గోంగూర పచ్చడి చేస్తా

  • 308 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘అమ్మను, అమ్మభాషనూ వేరుగా చూడలేను’... పుట్టినగడ్డకు దశాబ్దాల కిందటే దూరమైన ఓ వ్యక్తి అన్న మాట ఇది. అందులోనూ అమెరికా లాంటి అగ్రరాజ్యంలో చట్టసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఓ తెలుగింటి ఆడపడుచు నోటి వెంట వచ్చిన మాట ఇది. ఆవిడే కాట్రగడ్డ అరుణామిల్లర్‌. అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్ర ‘హౌస్‌ ఆఫ్‌ డెలిగేట్స్‌’ సభ్యురాలు. అక్కడి మౌంట్‌గోమరీ కౌంటీ 15వ డిస్ట్రిక్ట్‌ డెలిగేట్‌ (మన శాసనసభ్యుల మాదిరి). ఈ నెల్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్‌ తరఫున ఆవిడ ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మన భాషాసంస్కృతుల గురించి ‘తెలుగు వెలుగు’తో అరుణ పంచుకున్న విశేషాలు... ఆమె మాటల్లోనే... 
నేను
ఇప్పటికీ స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతున్నానంటే కారణం నాన్నగారే. మా స్వస్థలం కృష్ణాజిల్లా వెంట్రప్రగడ. నాన్నగారు కాట్రగడ్డ వెంకట రామారావు. అమ్మ వెనిగెళ్ల హేమలతది విజయవాడ. నాన్నగారు 1960లో అమెరికా వచ్చారు. ఎమ్మెస్‌ చేశాక, న్యూయార్క్‌ ఐబీఎంలో ఉద్యోగం రావడంతో ఇక్కడే స్థిరపడ్డారు. నేను ఏడేళ్ల వయసులో అమెరికా వచ్చా. అక్క, అన్నయ్య ఉన్నారు. మాకు మన సంప్రదాయాల గురించి నాన్నగారే వివరించేవారు. ఇంట్లో తెలుగే మాట్లాడాలి. ఆంగ్లం మాట్లాడితే సహించేవారు కారు. అమ్మ అయితే సంప్రదాయ వంటలే చేసేది. అలా నేనూ నేర్చుకున్నా. అమ్మ సాంబారు, వంకాయ పచ్చడి బ్రహ్మాండంగా చేస్తుంది. ఇప్పటికీ ఇంట్లో మన వంటలే ఎక్కువ. నేను గోంగూర పచ్చడి బాగా చేస్తాను. మావారికీ ఈ రుచులు నచ్చుతాయి.  
      నాన్న చనిపోయాక అమ్మ నాతోనే ఉంటోంది. ఇద్దరం చక్కగా తెలుగులోనే మాట్లాడుకుంటాం. మా బంధువులు అమెరికా, హైదరాబాదు, కృష్ణాజిల్లాల్లో ఉన్నారు. మా అక్క, అన్నయ్యలు తెలుగువాళ్లనే పెళ్లి చేసుకున్నారు. మరి మన వాళ్లతో సత్సంబంధాలు ఉండాలంటే మన భాషతోనే సాధ్యం కదా. పైగా బంధువుల ఇళ్లలో శుభకార్యాలు, పండగలకూ పిలుస్తుంటారు. వాటికి వెళ్తుంటా. వీటితో ఇన్నేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నా మన భాషకు దూరమయ్యానన్న భావన కలగలేదు. అయినా, అమ్మభాషని మర్చిపోవడం అంటే అమ్మని మర్చిపోవడమే! అమ్మ, అమ్మభాషలని వేరుగా చూడలేను.  అందుకే, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు ఎవరైనా పరిచయమైతే, మన భాషలోనే మాట్లాడుతుంటా. తెలుగు సంఘాల సభలూ, సమావేశాల్లోనూ తెలుగులోనే ఉపన్యసిస్తా. ఆటా, తానా... స్థానిక తెలుగు సంఘాలు ఎవరు పిలిచినా, ఎంత దూరమైనా వెళ్తుంటా. ఎలాంటి సాయం కావాలన్నా ‘నేనున్నాను’ అని వాళ్లకి చెబుతుంటా.  
      చెప్పలేదు కదూ... మావారు డేవిడ్‌ మిల్లర్‌. మా పెళ్లికి నాన్న మొదట్లో ఒప్పుకోలేదు. తర్వాత డేవిడ్‌ గుణగణాలను చూసి అంగీకరించారు. మాకు ముగ్గురు అమ్మాయిలు... మీనా, చోలే, షాషా. వీళ్లకి తెలుగు వచ్చు. మా అమ్మ నేర్పిస్తుంటుంది. డేవిడ్‌కు అయితే తెలుగు మాట్లాడటం రాదు. కానీ, అమ్మా నేనూ మాట్లాడుకుంటుంటే అర్థం చేసుకుంటారు. స్పందిస్తుంటారు కూడా. 
      పండగలు వచ్చాయంటే మా ఇంట్లో ఒకటే సందడి. దీపావళి నాడైతే ఇల్లంతా దీపాల వెలుగులతో కళకళలాడుతుంది. పండగల ప్రాశస్త్యం గురించి పిల్లలకు అమ్మ చెబుతుంటుంది. నాకు వినాయక చవితి చాలా ఇష్టం. గణపతి నా ఇష్ట దైవం. ఆయన ఆకారంలో ఎన్నో అర్థాలూ... పరమార్థాలూ! పిల్లల చదువులంటారా.. అమెరికన్‌ విద్యావిధానం బాగుంటుంది. ఇక్కడ ఆంగ్లం ఒక్కటే కాదు, ఇతర భాషలను అభ్యసించే అవకాశమూ ఉంటుంది. స్పానిష్, ఫ్రెంచ్, మాండరిన్‌.. ఇలా అన్న మాట. అయితే,  మన భారతీయ భాషలను బోధించే పాఠశాలల సంఖ్య తక్కువ. దీనికి కారణం... భారతదేశ ‘వ్యాపార భాష’ ఇంగ్లీషే అన్నది ఇక్కడి వాళ్ల నమ్మకం. భారత్‌తో అనుసంధానమవ్వడానికి మిగిలిన దేశాల్లో మాదిరిగా భాషాపరమైన ఇబ్బందులు ఎదురుకావన్నది వాళ్ల విశ్వాసం. మాండరిన్, ఫ్రెంచ్‌ల మాదిరిగా మన భాషలనూ అన్ని రంగాల్లో వాడగలిగితే ఇలాంటి అభిప్రాయాలు మారవచ్చు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ గెలుస్తారని ఘంటా పథంగా చెప్పగలను. ఆమె ఆ ఘనత సాధిస్తే మహిళాలోకానికే అదో గొప్ప విజయం అవుతుంది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం