జన సంక్షేమమే దేశానికి రక్ష

  • 64 Views
  • 3Likes
  • Like
  • Article Share

    సాహితీ స్రవంతి

వర్షాలు లేక పంటలు పండనప్పుడు ప్రజలు పన్నులెలా కడతారు! దుర్బరమైన కరవు పరిస్థితులప్పుడు కూడా పన్నుల కోసం వేదించడం నైతిక ధర్మం కాదు. తుమ్మెద పూవు నుంచి మకరందం సేకరించినట్టుగా ప్రజల నుంచి పన్ను వసులు చేయాలే గానీ దౌర్జన్యం చేయడం న్యాయసమ్మతం కాదంటారు కృష్టదేవరాయలు ఆముక్తమాల్యద కావ్యంలో. సకాలంలో పంటలు పండితే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. పన్నులు కూడా సమకూరి రాజ్యం సంపదలతో తులతూగుతుంది. కష్టకాలమే సంకటంగా మారి... బతకడానికి కనాకష్టమైనప్పుడు అధిక పన్నులు బతుకుకి మరింత బరువే కదా!
రాజ్యంలో
ఏం జరుగుతుందో.. ప్రజల ఇక్కట్లు ఏంటో, ఎలాంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం రాజు చేయాల్సిన పనుల్లో ముఖ్యమైంది. అప్పుడే దేశకాల పరిస్థితులపై రాజుకి అవగాహన ఏర్పడుతుంది. కేవలం అధికారుల మాటలతోనే సంతృప్తి పడే రాజుకి ప్రజల కష్టం తెలీదు. కష్టకాలమొచ్చినప్పుడు ప్రజల కష్టానికి స్పందించని అధికారులు ప్రతిచోటా ఉంటారు. యుద్ధభూమిలో శవాలకోసం కాచుకుని ఉండే గుంటనక్కల వంటి అవకాశవాదులున్నంత కాలం రాజుకి సుఖం ఉండదు. సరికదా దారిద్య్రం నీడలా వెంటాడుతుందంటాడు మురురాయరగండడు. జనుల కష్టాలకు స్పందించే వాళ్లే రాజు అభిష్టాన్ని నెరవేర్చగలుగుతారు. 
ప్రజనవసి చన్నబిలువ, కప్పసుల గొలుచు
నమ్మి, యిండ్లింధనంబుల కాయె, ననెడి
కలని నక్కైన యధికారిగల నృపతికి
ఏడు దీవుల గొన్న సమృద్ధి లేదు

      పన్నులు కట్టలేక, శిక్షలు అనుభవించలేక, వేరే దిక్కులేక ఇంటినీ, పాడినీ వదలి కట్టుబట్టలతో బతుకుదెరువు వెతుక్కుంటూ వలసపోయేవాళ్లని వెనక్కి పిలవాలి. వారిని ఓదార్చాలి. పోతే పోయారులే అని వాళ్ల ఇళ్లను కొల్లగొట్టి, పూరిళ్లను తగలబెట్టి, వారి భూములను కబ్జా చేసేవాళ్లు రాజు వెన్నంటి ఉన్నంత కాలం రాజుకి మనశ్శాంతి ఉంటుందా!  ఏడు దీవుల ఆవలికి పోయిన కూడా సుఖముండదు అంటున్న రాయలు తన ఆస్థాన అధికారుల ప్రవర్తపై విసిగెత్తి ఇలా అన్నారేమో!
మ్రుచ్చిమి పొరపిన వారల
గ్రచ్చఱ దండించి ధనముగల వారికి రా
జిచ్చుట తగునీ డేనిన్‌
వచ్చునతని పాపమెల్ల వసుధేశునకున్
‌ అంటాడు కేతన విజ్ఞానేశ్వరము అనే ధర్మశాస్త్రంలో. దొంగతనం చేసినవాణ్ని రాజు శీఘ్రమే శిక్షించి ఎవరి ధనం వారికి ఇప్పించాలి. అది తగినది. అలా ఇవ్వకపోతే ఆ పాపమంతా రాజుకు సంక్రమిస్తుందని అప్పటి రాజనీతి. కాని ఇప్పుడు పన్నులు వసూలు చేసే బాధ్యత రాజోద్యోగులే నిర్వర్తిస్తారు. పన్నులు కట్టనివాళ్లని వేదిస్తారు. కట్టడానికి దమ్మిడీ కూడా లేనివాళ్లని ముక్కుపిండీ మరీ వసూలు చేస్తారు. వసూలు చేసిన శిస్తు అంతా ప్రభుత్వ ఖజానాకే చేరుతుందా! ఎవరెవరి చేతులు మారుతుందో రాజుకు తెలీదు. అదీ దొంగతనమే. అలాంటి ఇంటి దొంగలను ఒక కంట కనిపెట్టుకుని ఉండమంటున్నాడు ఆంధ్రభోజుడు. ఒక జనపదం నుంచి మరొక జనపదానికి సరుకులు తీసుకునిపోతే బయలుదేరిన చోట, తీసుకుపోయిన చోట కూడా పన్నులు వసూలు చేయమన్నాడు కౌటిల్యుడు అర్థశాస్త్రంలో. ఆనాడు సీతభూములంటే ప్రత్యేకంగా ప్రభుత్వానికి పన్నుల ద్వారా అధిక రాబడిని తెచ్చిపెట్టేవే అని చరిత్ర చెబుతోంది.
పండితుడైనా పామరుడైనా పన్ను విషయంలో ఒకటే న్యాయం వర్తిస్తుందని ఈ శ్రీనాథుని చాటువు తేటతెల్లం చేస్తుంది.
ఆంధ్రనైషధకర్త యంఘ్రియుగ్మంబున
    దగిలియుండెనుకదా నిగళయుగము
వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత
    వియ్యమందెను గదా వెదురుగొడియ
సార్వభౌముని భుజాస్తంభ మెక్కెను గదా
    నగరవాకిటనుండు నల్లగుండు
కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు
బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లు చెల్లింతు టంకంబు లేడునూర్లు

      అవసానంలో ఆదరించే రాజులు లేక కృష్ణాజిల్లా లో బొడ్డుపల్లె దగ్గర కొంత భూమిని గుత్తకు తీసుకున్నాడు. కృష్ణకు వరద వచ్చి పంట కొట్టుకుపోయింది. శిస్తు కట్టనందుకు శిక్ష తప్పలేదు. నగర వాకిట నున్న నల్లగుండును మోశాడు. ఆనాడు పన్ను చెల్లించని వారిని ఏలినవారు పెట్టే కష్టాలు ఎలా ఉంటాయో చెబుతుందీ పద్యం. పంటలు పాడై పన్నులు కట్టలేక ప్రజలు పడే ఇక్కట్లను ఆనాడు ప్రభువులు పట్టించుకునేవారు కాదు. కష్టకాలంలో చేయూత నిచ్చి ఆదుకోవాల్సిన అధికార గణం ఎలాంటి కష్టాలు పెట్టేదో సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో ప్రస్తావిస్తారు
      ‘‘హైదరాబాదు సీమలోని పల్లెల్లో పటేల్, పట్వారీలు ఇవే పద్ధతులు అవలంబిస్తుండేవారు. ఊరి ముందర చావిడీ ఉండేది. అందులో చేతులకు కట్టే బేడీలు వేసే కోడాలు ఉండేవి. రెండు చేతులను మణికట్టు వరకూ రెండు కట్టెల రంధ్రములందుంచి ఒక వెదురు చీలను (గొడిగను) వాటికి బిగించేవారు’’
అవి కాకుండా... ఎండలో నిలబెట్టి బండలెత్తించడం. ఊరి ముందట ఉండే గుండును భుజంపై పెట్టి మోయించడం, ఒక పెద్ద మొద్దుకు గొలుసును కట్టి దానిని కాళ్లకు తగిలించడం అనే దారుణమైన హింసలు ఉండేవి. 
      దీర్ఘనికాయం అనే బౌద్ధగ్రంథంలో ఒక పురోహితుడు రాజుతో ఇలా చెబుతాడు. ‘‘ప్రజలు సంపన్నులు కావాలన్నా, దొంగతనాలూ దోపిడీలూ జరగకుండా ఉండాలన్నా యజ్ఞాలు చేస్తే ఉపయోగం లేదని, రైతులకు విత్తనాలు, వర్తకులకు పెట్టుబడి, పనిచేయగలవారందరికీ పనీ కల్పిస్తే ఎవరి  పనుల్లో వాళ్లు నిమగ్నులై ఉంటారనీ, తిరుగుబాట్లు అల్లర్లు ఉండవనీ అందరూ పన్నులు చెల్లిస్తారనీ, ఖజానా నిండుగా ఉంటుందని అంటాడు. మరో కథలో.. నేరాలను, దొంగతనాలను అరికట్టడానికి బలప్రయోగం ఎంత నిరర్థకమో దానధర్మాలు కూడా అంతే నిరర్థకమని, నేరాలకి మూలం పేదరికం అంటాడు బుద్ధుడు.
      పన్నుల భారంతో ప్రజలను హింసించకుండా ప్రజా సంక్షేమానికీ, శ్రేయస్సుకూ ప్రాధాన్యమిస్తూ, సలక్షణనిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగితేనే యువతలో నవకల్పనలకు వీలు కుదురుతుంది. కొత్త జీవశక్తితో పనిచేయగలుగుతారు. అధిక పన్నుల పేరిట చేసే దురాగతాలు, దుశ్చేష్టలు పనిమంతుల్లో సృజనకాంక్షను బలహీనపరుస్తాయి. పనిలో వేగం తగ్గిపోతుంది. ఉత్పత్తి మందగిస్తుంది. ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారగణం తీసుకునే మేలైన చర్యలే ప్రభుత్వ ఖజానాని నింపగలవు గానీ బలవంతపు పన్ను వసూళ్లు కావు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం