కానీ, నూరేళ్ల జీవితకాలం అబద్ధం ఎలా అవుతుంది? ఇలా అనడంలో అంతరార్థమేంటి? ఇదిగో ఇదీ సమాధానం... 
వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా
పోయేనాడు వెంబడిరాదు పూచికపుల్లయినా
చేతిలో బెల్లం ఉన్న వరకే చీమ బలగమంట
చేతిలో బెల్లం చెల్లితే ఎవరు రారు వెంట               ।।వస్తావట్టిది।।
ప్రమిదలో నూనె ఉన్న వరకే దీపమెలుగునంట
ప్రమిదలో నూనె నిండగా దీపమారునంట              ।।వస్తావట్టిది।।
పంచభూతముల తోలుబొమ్మతో ప్రపంచమాయెనంట
మట్టికుండ ఇది నమ్మరాదు మర్మమెరుగమంట          ।।వస్తావట్టిది।।

      తెలుగునాట ఒకప్పుడు తత్వాలు విరివిగా ప్రచారంలో ఉండేవి. ఇహపర సౌఖ్యాల మీద ఆసక్తి లేక, యోగసాధన చేసుకునే సాధువుల మఠాల్లో ఇలాంటివి కొన్ని పురుడుపోసుకునేవి. అలా అలా జనంలోకి వచ్చేవి. భిక్షకుల నోటివెంట కూడా ఎక్కువగా తత్వాలు పలికేవి. వాటికంటూ ఓ కర్త కనిపించడు. ఇలా తరతరాల అనుభవసారంగా ఒకరి నుంచి మరొకరికి అందేవి. అలాంటి వాటిలో ఒకటి ఈ ‘వస్తావట్టిది పోతావట్టిది’. 
‘‘పుట్టి గిట్టుటెల్ల భ్రాంతులు సుమీ’’ అన్నాడు వేమన. ఆ భ్రాంతే ఇక్కడ ‘వట్టిది’ అయ్యింది. కడలి లోతును నింపుకున్న మాట ఇది. మరీ వైరాగ్యంలా ధ్వనిస్తోంది కానీ, ఇదో వ్యక్తిత్వ వికాస పాఠం. బతుకు అశాశ్వతమన్న అర్థాన్నిచ్చే పదప్రయోగం. ఆశ ఎప్పుడూ శాశ్వతత్వాన్ని కోరుకుంటుంది. అశాశ్వతమైన జీవితం గడుపుతూ దేనిపైనైనా సరే, శాశ్వతమైన ఆశల్ని పెంచుకోవడం నిరుపయోగమన్నది దీని భావం. కోరికలు దుఃఖానికి హేతువులన్నాడు బుద్ధుడు. కోరికలన్నీ ఆశల నుంచే పుడతాయి. వాటిని మొగ్గలోనే తుంచేసుకుంటే దుఃఖాలు దరికిరావు కదా! ఇదే మాటను కొర్రుగాల్చి వాతపెట్టినట్టు చెబుతాడు వేమన- ‘‘ఆశయనెడు దాని గోసివేయగాలేక/ మోహబుద్ధి వలన మునుగువారు/ కాశివాసులైన గనబోరు మోక్షము’’ అని. ఇంతటి భావాన్ని పైన తత్వంలో మూడు మాటల్లో చెప్పేశారు ఆ అజ్ఞాత కవి. 
తోలుబొమ్మలాట
పోయేనాడు వెంటవచ్చేది ఏదీ లేనప్పుడు ప్రతిదీ నాదే అనుకోవడం మూర్ఖత్వం. బొందిలో ప్రాణమున్నంత వరకే బంధువులు. అది కాస్తా బయటికిపోతే ఏడ్చేవాళ్లు నలుగురు మిగిలినా గొప్పే. దీనికి ప్రతీకలే చేతిలో బెల్లం, దాన్ని చుట్టుముట్టే చీమలు, ప్రమిద వెలుగులు. ధనధాన్యాలు, భోగభాగ్యాలు అన్నీ క్షణికానందాలు. వాటిని సంపాదించే సత్తువ ఒంట్లో ఉన్నంత సేపే ఎవరైనా మనతో దోస్తీ చేస్తారు. ఆ సత్తువ సన్నగిల్లిననాడు ఎవరూ పక్కన ఉండరు. చెరువులో చేపలు చెల్లిపోగానే కొంగలెగిరిపోయినట్లు వీళ్లూ మాయమవుతారు. అందుకే ‘‘సిరి సంపదలూ చూసి మరువకే మనసా! ఇది తెరచాటు బొమ్మలాట తెరువే ఓ మనసా!’’ అన్నారెవరో. 
      పంచభూతాల ప్రతిరూపమే శరీరం అన్నది భారతీయ చింతన. ఇక ‘తోలుబొమ్మ’ అనడంలో రెండో అర్థమూ ఉంది. భూమి పండితేనే మనిషికి తిండి. ఆకాశం నవ్వితేనే గుక్కెడు నీళ్లు. ఆ నీళ్లు నోటిదాకా వస్తేనే దాహం తీరేది. ఇక నిప్పు లేనిదే పొద్దు గడవదు. గాలి లేనిదే ఊపిరి నిలవదు. ఈ అయిదూ ఎలా ఆడిస్తే మనిషి అలా ఆడతాడు. పంచభూతాల్లో ఏ ఒక్కటి కన్నెర్రజేసినా శరీరం చేజారిన మట్టికుండ అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకోకుండా దాన్ని నమ్మడం (శరీరంపై ప్రేమ పెంచుకోవడం) పిచ్చితనం. ఎంత బలవర్థకమైన ఆహారం పెట్టి పోషించినా అది నిలబడదు. ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. అందుకే ‘‘అద్దెకొంప వంటిది యీదేహ మనిత్యమే మనసా’’ అన్నాడు సారంగపాణి. ‘‘బొంది యెవరి సొమ్ము పోషింప బలుమారు/ ప్రాణమెవరి సొమ్ము భక్తిసేయ/ ధనమదెవరిసొమ్ము ధర్మమె తన సొమ్ము’’... ఈ వేమన సూక్తిని అర్థం చేసుకున్న వారికి ఏది నిత్యమో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఈ ‘వస్తావట్టిది’ తత్వం ద్వారా ఆ కవి తెలుసుకోమని చెప్పిందీ అదే. 
      తెలుగునాట ఈ తత్వం చాలా ప్రఖ్యాతం. దీనికి పాఠాంతరాలూ ఉన్నాయి. అందులో ఒకటి- ‘‘వస్తావట్టిదే పోతావట్టిదే ఆశ ఎందుకంటా/ చేసిన ధర్మము చెడని పదార్థము చేరును మీ వెంట/ చేతిలో అమృతం ఉన్న వరకే అన్నదమ్ములంట/ అగాథంబై పోవునాడు ఎవరు రారు వెంట’’... ఇలా సాగుతుంది. దీన్ని మూడు దశాబ్దాల కిందట మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం చేశారు కూడా. ఆయన పాడిన ఈ తత్వాన్ని మొన్నామధ్య ఎవరో యూట్యూబ్‌లో ఉంచితే దాదాపు యాభై వేల హిట్లు వచ్చాయి. ఆ కాలమైనా, ఈ కాలమైనా, ఏ కాలమైనా సరే, మానవ జీవితాలెప్పుడూ కష్టాల కొలిమిలోనే రాటుదేలుతుంటాయి. ఆ కొలిమిలోని చండ్రనిప్పుల కల్లోలానికి అద్దంపడతాయి కాబట్టే తత్వాల జనాదరణకు కాలరేఖ అడ్డుగీత కాబోదు.
ఎన్నాళ్లీ ముచ్చట?
చిలుకాను పెంచేను యెదముద్దులాడేను
కనుసైగలేదయ్యో చిలుకా
మూణ్నాళ్ల ముచ్చటకు మురిసేవు దిరిసేవు
ముందుగతి కానవే చిలుకా
కుక్కి మంచముమీద కూలబడిపోతేను
దిక్కెవ్వరే నీకు చిలుకా
ఇల్లు యిల్లనియేవు యిల్లునాదనియేవు
నీయిల్లు యెక్కడే చిలుకా
ఊరికి ఉత్తరాన సమాధిపురములో 
కట్టె యిల్లున్నదే చిలుకా
కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు
కన్నతల్లెవ్వరే చిలుకా
నువు కాలిపోయెదాకా కావలుందురు గాని
వెంటనెవరూ రారు చిలుకా

      ‘బతుకులెన్నాళ్లు- భాగ్యాలెన్నాళ్లు’ అన్న మాటకు వ్యాఖ్యానమే ఈ తత్వం. ఇక్కడ ‘చిలుక’ మానవ శరీరానికి ప్రతీక. దాన్ని ఎంత ముద్దుచేస్తే మాత్రం ఏంటి? కాలం దాటిపోయాక కనుసైగలూ గడ్డకట్టుకుపోతాయి. ‘‘మంటికుండ మాయ శరీరంబు/ చచ్చునెన్నడైన....’’ అని కదా వేమన వాక్కు. మరి ఈ మాత్రం మురిపానికి ఎగిరిపడటమెందుకు? ‘మురియు’ మురిసేవు అయినట్లు ఇక్కడ ‘తిరుయు’ దిరిసేవు అయింది. తిరియు అంటే యాచించడం. ఇక్కడి అర్థమేంటంటే... నాకది కావాలి ఇది కావాలని కోరికలు కోరడం. అంటే అలంకరణలనో ఇంకేవో పైపై మెరుగులనో ఆశించడం. మున్ముందు మట్టిలో కలిసిపోతానన్న స్పృహ లేకపోవడం (ముందుగతి కానకపోవడం), దానికి తగ్గట్టుగా నడుచుకోకపోవడం అమాయకత్వమా? అహంకారమా?
      ఒంట్లో శక్తి ఉడిగిపోయి మంచానపడినప్పుడు ఏ భోగభాగ్యాలు, ఏ బంధుజనవర్గాలు కాపాడతాయి? ఈ భూమి నాది అంటే భూమి కూడా ఫక్కున నవ్వుతుందట. ఈ ఇల్లు నాది... ఈ స్థలం నాది అని కొన్నాళ్లు మురిసిపోవచ్చు. కానీ, జీవికి శాశ్వతమైన నివాసగృహమేది? రుద్రభూమిలో ఆరడుగుల నేల. ఆ విషయాన్ని మరిచిపోయి కనిపించిన చోటల్లా మేసేస్తూ... కోటలు కట్టుకునే వారిని ఏమనాలి? కట్టె ఇల్లు అంటే చితి. ఓపిక ఉన్నప్పుడు ఎన్ని హంసతూలికా తల్పాల మీద పవళించినా, చివరికి ఆ కట్టె ఇంట్లో (శాశ్వతంగా) కునుకుతీయడానికి వెళ్లకతప్పదు. కాబట్టి, బంగారుమేడల్లో కలతనిద్రలకు ఆశపడటమెందుకు? చితికి పేర్చే కట్టెలే చుట్టాలెందుకవుతాయంటే... ఆఖరి క్షణాల్లో మన బరువుబాధ్యతలు మోసేవి అవే కదా. 
      ఈ తత్వ భావాన్ని జీర్ణించుకుందో ఏమోగానీ వేటూరి కలం అద్భుతమైన పాటకు ప్రాణం పోసింది. ‘కుంతీపుత్రుడు’ చిత్రంలోని ఓ సన్నివేశానికి తత్వ సమానమైన సాహిత్యాన్ని అందించారు వేటూరి. అందులోనే ‘‘మాసాలు మోసేటి ఈ మాయజన్మకు/ వాసాల పరుపంటరా జీవ పోసేది తులసి నీళ్లేరా’’ అంటారాయన. తల్లి నవమాసాలు మోసి కనిపెంచిన ఈ జన్మకు మిగిలేది వాసాల పరుపు... అంటే పాడె మాత్రమే. లోకంలోకి వచ్చాక తొలిసారి తల్లి స్తన్యంతో తడిచే నోరు... చివరికి తులసినీళ్ల తడినద్దుకుంటుంది. అక్కడితో కథ ముగిసిపోతుంది. అంతే కదా! తల్లిదండ్రులు, ఆలుబిడ్డలతో సహా ఎవరైనా కపాలమోక్షం దాకే కావలికాస్తారు. తర్వాత పాడెమంచాన్ని బోర్లాతిప్పేసి, తలంటుకుని తరలిపోతారు- ఎవరి పనుల్లోకి వారు!! ఆ మాత్రం సంబరానికి ‘నాది- నావాళ్లు’ అంటూ నానా హైరానా పడటమెందుకు?  ఉన్నంతలో తిని, మిగిలింది ఎవరికైనా కాస్త పెడితే మంచి పేరన్నా మిగులుతుంది కదా.
      దాదాపు ఇలాంటి జ్ఞానబోధలే చేసే వందల తత్వాలు తెలుగునాట ప్రచారంలో ఉన్నాయి. వాటన్నిటి సందేశమూ ఒకటే... 
అడియాసలతో పడుటేగానీ 
కట్టుకుపోయేదేమిటిరా జీవా 
కట్టెబొగ్గులో  కాలేటప్పుడు 
గవ్వరాదురా నీ వెంబడినీ 
ఏటికి నీ యారాటంబింకా 
ఎపుడో ఏమో ఎరుగుమురా 
త్వరపడరా కడతేరెడు 
గతికనుగొనరా జీవా! 

      కొన్నిటికి వ్యాఖ్యానాలు అవసరం లేదు. దీనికి కూడా!!


వెనక్కి ...

మీ అభిప్రాయం