కూచిపూడి... నర్తన పద్మకేళి!

  • 19 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ధనలక్ష్మి తోటకూర

సంగీతనాటక అకాడమీ పురస్కారం అందుకోవాలని నృత్య, సంగీత, నాటక కళాకారులందరూ కోరుకుంటారు. దాన్ని సాధించిన నాడు ‘పద్మ’ పురస్కారాన్ని తీసుకున్నంతగా ఆనందపడతారు. కళాకారుల జీవితకాల కృషికి గుర్తింపుగా లభించే ఈ గౌరవాన్ని ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల తరఫున కూచిపూడి నాట్యమయూరి డాక్టర్‌ పద్మజారెడ్డి అందుకున్నారు. సామాజిక సమస్యలే ఇతివృత్తాలుగా నృత్యరూపకాలకు ప్రాణంపోయడం పద్మజారెడ్డి ప్రత్యేకత. 
వేదిక మీద
ఓ నృత్యరూపక ప్రదర్శన జరుగుతోంది... పేరు ‘ప్రకృతి’! లీనమైపోయి నర్తిస్తున్నారు పద్మజారెడ్డి. అనుకోకుండా అటువచ్చి, అక్కడే ఆగిపోయి ఆ ప్రదర్శనను చూశారు లండన్‌ మేయర్‌. ఆయనకి భాష తెలియదు. భావం అంతకంటే తెలియదు. అయినా సరే, ఆమె అభినయానికి పులకించి పోయారు. వెంటనే రాయబార కార్యాలయానికి ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు. పద్మజారెడ్డి జీవితంలో ఇలాంటి అనుభవాలూ, అనుభూతులూ కోకొల్లలు. తెలుగుజాతి కీర్తిపతాకం కూచిపూడిని దేశవిదేశాల్లో రెపరెపలాడించిన కళామతల్లి ముద్దుబిడ్డలెందరో. ఆ కళాస్రష్టల్లో ముందు వరుసలో నిల్చేవారిలో పద్మజారెడ్డి ఒకరు. 
      కృష్ణాజిల్లాలోని పామర్రు ఆవిడ స్వస్థలం. తల్లిదండ్రులు వెంకటేశ్వరరెడ్డి, స్వరాజ్యలక్ష్మి. ఇద్దరూ హైదరాబాదులో వైద్యులుగా పనిచేస్తుండటంతో పామర్రులో అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే పెరిగారు. సిరిమువ్వల రవళికి శాశ్వత చిరునామా కూచిపూడి గ్రామం ఇక్కడికి చాలా దగ్గర. పైగా ఆ రోజుల్లో ఆడపిల్లలకి ఏదో ఒక కళ తెలిసి ఉండటం మంచిది అనుకునేవాళ్లు పెద్దలు. పద్మజ నృత్యం మీద ఆసక్తి చూపించడంతో, కూచిపూడి నుంచి గురువులను ఆహ్వానించి శిక్షణ ఏర్పాటు చేయించారు తాతగారు.  రాత్రిపూట మనవరాలికి బోలెడు కబుర్లు చెప్పేవారు. పద్యాలూ, పాటలు పాడి వినిపించేవారు. అందుకే పద్మజారెడ్డి మీద ఆయన ప్రభావం చాలా ఎక్కువ. అన్నట్టు, అరంగేట్రం అంటూ ఆవిడ ప్రత్యేకంగా ఏదీ చేయలేదు. చిన్నతనం నుంచే వేదిక మీద నృత్యం చేయడం అలవాటైంది. అలా అలా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. 
      ఎనిమిదేళ్లప్పుడు పద్మజారెడ్డి అమ్మానాన్నల దగ్గరికి వచ్చేశారు. తనూ వైద్యురాలైతే చూడాలన్నది వాళ్ల కల. కానీ, పద్మజారెడ్డి మనసంతా కూచిపూడి మీదే ఉండటంతో వాళ్లు మనసు మార్చుకున్నారు. ఆ సమయంలోనే ప్రముఖ నృత్య కళాకారిణి  శోభానాయుడు సొంత అకాడమీని మొదలుపెట్టారు. అందులో మొదటి విద్యార్థిని పద్మజనే. శోభానాయుణ్నే అమ్మగా భావిస్తూ ఎక్కువ సమయం అకాడమీలోనే గడిపేవారు. నిరంతరం సాధనే! పరీక్షలప్పుడు మాత్రం బడికి వెళ్లి రాసి వచ్చేవారు. ఎప్పుడైనా సాంస్కృతిక కార్యక్రమాలుంటే పాఠశాల యాజమాన్యం పద్మజను పిలిపించేది. ప్రదర్శనలు ఏర్పాటు చేయించేది. కళాశాలకు వచ్చాకా అంతే! అధ్యాపకులందరూ ఆమెని అభిమానించేవారు. 
ఆ పోలిక చాలు!
గురువు శోభానాయుడితో పద్మజ అనుబంధం విడదీయలేనిది. పెళ్లయ్యేవరకూ ఆమె దగ్గరే ఉంటూ సాధన చేసేవారు. సాధారణంగా ‘శ్రీకృష్ణపారిజాతం’లో పద్మజారెడ్డి ఎప్పుడూ రుక్మిణి పాత్ర పోషించేవారు. ఒకసారి అనుకోకుండా సత్యభామ పాత్ర చేయాల్సి వచ్చింది. ‘సత్యభామ పాత్ర చేసి ఒప్పించగలిగిన వాళ్లు తప్పకుండా గొప్ప కళాకారిణి అవుతారు’ అని శోభానాయుడు చెప్పారట. ఆ తర్వాత ఆ పాత్రలో పద్మజ మెప్పించారు. ఈ నలభై ఏళ్లలో దేశ విదేశాల్లో మూడు వేల ప్రదర్శనలు ఇచ్చి గురువుగారి మాటను నిజం చేశారు. 
      విఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం అంటే పద్మజకు చాలా ఇష్టం. ఆవిడ హావభావాలు కట్టిపడేసేవి. అందుకే ఎప్పుడు, ఎక్కడ ఆమె ప్రదర్శన ఉందని తెలిసినా అక్కడికి వెళ్లిపోయేవారు. పద్మా సుబ్రహ్మణ్యం మాదిరిగానే పద్మజ కూడా అదే నిబద్ధతతో అందంగా నృత్య ప్రదర్శన ఇస్తారు. అందుకే కాబోలు చూసినవాళ్లలో చాలామంది ‘నువ్వు నాట్యం చేస్తుంటే శోభానాయుడుగారే వచ్చి నర్తించినట్టు ఉంది’ అని చెబుతుంటారట. గురువుగారితో తనను పోల్చడమే తన జీవితంలో అతి గొప్ప ప్రశంస అంటారు పద్మజారెడ్డి. ఓసారి కెనడాలో ప్రదర్శన ముగిసిన తర్వాత ఓ పెద్దావిడ తన చేతి గాజును తీసి పద్మజకు తొడిగారు. ‘నీకు ఇంతకంటే నేనేమీ ఇవ్వలేకపోతున్నా నమ్మా’ అంటూ ఆ ప్రవాస భారతీయురాలు ఆనందభాష్పాలు రాల్చారు. ఈ సంఘటన జరిగి పదేళ్లు దాటింది. ఆ జ్ఞాపకాన్ని మనసులో భద్రపరచుకున్నట్లే, ఆ గాజునూ పదిలంగా దాచుకున్నారు పద్మజ. 
స్ఫూర్తిసందేశం
సామాజిక అంశాల ఆధారంగా నృత్యరూపకాలను సృజించడం పెద్ద సవాలు. దాన్ని పద్మజారెడ్డి చేసి చూపించారు. ‘‘నాకు ఆడపిల్లలంటే ఇష్టం. అందుకే భ్రూణహత్యల మీద ఓ రూపకానికి నృత్యరీతులు సమకూర్చాను. సీత, ద్రౌపదిలతో ప్రారంభించి... మగవాళ్ల వల్ల వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులను కళ్లకు కడుతూనే స్త్రీల గొప్పతనం వివరించాను. రాణి రుద్రమ, మదర్‌ థెరిస్సా, ఇందిరాగాంధీ... ఇంకా కొందరు క్రీడాకారిణుల్ని చూపించి... ఆడపిల్లలని వీళ్లను కడుపులోనే చంపేస్తే మనకు ఇంత గొప్ప వ్యక్తులు లభించేవారా ఆలోచించండి అంటూ ముగింపు పలికాను. ఈ రూపకానికి ప్రపంచవ్యాప్తంగా అద్భుత స్పందన వచ్చింది’’ అని చెప్పే పద్మజారెడ్డి, ఎయిడ్స్‌ బాధితులకోసం విరాళాలు సేకరిస్తుంటారు. ఈ క్రమంలోనే వారి బాధలను దగ్గరగా చూశారు. ఆ అనుభవాల్లోంచి ఓ నృత్యరూపకాన్ని సృజించారు. పంచభూతాలూ, పువ్వులూ.. ఇలా రకరకాల నేపథ్యాలతో నృత్యనాటికలను ప్రదర్శించారామె.
      డిగ్రీ చదువుతున్నప్పుడే పద్మజారెడ్డికి పెళ్లయింది. భర్త శ్రీనివాసరెడ్డి హైదరాబాదులోని ‘సెంట్రల్‌కోర్ట్‌’ హోటల్‌ యజమాని.  ఈ దంపతులకు ఓ బాబు. పేరు ప్రణవ్‌. తన పేరు మీదే 2007లో నృత్య శిక్షణా సంస్థ ‘ప్రణవ్‌ అకాడమీ’ ప్రారంభించారు పద్మజారెడ్డి. ప్రస్తుతం అందులో అయిదువందల మంది విద్యార్థులున్నారు. ఇక్కడ కూచిపూడి నేర్పించడంతోపాటు థియరీ తరగతులూ ఉంటాయి. ‘‘ఒకప్పుడు తెలుగులో చెబితే విద్యార్థులకు అర్థమయ్యేది. ఇప్పుడు  పిల్లలకు తెలుగు చదవడం, రాయడం రావట్లేదు. వాళ్లని కళల వైపు ప్రోత్సహించాలంటే అర్థమయ్యేలా చెప్పడం అవసరం. అందుకే ఆంగ్లంలోనూ బోధిస్తున్నా’’మని బాధగా చెబుతారావిడ.  
      ‘‘హడావుడి జీవితాల్లో చదువులే ఓ భారంగా మారుతున్నాయి. తల్లిదండ్రులు చదువుకే మొదటి ప్రాధాన్యమిస్తున్నారు. పిల్లలను గదుల్లో గంటలు గంటలు బంధించి చదివిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్నారులు నృత్యం లాంటి ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టడం కష్టమే. ఏదో ఖాళీ సమయంలో నృత్యం నేర్చుకుందామని కాకుండా పూర్తి అంకితభావంతో నేర్చుకుంటేనే మంచి కళాకారులు కాగలరు. నిజానికి ఇంటికి ఒకరు చొప్పున ఏదో ఒక కళ నేర్చుకోవాలి. కళల వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేసిన ఫలితం దక్కుతుంది’’ అనే పద్మజారెడ్డి మాటలు అక్షరసత్యాలు. మన సాంస్కృతిక ఔన్నత్యం ఏంటో నవతరానికి తెలియాలంటే, తెలుగునాట కళలకు పూర్వవైభవం దక్కాలనే ఆవిడ ఆశలో తెలుగు వెలుగుల కళా చైతన్యం ప్రతిఫలిస్తుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం