మన పద్యం... ఎంతో హృద్యం!

  • 56 Views
  • 6Likes
  • Like
  • Article Share

    డా।। జోశ్యుల కృష్ణబాబు

  • విశ్రాంత తెలుగు రీడర్,
  • మహారాణీ కళాశాల, పెద్దాపురం, తూ.గో.
  • 9866454340
డా।। జోశ్యుల కృష్ణబాబు

పద్యమన్నది వేయేండ్ల పసిడిపంట
పద్యమన్నది తెలుగింటి పాడిపంట
తెలుగు పద్యమ్మె పాడుము తెలుగుబాల
తెలుగు తేజమ్ము వెలయంగ దిశలమ్రోల

      ఇదీ తెలుగు పద్యం వైభవం. ఇలా అన్నది మహాసహస్రావధాని గరికిపాటి నరసింహారావు. తెలుగు సాహిత్యంలో పద్యం ప్రస్థానం పదకొండు వందల ఏళ్లకు ముందు మొదలైంది. ఇది మన వారసత్వ సంపద. పద్యం అనే పదానికి మూలం ‘పదగతౌ’ అనే సంస్కృత ధాతువు. తోవ, మార్గం అని దీనికి అర్థాలు. మొత్తానికి పద్యమంటే నియమబద్ధమైన నడక కలది. గడచిన వందేళ్లుగా వచన సాహిత్యం బాగా అభివృద్ధిచెందింది. దాంతో ఇప్పటికీ పద్యకావ్యాలు వస్తున్నా... పద్యం అంటే పాతదే అన్న భావన నెలకొంది.
      భాష- గుర్రమైతే, భావం- రథం, కవి- సారథి, ఛందస్సు- రాజమార్గం. అంటే కవి సారథిగా ఉండి, భావరథానికి భాష అనే గుర్రాన్ని పూన్చి ఛందో రాజమార్గంలో హేలగా నడిపించటమే పద్యం. ఈ మార్గం మీద పయనించడానికి ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి. అభ్యాసం లేనివాళ్లు, నేర్పరులు కానివాళ్లు పద్యరథాన్ని సరిగా నడపలేరు. మంచిపద్యం రాయటం కవికి ప్రసవవేదన లాంటిది. జాషువా ‘నా కథ’లో ‘గణ బాధ రవ్వంత గడచి ముందుకు సాగ/ తగ్గవోయని యతిస్థాన మురుము...’ అంటూ పద్య సృజనకు ఎంతటి కసరత్తు చేయాలో చెప్పారు.
      ఎలాగైనా ఓ మంచిపద్యం రాయాలని కవి కాగితం, కలం పట్టుకుని కూర్చున్నంత మాత్రాన అది హఠాత్తుగా ఊడిపడిపోదు. పద్యం బయటికి రావాలంటే ఎన్నో అవరోధాల్ని అధిగమించాలి. మొదట గణాలు అడ్డుపడతాయి. ఆపై యతి సరి చూసుకోమని హెచ్చరిస్తుంది. ఆపై ప్రాస పీక పట్టుకుంటుంది. ప్రాసవేదన దాటినా, భావం పొసగక ఇబ్బంది పెడుతుంది. భావం పొసగినా తనను పట్టించుకోలేదని రసానికి కోపం వస్తుంది. అప్పుడిక రసాభాసే. పోనీ ఇన్ని ప్రతిబంధకాల్నీ అధిగమించి అడుగు ముందుకు వేద్దామంటే, వ్యాకరణం మరి నా సంగతేంటి? అని నిలదీస్తుంది. ఇలా అడుగడుగునా కవికి ఆటంకాలే. అయితే యతి, ప్రాసలతోనే పద్యానికి అందం, ఆకర్షణ. మరే భాషకూ ఈ రెండు నియమాలు లేవు. ఏదో ఒకటే ఉంది.
      పద్యం నాడి దొరకబుచ్చుకున్న కవులకు ఈ ఆటంకాలు అసలు లెక్కలోకి రావు. పద్యాన్ని హృద్యంగా, అనవద్యంగా నడిపించగల సత్తా ఉన్న కవి వాటితో ఆటలాడుకుంటాడు. పద్యం అతను చెప్పినట్టు వింటుంది. అతని ముందు మోకరిల్లుతుంది. వెయ్యేళ్ల సాహిత్య చరిత్రలో వేలమంది కవులున్నా తమకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్నవాళ్లు కొంతమందే. 
కవిత్రయం బాటలో...
పద్య రచనలో కవిత్రయానిది అద్వితీయ స్థానం. వాళ్లది ఒక్కొక్కరిది ఒక్కో శైలి. నన్నయకు సంస్కృత పద భూయిష్ఠమైన శైలి ఇష్టం. అక్షర రమ్యత ఆయన సొంతం. ధర్మరాజు తలపెట్టిన రాజసూయ యాగ సందర్శనకు వచ్చిన రాజుల్ని నన్నయ ఇలా వర్ణించాడు...
మద మాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య గాణిక్య సం
పద లోలింగొని తెచ్చియిచ్చి ముద  మొప్పంగాంచి సేవించి ర
య్యు దయాస్తాచల సేతు శీతనగ మధ్యోర్వీపతుల్‌ సంతతా
భ్యుదయున్‌ ధర్మజుఁ దత్సభా స్థితు జగత్పూర్ణ ప్రతాపోదయున్

      ఇందులో ‘మద మాతంగ తురంగ’ అన్న దీర్ఘ సమాసం ధర్మరాజు సంపద ఔన్నత్యాన్ని తెలుపుతుంది. మహాకవి వ్యర్థంగా దీర్ఘ సమాసాన్ని ఎప్పుడూ ప్రయోగించడు. పద్యంలో మొదటి పాదమంతా ఏక సమాసం చేసి, వెంటనే రెండో పాదంలో ‘తెచ్చి, ఇచ్చి, గాంచి, సేవించి’ అని నాలుగు క్రియలు ప్రయోగించాడు. ఇవి ధర్మరాజును సందర్శించేందుకు వచ్చిన రాజుల వేగిరపాటును తెలియజేస్తాయి. మూడోపాదంలో రాజుల బాహుళ్యాన్ని చెప్పటానికి మరో దీర్ఘసమాసం ప్రయోగించాడు. ఇది సాధారణ పాఠకులకు అర్థం కాకపోవచ్చు. అయినా వాళ్లు కూడా పద్యాన్ని ఆస్వాదిస్తారు. కారణం అందులోని అక్షర రమ్యత.
      అవసరమైతే తప్ప సంస్కృతం వాడనన్న తిక్కన అలతి అలతి పదాలతోనే భారత రచన పూర్తిచేశాడు. రౌద్ర, వీర, భయానక రసాల్లో తప్పనిసరై మాత్రమే సంస్కృతం ఉపయోగించుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజు కర్ణుడికి పట్టుబడిపోతాడు. అదే సమయంలో భీముడు దుర్యోధనుణ్ని ఎదుర్కొంటాడు. వెంటనే కర్ణుడు ప్రభు సంరక్షణార్థం ధర్మరాజును వదిలి, భీమ దుర్యోధనులు యుద్ధం చేస్తున్న ప్రదేశానికి వెళ్తాడు. ఇక్కడ కర్ణుడు ధర్మరాజును వదిలేయడానికి కారణం తల్లికిచ్చిన మాటే. సంజయుడు ఈ సందర్భాన్ని ధృతరాష్ట్రునికి చెబుతుంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడి హృదయ వేదన ఎలా ఉందో తిక్కన అతని మాటల్లోనే ఇలా చెప్పిస్తాడు...
అనిలజునకు జాలడె నా
తనయుడు? మోసంబుగాక ధర్మజుడట్ల
బ్బిన బోనిచ్చుట, రాధా
తనయునకున్‌ బుద్ధియగునె? తప్పెందప్పెన్‌!

      నా కొడుకు భీముడికి సరిపోడా? కావాలనే కర్ణుడు ధర్మరాజుని వదిలేశాడు.  చేతికందిన ఫలం జారిపోయిందంటూ వాపోతాడు. ‘తప్పెందప్పెన్‌’ అనే తేట తెనుగు మాటలో ఎంత శక్తి ఉందో! ధృతరాష్ట్రుడి పాపచింతన అంతా ఈ రెండు మాటల్లో వ్యక్తమవుతుంది. ఒక పాత్ర మాటల్లో ఆ పాత్ర వ్యక్తిత్వం ప్రతిఫలింపజేయడం నాటకీయతలో భాగం.
ఎర్రన ‘తద్రచనయకా’ అంటూ నన్నయ శైలిలోనే భారతం అరణ్యపర్వ శేషాన్ని పూరించాడు. 
      శ్రీనాథుడి పద్యాలైతే ఎక్కువగా సంస్కృత పద భూయిష్ఠమే. నైషధం ఆంధ్రీకరణలో సంస్కృత శ్లోకాన్ని యథాతథంగా స్వీకరిస్తూ చివర డు, ము, వు, లు చేర్చిన పద్యాలెన్నో కనిపిస్తాయి. మీ డు, ము, వు, లు మీరు తీసుకొని మా సంస్కృతాన్ని మాకిచ్చేయండని సంస్కృత కవులు ఎద్దేవా చేసినట్లు కథలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ శ్రీనాథుడు అక్కడక్కడా ప్రసాద, మాధుర్య గుణాల్ని జోడిస్తూ రాసిన పద్యాలూ కనిపిస్తాయి. భీమఖండంలో దాక్షారామ ప్రాశస్త్యం వర్ణిస్తూ చెప్పిన పద్యం భీమ మండలాన్ని కళ్లకు కడుతుంది. భూగోళం మీద భీమమండలం లాంటిది ఎక్కడైనా ఉందా? అంటూ సాగే ఆ పద్యం ఇది...
ఎక్కడ జూచిన న్సరసి యొక్కడ జూచిన దేవ మందిరం
బెక్కడ జూచినందటిని యెక్కడ జూచిన పుష్పవాటికల్‌
యెక్కడ జూచినన్నది మహీవలయంబున భీమ మండలం
బెక్కడ యన్య మండలము లెక్కడ భావన చేసి చూచినన్‌

      ఇక తన గంటాన్ని అమృతంలో అద్ది రచించాడా? అన్నంత మధురంగా ప్రతి పద్యాన్నీ తీర్చిదిద్ది భాగవతాన్ని తెలుగు వాళ్లకు అందించిన మహనీయుడు పోతన. అందుకే ఆయన ‘తెలుగుల పుణ్యపేటి’ అయ్యాడు. గజేంద్రమోక్షం, ప్రహ్లాద చరిత్ర, శ్రీకృష్ణలీలలు, రుక్మిణీ కల్యాణం, వామనావతారం- వంటి ఘట్టాల్లో ప్రతిపద్యమూ ఓ రసగుళికే.
‘‘రావే! ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!’’ అన్న గజేంద్రుడి మొర శ్రీమహావిష్ణువుకు వినిపించింది. సరిగ్గా అదే సమయంలో లక్ష్మీదేవి చేలాంచలం ఆయన చేతుల్లో ఉండిపోయింది. అంతే! అదేమీ గమనించకుండానే గజ సంరక్షణార్థం ఆయన ఉన్నపళంగా బయలుదేరాడు. అప్పుడు లక్ష్మీదేవి స్థితి ఇలా ఉందట.
అడిగెదనని కడువడి జను
నడిగినదన మగడు నుడువడని నడయుడుగున్‌
వెడవెడ చిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్‌

      భర్తను అడగాలా? వద్దా? అనే తడబాటును సూచించే పద్యమిది. అప్పటి ఆమె ఆందోళనకు తగ్గ అక్షరాల పోహళింపు ఈ పద్యంలోని సొంపు. ఇది సర్వలఘు కందంలో సాగిన పద్యం. అంతమాత్రాన్నే ఇది గొప్ప పద్యం కాలేదు. నుడుల నడకలో ‘డ’ కారం పదేపదే సవ్వడించడం వల్ల గొప్పదైంది. తర్వాతి కాలపు అల్లసాని పెద్దన, ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు, రామరాజభూషణుడు, పింగళి సూరన, చేమకూర వేంకటకవి లాంటి ప్రబంధ కవులూ ఈ మార్గాన్నే అనుసరించి ఎన్నో ప్రయోగాలు చేశారు. పద్యానికి విశిష్టతను సంతరించిపెట్టారు.
పద్యం పనైపోలేదు...
ఇటీవలి కాలంలో, పద్యం అంటే పాత చింతకాయ పచ్చడనీ, ఆధునిక యుగంలో దానికి పెద్దగా చోటులేదని భావించే వాళ్లూ ఉన్నారు. అయితే, తిరుపతి వేంకటకవులు, జాషువా, కరుణశ్రీ, మల్లెమాల, జ్ఞానానందకవి వంటి కవులు పద్యానికి ఎన్ని సొబగులు అద్దాలో అన్నీ అద్దారు. ముఖ్యంగా తిరుపతి వేంకట కవుల పాండవోద్యోగ విజయ నాటకాలు ఆ రోజుల్లో ఊరూరా, వాడవాడలా ప్రదర్శించారు. ‘బావా! ఎప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్‌ సుతుల్‌ చుట్టముల్‌...’, ‘చెల్లియొ చెల్లకో...’, ‘ఎక్కడి నుండి రాకయిట కెల్లరున్‌ సుఖులే కదా!’, ‘జెండాపై కపిరాజు...’, ‘అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు’ లాంటి పద్యాలు తెలియని తెలుగువాళ్లు అరుదు. నిజానికి పద్యానికి పట్టాభిషేకం చేసిన నాటకాలు ఈ పాండవోద్యోగ విజయాలు. ఇంకా పద్యం అంటే ఇలాగే ఉండాలనిపించేలా పద్యాన్ని నడిపించిన కవి కరుణశ్రీ. ఆయన రాసిన ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ కవితా సంపుటుల్లోని ప్రతిపద్యమూ హృద్యమే. విజయశ్రీలో నిరుపేదనైన నా ఇంటికి రా ప్రభూ! అని భగవంతుణ్ని ఆహ్వానిస్తూ రాసిన పద్యం...
కూర్చుండ మా యింట కుర్చీలు లేవు నా
    ప్రణయాంకమే సిద్ధపరచనుంటి
పాద్యమ్ము నిడనాకు పన్నీరు లేదు నా
    కన్నీళ్లతో కాళ్లు కడుగనుంటి
పూజకై మావీట పుష్పాలు లేవు నా
    ప్రేమాంజలులె సమర్పింపనుంటి
నైవేద్యమిడ మాకు నారికేళము లేదు
    హృదయమే చేతి కందీయనుంటి
లోటు రానీయనున్నంత లోన నీకు
రమ్ము దయజేయుమాత్మ పీఠమ్ము పైకి
అమృత ఝరి బిందు నీ పదాంకములయందు
కోటి స్వర్గాలు మొలిపించుకొనుచు తండ్రి!

      కరుణశ్రీ అనగానే ‘పుష్పవిలాపం’ గుర్తుకొస్తుంది. ఇందులోని భావుకత హృదయాల్లోకి దూసుకుపోతుంది. తిరుపతి వేంకట కవుల తర్వాత పద్యాన్ని సామాన్యుడి ముందుకు తీసుకువచ్చిన ఘనత కరుణశ్రీదే. ఒక విషయాన్ని వచనంలో కంటే పద్యంలో చెబితేనే అందంగా ఉంటుంది. శాశ్వతంగా గుర్తుండిపోతుంది. కానీ ఎంత బాగున్నా వచనాన్ని కొన్నాళ్ల తర్వాత మరచిపోతాం.
      అయితే ఇటీవల పద్యకవిత్వం కొంత వెనకబడింది. కవులు ఎక్కువగా వచన కవిత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. కొందరైతే పద్యం మీద నోరు పారేసుకుంటున్నారు కూడా. ఈ నేపథ్యంలో పద్యాన్ని ప్రాణప్రదంగా భావించే సహస్రావధాని కడిమిళ్ల వరప్రసాద్‌... ‘పద్యమ్మునెవడురా! పాతి పెట్టెదనంచు/ నున్మాదియై ప్రేలుచున్నవాడు...’ అంటూ, పద్యాన్ని పెకలించడం ఎవరి తరం? ఒకవేళ పెకలించినా పాతిపెట్టాలనుకోవడం వెర్రితనం. నిన్న మొన్ననే కన్ను తెరిచిన మనకు అలా అనడం వదరుతనమే అన్నారు. ఈ మాటలు పద్యప్రియులకి కొండంత ధైర్యాన్నిస్తాయి. 
      పద్యం రాసేవాళ్లు, పద్యాన్ని ప్రేమించేవాళ్లు, ద్వేషించేవాళ్లు, పద్యం పనైపోయిందన్నవాళ్లూ, పద్యాన్ని పాతిపెట్టండన్న వాళ్లూ... అందరూ ఈ లోకం నుంచి వెళ్లిపోయేవారే. కానీ గువ్వలచెన్న శతక కర్త అన్నట్లు కాలపరీక్షకు తట్టుకుని చెడకుండా నిలిచేది పద్యమొక్కటే.


వెనక్కి ...

మీ అభిప్రాయం