ఉషాపరిణయం... సరసం మధురం

  • 106 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। దామెర వేంకట సూర్యారావు

  • విశాఖపట్నం
  • 9885188431
డా।। దామెర వేంకట సూర్యారావు

పద్యకావ్యాలు, ద్విపదలు, యక్షగానాలు... ఇలా వివిధ తెలుగు సాహితీ ప్రక్రియలు వికసించిన కాలం దక్షిణాంధ్ర యుగం. ఈ యుగం పేరు చెప్పగానే గుర్తుకువచ్చే రాజులు రఘునాథ, విజయరాఘవ నాయకులు. రామభద్రాంబ, కృష్ణాజమ్మ, మధురవాణి, రంగాజమ్మలాంటి నారీమణులు వీరి ఆస్థానాన్ని అలంకరించారు. ఈ విదుషీమణుల్లో విజయరాఘవుడి ఆస్థాన కవయిత్రి రంగాజమ్మ అష్టభాషా విశారద. ఆ రాజేంద్రుడి చేతుల మీదుగా కనకాభిషేకం చేయించుకున్న ప్రజ్ఞాశాలి. ఆమె రచనల్లో విశిష్టమైంది ‘ఉషాపరిణయం’. ఇదో శృంగారప్రబంధం.
శ్రీకృష్ణదేవరాయల
అనంతరం విజయనగర సామ్రాజ్య వైభవం క్షీణించింది. ఆ సమయంలో తంజావూరు, మధుర, చెంజి మండలాలు స్వతంత్ర రాజ్యాలయ్యాయి. ఇవి తమిళనాట ఉన్నా వీటికి పాలకులు తెలుగువారైన నాయకరాజులు. చిన చెవ్వప్పనాయకుడు 1550లో తంజావూరు నాయకరాజ్యాన్ని స్థాపించాడు. అతని తర్వాత అచ్యుతప్ప, రఘునాథుడు, విజయరాఘవుడు పాలకులయ్యారు. రఘునాథ నాయకుడు, అతని కుమారుడు విజయరాఘవుల కాలం తంజావూరులో తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం. అందుకే క్రీ.శ.1600-1700 కాలాన్ని తెలుగు సాహిత్యచరిత్రలో దక్షిణాంధ్రయుగం లేదా నాయకరాజ యుగంగా వ్యవహరిస్తారు. 
      కదనరంగంలోనూ, కవిపండిత పోషణలోనూ, సాహితీ సృష్టిలోనూ కృష్ణరాయలతో పోల్చదగినవాడు రఘునాథుడు. ఇక విజయరాఘవుడైతే సంగీత సాహిత్య సేవలో తండ్రిని మించిన తనయుడు. ఇతడి కొలువు కూటం పేరు ‘రాజగోపాలవిలాసం’. ఇతను యాభై కృతులు రచించినట్లు ప్రహ్లాద చరిత్రలో చెప్పుకొన్నాడు. విజయరాఘవుడి ఆస్థానంలో వెలసిన విదుషీమణులు చంద్రరేఖ, కృష్ణాజీ, రంగాజమ్మ. తెలుగు సాహిత్యచరిత్రలో కవయిత్రులు ప్రముఖంగా కనిపించే కాలం నాయకరాజ యుగమే. రఘునాథుడి ఆస్థానంలోనూ మధురవాణి, రామభద్రాంబ అనే కవయిత్రులు ఉండేవారు. విజయరాఘవుడి కాలంనాటి చెంగల్వకాళకవి ‘రాజగోపాల విలాసం’లో చంద్రరేఖ, కృష్ణాజీలను పేర్కొన్నా వారి రచనలేవో తెలియట్లేదు.
వలసవెళ్లిన సాహిత్యం
విజయరాఘవుడి ఆస్థానంలో గొప్పకీర్తి గడించిన కవయిత్రి రంగాజమ్మ. ఈమెను రంగాజీ అనీ పిలుస్తారు. తెలుగునాట శత్రురాజుల దండయాత్రలు ఎక్కువై ప్రజలు అన్నివిధాలా అల్లాడుతున్న రోజులవి. జీవనోపాధి కరవైన జనం తమిళదేశానికి, అందునా తంజావూరు నాయకరాజ్యానికి వలసవెళ్లారు. వారిలో సాధారణ ప్రజలతోపాటు కవులు, కళాకారులు కూడా ఉన్నారు. వలసవెళ్లిన కుటుంబాల్లో రంగాజమ్మ కుటుంబం ఒకటి. పసుపులేటి వెంకటాద్రి, మంగమ్మ దంపతులు ఆమె తల్లిదండ్రులు. రంగాజమ్మ జీవితం గురించి, విజయరాఘవుడితో ఆమెకు ఉన్న సంబంధం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. తరతరాలుగా ప్రేమ విషయంలో స్త్రీలు వంచనకు గురవుతున్నారనడానికి రంగాజమ్మ జీవితం కూడా ఓ ఉదాహరణ అంటారు కొంతమంది విమర్శకులు. 
      అద్భుతమైన సౌందర్యం, నాట్యకౌశలం, పాండిత్య ప్రకర్ష, సున్నితహృదయం, విశిష్ట వ్యక్తిత్వం రంగాజమ్మ సొత్తు. విజయరాఘవుడి పట్టాభిషేక సమయంలో ఆమె నృత్యం చేశారు. అపురూపమైన ఆమె సౌందర్యానికి రాజు ఆకర్షితుడయ్యాడు. ఆమెలోని కవితాసక్తి, ముగ్ధమోహన స్వభావం, ప్రేమమూర్తిత్వం రాజును ఆకట్టుకున్నాయి. దాంతో రంగాజమ్మను పెళ్లాడాడు. పట్టపురాణి ప్రాధాన్యం తగ్గడంతో, రాజగురువైన తాతాచార్యులు రాజు దృష్టిమరల్చడానికి, రంగాజమ్మ తనకు కూతురు వరస అని అబద్ధం చెప్పాడట. తాను తండ్రిగా భావించే తాతాచార్యులకు పుత్రిక వంటిది, తనకు సోదరి సమానంగా భావించిన విజయరాఘవుడు రంగాజమ్మకు దూరమయ్యాడన్నది ఓ కథ. ఎంతకూ రాని రాజు కోసం విరహంతో తపించిపోయారు రంగాజమ్మ. అప్పటికి ఆమె గర్భవతి. ప్రసవించాక పట్టమహిషీ సమేతంగా వచ్చిన విజయరాఘవుడి ఒళ్లో శిశువును ఉంచి, రంగాజమ్మ మరణించిందన్న విషయం ఈ కథనానికి కొనసాగింపు. రాజు తన దగ్గరికి రాకపోతే పట్టపురాణి ఆత్మహత్య చేసుకుంటానందట. అందుకే అబద్ధం ఆడానని రాజగురువు సమర్థించుకున్నప్పటికీ రంగాజమ్మ జీవితం అన్యాయంగా ముగిసిపోయిందంటారు కొంతమంది.
      కొంతమంది సాహిత్యచరిత్రకారులు రంగాజమ్మను విజయరాఘవుడి ‘భోగపత్ని’ అన్నా, కావ్యాల్లో మాత్రం ఆమె తాను విజయరాఘవుడి ‘ధర్మపత్ని’ననే పేర్కొన్నారు. మన్నారుదాసవిలాస ప్రబంధాన్ని రంగాజమ్మ సభలో వినిపించినప్పుడు రాజు మెచ్చుకుని కనకాభిషేకం చేసి భార్యగా స్వీకరించాడని చెబుతారు. రాజు ఎక్కువ సమయం ఆమెతో గడపటం సహించలేని పట్టమహిషి కాంతిమతి రంగాజమ్మను దూషిస్తూ తన చెలికత్తెతో కబురుపంపింది. దానికి జవాబుగా రంగాజమ్మ పంపిన పద్యం ఒకటి ‘చాటుపద్య మణిమంజరి’లో ఉంది.
ఏ వనితల్‌ మముందలప నేమిపనో? తమరాడువారు గా
రో వలపించు నేర్పెరుగరో? తమ కౌగిట లోననుండగా
రావది యేమిరా విజయరాఘవ యంచిలుదూరి బల్మిచే
దీపర కత్తెనై పెనగి తీసుకువచ్చితినా తలోదరీ

      అంటే రంగాజమ్మ విజయరాఘవుణ్ని బలిమితోగాక చెలిమితోనే ఆకట్టుకుందన్న మాట! ఒకసారి ఆయన మంచంమీద కూర్చుంటే... ఇంతీ పానుపునిదె/ కంతుడు కూర్చున్నవాడు కొనుగొను వహవా/ కంతుడనంగుడ నీతెలి/ వింతేనా విజయరాఘవేంద్రుడు చెలియా అని విజయరాఘవుణ్ని మన్మథుడితో పోలుస్తూ చాటువు చెప్పారు. ‘మన్నారుదాస విలాస ప్రబంధం, ఉషాపరిణయం, మన్నారుదాస విలాస నాటకం (యక్షగానం)’ ఆమె కృతులు. రామాయణ, భారత, భాగవతాలను సంగ్రహంగా రచించినట్లు పేర్కొన్నా అవి అలభ్యం. ఆమె తన కృతులన్నింటినీ విజయరాఘవుడికే అంకితమిచ్చారు. తర్వాతి కాలానికి చెందిన సౌందరి రాసిన ‘అల్లాడ విజయసింహ భూపతివిలాసం’ రంగాజమ్మ ‘మన్నారుదాస విలాసం’ ప్రబంధానికి నకలు అంటారు.
ఒకే ఇతివృత్తం.. కవులనేకం..
ఉషాపరిణయానికి మూలం సంస్కృతంలో వ్యాసకృత హరివంశం. ఎర్రన హరివంశంలోను, నాచన సోమన ఉత్తర హరివంశంలోను ఈ వృత్తాంతం ఉంది. ఈ ఇతివృత్తంతో తెలుగులో 25 గ్రంథాలు వెలువడినట్లు ఆరుద్ర పేర్కొన్నారు. వీరిలో ఉషాపరిణయాన్ని పద్యకావ్యంగా రచించిన వారిలో రంగాజమ్మ ప్రథమురాలు. అంతకుముందు తాళ్లపాక తిరువేంగళనాథుడు (1498-1561) ద్విపదలో రచించాడు. తర్వాత కనుపర్తి అబ్బయామాత్యుని ‘అనిరుద్ధ చరిత్ర’ వెలువడింది. ఉషాపరిణయం పేరుతో దామెర్ల అంకభూపాలుడు తదితరులు ప్రబంధాలు రచించారు. ఈ ఇతివృత్తంతోనే కోన నారాయణకవి రచించిన ‘వజ్రాభ్యుదయం’ అసమగ్రంగా లభిస్తోంది. ఉషాపరిణయగాథను యక్షగానకవులు బాగా ఆదరించారు. విరిసారి నృసింహరాజు, చెన్నయ, మీసరగండ ఓబుళరాజు, వేదం వేంకటరాయశాస్త్రి మొదలైనవారు ఉషాపరిణయ యక్షగానాలు రచించారు. నడిమింటి రామజోగి దీన్ని గేయకావ్యంగా తీర్చిదిద్దారు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఉషాపరిణయాన్ని రంగస్థల పద్యనాటకంగా రచించారు.
      రంగాజమ్మ ఉషాపరిణయం అయిదు ఆశ్వాసాల ప్రబంధం. అయితే మూడు ఆశ్వాసాలు పూర్తిగా, నాలుగో ఆశ్వాసంలో 70 పద్యాల వరకే లభిస్తున్నాయి. దీనికి మాతృక అయిన తాళపత్రప్రతి తంజావూరు సరస్వతీమహల్‌లో ఉంది. దీన్ని సరస్వతీమహల్‌ 1955లో ప్రచురించింది. దీనికి గ్రంథాలయం గౌరవ కార్యదర్శి ఎస్‌.గోపాలన్‌ ముందుమాట రాశారు. విఠలదేవుని సుందరశర్మ పరిష్కరించారు.
      ‘పరగ హరివంశమున ఉషాపరిణయ కథ తెనుగున గావింపుమిక నీవు తేటకాగ’ అని విజయరాఘవుడు కోరితే తాను కావ్యం రచించినట్లు రంగాజమ్మ చెప్పారు. ఇందులో ఆమె విజయరాఘవుణ్ని శ్రీకృష్ణుడి అవతారంగా నిరూపించే ప్రయత్నం చేశారు. విజయరాఘవుడు 1633లో రాజ్యానికి వచ్చాడు. 40 ఏళ్లు పరిపాలించాడు. రఘునాథుడి కాలంలో కుమార తాతాచార్యులు కులగురువు. విజయ రాఘవుడి కాలంలోనూ కొన్నాళ్లు ఈయనే కులగురువుగా ఉండేవాడు. తర్వాత శతక్రతు శ్రీనివాస తాతాచార్యుడు ఆస్థానపండిత, కులగురువు పదవులు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఈయన విజయరాఘవుడికి అత్యంత సన్నిహితుడు. విజయరాఘవుడు సింహాసనం అధిష్ఠించిన 10-15 ఏళ్ల తర్వాత ఈయన పదవిలోకి వచ్చినట్లు భావిస్తున్నారు. రంగాజమ్మ తన కృతుల్లో పేర్కొన్నది ఈ శ్రీనివాస తాతాచార్యులనే. అంటే ఆమె కావ్యాలు 1645- 1655లో వెలువడి ఉండొచ్చు.
మనోహర ఇతివృత్తం
బాణాసురుడి కుమార్తె ఉష, ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధుడి వివాహం ఉషాపరిణయం ఇతివృత్తం. ప్రద్యుమ్నుడు రుక్మిణీ కృష్ణుల తనయుడు. బాణుడు బలిచక్రవర్తి కుమారుడు. శోణపురం అతని రాజధాని. అతడు శివుణ్ని ఆరాధించి శత్రుభయం లేకుండా శివుడే తన నగరానికి కాపలా ఉండాలని కోరుకున్నాడు. అలా శివపార్వతులు అతని నగరానికి వచ్చారు. ఒకరోజు బాణుడు శివుడితో నాతో యుద్ధం చేయగలవాడు ఒక్కడూ కనిపించడంలేదు. కనుక నువ్వే నాతో యుద్ధం చేయాలన్నాడు. దానికి శివుడు నీ కోరిక తీర్చేవాడు ఒకడున్నాడని చెప్పి పంపించాడు. ఉష పూర్వజన్మలో దేవనర్తకి అయిన తిలోత్తమ. ఒకనాడు తిలోత్తమ చంద్రుని దగ్గరికి వెళ్తూండగా సాహసికుడనే రాక్షసుడు ఆమెను అడ్డగిస్తాడు. తిలోత్తమ సాహసికులు శృంగారక్రీడలో ఉండగా సమీపంలో ఉన్న దూర్వాసుడికి తపోభంగమైంది. అప్పుడాయన ఉషను రాక్షసిగా పుట్టమని శపించాడు. ఆమె శాప పరిహారం వేడుకోగా బాణాసురుని కూతురుగా జన్మించి కృష్ణుడి మనుమణ్ని పెళ్లాడినప్పుడు తొలిరూపం వస్తుందని చెప్పాడు దూర్వాసుడు.
      ఉష తనకు తగిన భర్త దొరకాలని పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తుండేది. ఓమారు ఆమెకు పార్వతి ప్రత్యక్షమై నీకు కలలో కనిపించే సుందరాకారుడే తగిన వరుడని చెబుతుంది. అలా ఓ రాత్రి ఆమెకు తననో సుందరుడు కలిసినట్టు ఉషకు కలవస్తుంది. దాన్ని చెలికత్తె చంద్రరేఖకు వివరించగా, ఆమె అన్నిదేశాల రాజకుమారుల చిత్రపటాలు తెప్పిస్తుంది. వాటిలో అనిరుద్ధుడి పటం చూసి తనకు కలలో కనిపించింది అతనే అని గుర్తిస్తుంది ఉష. దాంతో చంద్రరేఖ ద్వారక వెళ్లి అనిరుద్ధుణ్ని తీసుకువచ్చి ఉష అంతఃపురానికి చేరుస్తుంది. వాళ్లు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులై రతిసుఖాలను అనుభవిస్తారు. ఉష గర్భవతి కావడంతో, విషయం తెలుసుకున్న బాణుడు అనిరుద్ధుణ్ని బంధిస్తాడు. తన మనవణ్ని విడిపించుకోవడానికి శ్రీకృష్ణుడు బాణుడితో తలపడతాడు. యుద్ధంలో ఓడిన బాణుడు ఉషకు అనిరుద్ధుడితో వివాహం జరిపిస్తాడు. ఉషా అనిరుద్ధులకు వజ్రుడు జన్మిస్తాడు. ఇది మూలకథ. రంగాజమ్మ దాదాపుగా దీన్నే స్వీకరించారు. నాలుగో ఆశ్వాసంలో బాణాసుర శ్రీకృష్ణుల యుద్ధం పూర్తిగాలేదు. పూర్తిగా లభించని అయిదో ఆశ్వాసంలో ఉషా అనిరుద్ధుల వివాహఘట్టం ఉండి ఉంటుంది. హరివంశం నుంచి గ్రహించిన ఈ కథను ప్రబంధోచిత లక్షణాలతో మనోహర కావ్యంగా మలచారు రంగాజమ్మ.
శృంగార రస ప్రాధాన్యం
కృష్ణరాయల కాలం కంటె హెచ్చుగా నాయకరాజుల కాలపు కవిత్వంలో శృంగారం రాజ్యమేలింది. ఉషాపరిణయంలో సంభోగ, వియోగ శృంగారాలను రెండింటినీ పరిపుష్టంగా పోషించారు రంగాజమ్మ. విరహవర్ణన సాధారణంగా ప్రబంధాలన్నింటిలోనూ ఉండేదే. ఉషాకన్య మన్మథ ప్రలాపాలను విశృంఖలంగా వర్ణించారు. ఇలాంటి విశృంఖల శృంగాôœ వర్ణనలు ఇంతకుముందే పింగళిసూరన ప్రభావతీ ప్రద్యుమ్నం మొదలైన ప్రబంధాల్లో చోటుచేసుకున్నాయి. ప్రబంధాల్లో నాయకి అంగాంగ వర్ణన, విరహవర్ణన, శైత్యోపచారాలు, మన్మథోపాలంభన మొదలైనవి సాధారణం. ఉషాపరిణయంలోనూ ఇవన్నీ ఉన్నాయి. రంగాజమ్మ కావ్యంలో కొన్ని పద్యాలు ఆనాటి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. స్త్రీల అలంకరణల గురించి చక్కటి పద్యం చెప్పారామె. ఆ పద్యం ఇది...
బొమ్మలపట్టుకోకలను బొంకముమీరగ గట్టి మేలిమౌ
సొమ్ములు మేన దాల్చి కడుసొంపమరన్‌ జడలల్లి వింతగా
నెమ్మిని గీఱునామములు నీటుగ దిద్దుచు దీవమేనులన్‌
గమ్మజవాదివాసనలు ఘమ్మని మీర నలంది వేడుకల్‌

      ఇక ద్వితీయాశ్వాసంలో సంగీత వర్ణనలో... దండె తంబుర, స్వరమండలం, రబాబు, వేటుగజ్జెలు, ముఖవీణె, డక్క, కిన్నెర, వీణ, శ్రీతాళం, పిల్లనగోవి, చిటితాళం, శేషనాదం, రావణ హస్తం, చంద్రవలయం, మురజం (మృదంగం) లాంటి ఆనాడు వాడుకలో ఉన్న వాద్య విశేషాలను ప్రస్తావించారు రంగాజమ్మ.
ప్రసన్న మధుర శైలి
రంగాజమ్మ ఉషాపరిణయం కావ్యమంతటా ప్రసన్నగుణం విరాజిల్లింది. పద్యాలు మాధుర్య గుణంతో అందరికీ అర్థయ్యేలా సాగుతాయి. శృంగారం అంగిరసం కనుక ఆ రసాభివ్యక్తీకరణ కోసం మృదువైన పదాలు కావ్యంలో పరిమళించాయి. చతుర్థాశ్వాసంలో రౌద్ర వీరరసాలకు స్థానం దక్కింది. యుద్ధఘట్టంలో అనిరుద్ధుడి ఆగ్రహాన్ని ప్రతిబింబించే సందర్భంలో రంగాజమ్మ ‘అనిరుద్ధుండును రోషభీషణ రాహంకార హుంకారుడై దనుజానీకము దేరిజూచి’ అనే తత్సమపద భూయిష్ఠమైన సమాసాలను ప్రయోగించారు. శ్రీకృష్ణుడు బాణుడి నగరంలోకి ప్రవేశించిన సందర్భంలో కవయిత్రి ‘ప్రద్యుమ్నోపేత సంకర్షణ ముఖకమల ప్రస్ఫురద్దివ్యశంఖ...’ అంటూ ప్రౌఢశైలిలో స్రగ్ధర రచించారు. మన్మథారాధనం శీర్షికలో ఒక పద్యంలో ‘రాచిలుక తేజీరరౌతు’, ‘వారిచరాంకుడు’, ‘పూవింటిజోదు’, ‘మలయాశుగ ప్రభువు’, ‘కుసుమాకర సఖుడు’, ‘ఇక్షుచాపధరుడు’ మొదలైన పదబంధాలను మన్మథుడికి పర్యాయంగా ప్రయోగించారు రంగాజమ్మ. ఈ పద్యంలోనే మన్మథుడికి ‘సరస నైవేద్యం’ సమర్పించడం విశేష ప్రయోగం. 
      విజయనగర వైభవం ఆరిపోతున్న సమయంలో తెలుగు సాహితీ సరస్వతి దారిబత్తెం వెతుక్కుని తంజావూరుకు వలసపోయింది. సాహిత్యానికి సంబంధించినంత వరకు అదో స్ఫూర్తిదాయక ఘట్టం. ఆ దక్షిణాంధ్ర యుగంలో స్త్రీలు... ముఖ్యంగా దేవదాసీలు సాహితీ సృజనకు పూనుకోవడం విశేషం. ఆ కోవలో వచ్చిన కావ్యమే ఈ ఉషాపరిణయం. కావ్యంలో అక్కడక్కడా శృంగారం మితిమీరినా, ఆనాటి సాహిత్య విలువలతో అనంతర కాలంలో ఇదే ఇతివృత్తంతో వెలువడిన కావ్యాలతో పోలిస్తే రంగాజమ్మ కావ్యానిది సాహిత్య చరిత్రలో ఉత్తమమైన స్థానమే.


వెనక్కి ...

మీ అభిప్రాయం