హస్తినలో పురివిప్పిన తెలుగు పద్యం

  • 10 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఉపదేష్ట అగ్నివేశ్‌

  • హైదరాబాదు.

సాహితీప్రియులకు అవధానం సురుచిరం. పృచ్ఛకులు సంధించే సమ్మోహనాస్త్రాలను అవధాని ఎంత సమర్థంగా ఎదుర్కొంటే సదస్యులు అంత మైమరచిపోతుంటారు. నిజానికి పద్యప్రక్రియని ప్రదర్శనకళగా మార్చిన ఘనత అవధానాలదే! అప్పట్లో రాజాస్థానాల్లో ‘వేదావధానం’ జరిగేది. 8 అంశాలే ఉండే వేదావధానంలో ‘ధారణ’కే ప్రాధాన్యం. దాని ప్రేరణగానే తెలుగులోనూ 8 సంఖ్యకే ప్రాధాన్యమిచ్చి ‘అష్టావధానం’ ప్రారంభించారు. 13వ శతాబ్దం నుంచి వర్ధిల్లిన అవధానం కాలానుగుణంగా శతావధానం, సహస్రావధానంగా విస్తరించింది. అయితే నిత్య ప్రయోగాలతో అవధానాన్ని ప్రజారంజకం చేసిన తెలుగు కవులు ఎందరో. ఆ కోవలోని వారే మాడుగుల నాగఫణిశర్మ. అష్ట, శత, మహాశత, ద్విశత, మహా సహస్ర, బృహత్‌ ద్విసహస్ర ఇలా తన అవధానాల పరంపరను ఎప్పటికప్పుడు విస్తరించుకున్నారు. నవంబరు 2న దిల్లీలో ‘అవధాన రాజధాని’ పేరుతో నాలుగు వందలకు పైగా తెలుగు, సంస్కృత భాషా పృచ్ఛకులు, పాతికమంది సంస్కృత పండితులతో అవధానాన్ని రక్తికట్టించారాయన.
      దత్తపది, సమస్య, ఆశువు, వర్ణన, న్యస్తాక్షరి, ఘంటాగణనం, పురాణపఠనం, అప్రస్తుత ప్రశంస.. ఇవి సాధారణంగా అవధానాల్లో ఉండే అంశాలు. ఈ కార్యక్రమంలో వీటికి తోడుగా శర్మ మీ ప్రశ్నకు నా పాట, స్వరపది, నృత్యపది, చిత్రపది వంటివాటిని జోడించడం కొత్త ప్రయోగం! దీనిని సంస్కృతం, తెలుగు భాషల్లో నిర్వహించారు.
తెలుగు భాషకు గౌరవం
ఫిక్కీ ఆడిటోరియంలో 2014, నవంబరు 2న ప్రారంభమైన ఈ కార్యక్రమానికి, ఆకాశవాణి సంస్కృత వార్తల ద్వారా సుపరిచితులైన బలదేవానంద సాగర స్వాగతోపన్యాసం చేశారు. ‘‘అన్ని ప్రక్రియల్లో పాండిత్య గరిమతో కూడింది అవధానం. స్వీయజ్ఞానం, కవిత్వం, సందర్భోచిత భాషాలంకారంతో సాగే మనోహర ప్రదర్శన ఇది. వాఙ్మయాధీశులైన వారికే ఇది సాధ్యం’’ అన్నది బలదేవానంద మాట. ఎన్నికల సంఘం మాజీ సభ్యులు జివిజి కృష్ణమూర్తి నాగఫణిశర్మ అవధాన విధానాన్ని ప్రశంసిస్తూ ‘‘ఇది తెలుగుభాషకు జరుగుతున్న గౌరవం’’ అన్నారు. ‘ఎప్పటికైనా ‘తెలుగు దేశ రాజభాష అవుతుందని’ తన ఆకాంక్షను ఈ కార్యక్రమం వేదికగా ప్రకటించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ. సంస్కృత భాషలో జ్ఞానపీఠ పురస్కారం పొందిన పండిత సత్యవ్రత శాస్త్రి, ఈలపాట శివప్రసాద్‌ తదితరులు అభినందనపూర్వకంగా మాట్లాడారు. ప్రారంభసమావేశంలో పాల్గొన్న ముఖ్యులందరూ అవధానిని ఆశువుగా చెప్పమని వివిధ అంశాలనిచ్చారు. సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ- ‘ఇంతమంది పండితుల మధ్య కూర్చొనే అర్హత నాకు లేదు. అయినా కూర్చొనే అవకాశం వచ్చింది’ అనడంతో మాడుగుల వెంటనే-
      ‘‘అందరూ సమానమే,
      అన్నది అనుమానమా?
      మనిషి మనిషి మనిషి మనిషి
      ఒకరికొకరు తోడై

ఎదుటివారు, పక్కవారు అందరు నీ నీడై..’’ అంటూ గేయాన్ని ఆశువుగా పలికించారు. కీబోర్డు, మృదంగం వంటి వాద్య పరికరాలు జత కలవడంతో మంచి ప్రారంభగీతం అయింది. ఆ పాట స్ఫూర్తితో శ్రీమతి జివిజి కృష్ణమూర్తి, కార్తికజ్యోతి దర్శన ఫలం అందరికీ దక్కేలా ఓ గీతం ఆలపించమనడంతో మాడుగుల- ‘జయ జయ జయ మహాదేవ/ కార్తిక శ్రీమాస ఘన గౌరవవిధేయ’ అంటూ అప్పటికప్పుడు గీతాన్ని ఆలపించారు. ఈలపాట శివప్రసాద్‌ ‘ఎందరో మహానుభావులు’ కీర్తన పాడగా, మాడుగుల ‘శివో విలసతు, శివో విలసతు నాదమయః’ అంటూ శివతాండవం చేశారు. అలా ప్రారంభ సమావేశం పరమ శివునికే అంకితమైంది.
ఆద్యంతం ఆసక్తికరం
రెండో రోజు (3.11.2014) అష్టకాల నృసింహశర్మ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో ఏర్పాటైన ‘అవధాన రాజధాని’ హాస్యావధాని శంకరనారాయణ అప్రస్తుత ప్రసంగంతో, రంగాచార్య సమన్వయకర్తగా దత్తపదులతో ప్రారంభమైంది. మధ్యాహ్నం ఆశువు చేపట్టారు. ఆ సాయంత్రం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎం.పి. జితేంద్ర రెడ్డి, ఎం.పి. కంభంపాటి హరిబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. హరీశ్‌రావు తన ప్రసంగంలో ‘‘ఇది శుభసూచకం. రెండు రాష్ట్రాలవారు ఇక్కడ కలిశారు. రెండు రాష్ట్రాలవారు కలిస్తేనే ప్రగతి సాధ్యం. రెండు రాష్ట్రాలు బాగుండాలను కున్నప్పుడే భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. రెండు రాష్ట్రాలు ముందుకు వెళ్లేలా మీ ఆశీస్సులు కోరుతున్నాను’’ అనగానే... అవధాని వెంటనే- ‘‘రెండౌ రాష్ట్రములెల్ల వేళల శుభ శ్రీలన్‌ నిడంబించగా/ నిండే సహృదయంబు లెల్లెడల నింపై...’’ అంటూ శుభకామనలందజేశారు. హుద్‌హుద్‌ తుఫాను గురించి ఒక పృచ్ఛకుడు ఆశువు కోరగా- ‘‘శ్రీవిశాఖ ఇంక చిగురులు తొడగును కొత్త శోభతోడ’’ అంటూ విశాఖ తిరిగి సర్వాంగ సుందరంగా తయారవుతుందన్నారు. సంగీత విద్వాంసులు హైదరాబాదు బ్రదర్స్‌ బతుకమ్మ మీద అడిగిన పాటకు... ‘‘మనమంతా జనమంతా మనసంతా ఏకమై/ మనదే ఒక మనకే ఒక లోకమై/ బతుకమ్మను పాడే రసమయ సుశ్లోకమై...’’ పాటను ఆశువుగా గానంచేశారు నాగఫణిశర్మ. రెండో రోజు అవధాని బతుకమ్మ గీతానికి వందకు పైగా మహిళా పృచ్ఛకులు బతుకమ్మ ఆడటంతో ప్రాంగణమంతా పరవశించింది.
      ఈ కార్యక్రమానికి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాదు, అబుదబి, శ్రీలంక వంటి ఇతర దేశాల నుంచీ సంస్కృత పండితులు రావడం విశేషం. నాటక సినీరంగాలకు చెందిన దీక్షిత్, నాగరాజు, మణి వంటి వారు స్వరపది, నృత్యపదిలో తమవంతు సహకారం అందించారు. ఎనిమిది రోజుల కార్యక్రమంలో శ్రీధర వాసిష్ఠ, వసంత గాడ్గిల్, శ్రేయాంశు ద్వివేది, సులోచనా త్రివేది, పద్మశ్రీ రమాకాంత శుక్లా, విద్యాసాగర్, డా.పిటిజివి రంగాచార్యులు, కె.ఆర్‌.గణేశన్, బలదేవానంద సాగర్‌ తదితర సంస్కృత విద్వాంసులు పృచ్ఛకులుగానే కాక, వక్తలుగానూ సభికులను చైతన్యవంతుల్ని చేశారు. ‘‘ఇది సరస్వతీ ఉపాసన. ఇలాంటివి అన్ని చోట్లా జరిగితే భాషా సంస్కృతుల మీద గౌరవం ఇనుమడిస్తుంది. ఆదరణ పెరుగుతుంది’’ అని వసంత గాడ్గిల్‌ అంటే, ‘‘ప్రాచీన పరంపరని సజీవంగా ఉంచే ప్రక్రియ అవధానం. వర్తమాన కాలంలో దీని అవసరం ఎంతైనా ఉంది’’ అన్నది సులోచనా త్రివేది ఉవాచ.
శిఖరాయమానం శిఖరోత్సవ సభ
నవంబరు 9 ఉదయం 8.30 గంటలకు ‘అవధాని రాజధాని’ విజయ శిఖరోత్సవ మహాసభ ఏర్పాటైంది. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, ప్రకాష్‌ జవదేకర్, బండారు దత్తాత్రేయ, దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి తదితరులు హాజరయ్యారు. వెంకయ్యనాయుడు తన సహజ ప్రసంగధారలో ‘‘ఈనాడు మాడుగుల కవితావృష్టిని ఢిల్లీ అనుభవించింది. పద్యం సుందరమైంది. మనకు జ్ఞానం కలిగిస్తుంది. కొంతకాలంగా అది నిరాదరణకు గురవుతోంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ’’ అన్నారు. నాగఫణిశర్మ ప్రతిస్పందనలో ‘జాతి గర్వించి ఉప్పొంగు జాతినేత, పండితులు కూడా మెచ్చు ఆ ప్రతిభతోడ, కవుల కందని రస ప్రసంగములతోడ, మనదు వేంకయ్యనాయుడు మహిత నేత’ అంటూ అభినందించారు.
ప్రకాష్‌ జవదేకర్‌ ‘భారతీయ భాషల వైవిధ్యాన్ని చాటిన ప్రక్రియ అవధానం’ అంటూ శర్మను కొనియాడగా, దత్తపీఠాధిపతి ‘శబ్దకోశం’ అని ప్రశంసించారు. తరువాత ‘అవధాన సమ్రాట్టు’ బిరుదుతో శర్మను సత్కరించారు. ‘అవధాన రాజధాని’ కార్యక్రమంలో పాల్గొన్న పృచ్ఛకులను, సహ అవధానులను, తనకు సహకరించిన సత్యప్రసాద్, గిరిజారమణ, ఆమళ్ళదిన్నె వేంకటరమణప్రసాద్, శంకరనారాయణ, దీక్షిత్‌ తదితరులను, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను సత్కరించారు. ఆ ఎనిమిది రోజులు తెలుగు పద్యం హస్తినలో పురివిప్పి నాట్యం చేసింది. అవధాన కార్యక్రమాలు దేశమంతా నిర్వహించేందుకు సంస్కృత పండితులు ముందుకు రావడం ఈ సందర్భంగా గమనార్హం. ఇంతకన్నా భాషాభిమానులకు సంతోషకరమైంది ఏముంటుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం