ఆ రైతు శ్రీకృష్ణుడు! ఈ వ్యాపారి విశ్వామిత్రుడు!!

  • 550 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పి.న‌ర్సిమ్ములు

  • ప‌లేప‌ల్లి, వికారాబాదు జిల్లా
  • 8008573274
పి.న‌ర్సిమ్ములు

జి.నారాయణ... వికారాబాదు జిల్లా పరిగి నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి గ్రామవాసి. తనకున్న కొద్దిపాటి భూమిని సాగు చేస్తుంటారు. ఓ రోజు డబ్బు అవసరమైంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. తెలిసిన వాళ్లను అడిగి చూశారు. అందరిదీ అదే పరిస్థితి. ఈ అవసరం గడిచేదెలా అనుకుంటూ ఆ సాయంత్రం ఇంట్లో దీర్ఘాలోచనలో మునిగిపోయారు. ఆయన ఆవేదన గమనించిన భార్య తనకున్న కాస్తోకూస్తో బంగారాన్ని తెచ్చి భర్త ముందుంచి, కుదవబెట్టమంది. ఆ క్షణం ఆమె ముఖం మీద చిరునవ్వు తప్ప ఎలాంటి విచారమూ లేదు. 
ఇంతకీ నారాయణకు డబ్బు అవసరమైంది ఏ విత్తనాల కోసమో, ఎరువుల కోసమో కాదు.  తాము ఉచితంగా ప్రదర్శించబోయే నాటకం కోసం! అవును.. తాను ప్రాణప్రదంగా భావించే నాటకం కోసమే!! పరిగి నియోజకవర్గంలో ఇలాంటి నారాయణలు ఎందరో! రైతులు నాగేశ్వర్‌, హనుమయ్య, మల్లయ్య, శ్రీనివాస్‌, సాయన్న, నర్సింహులు, ప్రింటింగ్‌ప్రెస్‌ నిర్వాహకుడు సంజీవన్‌గౌడ్‌, చిన్న వ్యాపారి పాండు యాదవ్‌, ఆర్టీసీ ఉద్యోగి వెంకటేశం... ఇలా ఎందరో కళకోసం సర్వస్వం అర్పించడానికి సిద్ధంగా ఉంటారు. వృత్తులు ఏవైనా కళాసేవే వీరి ప్రవృత్తి. వీరి సంకల్పానికి సంస్థాగత రూపమే- శ్రీ వీరాంజనేయ నాట్య కళా మండలి.  
      రెండున్నర దశాబ్దాల కిందటి వరకు నాటకాలు, హరికథలు, బుర్రకథలు, యక్షగానాలు, భజనలు ప్రజలకు ప్రధాన వినోద, విజ్ఞాన సాధనాలుగా ఉండేవి. అదే సమయంలో మనదైన సంస్కృతికి ప్రతిబింబాలుగానూ నిలిచేవి. ముఖ్యంగా నాటక ప్రదర్శనలు ఉంటే చాలు, ఆబాలగోపాలమంతా ఉత్సాహంతో రంగస్థలం ముందుకు ఉరకలెత్తేది. వాళ్లని అలరించడానికి నటులు కూడా తగిన కసరత్తు చేసుకుని వచ్చేవారు. సామాన్యుల నుంచి పండితుల వరకూ అందరూ చెవికోసుకునే పౌరాణిక నాటకాల్లోనైతే పద్యాలను రాగయుక్తంగా ఆలపించడానికి కళాకారులు తీవ్రంగా శ్రమించేవారు. ఒకే కళాకారుడు వేర్వేరు నాటకాల్లో వేర్వేరు పాత్రలు పోషించి అందరితో శభాష్‌ అనిపించుకునేవారు. మరికొందరైతే కొన్ని పాత్రలకు ప్రత్యేకంగా నిలిచేవారు. ఈ ప్రశంసలు, గుర్తింపును చూసి చిన్నతనం నుంచే ఎందరో ఔత్సాహికులు నాటక రంగం మీద మక్కువ పెంచుకునేవారు. పరిగి నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ఔత్సాహికులు కూడా ఇలాగే నాటకాలపై ఆసక్తి పెంచుకున్నారు. చిన్నతనం నుంచి వీధి నాటకాలు, పద్యనాటకాల్లో శిక్షణ తీసుకున్నారు. ప్రదర్శనలివ్వడమూ ప్రారంభించారు. అయితే, సాంకేతికత అభివృద్ధి చెందుతున్నకొద్దీ నాటకాలకు ఆదరణ తగ్గడం మొదలైంది. అయినా సరే, మనదైన సంస్కృతి, కళలను పరిరక్షించుకోవాలనే తపనతో వారు తమ గ్రామాల్లోనే ప్రదర్శనలు ఇస్తూ వచ్చేవారు.  
      చెట్టుకొకరు.. పుట్టకొకరుగా ఉండిపోయిన ఈ కళాకారులందరిలోనూ ఒకే ఆలోచన! ఇలా ఒక్కళ్లం ఎంతకాలం? ఇలాగైతే ఎన్ని రోజులీ నాటకాన్ని బతికించగలం? అప్పుడే ‘ఎపుడో అపుడు ఎవరో ఒకరు నడవరా ముందుకు..’ అన్నట్టు బసవేశ్వర్‌, నాగేశ్వర్‌, అనంతరాములు, పొగాకు నారాయణ, సంజీవన్‌గౌడ్‌, వెంకటేష్‌లు చేయిచేయి కలిపారు. 1998లో పరిగిలో ‘శ్రీవీరాంజనేయ నాట్య కళా మండలి’ని స్థాపించారు. అప్పట్లో ఇందులో పదిహేను మందే సభ్యులు. ఇప్పుడా సంఖ్య రెట్టింపు అయ్యింది. మాణిక్యం, పాండుయాదవ్‌, సంజీవులు, బి.వెంకటేశం, జి.హన్మయ్య తదితర సీనియర్‌ కళాకారులతో సహా నియోజకవర్గం పరిధిలోని మిట్టకోడూర్‌, కళ్లాపూర్‌, దోమ, లక్ష్మీదేవిపల్లి, కుల్కచర్ల, పరిగి, రాఘవపూర్‌, మోత్కూర్‌, ఐనాపూర్‌, సుల్తాన్‌పూర్‌, రంగంపల్లి, ఊటుపల్లి గ్రామాలకు చెందినవారు ఈ మండలిలో సభ్యులుగా ఉన్నారు. వీరిలో కొంతమంది రైతులు, మరికొందరు ఉద్యోగులు, ఇంకొందరు చిన్న వ్యాపారులు. వీళ్లందరూ కలిసి ఏడాదికి 10- 15 ప్రదర్శనలు ఇస్తుంటారు. సత్యహరిశ్చంద్ర, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ రాయబారం, బాలనాగమ్మ, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, భక్త పుండరీక తదితర నాటకాలను ప్రదర్శిస్తుంటారు. ఆలయాల వార్షికోత్సవాలు, ఇతర సందర్భాల్లో తామే చొరవ తీసుకుని ప్రదర్శనలకు రంగం సిద్ధం చేసుకుంటారు. 
నాణ్యతకు పెద్దపీట!
నాటక రంగంలో ఇరవై ఏళ్ల అనుభవం ఉన్నా సరే, శ్రీ వీరాంజనేయ నాట్య కళామండలి సభ్యులు సాధనకు చాలా ప్రాధాన్యమిస్తారు. ఏడాదికి ఒక్కొక్కరు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు గురువులకు చెల్లించి మరీ, తమ నైపుణ్యాలకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ ఉంటారు. తమ పనులకు ఆటంకం కలగకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ పొందుతూ ఉంటారు. జగన్నాథరాజ్‌, చింతలదిండి హన్మంత్‌రెడ్డి, వేణుగోపాలాచారి తదితర గురువులు ఎప్పటికప్పుడు వీళ్లని తీర్చిదిద్దుతూ ఉంటారు. పద్యాన్ని లయబద్ధంగా పాడటం నుంచి అభినయంలో సూక్ష్మస్థాయి అంశాలను పలికించడం వరకూ అన్ని విషయాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.  
      గతంలో స్థానికంగా అందుబాటులో ఉన్న వారితో అలంకరణ (మేకప్‌) చేేయించుకునేవారు. ఇప్పుడు కర్నూలు నుంచి అలంకరణ నిపుణులను పిలిపిస్తున్నారు. దుస్తులు, అలంకరణకు సంబంధించి సురభి నాటక సమాజం వారి సలహాలూ తీసుకుంటూ ఉంటారు. 
      కళ మీద ఆసక్తి చాలా ఉండవచ్చు కానీ, చేతిలో డబ్బు లేకపోతే ఏ కళాకారుడూ ఏమీ చేయలేడు! చేయూతనిచ్చేవారు లేకపోతే, కళలేవీ మనుగడ సాగించలేవు. మరి శ్రీ వీరాంజనేయ నాట్య కళామండలి ప్రదర్శనలకు డబ్బు ఎక్కడి నుంచి సమకూరుతోంది? అంటే... సభ్యుల సమష్టి సంకల్పంలోంచే! ఒక్కో నాటక ప్రదర్శనకూ వీళ్లకి రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. ఈ మొత్తాన్ని మండలి సభ్యులే చందాలు వేసుకుని సమకూర్చుకుంటూ ఉంటారు. అరుదుగా దాతలూ సాయం చేస్తూంటారు. 
కుటుంబాలే పెద్ద అండ
మండలి సభ్యుల్లో చాలామందిది అరకొర ఆదాయమే. మరి వాళ్లు నాటకాలకు సొమ్మును వెచ్చిస్తుంటే,  ఇంట్లో వాళ్లు ఏమీ అనరా? ఎందుకనరూ! కళారంగానికి ఆ మాత్రం సేవ చేయడం మన అదృష్టం అని వెన్ను తడతారు! ఆ ప్రోత్సాహమే ఈ కళాకారులకు కొండంత బలం.
పైన చెప్పుకున్నట్టు.. నారాయణ భార్యలానే మిగిలినవారూ అవసరమైన సందర్భాల్లో మండలికి చేదోడువాదోడుగా ఉంటారు. నాటకానికి పెద్దలు ఇస్తున్న ఈ ప్రాధాన్యాన్ని చూసి, యువతరమూ ఈ రంగంలోకి వస్తోంది. నారాయణ కుమారుడు గోపాల్‌తో సహా ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులు దాదాపు పదిహేను మంది ప్రస్తుతం శ్రీ వీరాంజనేయ నాట్య కళామండలిలో శిక్షణ తీసుకుంటున్నారు.
      నాటక ప్రదర్శనలిచ్చే సమయంలో చుట్టుపక్కల గ్రామాల్లో పెద్దఎత్తున ప్రచారం చేయడం మండలి సభ్యుల మరో ప్రత్యేకత. కరపత్రాల దగ్గర నుంచి వివిధ మాధ్యమాల్లో తాము వేయబోయే నాటకం గురించి ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. వీళ్ల ఉత్సాహానికి ఊపిరిలూదుతూ.. సమీప గ్రామాల నుంచే కాదు, హైదరాబాదు, మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌, వికారాబాదు, కొడంగల్‌, కోస్గీ, నారాయణపేట, మద్దూరు తదితర పెద్ద పట్టణాల నుంచీ ప్రేక్షకులు వస్తారు. మాజీ ఉపసభాపతి, తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, సాహితీవేత్తలు కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొద్దుటూరి ఎల్లారెడ్డి, భాస్కరయోగి వంటివారెందరో వీలు చిక్కినప్పుడల్లా ప్రదర్శనలను తిలకించడానికి వస్తూంటారు. ఇక స్థానిక తహశీల్దార్లు, ఎస్‌ఐలతో పాటు చాలామంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వైద్యులు, కళాశాలల విద్యార్థులూ ఈ నాటకాలకు అభిమానులే.  
పాలకులు పట్టించుకుంటే...
స్థానిక ప్రదర్శనలే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ నాటకాల పోటీలున్నా ఈ కళామండలి సభ్యులు పాల్గొంటారు. 2002లో అన్నవరంలో జరిగిన నంది నాటకోత్సవ పోటీల్లో ప్రశంసాపత్రం అందుకున్నారు. 2003 గోదావరి పుష్కరాల సందర్భంగా అన్నవరంలోనే శ్రీరామాంజనేయ యుద్ధాన్ని కళ్లకుకట్టారు. 2015 గోదావరి పుష్కరాలప్పుడు బాసర జ్ఞానసరస్వతి సన్నిధిలో ‘సత్యహరిశ్చంద్ర’ను ప్రదర్శించారు. కిందటేడాది కృష్ణా పుష్కరాల వేళ మహబూబ్‌నగరు జిల్లా బీచుపల్లి రంగాపూర్‌ఘాట్‌లోనూ ఇదే నాటక ప్రదర్శన ఇచ్చారు. హైదరాబాదు త్యాగరాయగానసభతో పాటు వరంగల్లు, శ్రీశైలం తదితర ప్రాంతాల్లోనూ మండలి సభ్యులు వివిధ నాటకాలను రక్తికట్టించారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రతి నెలా జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ‘నెలనెలా వెన్నెల’ కార్యక్రమంలోనూ వీళ్లు ప్రదర్శనలు ఇస్తున్నారు. 
      నాటకమే శ్వాసగా బతుకుతున్న పరిగి కళాకారులకు ప్రభుత్వ సాయం  అంతంతమాత్రమే. వీళ్లలో ముగ్గురికి మాత్రమే పింఛను (నెలకు రూ.1500) అందుతోంది. వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రదర్శనలు నిర్వహిస్తున్న మండలి సభ్యులకు తగినంతగా ఆర్థిక సాయం అందితే.. కళారంగాన్ని మరింతగా దేదీప్యమానం చేయగలరనడంలో సందేహం లేదు. వాస్తవానికి సినిమాలు, టీవీలు ఊపందుకున్నాక నాటకాలకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు అద్భుత నాటకాలతో తెలుగు నేలను శోభాయమానం చేసిన ఎన్నో సమాజాలు ప్రస్తుతం కనుమరుగయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మండలి సభ్యులు రెండున్నర దశాబ్దాలుగా కళాసేవ చేయడం, యువతరాన్ని కూడా ఆ దిశగా నడిపించడం స్ఫూర్తిదాయకం. రంగస్థల కళారంగం కొత్త చిగుళ్లు వేయాలంటే ఇలాంటి వారికి చేయూతనందించడంతోనే సాధ్యం.


వెనక్కి ...

మీ అభిప్రాయం