తెలుగెళ్లీపోతోందిరా...

  • 1070 Views
  • 6Likes
  • Like
  • Article Share

    డి.కస్తూరి రంగనాథ్‌

  • షాద్‌నగర్‌, రంగారెడ్డి జిల్లా
  • 8008573907
డి.కస్తూరి రంగనాథ్‌

ఆకాశవాణి.. వివిధభారతి.. మీరుకోరిన పాటలు.. ఇప్పుడు భక్తతుకారాం చిత్రం నుంచి ఈ పాట...
      ‘పడవెళ్లీపోతోందిరా.. ఓ మానవుడా.. దరిచేరే దారేదిరా.. నీ జీవితమూ కెరటాలా పాలాయెరా....’
      డాబామీద పడుకొని చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఆకాశంలో చందమామ, నక్షత్రాల మధ్య దోబూచులను చూస్తూ మన తెలుగు పాటను మనసారా వింటూంటే.. అందమైన ఆ భావాలను చెవులారా నెమరువేసుకుంటుంటే ఆ ఆనందమే వేరు.. పేద, మధ్యతరగతి కుటుంబాలలో ఈ అనుభూతులు లేనివారంటూ ఎవరూ లేరు. అలా పాటలు వింటూ పరవశించిన నా హృదయం  ఎక్కడికో వెళ్లిపోయింది.
      బహుశా అది 50వ దశకంలోకి వెళ్లినట్టుంది.. ఎందుకంటారా.. అదిగో.. మల్లీశ్వరి తన బావతో కలిసి వస్తుంది. అది నలుపుతెలుపు యుగమే కావచ్చు.. కానీ మల్లీశ్వరి తన బావతో బండిమీద వెళ్తూ, పక్కనున్న పంటపొలాలను చూస్తూ ‘పరుగులు తీయాలి.. గిత్తలు ఉరకలు వేయాలి’.. అని పాడుతుంటే వెండితెరపై పచ్చదనం పరుచుకున్నట్లు అనిపించేది. ‘హోరుగాలి.. కారుమబ్బులు ముసిరేలోగా ఊరును చేరాలి’.. అనగానే పంకా తిరగని తడకల ప్రదర్శనశాలల్లో సైతం పైరగాలి వీచినంత ఆనందం కలిగేది. ‘నల్లని మబ్బులు గుంపులు గుంపులు.. తెల్లని కొంగలు బారులు బారులు అవిగో.. అవిగో’.. అంటే చాలు అవన్నీ మన చుట్టూ ఉన్నట్టే అనిపించేది. ‘పచ్చనితోటలు.. విచ్చిన పువ్వులు.. కోయిల జంటలు.. తుమ్మెద గుంపులు’.. అని ఆలపిస్తుంటే వెండితెర ముందు పదిమంది మధ్యనున్నా ప్రకృతి రమణీయత మధ్య ఒంటరిగా ఉన్న భావన కలిగేది. అది ఆ కాలం మహిమో.. కృష్ణశాస్తి కలం మహిమో.. సాలూరి సంగీత మాధుర్యమో.. భానుమతి, ఘంటసాల గాన సౌందర్యమో తెలియదు కానీ విన్న ప్రతిసారీ అనిపిస్తుంది.. అలా వింటూ పరవశించి పోవాలని..
      తెలుగు సినిమా 30వ దశకంలో ప్రాణం పోసుకున్నా పాటల పూదోటలు సుగంధాలను వెదజల్లింది మాత్రం 50వ దశకంలోనే. ‘కలవరమాయే మదిలో నామదిలో.. కన్నులలోన కలలే ఆయె.. మనసే ప్రేమ మందిరమాయె’.. అంటూ పింగళి కలం ప్రేయసీప్రియుల హృదయభావాలను ఆవిష్కరించింది. ఆ దశాబ్దమంతా ‘ఎచటినుండి వీచెనో.. ఈ చల్లనిగాలి.. తీవెలపై ఊగుతూ.. పూవులపై తూగుతూ.. ప్రకృతినెల్ల హాయిగా’... అని ప్రతి ప్రేక్షకుడూ పాటకు ముగ్ధుడయ్యేలా చేసింది. ఇక ‘చెలియలేదు.. చెలిమిలేదు.. వెలుతురే లేదు’.. అని భగ్నప్రేమికుడి వేదనను వెలుగులోనికి తెచ్చిన సముద్రాల రాఘవాచార్య కలమే ‘చిగురాకులలో చిలకమ్మా.. చిన్నమాట వినరావమ్మా’.. అంటూ కన్నెపిల్లలను కవ్వించింది. వీళ్లు మాత్రమేనా.. ‘చల్లని వెన్నెలలో.. చక్కని కన్నె సమీపములో.. అందమె నాలో లీనమాయునే.. ఆనందమే నా గానమాయెనే’.. అని అనిశెట్టి సుబ్బారావు అక్షర వెలుగుల వెన్నెలలు పరిస్తే, ‘ఆకాశవీధిలో అందాల జాబిలి.. వయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే.. సయ్యాటలాడెనే..’ అంటూ శ్రీశ్రీ అక్షర నక్షత్రాలను సృష్టించి అందులో ప్రేయసీప్రియులను విహరింపజేశారు. 
      60వ దశకంలోకి వచ్చేసరికి వీరితో పాటు మరెందరో కవులు తెలుగుపాటకు తేనెరుచులు అద్దేందుకు వచ్చారు. ‘ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో.. ఈ బండల మాటున.. ఏ గుండెలు మ్రోగెనో’.. అంటూ రాయిని సైతం వర్ణించిన సినారె ‘పగలే వెన్నెల జగమే ఊయల.. కదిలే ఊహలకే కన్నులుంటే’.. అంటూ మగువలను ఊహలపల్లకిలో ఊరేగించారు. ‘కొండగాలి తిరిగింది..గుండె ఊసులాడింది.. గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది’.. అంటూ ప్రేక్షకుడిని ప్రకృతి ఒడిలో పవళింపజేసిన ఆరుద్ర ‘నీలిమేఘాలలో.. గాలికెరటాలలో’.. తేలియాడించారు. ‘నవ్వుల నదిలో.. పువ్వుల పడవలో’ ప్రయాణింపజేశారు. ‘నాకంటి పాపలో నిలిచిపోరా.. నీవెంట లోకాల గెలువనీరా’.. అని ప్రేయసి మనసు తెలిపిన దాశరథి, ‘ చెంగుచెంగునా గంతులు వేయండి.. ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా.. నోరులేని చువ్వాయిల్లారా’.. అంటూ మూగజీవాల గొప్పతనాన్ని వివరించిన కొసరాజు, ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే.. చెలికాడే సరసన ఉంటే.. చెట్టాపట్టగ చేతులు కట్టి చెట్టునీడకై పరుగెడుతుంటే.. చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి’.. అంటూ ప్రేమికులకు దిశానిర్దేశం చేసిన ఆత్రేయ.. ఇలా ఎందరో.. మరెందరో కవులు మరపురాని మధుర గీతాలను మనకు ఆస్తులుగా  ‘రాసిచ్చారు’.
      అయితే తెలుగుపాటల్లోకి ఆంగ్లపదాల వలస ప్రారంభమైంది కూడా 60వ దశకంలోనే. ‘పడమటి సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం.. ఒడిలో చెలి మోహనరాగం.. జీవితమే మధురానురాగం.. అందమె ఆనందం.. ఆనందమె జీవిత మకరందం’.. అని నిర్వచించిన సముద్రాల రామానుజాచార్య(జూనియర్‌) కలమే ‘కం కం కం .. కంగారు నీకేలనే’.. అంటూ ఆంగ్లపదాలను ఆహ్వానించింది. ‘నోనోనో.. నీజోరు తగ్గాలిగా’.. అంటూ తెలుగు పదాల భవితవ్యాన్ని నిర్దేశించింది. ‘హాటుహాటు గారి.. వెరీవెరీ సారీ.. స్వీటుస్వీటు బూరి.. వైవై హర్రీ’.. అంటూ ఆంగ్ల పదాలతో హాస్యం సృష్టించింది. ఇలాంటి పాటలతో ఆయన 60వ దశకాన్ని ఆహ్వానిస్తే ‘లవ్‌ లవ్‌ లవ్‌మి నెరజాణ.. యస్‌.డాళింగ్‌.. నౌనౌ కిస్‌మీ చినదానా.. విత్‌ప్లెజర్‌’.. అంటూ సినారె ఈ దశకానికి తనదైన శైలిలో ముగింపునిచ్చారు. అయితే ఇవి అక్కడక్కడా సరదాగా వాడటం వల్ల ప్రేక్షకులకు అంతో ఇంతో రుచించాయి. కాకపోతే ఆ తర్వాతే ఆంగ్లపదాల జోరువాన ఆరంభమైంది. 
      70వ దశకంలోకి వచ్చేసరికి ఆంగ్ల, హిందీ పదాలతో ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఒకవిధంగా చెప్పాలంటే తెలుగు సినీగీతాల్లో షడ్రుచులు చూపిన సంవత్సరంగా దీనిని చెప్పాలి. ఉషశ్రీ కలంతో ‘చిన్నారి పొన్నారి పువ్వు.. విరబూసి విరబూసి నవ్విందీ’... మల్లెమాల సిరాచుక్కలతో ‘మల్లి విరిసిందీ పరిమళపు జల్లులు కురిసిందీ’.. ఆత్రేయ అక్షరాలలో ‘తేటతేట తెలుగులా తెల్లవారి వెలుగులా’ కాంతులు నింపిందీ.. వేటూరి చేతుల మీదుగా ‘మావిచిగురు తినగానే కోయిల పలికిందీ.. కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగిందీ’.. ఈ దశాబ్దంలోనే.. ఈ సమయంలో కవుల కలాల నుంచి ఉద్భవించిన ‘సరిగమలు.. గలగలలు.. ప్రియుడే సంగీతంగా.. ప్రియురాలు చేసిన నాట్యాలు’ ఎన్నెన్నో. 
      ఇక ప్రయోగాల విషయానికి వస్తే ‘భలెభలే మగాడివోయ్‌.. బంగారు నాసామివోయ్‌’.. అంటూ కదిలిన ఆత్రేయ కలం ‘ఐ డోంట్‌ నో వాట్‌ యూ సే’.. అంటుంది.. ‘ఐ కాంట్‌ హెల్ప్‌ డాళింగ్‌ ఫాలింగ్‌ ఇన్‌ లవ్‌ విత్‌ యూ’.. అంటూ అరపాట ఆంగ్లంలోనే ఉంటుంది. అయితే ఈ చిత్రంలో కథానాయకుడు తమిళుడు కాబట్టి సందర్భరీత్యా వచ్చిన ఈ పాటకు ప్రేక్షకుల మద్దతు లభించింది. ఇక 1981లో వచ్చిన ఆకలిరాజ్యం చిత్రంలోనూ ‘తూహై రాజా.. మైహు రాణి’.. అంటూ పూర్తిస్థాయి హిందీలో కథానాయిక పాట పాడుతుంది. కథ ప్రకారం ఆమె ప్రదర్శన సాగేది దిల్లీలో కాబట్టి ఆ పాటకు జనం నీరాజనం అందించారు.
      అయితే 70వ దశకంలో అవసరం ఉన్నా, లేకున్నా పాటల్లో ఆంగ్లపదాల వాడకం పలు సందర్భాల్లో కొనసాగింది. 1972లో వచ్చిన కులగౌరవం చిత్రంలో ‘హలో హలో డాక్టర్‌.. టెల్‌మీ’.. పాట మొత్తం పల్సు, అవర్సు, యస్సు, డోసు, పేషంటు, బ్రీజూ, టెంపరేచరు వంటి పదాలతో సాగుతుంది. అంతకు ముందే 1970లో వచ్చిన తల్లాపెశ్లామా చిత్రంలో ‘తాగితే తప్పేముంది’.. పాటలోనూ అఫ్‌కోర్సు, దట్స్‌వై, సైలెన్సు, వంటి పలు ఆంగ్ల పదాలు కలిశాయి. 71లో వచ్చిన రంగేళిరాజాలో ‘డార్లింగ్‌ డార్లింగ్‌ కమాన్‌’.. పాటలో రొమాన్స్, డ్యూటీ, బ్యూటీ వంటి పదాలు వినిపిస్తాయి.
      `80వ దశకం వచ్చేసరికి ఈ జబ్బు మరింత ముదిరింది. తెలుగుపాటలోకి ఆంగ్లపదాలు వెల్లువలా వచ్చిచేరాయి. ‘చినుకులా రాలి.. నదులుగా సాగి.. వరదలైపోయి.. కడలిగా పొంగిన’.. వేటూరి కలమే ‘అది ఒకటో నంబరు బస్సు.. దీని వయ్యారం నైసు నైసు’.. అంటూ పరభాషా బండెెక్కింది. హాల్టు, మిస్సు, స్వీటు, కిస్సుమిస్సు, ఆల్‌రైట్, జాస్మిన్‌వైట్, హైటు, స్టార్టు, హోల్డాన్‌.. అంటూ పూర్తి ఆంగ్లపదాల సహకారంతో ప్రయాణించింది. ఇదే కలం నుంచి అదే దశాబ్దంలో ‘ఆనందో బ్రహ్మ.. గోవిందో హార్‌’.. అంటూ సాగే పాటలో ‘లైఫ్‌ బోరుగున్నదీ.. కొత్త టైపు కోరుతున్నదీ’.. అంటూ మొదలు పెట్టి యస్సు, కిస్సు, క్లోజప్పు వంటి పదాలతో ముగుస్తుంది. ‘ఆమని పాడవే హాయిగా.. మూగవైపోకు ఈ వేళ.. రాలేటి పూవులా రాగాలతో’.. అంటూ మంచు ముత్యాల వంటి పాటలు అందించిన ఈ సుందరరాముడు అదే ఏడాదిలో ఖజురహోలో కసిప్రేమ అంటూ కలాన్ని కదిలించి ‘కౌగిళ్లలో థ్యాంక్స్‌ చెప్పేయనా.. నా లిప్పుతో కిస్సు ఇచ్చేయనా’.. అని ఆంగ్లోపదేశం చేశాడు.
      ఈయన మాత్రమే కాదు.. మారిన నిర్మాత, దర్శకుల అభిరుచి మేరకంటూ ‘ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు.. సెలయేరు.. ననుగన్న నావాళ్లు.. నా కళ్ల లోగిళ్లు’.. అంటూ తెలుగు పాటపై సిరివెన్నెలలు కురిపించిన సీతారామశాస్త్రి వంటి కవులు కూడా ‘బోటనీ పాఠముంది.. మేటనీ ఆట ఉంది.. హిస్టరీ లెక్చరుంది.. మిస్టరీ పిక్చరుంది’.. అని రాయక తప్పలేదు. 
      90వ దశకంలోకి వచ్చేసరికి కొత్త కవులు సైతం ఆంగ్ల మార్గాన్ని అనుసరించి తమ మార్గం సుగమం చేసుకునేందుకు ప్రయత్నించారు. ‘ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ’.. అంటూ అచ్చతెలుగు పదాలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన భువనచంద్ర ‘పండు పండు పండు ఎర్రపండు.. ఆపిల్‌ దాని పేరు.. పడింది నాకు గేరు’.. అంటూ ఆంగ్లజోరుకు హారతి పట్టాడు. ‘జీఏఎన్‌జీ గ్యాంగ్‌ గ్యాంగ్‌’.. అంటూ హోరెత్తించాడు. ‘దోస్త్‌ మేరా దోస్త్‌.. తూహై మేరీ జాన్‌’ అని స్నేహానికి హిందీలో భాష్యం చెప్పాడు. ఇదే బాటలో ‘ఫ్రంటు సైడు ఆ రూపు.. బ్యాకు సైడు ఈ షేపు.. మెంటలెక్కి పోయిందే నాకు’.. అంటూ జొన్నవిత్తుల, ‘మేడిన్‌ ఆంధ్రా స్టూడెంట్‌ అంటే అర్థం వివరిస్తా’.. అంటూ చంద్రబోస్‌.. ఇలా ఎవరికి వారు ఈ మార్గానికి తమ వంతు సిరాచుక్కలు చిందించారు. 
      ఇక 2వేల సంవత్సరంలోకి అడుగు పెట్టేసరికి హోరెత్తించే సంగీత రణగొణుల మధ్య అర్థంకాని ఆంగ్లపదాలతో అయోమయం సృష్టించిన పాటలెన్నో.. వీటిని అర్థం చేసుకున్న తెలుగు ప్రేక్షకులు ఎందరో తెలియదు కానీ.. అక్కున చేర్చుకున్న కవులు మాత్రం ఎక్కువే.
      బద్రి సినిమాలో ‘ఐయాం యాన్‌ ఇండియన్‌’, ఖుషీలో ‘ఏ మేరా జహా’.. లాంటి పాటలు పూర్తి ఆంగ్ల, హిందీ పదాలతో సాగుతాయి. 2000-2010 మధ్య పదేళ్లలో వచ్చిన చిత్రాలలో ఆర్య2లో- మిస్టర్‌ పెర్‌ఫెక్ట్, మై లవ్‌ ఈజ్‌ గాన్‌.. ఇలా ఎన్నో పాటలు ఆంగ్లపదాలనే నమ్ముకున్నాయి. ఆ పదేళ్లలో వచ్చిన చిత్రాల్లో నువ్వేనువ్వే, నాని, పోకిరి, కిక్, విక్రమార్కుడు, ఛత్రపతి, బిల్లా లాంటి పలు చిత్రాలలో ఈ తరహా పాటలే వినిపించాయి.
      2010 నుంచి ఈ ఏడాది వరకు వచ్చిన చిత్రాలలో ఖలేజాలో ‘భూంషకలక భూతసుందరి’.. బిజినెస్‌మేన్‌లో ‘సారొస్తారొస్తారా’.. కెమెరామెన్‌ గంగతో రాంబాబులో ‘మెల్‌కల్‌ తిరుగుతుంటె అమ్మాయో’.. బలుపులో ‘కాజలు చెల్లివా.. కరీనాకు కజినువా’.. రచ్చలో ‘హి ఈజ్‌ ద మిస్టర్‌’.. ఇష్క్‌లో ‘తేరేబినా’.. గుండెజారి గల్లంతయ్యిందేలో ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్మన్‌’.. నేనొక్కడినేలో ‘హూ ఆర్‌ యూ’, ‘హల్లో రాక్‌స్టార్‌’.. ఇలా తెలుగు పదాలను అదృశ్యం చేసిన దృశ్యాలు తెలుగు పాటల్లో ఎన్నెన్నో కనిపిస్తాయి.
      ‘ప్రేక్షకుల అభిరుచి మేరకే ఇలా రాయిస్తున్నాం’.. అనే మాటలు తరచూ నిర్మాత, దర్శకుల నోట వినిపిస్తుంటాయి. అదే నిజమైతే ఇదే దశాబ్దంలో రంగుల్లో వచ్చిన మాయాబజార్‌ చిత్రానికి ఇంతటి జనాదరణ లభించేది కాదు. తెలుగు పాటల్లో ఆంగ్లపదాలు తిష్టవేయడం ప్రారంభించిన 80వ దశకంలోనే ‘దొరకునా ఇటువంటి సేవా’.. అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన శంకరశాస్త్రిని చూసేందుకు తండోపతండాలుగా ప్రేక్షకులు వచ్చారు. ‘కన్నెపిల్లవని.. కన్నులున్నవని.. ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి’.. అన్న అచ్చతెలుగు ప్రయోగాన్ని సాదరంగా ఆహ్వానించారు. ‘ఆకులో ఆకునై.. పువ్వులో పువ్వునై.. కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై’.. అని కథానాయిక పాడుతుంటే మైమరచి పోయారు. ‘తరలి రాద తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసం’.. అన్న సందేశాత్మక భావాన్ని గుండెల్లో పదిలంగా దాచుకున్నారు. 
      నేటికీ ఏ పెళ్లిలో చూసినా తప్పని  సరిగా వినిపించే పాట ‘శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం.. ఇక ఆకారం దాల్చనుంది కొత్త జీవితం’.. ఇది 90వ దశకంలోనే శ్రీకారం చుట్టుకుంది. రెండువేల దశకం నుంచి ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకుల అభిరుచిలో ఏ మార్పులేదు. ఆరంభంలో వచ్చిన ‘ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి’.. పాటతో మొదలు పెట్టి నిన్నమొన్నటి ‘జగదానంద కారకా జయ జానకీ ప్రాణనాయకా’.. దాకా అలరిస్తూ వచ్చిన అచ్చతెలుగు ఆణిముత్యాలు ఎన్నెనో... ‘చెప్పవే చిరుగాలి.. చల్లగా యెదగిల్లి.. ఎక్కడే వసంతాల కేళి.. చూపవే నీతో తీసుకెళ్లి’.. ‘చిరునవ్వులతో బతకాలి.. చిరంజీవిగా బతకాలి.. ఆనందాలను అన్వేషిస్తూ అందరికోసం బతకాలి.. అందరినీ బతికించాలి’.. ‘నీ నవ్వులే వెన్నెలనీ.. మల్లెలనీ.. హరివిల్లులనీ’.. ‘మనసున ఉన్నదీ.. చెప్పాలనున్నదీ.. మాటలు రావే ఎలా’.. అంటూ మొన్నటి  ‘సీతమ్మా వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. పాట దాకా ప్రతి పాటలో ఉన్నది అచ్చతెలుగు సాహిత్యమే. తెలుగు పదాల్లో చమక్కులతో ‘అమ్మో.. బాపుగారి బొమ్మో.. మల్లెపూల కొమ్మో’.. అంటూ యువతను ఉర్రూతలూగించవచ్చని మన కవులు నిరూపిస్తూనే ఉన్నారు. అది అక్షరసత్యమని శ్రోతలు తమ అపూర్వ ఆదరణ ద్వారా చాటుతూనే ఉన్నారు. అయితే ఇలాంటి మంచి పాటల్లో ‘ఓల్డ్‌మాంకు రమ్ములు’ను ప్రేక్షుకులకు అలవాటు చెయ్యకపోతేనే మంచిది. 
      తెలుగు పాటలో కలుషిత వాతావరణానికి కారణం ఎవరన్నది ఇక్కడ ప్రశ్న కాదు. సందర్భానుసారమో.. కథానుసారమో.. ప్రత్యామ్నాయ తెలుగు పదం  లేకపోతేనో పాటలో అక్కడక్కడా ఆంగ్ల పదాలు ప్రయోగించడాన్ని ఎవరూ కాదనరు. కానీ ఆద్యంతం ఆంగ్లపదాలతోనే పాటను నడిపిస్తామంటే ఎలా?
      అందుకే సినీ కవిచక్రవర్తులకు తెలుగు ప్రేక్షకుల విన్నపం ఒక్కటే.. ‘నా పాట తేట తెలుగుపాట’.. అని గర్వంగా చెప్పుకునేలా.. ‘నాపాట పంచామృతం’.. అని సగర్వంగా చాటుకునేలా.. ‘రాగమయీ రావే.. అనురాగమయీ రావే’.. అని ఆప్యాయంగా ప్రతి ఒక్కరూ పిలుచుకునేలా.. మన తెలుగు పాట సాగాలి. లేకుంటే ‘తెలుగెళ్లీ పోతోందిరా.. ఓ తెలుగోడా.. దరిచేరే దారేదిరా.. నీ జీవితమూ అంగ్రేజీ పాలాయెరా’.. అని పేరడీ కట్టి పాడుకోవాల్సి వస్తుంది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం