విలువల్లోనూ ‘అమ్మభాషే’!

  • 41 Views
  • 0Likes
  • Like
  • Article Share

అమ్మభాషతో మన భావాలను సులభంగా వ్యక్తీకరించవచ్చు, సంస్కృతిని కాపాడుకోవచ్చనీ నిరూపించే పరిశోధనలకి కొదవలేదు. కానీ మాతృభాషకీ మంచితనానికీ సంబంధం ఉందని నిరూపించిన ఓ పరిశోధన మాత్రం కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది.
      మీరు ఓ వంతెన మీద నిల్చుని ఉన్నారు. ఇంతలో ఆ వంతెన మీద ఉన్న పట్టాలపైకి ఓ రైలు దూసుకురావడాన్ని గమనించారు. ఆ రైలు అలాగే ముందుకు వస్తే, పట్టాలమీదే నడుస్తూ వెళ్తున్న ఓ అయిదుగురిని గుద్దేసే ప్రమాదం ఉంది. ఆ అయిదుగురినీ కాపాడేందుకు మీ దగ్గర ఒక్కటే మార్గం ఉంది. మీ పక్కనే ఉన్న ఓ లావాటి వ్యక్తిని... దూసుకువస్తున్న రైలు ముందుకు తోసేస్తే, ఆ రైలు అక్కడితో ఆగిపోతుంది... అయిదుగురి ప్రాణాలు నిలుస్తాయి. అయిదు ప్రాణాలను కాపాడేందుకు, ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమా వద్దా అనేది నైతికంగా సందిగ్ధంలో పడేసే సమస్యే!
సందిగ్ధానికి భాష తోడైతే
ఈ సమస్యను ఎవరికన్నా తన మాతృభాషలో వివరిస్తే ఒకలా, పరాయి భాషలో చెబితే మరోలా స్పందించే అవకాశం ఉందా? స్పెయిన్‌ పరిశోధకుడు ఆల్బెర్ట్‌ కోస్టాకు ఇదే సందేహం వచ్చింది. దాంతో 317 మంది విద్యార్థుల మీద ఓ పరిశోధన చేశారు. అమెరికా, కొరియా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌కు చెందిన ఈ విద్యార్థుల ముందు రైలు పట్టాల సందిగ్ధాన్ని ఉంచారు. వాళ్లలో కొంతమందికి వాళ్ల మాతృభాషల్లోనూ, మరికొంతమందికి వాళ్లకు తెలిసిన పరాయిభాషలోనూ దాన్ని వివరించారు. మీరైతే ఆ లావాటి మనిషిని తోసేస్తారా అని అడిగారు. పరాయి భాషలో అడిగినప్పుడు అతన్ని పట్టాల మీదకు తోసేస్తాం అని చెప్పిన వారి సంఖ్య 65 శాతం కన్నా ఎక్కువ ఉందట!
సమస్య సులువైనప్పుడు
భాషకీ నైతికతకీ మధ్య సంబంధాన్ని మరింతగా ధ్రువపరుచుకునేందుకు ఇదే పరిశోధకులు మరో పరీక్ష చేశారు. ‘రైలు వస్తున్న పట్టాల మీద ఓ అయిదుగురు నడుచుకుంటూ వెళ్తున్నారు. మీ పక్కనే ఉన్న మీటని నొక్కితే, రైలు వేరే పట్టాల మీదకి వెళ్లిపోతుంది. కానీ అవతలి పట్టాల మీద ఉన్న ఓ మనిషి ప్రాణం పోతుంది’ ఇదీ సమస్య! అయిదుగురి ప్రాణాల కోసం ఒక ప్రాణం బలి అనే సమస్య ఇందులోనూ ఉంది. కాకపోతే దానికోసం ఎన్నుకున్న విధానం కొంత సహజంగా, దౌర్జన్యరహితంగా తోస్తుంది. అందుకే ఈ సమస్యను ఏ భాషలో విద్యార్థుల ముందు ఉంచినా, నిర్ణయంలో పెద్దగా తేడా కనపడలేదు.
ఇవీ కారణాలు!
భాషనిబట్టి నిర్ణయాలు ఎందుకు మారిపోయాయి? అన్న ప్రశ్నకి కచ్చితమైన కారణాలు వివరిస్తున్నారు పరిశోధకులు. పరాయి భాషలో సమస్యని వింటున్నప్పుడు మెదడు యాంత్రికంగా నిర్ణయాలను తీసుకుంటుందట. ‘నాది కాదు’ అన్న భావనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందట. చిన్నప్పుడు మనకి అమ్మభాషలోనే విలువలన్నీ పరిచయం అవుతాయి. అందుకని నైతికతకి సంబంధించిన సమస్యలన్నీ ఎదుర్కొన్నప్పుడు తెలియకుండానే ఆ జ్ఞాపకాలు కూడా మనల్ని ప్రభావితం చేస్తాయట. ఈ పరిశోధనతో అమ్మభాషలోని ‘విలువలు’ మరోసారి రుజువయ్యాయి!


అదే శబ్దం... అదే అర్థం
మానవ మెదడు త్వరగా, స్పష్టంగా గ్రహించేందుకు ఏ శబ్దాలైతే దోహద పడతాయో వాటికి అనుగుణంగానే భాషలన్నీ రూపొందాయన్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా చాలా భాషల్లోని శబ్దాల మధ్య కూడా అనుకోని సారూప్యం ఒకటి ఉందట!
నాసిక అనగా నోస్‌
అమెరికాలోని కార్నెల్స్‌ కాగ్నిటివ్‌ న్యూరోసైన్స్‌ ల్యాబ్‌ భాషకి సంబంధించి  వివిధ పరిశోధనలు చేస్తుంటుంది. వీటిలో భాగంగా ఏమాత్రం సంబంధం లేని రెండు భాషల్లోని పదాల మధ్య సారూప్యతని గమనించాలనుకున్నారు అక్కడి పరిశోధకులు. దీనికోసం 3,700 భాషల్లోని 40- 100 మౌలిక పదాలను పరిశీలించారు. శరీరభాగాలు, సర్వనామాలు, కుటుంబ సంబంధాలు, ప్రకృతి... వంటి అనేక అంశాలకు చెందిన పదాలు ఒకేతీరులో ఉండటం గమనించారు. ‘నోస్‌’ లాంటి కొన్ని పదాలు చాలా భాషల్లో ఒకే రీతిలో కనిపించాయి. సంస్కృతంలో ‘నాసిక’, ఆఫ్రికాన్స్‌లో ‘నూజ్‌’... ఇలా! మరికొన్ని పదాల్లోనేమో ఒకే రకమైన శబ్దాలు వినిపించాయి. ఉదాహరణకు నాలుక అనే అర్థాన్ని సూచించే పదాలలో ‘ల’ లేదా ‘ఉ’ అనే శబ్దం తరచూ ధ్వనించింది. అలాగే గుండ్రని అన్న అర్థాన్ని సూచించేటప్పుడు ‘ర’ అనే శబ్దం ఎక్కువగా వినిపించింది.
కారణం ఉంది!
పిల్లలు భాషని నేర్చుకునే దశలో ‘ప,బ,ద,మ,త,న’ వంటి శబ్దాలను చేస్తూ ఉంటారనీ.. అందుకనే మౌలికమైన పదాలన్నీ వీటిని అనుసరించి ఉంటాయన్నది ఓ వాదన. ఉదాహరణకు ‘అమ్మ’ను సూచించేందుకు దాదాపు అన్ని భాషల్లోనూ ఒకే రకమైన పదాలను గమనించవచ్చు. మన ఉచ్ఛారణ ఆధారంగా ఒక వస్తువుని వర్ణించే ప్రయత్నం చేస్తామని ఈ మధ్యనే కొన్ని పరిశోధనలు వెలుగులోకి తెచ్చాయి. భారతీయ పరిశోధకుడు ఎస్‌.రామచంద్రన్‌ ‘బౌబా కికీ’ పరిశీలన ఇందుకో ఉదాహరణ. 
      అటు అమెరికా విద్యార్థులకీ, ఇటు తమిళులకీ రెండు ఆకారాలను చూపించారు రామచంద్రన్‌. వీటిలో నక్షత్రంలా పదునైన కోణాలతో ఉండే ఆకారం ఒకటైతే, గుండ్రని అంచులతో ఉండేది మరొకటి. వీటిలో ఒకదానికి ‘బౌబా’, మరోదానికి ‘కికీ’ అనీ పేరు పెట్టమన్నారు. ఆశ్చర్యకరంగా 95 శాతం కంటే ఎక్కువ మంది గుండ్రటి అంచులు ఉన్న ఆకారానికి ‘బౌబా’ అనీ, నక్షత్రాకారానికి ‘కికీ’ అని నామకరణం చేశారు. ‘బౌబా’ అన్న పదాన్ని పలికేటప్పుడు పెదాలను గుండ్రంగా చుట్టాల్సి ఉంటుందనీ, ‘కికీ’ అన్న పదాన్ని పలికేటప్పుడు నాలుక కోసుగా నొక్కి పెట్టాల్సి ఉంటుందనీ... ఇలా చేయడం ద్వారా ఆ ఆకారాన్ని తెలియకుండానే మనం అనుకరిస్తామనీ పరిశోధకులు తేల్చారు. అందుకే వాటికి అనుగుణమైన పదాలను ఎన్నుకుంటామని అభిప్రాయపడ్డారు.


భాషంటే జ్ఞాపకాల పుట్ట
భాషకీ, జ్ఞాపకాలకీ మధ్య ఉండే సంబంధానికి దోహదపడే అంశాలు ఏంటి? చెప్పాలనుకున్న విషయాన్ని బట్టి మెదడు పనితీరులో మార్పు ఉంటుందా? అన్న అంశాలమీద స్పష్టత లేదు. ఇన్నాళ్లకి ఓ పరిశోధనతో ఈ అంశాల మీద కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి.
ఖాళీలను పూరించండి..
ఓ వ్యక్తిని ఏదన్నా ప్రశ్నించినప్పుడు, అతని మెదడులో ఎలాంటి మార్పులు జరుగుతాయి? అన్న విషయం మీద కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. ఇందుకోసం వాళ్లు ఓ పన్నెండు మంది మెదళ్లలోకి కొన్ని ఎలక్ట్రోడ్లను చొప్పించారు. ఆ తర్వాత వాళ్లని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు చాలా సులభమైన జవాబులు ఉన్నప్పుడు, మెదడు మధ్యలో ఉండే హిప్పోక్యాంపస్‌ పనితీరులో మార్పులు వచ్చినట్లు గమనించారు. ఉదాహరణకు ‘అతను ........తో నేలని ఊడ్చాడు’ అన్నప్పుడు ఈ హిప్పోక్యాంపస్‌ ఉత్తేజం పొందుతోందట. అంటే మెదడులోని ఇతర భాగాల్లో ఉన్న జవాబుని హిప్పోక్యాంపస్‌ వెలికి తెస్తోందన్న మాట!
ఉపయోగం ఏంటంటే
ఇంతవరకూ భాషకు సమస్త వ్యవహారాలనూ మెదడులోని కార్టెక్స్‌ మాత్రమే చూసుకుంటుందన్న నమ్మకంలో శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ ఇప్పుడు మనిషి ఒక భాషని వినేటప్పుడు, ఆ భాషలో మాట్లాడేటప్పుడు, మెదడులోని వివిధ భాగాల మధ్య సమన్వయం జరుగుతోందని తేలిపోయింది. ‘అతను .......తో నేలని ‘ఊడ్చాడు’ అన్నప్పుడు ‘నేల’, ఊడ్వటం’ అనే పదాలకు సంబంధించిన జ్ఞాపకాలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ జ్ఞాపకాలలో ‘చీపురు’ అన్న పదం రెండింటికీ అన్వయించడంతో, దాన్నే జవాబుగా మెదడు నిర్ధరించింది. ఈ జవాబుని హిప్పోక్యాంపస్‌ ఉత్సాహంగా కార్టెక్స్‌కి అందించింది.
మన మెదడులో భాష నమోదయ్యే తీరు, అది వెలికి వచ్చే వ్యవస్థల గురించి మరిన్ని పరిశోధనలు చేసేందుకు ఈ పరిశీలనలు ఉపయోగపడతాయి. మెదడులోని కొన్ని భాగాలు దెబ్బతిన్నప్పుడు, భాష విషయంలో రోగులెందుకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారన్న ప్రశ్నకి కూడా జవాబు లభించినట్లయ్యింది. అన్నింటికీ మించి భాష అనేది కేవలం భావప్రసార సాధనం మాత్రమే కాదనీ, జ్ఞాపకాల సమాహారం అని తేలిపోయింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం