వి‘ముక్త’వర్ణాలు... అమ్మల అంతరంగాలు!

  • 226 Views
  • 0Likes
  • Like
  • Article Share

    క్రాంతి

  • హైదరాబాదు.

తెలంగాణ పోరాటంలో నిజాం గూండాలను తరిమికొట్టి తన పంటచేలో గింజలు కాపాడుకున్న చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా చిత్రకారిణులంతా ఒకే వేదిక మీద అనుభవాలను కలబోసుకున్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చారిత్రాత్మక హైదరాబాదు ‘పైగా టూంబ్స్‌’ వేదికగా నిర్వహించిన మూడు రోజుల కళల వేడుక కనువిందు చేసింది. 
నగరంలో
జరిగే ఆర్ట్‌ క్యాంపుల్లో చిత్రకారుల ప్రదర్శనలకు లెక్కే లేదు. కానీ, పురుషాధిక్యతను ప్రశ్నించే ఈ సృజనాత్మక ప్రదర్శనల్లోనూ పురుషాధిక్యతే! చిత్రకళపట్ల ఆసక్తి, అభిరుచి ఉన్న అమ్మాయిలు ఇష్టమైన చదువులు చదివే అవకాశం, ఇష్టమైన వ్యాపకానికి సమయం కేటాయించే అవకాశం లేకపోవడం ఈ ‘చిత్ర’మైన వెనుకబాటుకు కారణాలు. తెలంగాణ మహిళలను సామాజిక, కళా రంగాల్లోకి నడిపించాలనే ఆలోచనతో అడుగులేస్తున్న ‘ముక్త’ సంస్థ కాన్వాస్‌ మీద అద్భుతాలు సృజించే చిత్రకారిణులను మనకు పరిచయం చేసింది. తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో సెప్టెంబరు 8, 9, 10 తేదీల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం.. ఇప్పటికే ఆదరణ, గుర్తింపు ఉన్న చిత్రకారిణులను భుజం తట్టి ప్రోత్సహించింది. కుంచెను వదిలి కుటుంబానికే పరిమితమైన చిత్రకారిణులను వెన్నుతట్టి ముందుకు నడిపించింది. 
      ఆది మానవుడు రాతికుడ్యం మీద అందమైన సృజన చేశాడు. కళ విశ్రాంత సమయాన్ని సూచిస్తుంది. వేటగాళ్ల ఊహలు రాతి చిత్రాల్లో కనిపించినట్లే ఆ తర్వాత కళల్లో ఎన్నో ఆలోచనలు. నాగరికతలోకి పయనించిన మనిషి శ్రమ విభజన తర్వాత వేటలో, ఉత్పత్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గిపోయింది. పిల్లల పెంపకం, వంట, ఇంటి పనులకు వాళ్లు పరిమితమయ్యారు. ఉత్పత్తిలో మనిషి విజయం సాధించిన తర్వాత లభించిన విశ్రాంతితో కళలు ఆవిర్భవించాయి. పరిణామం చెందాయి. ఈ కళల్లో పురుషులదే ఆధిక్యం. మహిళలు పురుషుల కంటే ఎక్కువగా శ్రమ చేయాల్సి ఉండడం లేదా పురుషాధ్యికత... కారణమేదైనా స్త్రీలు కళల్లో వెనుకబడ్డారు. శ్రమ నుంచి, జీవిత అనుభవాల నుంచి పుట్టే కథలు, కళలు అధిక శ్రమ చేసే మహిళలకు దూరం కావడం చరిత్రలో పురుషాధిక్యతను సూచిస్తుంది. ఆ చరిత్ర ఈనాటికీ పునరావృతమవుతూనే ఉంది.
      స్త్రీలు శారీరక శ్రమ చేయలేరనే పురుషాధిక్య సమాజం, వాళ్ల శ్రమను గుర్తించదు. ఉద్యోగ విధుల కంటే ఇంటిపని కష్టమైనది. అయినా తామే శ్రమతో కుటుంబాలను పోషిస్తున్నామని భర్తలు భావిస్తుంటారు. పెరిగిపోతున్న ఖర్చులు స్త్రీలూ పనిచేయాల్సిన అవసరాన్ని కల్పిస్తే, మారుతున్న సమాజం స్త్రీలకూ అవకాశం కల్పించింది. ఈ మార్పు స్త్రీల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తుందనుకుంటే, ఫలితం వేరుగా ఉంది. విద్యాధికులైన స్త్రీలమీదే గృహ హింస పెరగడం, ఉద్యోగ మహిళల్లోనే విడాకుల సమస్య అధికమవ్వడం గమనార్హం. స్త్రీలు సంప్రదాయాల్లోంచి ఆధునికతలోకి అడుగుపెడుతుంటే, పురుషాధిక్యత కూడా పాత పద్ధతులను విడనాడి, రూపాంతరం చెందుతూ వర్ధిల్లుతోంది. ఎక్కడ పురుషాధిక్యత కాలం వెళ్లదీస్తుందో అక్కడ స్త్రీల సృజనకు కాలం చెల్లినట్లే. కళా రంగాల్లో రాణించాలంటే పురుషాధిక్యతను అధిగమించాల్సిందే. చిత్రకళ అభ్యాసం కోసం పోరాడిన అమ్మాయిలెందరో! పోరాడినా పెళ్లాడి ఓడిన కళాకారిణులెందరో! పోరాడి గెలవాలని పట్టుదలతో నిలిచినా కుటుంబ ప్రోత్సాహం లేక ఆర్థిక ఒడిదుడుకుల ప్రయాణంలో ఆగిపోయిన వాళ్లెందరో. వాళ్లందరినీ చేరదీసిన అమ్మ ఒడి ‘ముక్త’.
      ‘ముక్త’ ఆధ్వర్యంలో జరిగిన ఈ చిత్రకారిణుల కార్యశాల ముచ్చటగా ముగిసింది. వివిధ రంగాల్లోని మహిళలను ఆహ్వానించి, అభినందించిందీ కార్యక్రమం. తెలంగాణ కళారూపమైన శారద కథా గానం, కోలాటం, డప్పు దరువుల మోతతో పైగా టూంబ్స్‌ మూడురోజులపాటు సాంస్కృతిక సంబురాలతో కళకళలాడింది. ఈ చిత్రకళా కార్యశాలకు సమన్వయకర్తగా వ్యవహరించిన రమాదేవి నకాశీ చిత్రకళ వారసత్వం నుంచి వచ్చిన కళాకారిణి. అన్నం మాని అమ్మానాన్నలను ఒప్పించి, ఆధునిక చిత్రకళారీతులను అధ్యయనం చేసిన వ్యక్తి. ఈ కార్యశాలలో పాల్గొన్న మహిళల్లో అలాంటి జీవితానుభవాలున్న వారే అధికం. 
      కుంచెకు విరామం చెప్పి ముక్త ప్రోత్సాహంతో మళ్లీ కుంచెపట్టారు రమాదేవి. మూడేళ్ల నుంచి సాధన కొనసాగిస్తున్నారు. ఆటుపోట్లను దాటుకుంటూ రమాదేవి వచ్చినట్లే మరెందరో సామాజిక కట్టుబాట్లను దాటుకుంటూ, ఆధునికత దూరం చేసిన కళాభిరుచికి దగ్గరై ఈ కార్యశాలలో పాల్గొన్నారు. వాళ్ల చిత్రాలు ఆ ఆటుపోట్లనే చెబుతున్నాయి. ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకుని కుటుంబానికే పరిమితమైన ఓ కళాకారిణి ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ కాన్వాస్‌ మీద రంగులద్దుతూ కన్నీరు కార్చింది. దూరమైన బిడ్డ దగ్గరైనప్పుడు ఆలింగనం చేసుకున్న తన్మయత్వం ఆ తల్లిది. చాలా ఏళ్ల తర్వాత కుంచె పట్టిన ఆ కళాకారిణి ఇక ఈ రంగులతోనే నా ప్రయాణమంటూ ప్రకటించడం కళాకారులందరినీ ఆలోచింపజేసింది. జాతులు వేరైనా, రంగూ రూపూ వేరైనా, మన జీవితాలు ఒక్కటేనంటూ వాటర్‌ కలర్స్‌ కాన్వాస్‌ మీద కలంకారీ దుస్తుల్లో ముస్తాబు చేసిన ముగ్గురు ఆడవాళ్లను కాన్వాస్‌పై నిలిపారు విమల మారోజు.  ఈ చిత్రం మధ్యలో ఉండే మహిళ కురులు కనిపించవు. జుట్టు ఉండటం ఆశ. లేకపోవడం నిరాశ. తీవ్ర దుఃఖం, బాధలోనే దాన్ని వదిలేస్తారు. లేదు, ఉంది... లేదు... ఈ ఆశానిరాశల జీవితాన్ని చెబుతుందీ చిత్రం. 
      సృజనలో పురుషులకు తీసిపోనిరీతిలో అందమైన చిత్రాలెన్నింటినో ఆవిష్కరించిందీ కార్యశాల. ఇందులో చిత్రకారిణులు సృజించిన ప్రతి చిత్రమూ స్త్రీల అంతరంగాన్ని, ఆకాంక్షలను ఆవిష్కరించింది. గడపదాటి బయటికిపోయిన ఆడపిల్లను వెంటాడే వేయి కళ్లను మూడు దారుల కూడలిలో నిలేసింది కరుణ కాన్వాస్‌. సంప్రదాయ హైదరాబాద్‌ జీవితంలోని సాంస్కృతిక శోభ మసకబారిపోతున్న తీరుకు నిదర్శనంగా నిలుస్తుంది అఫ్జా తమకనాత్‌ చిత్రం. రంగులు ఎలిసి, నెర్రలిచ్చిన గోడలాగే గుండె పగిలి ఏడ్చే పేద కళాకారుల జీవితాలు మసకబారుతున్నాయంటూ పకీర్ల కన్నీళ్లను రంగుల్లోకి ఎత్తిపోశారామె
      ఆడవాళ్ల పండగ బతుకమ్మ. ఈ పండగ విశేషాలన్నింటినీ చెప్పే ఒకే చిత్రం గీశారు ఎస్వీ ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థిని శేషువాణి. పండగనాటి ముస్తాబుతో పాటు నేలమీద గౌరిని పూజిస్తుంటే, నింగిలోని ఆమె సవతి నవ్వుతూ వెన్నెల కురిపించడం ఆకట్టుకుంటుంది. తన పుట్టినిల్లు పాతబస్తీలోని సాంస్కృతిక వైవిధ్యాన్నీ చెబుతుందీ చిత్రం. నకాశీ చిత్రకళలో భాగస్వాములయ్యే మహిళలు ఈ కార్యశాలలోనూ పాల్గొని తెలంగాణలోని చేర్యాల వారసత్వాన్ని నిలిపారు. 
      తెలంగాణ పోరాటాలకు పురిటిగడ్డయితే ఆ పోరాటాల్లో స్త్రీలది త్యాగాల చరిత్ర. మహా యోధురాలు ఆరుట్ల కమలాదేవి వెంట నడిచి సాయుధ పోరాటంలో తెగువజూపిన స్త్రీలెందరో. వారి త్యాగాలను మళ్లీ గుర్తుచేస్తోంది ‘ఆఫ్‌ 1948’. పద్మారెడ్డి ఈ గీసిన చిత్రం తెలంగాణ పోరాటంలో ఆయుధాలు ధరించిన స్త్రీల తెగువకు దర్పణం పడుతుంది. ఆధునికతలో ఆడవాళ్లు కోల్పోతున్న ఆత్మీయతను అందంగా ఆవిష్కరించారు అంజనీరెడ్డి. కాలం మారింది అనగానే.. ఆనాడు ఉపయోగించిన వస్తువులు ఎలా కనుమరుగయ్యాయో? ఉపకరణాలు ఎలా రూపాంతరం చెందాయో మాట్లాడుకుంటాం. లోకంలో జరిగే ముచ్చట్లు లేకున్నా చుట్టుపక్కల జరిగే విషయాలకే పరిమితమయ్యే అమ్మలక్కల ముచ్చట్లలో మాత్రం కట్టు, బొట్టుతోపాటు ఇంటి అలంకరణ, వంటలు, బంధుమిత్రుల బాగోగులే ఉంటాయి. ఇలాంటి సంభాషణలన్నీ ఇప్పుడు ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. సాంకేతికత విప్లవంతో చేతికి అందివచ్చిన ఫోన్లు ముచ్చట్లకు మాధ్యమాలయ్యాయి. ఆధునిక జీవితంలోని ఆత్మీయమైన స్పర్శకు దూరం చేశాయి. సమష్టిగా బతికే రోజుల్లో ఆడవాళ్ల ఆత్మీయతలను ఆమె గుర్తు చేశారు. 
      ఇది చిత్రకారిణుల కలయికే కాదు. విభిన్న కళారంగాల్లో మహిళల కూడిక. తమ కళా జీవితంలోని అనుభవాల వలపోత, కళా ప్రదర్శనల కలబోత ఈ కార్యక్రమం. ‘ముక్త’ దిద్దిన ఈ ఒరవడి ఇలాగే కొనసాగాలి. దీని స్ఫూర్తి మిగిలిన కళా రంగాల్లోనూ ప్రతిఫలించాలి. అప్పుడే మహిళా లోకపు సృజనాత్మక సామర్థ్యం మరింతగా వెలుగులోకి వస్తుంది. రూపం ఏదైనా, తెలుగు కళ పూర్తిస్థాయిలో శోభాయమానం అవ్వాలంటే ఇలాంటి ప్రయత్నాలు తప్పనిసరి.


వెనక్కి ...

మీ అభిప్రాయం