సాహితీ మేఖల... తెలుగు వెన్నెల!

  • 90 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పున్న అంజయ్య

  • ప్రధాన కార్యదర్శి, సాహితీ మేఖల,
  • నల్లగొండ.
  • 9396610639
పున్న అంజయ్య

‘‘తెలుగన్నంతనే యేవగించుకొని మూతిన్‌ విప్పవేమోయి ఈ/ తెలుగుంబాస పసందు ముచ్చటలు సుంతేనిం పసందింపవో/ పలుకం జెల్లునె తెల్గు రాదనుచు నీ పాండిత్యమా గంగలో/ గలుపంగా దగదే యదేది యయినంగానిమ్ము నీ పాలిటన్‌’’...  తెలుగు పేరెత్తితేనే ఛీత్కరించుకుంటున్న నిజాం పాలనాకాలంలో ‘సాహితీ    మేఖల’ కవి ధవళా శ్రీనివాసరావు కలం ఇలా నిప్పులు కురిపించింది. ఆనాటి తెలంగాణలో కొండెక్కిపోతున్న తెలుగు భాషాజ్యోతిని తిరిగి దేదీప్యమానం చేసిన సాహితీసంస్థల్లో తొలివరసలో నిలిచేది ‘సాహితీ మేఖల’. ఎనిమిది దశాబ్దాల ఈ సంస్థ ప్రస్థానంలో మైలురాళ్లెన్నో!
తెలంగాణలో
సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం, తెలుగు భాషా వికాసాల కోసం నిత్యం శ్రమిస్తున్న సాహిత్య సంస్థ ‘సాహితీ మేఖల’. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడటానికి ఓ దశాబ్దం ముందు నుంచే ఈ ప్రాంతంలో ‘సాహితీ మేఖల’ కృషి ప్రారంభమైంది. గుంటూరు జిల్లా ఏదుబాడుకు చెందిన అంబటిపూడి వెంకటరత్నం బీయ్యే చదివి, పల్నాడంతా కాలినడకన తిరుగుతూ చివరికి నల్లగొండ జిల్లా చండూరు ప్రాంతం చేరారు. అప్పుడాయన అర్పిరాల సుబ్బరామయ్య శర్మ ఇంట్లో బస చేసి, మొదటగా 1934లో ‘దరిద్రనారాయణ సేవాసమితి’ని ఏర్పాటు చేశారు. కృష్ణతత్వం మీద ప్రేమ ఉన్న శాస్త్రి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం అన్నదానం, కృష్ణ స్మరణ చేయించేవారు. కులమతాలకు అతీతంగా, ధనిక పేద తారతమ్యం లేకుండా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసేవారు. రావి నారాయణరెడ్డి సహకారంతో హరిజనులకు పాఠశాల స్థాపించారు. జాతరలు, ఉత్సవాల్లోనూ వాళ్లను భాగస్వాములను చేశారు. ఇవన్నీ తెలుగు సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తే, తెలుగు భాషాభివృద్ధికి ‘సాహితీ మేఖల’ ఆవిర్భావం తోవ చూపింది.
      ఒకపక్క ఆచార్య వినోబాభావే భూదానోద్యమం, మరోపక్క తెలంగాణా సాయుధ పోరాట ప్రభావాలు ప్రజలను బాగా ప్రభావితం చేస్తున్న రోజులు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎన్నో సాంఘిక, సాహిత్య సంస్థలు వెలిశాయి. అందులో రచనా వ్యాసంగానికి దోహదపడిన సంస్థ ‘సాహితీ మేఖల’. ‘‘తల్లి యొసగెడి పాలు తెలుగే/ తండ్రి గరపెడి పలుకు తెలుగే/ తరుణి చూపెడి వలపు తెలుగే- తెలియరా/ మన బ్రతుకు బ్రతుకే తెలుగురా’’ అని నినదించిన అంబటిపూడి తెలంగాణలో ఈ సంస్థను స్థాపించి, ప్రాంతీయ భేదాలకు అతీతంగా తెలుగుజాతికి వెలుగుబాటగా నిలిచారు.
లలితగుణ కల్పవల్లి... మా తెలుగుతల్లి
‘సాహితీ మేఖల’కు పట్టుగొమ్మల్లాంటి వాళ్లలో ధవళా శ్రీనివాసరావు (కోటయ్య గూడెం), పులిజాల హనుమంతరావు (కొండాపురం), సిరిప్రెగడ భార్గవరావు (గుండ్రేపల్లి), మద్దోజు సత్యనారాయణ (చండూరు), పులిజాల గోపాలరావు (దోనిపాముల) ముఖ్యులు. గోలకొండ, కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, ప్రజామిత్ర సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి, ముట్నూరి కృష్ణారావు, కాశీనాథుని నాగేశ్వరరావు, గూడవల్లి రామబ్రహ్మం తదితరుల ప్రోత్సాహంతో ‘సాహితీ మేఖల’ రచనల పరంపర కొనసాగింది. అటు సాంప్రదాయాన్ని, ఇటు ఆధునికతను మేళవించుకుంటూ ఉత్తమ సాహిత్య రచనలు వెలువడ్డాయి. ఈ సంస్థ వ్యవస్థాపకులైన అంబటిపూడి తొలి రచన ‘ప్రణయవాహిని’ కావ్యాన్ని శిర్దేపల్లి వాస్తవ్యులైన సిరిప్రెగడ రామారావు అచ్చువేయించారు. 1857లో నానాసాహెబ్‌ కుమార్తె మైనాను బ్రిటీషు ప్రభుత్వం సజీవంగా కాల్చి చంపిన కథే ఇతివృత్తంగా, సాహితీ మేఖల రెండో ప్రచురణ ‘మైనాదేవి’ వెలువడింది. ఈ కావ్యం దేశభక్తిని ప్రబోధిస్తూ జాతీయోద్యమానికి మంచి బలం చేకూర్చింది. ‘బ్లాంక్‌ వర్స్‌’ అనే కొత్త మార్గంలో అంబటిపూడి రాసిన ‘దక్షిణ’ నాటకమూ సాహితీ మేఖల పక్షాన అచ్చయింది. ఆ తర్వాత ‘మొరాన్‌కన్య, వత్సలుడు, వనవాటి, వీరాంజలి, చంద్రశాల, ఇంద్రధనువు, సంధ్యావిద్య, మధురయాత్ర, ప్రభుసప్తతి, వివేక శిఖరాలు, కథావళి, ఇందిరా విజయమ్, గోపీ కావ్యం, ఓటర్లకొకమాట, బ్రహ్మ సూత్రములు, వ్యాసతరంగాలు, షడ్దర్శనములు, శాంతితీరాలకు, తర్కభాష, భారతీయ సంస్కృతి, అనువాద లహరి’ మొదలైన రచనలు ఈ సంస్థ పక్షాన అచ్చయ్యాయి.
      ‘నా తెలంగాణ కోటిరతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన దాశరథి కృష్ణమాచార్యుల తొలి రచన ‘అగ్నిధార’ను మొదటిసారి 1949లో ‘సాహితీమేఖల’ ప్రచురించింది. ‘‘పులకింతు నొకసారి/ తులకించు భావాలు/ సలిపెడి మువ్వంపు చక్కిళులకు/ గమకింతునొకసారి/ కలిత రసోపేత/ పద్యం పుటనవద్య హృద్యధార/ అమ్మ అమ్మాయటంచు/ నోరార నిన్ను బిలువ జేసిన/ నా పుణ్య ఫలమునెంచి/ సంతసింతును విరిదండ సంతరింతు/ లలితగుణకల్పవల్లి/ మా తెలుగుతల్లి’’ అన్న సిరిప్రెగడ భార్గవరావు లాంటి ఎందరో కవులు ‘సాహితీ మేఖల’ వేదికగా తెలుగువాణిని బలంగా వినిపించారు. 
ఆ సభల మధుర జ్ఞాపకాలు
‘సాహితీ మేఖల’ రచనలను సురవరం, మాడపాటి హనుమంతరావు, రాయప్రోలు, జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, వేలూరి శివరామశాస్త్రి, మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, చలమచర్ల రంగాచార్యులు, కుందుర్తి సత్యనారాయణమూర్తి తదితరులు ప్రశంసించారు. సంస్థ సాహితీ కృషి గురించి ఆచార్య కురుగంటి సీతారామయ్య తమ ‘నవ్యసాహిత్య వీధుల్లో’నూ, దేవులపల్లి రామానుజరావు ‘సారస్వత నవనీతము’లోనూ, గొల్లపూడి ప్రకాశరావు ‘ప్రకాశం జిల్లా సాహిత్య ప్రకాశిక’లోనూ వివరించారు. సాహిత్యంలో విభిన్న ప్రక్రియలకు చెందిన రచనలు... పద్యం, వచనం, కవిత, కథ, కథానిక, గేయం, నాటిక, వ్యాసం, అనువాద గ్రంథాలు, అవధాన గ్రంథాలను వెలువరించి ఉత్తమ సాహిత్య సంపదను సృష్టించిన ఘనత ఈ సంస్థది. 
      చండూరులో 1946లో జరిగిన ‘సాహితీ మేఖల’ పదో వార్షికోత్సవాలు గొప్ప సాహితీ తిరునాళ్లలాగా సాగాయి. అవి పేరుకు సాహిత్య సభలే అయినా రాజకీయ సభలకన్నా మిన్నగా జరిగాయి. మూడు రోజులపాటు కవి సమ్మేళనాలు, చర్చాగోష్ఠులతోపాటు కథకుల సమ్మేళనాలు సాహిత్యాభిమానులను ఉర్రూతలూగించాయి. ఈ సభలకు మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, అభినవ పోతన వానమామలై వరదాచార్యులు, దేవులపల్లి రామానుజరావు, కొప్పరపు కవులు, సత్య దుర్గేశ్వర కవులు, బిరుదురాజు రామరాజు, డా।। సి.నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. అంబటిపూడి అధ్యక్షతన ప్రజాకవి కాళోజీకి ఘన సన్మానం జరిగింది. ‘తెలుగుదేశం’ గ్రంథకర్త దేవులపల్లి రామానుజరావు తన గ్రంథంలో ‘సాహితీ మేఖల’ను ఇలా ప్రస్తుతించారు.
తెలువుల్గల్గియు లేనివారివలె హృత్తేజంబు గోల్పోయి మూ
లల పన్నుండిన మా తెలుంగు కవులన్‌ లాలించి- పాలించు త
ల్లుల ఠేవన్‌ మధురాంధ్ర కావ్యరసమున్‌ గ్రోలింపగాజేసి ము
ద్దుల పల్కుల్‌ బలికించి కుల్కెదవు గాదో సాహితీ మేఖలా

      ‘సాహితీ మేఖల’ పుస్తక ప్రచురణలతో పాటు సారస్వత సభలూ నిర్వహించింది. ప్రజల్లో సాహిత్యాభిరుచిని, తెలుగు భాషాభిమానాన్ని రేకెత్తించింది. ఉత్తమ సాహిత్యం ఏ ప్రక్రియలో ఉన్నా, ఏ రచయిత రాసినా దాన్ని పాఠకులకు అందించడానికి మొదటి నుంచీ కృషి చేస్తూనే ఉంది. ఆ కృషిలో భాగంగా నాటి నుంచి నేటి వరకు ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు, వజ్రోత్సవాలు, అమృతోత్సవాలు ఘనంగా జరిగాయి. సాహిత్యంలో విశేష కృషి చేసిన అనేకమందిని సాహితీ పురస్కారాలతో సత్కరించింది ‘సాహితీ మేఖల’. శతాధిక గ్రంథ ప్రచురణలు చేపట్టి తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ సంస్థ ఛందోబద్ద సాహిత్యానికి పెద్ద పీట వేసింది. నవకవులను తయారు చేసింది. కాంచనపల్లి చిన వెంకట రామారావు అన్నట్లు ‘సాహితీ మేఖల’ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు... అది గొప్ప మానవతా శక్తుల సమన్వయం.   


వెనక్కి ...

మీ అభిప్రాయం