బడి అద్దంలో రాజ్యాంగం

  • 67 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పళ్ళ శ్రీనివాసరావు

  • అంబాజీపేట, తూర్పుగోదావరి.
  • 8008574178
పళ్ళ శ్రీనివాసరావు

స్వచ్ఛమైన తెలుగులో అందమైన కవితలూ, కథలూ అల్లుతున్న చిన్నారులు బోలెడు మంది! ఇక ఛందోబద్ధంగా పద్యాలు చెబుతున్న బాలకవుల సంఖ్యా తక్కువేం లేదు. అయితే, వీళ్లందరికీ భిన్నంగా తూర్పుగోదావరి జిల్లా పుల్లేటికుర్రు ఉన్నత పాఠశాల పిల్లలు ఓ రచన చేశారు. ఏంటంటే... రాజ్యాంగ రచన! అవునండీ... సాక్షాత్తూ రాజ్యాంగమే!! తమ పాఠశాల కోసమే ప్రత్యేకంగా దాన్ని తయారుచేసుకున్నారు వాళ్లు.    
మాలో దాగి ఉన్న నైపుణ్య కుశలతను వెలికితీసే మహోన్నత సంస్థ... మా అజ్ఞానాన్ని పోగొటి,్ట మమ్మల్ని జ్ఞానవంతులుగా చేసే సరస్వతీ నిలయం... పాఠశాల రాజ్యాంగ ప్రవేశికలో తమ బడికి పుల్లేటికుర్రు పిల్లలు ఇచ్చిన నిర్వచనాలివి. ఇంతకూ వాళ్లు రాజ్యాంగ రచన ఎందుకు చేశారంటే... దీనికీ ప్రవేశికలోనే సమాధానం చెప్పారు ఆ గడుగ్గాయిలు. ఏమని అంటే... ‘మాలో మేం సోదర భావాన్ని పెంపొందించుకుంటూ- ఈ విశాల విశ్వంలో చక్కని ధార్మిక పౌరులుగా, విజ్ఞానఖనులుగా, మేధోవంతులుగా, దేశ ఉజ్జ్వల భవిష్యత్తుకు నిర్మాణకర్తలుగా పరిణామం చెందడానికి’ అని! ఎంత చక్కటి ఉద్దేశం! అసలు ఓ పాఠశాలకు రాజ్యాంగం రాసుకోవడమన్న ఆలోచనే వినూత్నం. దాన్ని కార్యరూపంలోకి తేవడానికి ఆ పిల్లలు పడిన కష్టం అంతా ఇంతా కాదు. అదంతా ఒక ఎత్తయితే, ఆ పిల్లల్లో తగిన స్ఫూర్తి నింపి- దేశంలోనే దాదాపు తొలిసారి ఇలాంటి రచన చేయించిన ఆ పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కుడుపూడి మురళీధర్‌ శ్రమ మరో ఎత్తు. 
      ఆసేతుహిమాచలం ఎన్నో సంప్రదాయాలు... ఎన్నెన్నో భాషలు! ఆహారపుటలవాట్ల నుంచి స్థానిక ఆలోచనా విధానాల వరకూ వేటికవే విభిన్నం. అయినా... భారతీయ సమాజాన్ని ఏకతాటి మీద నిలుపుతున్న అంశమేంటి? దాయాది దేశం పాకిస్తాన్‌లా ఓ విఫల రాజ్యం కాకుండా భారతావనిని ప్రజాస్వామ్య పథంలో ముందుకు నడిపిస్తోందేంటి? అదే... రాజ్యాంగం. భిన్నత్వంలో ఏకత్వం దిశగా దేశాన్ని నడిపించిన రాజ్యాంగ నిర్మాతల దార్శనికతకు జోతలు పట్టాల్సిందే. మరి నేటితరానికి మన రాజ్యాంగం అందించే అంతఃసందేశమేంటో అవగాహన ఉందా? పేరుకు పాఠ్యపుస్తకాల్లో పాఠాలు ఉంటాయి. రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఏర్పడింది, ఎంత మంది సభ్యులు, అధ్యక్షులెవరు, హక్కులు- విధులేంటి... ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి. వాటిని విద్యార్థులు బట్టీపడతారు. మార్కులు వస్తాయి. అక్కడితో సరి. ఇలాగైతే ఉపయోగమేంటన్న ప్రశ్నే మురళీధర్‌లో ఓ కొత్త ఆలోచనకు ప్రాణంపోసింది. రాజ్యాంగం గురించి పిల్లలు పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలంటే, వాళ్లతోనే రాజ్యాంగ రచన చేయించాలని నిర్ణయించుకున్నారు. ఒకరకంగా ఇదో క్షేత్రస్థాయి శిక్షణ. 
అవగాహన... అధ్యయనం
రాజ్యాంగ రచన కోసం మన నాయకులు ఎన్నో చర్చలు జరిపారు. ఎన్నెన్నో అధ్యయనాలు చేశారు. ముసాయిదా ప్రతులు రూపొందించారు. వాటిని క్షుణ్నంగా పరిశీలించారు. అలా తయారైన రాజ్యాంగాన్ని అందరి ఆమోదంతో అమల్లోకి తెచ్చారు. పుల్లేటికుర్రు పిల్లలు కూడా దాదాపు రెండు నెలల పాటు ఇంత శ్రమా పడ్డారు. 8, 9, 10 తరగతుల్లోని రాజ్యాంగ సంబంధిత పాఠాలతో పాటు ఇంటర్మీడియట్‌ పాఠ్యాంశాలనూ చదివారు. పాఠశాల గ్రంథాలయం, అంతర్జాలాల నుంచి సమాచారాన్ని సేకరించారు. వీటన్నింటికంటే ముందు రాజ్యాంగం విశిష్టత, దాని లక్షణాల గురించి వాళ్లకు మురళీధర్‌ తరగతి గదిలో ఓ అవగాహన కల్పించారు. ఆ తర్వాత నవంబరు 2015లో పాఠశాల రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు. దీనికి అన్ని తరగతుల నుంచీ వందమంది సభ్యులను ఎంపిక చేశారు.  
      బడి రాజ్యాంగంలోని వివిధ అంశాలు ఎలా ఉండాలో నిర్దేశించడానికి ఆరు సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎంపిక చేసిన విద్యార్థులే వీటికి అధ్యక్షులు. సభ్యులూ వాళ్లే. విద్యార్థిని సంగీత అధ్యక్షురాలిగా వ్యవహరించిన ‘ప్రాథమిక హక్కుల సంఘం’లో నలుగురు సభ్యులు. అందరూ కలిసి విద్యార్థులకు ఎలాంటి హక్కులు ఉండాలో అధ్యయనం చేసి, నివేదిక తయారుచేశారు. దాన్ని ముసాయిదా సంఘానికి సమర్పించారు. రాజ్యాంగ రచనలో అతికీలకమైన ముసాయిదా సంఘానికి డి.శార్వాణి నేతృత్వం వహించింది. పాఠశాల రాజ్యాంగం తుది ప్రతి రచనా బాధ్యతలను తనే నిర్వర్తించింది. దీనికోసం ప్రత్యేకంగా కృష్ణారెడ్డి ‘భారత రాజ్యాంగం’ పుస్తకాన్ని అధ్యయనం చేసిందా అమ్మాయి. తన జట్టులో ఏడుగురు ఉన్నారు. ఇక ప్రాథమిక విధులేంటో చెప్పిన బృందంలో ఆరుగురు సభ్యులు. దీనికి రహళిక అధ్యక్షురాలు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు నిర్వర్తించాల్సిన విధులు,  బాధ్యతల మీద ఓ నివేదికను సమర్పించిందీ జట్టు.  
జెండా... చిహ్నం
పుల్లేటికుర్రు ఉన్నత పాఠశాల అధికార భాష తెలుగు. విద్యార్థులకు మాతృభాషలో బోధించాలి. ఈ మాటలు పిల్లలు తమ రాజ్యాంగంలోనే రాసుకున్నారు. ఈ విషయాలను నిర్దేశించింది సతీశ్‌ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల ‘భాషల సంఘం’. పాఠశాల స్థాయిలో ఉండాల్సిన సంస్థల గురించి కిరణ్మయి నేతృత్వంలోని ‘సంస్థల సంఘం’, బడి పాలన- అభివృద్ధి కోసం తులసి అధ్యక్షతలోని ‘ఆదేశసూత్రాల సంఘం’ నివేదికలు ఇచ్చాయి. ఈ సంఘాల అధ్యక్షులను తెలివితేటలు, విషయనైపుణ్యం, వాక్పటిమ ఆధారంగా ఎంపిక చేశారు. చదువులో కాస్త వెనుకబడి ఉండే విద్యార్థులనూ ఆయా సంఘాల్లో సభ్యులుగా భాగస్వాములను చేశారు.  వీళ్ల కూర్పులో అన్ని తరగతులకూ ప్రాధాన్యమిచ్చారు. ఈ పనిలో పడి పిల్లలు రోజువారీ చదువులను నిర్లక్ష్యం చేయకుండా మురళీధర్‌ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
      పాఠశాల జెండాగా విద్యార్థి సన్నిహిత్‌ బాబు రూపొందించిన నమూనా ఎంపికైంది. నీలం రంగు జెండా మధ్యలో పుస్తకంతో పాటు ఇద్దరు విద్యార్థులు కనిపించేలా దీన్ని తీర్చిదిద్దాడు. ఇక భారత రాజ్యాంగానికి ఏనుగు చిహ్నం. అలా ఈ పాఠశాల రాజ్యాంగానికి చదువులతల్లి సరస్వతీదేవి వాహనం హంస చిహ్నమైంది. దీన్ని విద్యార్థిని దివ్య తయారుచేసింది. 
స్ఫూర్తిదాయకం
ఆయా సంఘాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ముసాయిదా రాజ్యాంగం తయారైంది. దానిమీద రాజ్యాంగ పరిషత్తు సభ్యులు నాలుగుసార్లు సమావేశమై, విస్తృతస్థాయిలో చర్చించుకున్నారు. ముసాయిదా ప్రతికి మరిన్ని మెరుగులు దిద్దారు. పరిషత్తు చివరి సమావేశాన్ని జనవరి 25, 2016న గ్రామపెద్దలు, సర్పంచి, మండలపరిషత్తు అధ్యక్షుడు, విద్యాధికారులు, తలిదండ్రుల సమక్షంలో నిర్వహించారు. పన్నెండు భాగాలు, 159 నిబంధనలతో కూడిన ముసాయిదా రాజ్యాంగాన్ని పూర్తిగా పరిశీలించి, ఆమోదించుకున్నారు. పాఠశాల వాతావరణం నుంచి కాలానుగుణంగా తమ రాజ్యాంగాన్ని సవరణ చేసే విధానం వరకూ... దేశ రాజ్యాంగాన్ని తమ పాఠశాలకు అన్వయించడంలో పిల్లల ప్రతిభ పెద్దలనూ ముగ్ధులను చేసింది. అందుకే, ఆ చిన్నారులతో పాటు మురళీధర్‌నూ మనస్ఫూర్తిగా అభినందించారు. తర్వాత ఈ పాఠశాల రాజ్యాంగాన్ని పుస్తక రూపంలోకి తెచ్చారు.  
      భారత రాజ్యాంగం మీద పిల్లలకు పూర్తి అవగాహన కల్పించాలన్న మురళీధర్‌ లక్ష్యాన్ని ఈ క్రతువు సఫలీకృతం చేసింది. రాజ్యాంగం గురించి సాధికారికంగా మాట్లాడగల స్థాయికి పిల్లలు చేరుకున్నారు. ఈ క్రమంలో చేయీచేయీ పట్టుకుని సాగడంతో, గతంలో వాళ్ల మధ్య ఉన్న ఈర్ష్య, అసూయల్లాంటివి మాయమయ్యాయి. భావప్రకటన నైపుణ్యాలు ఇనుమడించాయి. తోటి విద్యార్థుల పట్ల ప్రేమతో ఉండటం అలవడింది. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడంతో తమవంతు తోడ్పాటును అందిస్తున్నారు. 
      పుల్లేటికుర్రు ప్రయోగం సత్ఫలితాలను ఇవ్వడంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ దీన్ని చేపట్టమని ‘ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి.’ సూచించింది. వరంగల్లు జిల్లా మరిపెడ, తూర్పుగోదావరి జిల్లా గంటి, దేవగుప్తం, కాట్రేనికోన, అంబాజీపేట, పడమటిపాళెం, రమణయ్యపేట ఉన్నత పాఠశాలల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఇప్పటికే తమ పాఠశాలల రాజ్యాంగ నిర్మాణానికి నడుంబిగించారు. బోధనలో ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపించే మురళీధర్‌ లాంటి ఉపాధ్యాయుల చొరవే... భావిభారత పౌరులను అత్యున్నతంగా తీర్చిదిద్దుతుంది. ఈ విషయాన్ని పుల్లేటికుర్రు పాఠశాల రాజ్యాంగం మరోసారి నిరూపించింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం