నడిపించు నా నావ

  • 38 Views
  • 0Likes
  • Like
  • Article Share

గాలి అలల మీద అలా తేలుతూ వచ్చే పాట, మనసును ఎక్కడో తాకుతుంది. గుండె కన్నీళ్లను తుడుస్తుంది. తాదాత్మ్యంలోకి తీసుకుపోతుంది. అప్రయత్నంగా మన పెదవులపైనా ప్రతిధ్వనిస్తుంది. తెలుగులో... ముఖ్యంగా భక్తి సాహిత్యంలో ఇలాంటి పాటలు కోకొల్లలు. క్రైస్తవ భక్తి గీతాల్లోని ఇలాంటి వాటిలో అజరామరమైంది ‘నడిపించు నా నావ- నడిసంద్రమున దేవ’. మానవ నైజాన్ని కళ్లకు కడుతూ, ప్రభువు పట్ల తన అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఈ గీత రచన చేశారు డా।। ఎ.బి.మాసిలా మణి. తెలుగునాట క్రైస్తవ భక్తిసాహిత్యాన్ని విరివిగా సృష్టించిన రచయితల్లో ఆయనో ‘మణి’పూస!  
శాంతి,
కరుణ, పరోపకారం, తోటి జీవుల పట్ల సహానుభూతి... ఏ మతానికైనా ఇవే పునాదులు. ఏ భక్తి సాహిత్యంలోనైనా ఈ విలువలే ప్రధానం. మానవతా పరిమళాలను వెదజల్లే ఈ అక్షరపుష్పాల సాహితీ విరిదండకు దారమయ్యేది నమ్మిన దైవం మీద విశ్వాసమే. మాసిలామణి కూడా ఇలాంటి సాహిత్యాన్ని... పాటల రూపంలో విస్తృతంగా సృజించారు. 
      రెవరెండ్‌ డా।। ఎబెల్‌ బోనెర్గస్‌ మాసిలామణి... తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వాసి. నవంబరు 30, 1914న జన్మించారు. ఆయన పూర్వికులు కర్ణాటక నుంచి వలస వచ్చారు. మాసిలామణి తాతయ్య గోడి కామయ్య సువార్తికులు. తండ్రి గెర్షెం పాల్‌ పిఠాపురం కెనడియన్‌ ఆస్పత్రిలో కాంపౌండర్‌. తల్లి శారమ్మ ఉపాధ్యాయురాలు. బడిలో పిల్లలకు చిన్న చిన్న పాటలు రాసి నేర్పించేవారు. అలా అమ్మ, తాతయ్యల ప్రభావంతో చిన్నతనంలోనే మాసిలామణికి దైవభక్తి, రచనాసక్తి అలవడ్డాయి. 
నిన్ను గొలిచెదర రారా
నాలుగో ఫారం చదువుతున్నప్పుడే మాసిలామణి నాటకరంగంలోకి ప్రవేశించారు. హార్మోనియం, తబలా వాయించేవారు. చిన్న చిన్న గేయాలు రాసేవారు. 1930లో కాకినాడ బైబిల్‌ సెమినరీలో వేదాంత శిక్షణకు వెళ్లారు. అక్కడ చెట్టి భానుమూర్తికవి సాన్నిహిత్యం ఆయన ప్రతిభకు సానబెట్టింది. చౌధరి పురుషోత్తం, పులిపాక జగన్నాథం, గొల్లపల్లి నతానియేల్‌ తదితరుల గీతాలు మాసిలామణిని కదిలించాయి. భక్తిగీతాల రచనవైపు నడిపించాయి. ఆయన మొదటి పాట ‘నమోక్రీస్తునాథ’. రామచంద్రపురంలో వేదాంత అధ్యాపకుడిగా చేస్తూ 1938లో ‘నిన్ను గొలిచెదర రారా నా యేసన్న’, ‘నీ దర్శనమునకే యేసు- నీ దరి చేరితిని’ అంటూ మరో రెండు గీతాలు రాశారు. అలా ఆయన కలం నుంచి ఆ పాటల ప్రవాహం దశాబ్దాల పాటు కొనసాగింది. 
      ‘‘నడిపించు నా నావ- నడి సంద్రమున దేవా/ నవ జీవన మార్గమున- నా జన్మ తరియింప’’ పాట తెలియని తెలుగువారు అరుదు. ఏసుక్రీస్తు శిష్యుడైన పేతురు జీవితానుభవాల నేపథ్యంలో మాసిలామణి రాసిన పాట ఇది. ‘‘అహమును ప్రేమించుచునే- అరసితి ప్రభు నీ కలిమి’’ అన్న మాటలు మనిషి ఆలోచనాధోరణినీ పట్టిస్తుంది. అహాన్ని విడిచిపెట్టలేని వాడెప్పటికీ శాశ్వతానందాలను అందుకోలేడన్న అర్థాన్ని స్ఫురింపజేస్తాయి. ‘‘ప్రభు మార్గము విడిచితిని- ప్రార్థించుట మానితిని/ ప్రభు వాక్యము వదలితిని- పరమార్థము మరచితిని/ ప్రాపంచ నటనలలో- ప్రావీణ్యమును బొంది/ ఫలహీనుడనై ఇపుడు- పాటింతు నీ మాట’’ అంటూ ఎదురుదెబ్బలు తిన్నప్పుడే దైవనామస్మరణ చేసే వాళ్ల మనస్తత్వాన్ని చిత్రికపట్టారు మాసిలామణి. ఆయన పాటలన్నింటిలో అనుభవైక సత్యాలు, ఆధ్యాత్మిక భావాలు మెండుగా ఉంటాయి. 
పాపం భయపడు నామం
అప్పట్లో రెండేళ్లకోసారి విజయవాడ రాణిగారి తోటలో క్రైస్తవ మహాసభలు జరిగేవి. వాటికి మాసిలామణి కార్యనిర్వహణ, వాఙ్మయ కార్యదర్శి. ఆ సభలకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ పాట నేర్పించడమే ఆయన లక్ష్యం. అలా నేర్పినవే... ‘దేవుని నీతి ప్రతాపం-  భువియేసుని సిల్వ ప్రభావం’, ‘పలుకులలో నీ శాంతి కథ’, ‘నీతి నిలయమౌ లోకమున’ కీర్తనలు. ఇవి క్రీస్తు మూర్తిమత్వాన్ని వెల్లడిస్తాయి. ఈ మూడూ ఆ క్రైస్తవ సభకు ధ్యేయగీతాలు. ‘దేవుని నీతి ప్రతాపం’లో ఏసు అవతార విశేషం, మానవజాతికి ఆయన చేసిన మహోపకారాలను కీర్తించారు. ఇందులో ‘పాపం భయపడు నామం- పాపాత్ముడు కృపగను హోమం’ అంటూ క్రీస్తు నామం వింటే పాపం కూడా భయపడుతుందని భక్తిభావంతో వర్తించారు. 
      మాసిలామణి రచించిన మరో ప్రఖ్యాత గీతం... ‘రండి సువార్త సునాదముతో- రంజిల్లు సిలువ నినాదముతో’! ‘యేసే మానవజాతి వికాసం- యేసే మానవనీతి విలాసం’ అనే దివ్యాక్షర సందేశం వినిపించే పాట ఇది. కలుషితమైన మనిషి జీవితం అనే ఎడారిలో కలువలు పూయించేది సిలువేనని, మాసిపోయిన మానవత్వానికి తిరిగి ప్రాణంపోసేదీ సిలువేనన్న భావాన్ని ‘పలుకులలో నీ శాంతి కథ’ గీతంలో పలికించారు మాసిలామణి. ‘కరుణాపీఠము జేరరే- దేవుని కృపా చరణస్థలికి జేరరే’ అన్న కీర్తనతో క్రీస్తు మార్గంలోకి అందర్నీ ఆహ్వానించారు. ఆ కరుణామయుడి నామస్మరణతో తన జీవితం కొత్త శోభను సంతరించుకుందంటూ ‘దేవా వెంబడించితి’ గీతాన్ని రాశారు. చెప్పాలనుకున్న విషయాన్ని బలంగా వినిపించే పదాల పొందిక, శ్రోతల మనసుల్లో నాటుకుపోయేలా సాగే భావాల అమరికలే మాసిలామణి పాటలకు ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. అందుకే రచించి దశాబ్దాలు గడిచినా, అవి ఇప్పటికీ క్రీస్తు అనుయాయులను ఆధ్యాత్మిక భావసంద్రంలో ఓలలాడిస్తూనే ఉన్నాయి.    
అంతర్జాతీయ వెలుగు
మాసిలామణి 1945లో విమలను వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు నలుగురు పిల్లలు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే రచయితగా, సువార్తికుడిగా మాసిలామణి అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. కలకత్తా, ఉస్మానియా విశ్వవిద్యాలయాల నుంచి స్నాతకోత్తర, పరిశోధక విద్యా పట్టాలను స్వీకరించారు. కొన్నాళ్లు అకాడియా డివినిటీ కాలేజ్‌ (కెనడా) అతిథి ఆచార్యులుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ బైబిల్‌ సొసైటీ కార్యదర్శిగా సేవలందించారు. స్వచ్ఛంద సువార్తికుడిగా మన దేశంతోపాటు జపాన్, హాంగ్‌కాంగ్, సింగపూర్, శ్రీలంక, కువైట్, ఇంగ్లాండ్, అమెరికా, కెనడాల్లో క్రీస్తువాణిని వినిపించారు. క్రైస్తవ ధర్మశాస్త్రంలో విశేష కృషి చేసిన మాసిలామణిని 1974లో ‘డాక్టర్‌ ఆఫ్‌ డివినిటీ’ అనే అత్యున్నత వేదాంత బిరుదుతో సత్కరించింది కెనడాలోని మెక్‌మాస్టర్‌ విశ్వవిద్యాలయం. 
      మాసిలామణి 1970లో హైదరాబాదులో ‘న్యూలైఫ్‌ అసోసియేట్స్‌’ను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా క్రైస్తవ సాహిత్యాన్ని అందించేవారు. కెనెడియన్‌ బాప్టిస్టు పత్రిక ‘రవి’కి 1947- 60 మధ్య సంపాదకత్వం వహించారు. ఆంధ్రక్రైస్తవ సభ తరఫున ‘గృహజ్యోతి’ మాసపత్రికను స్థాపించి, నడిపించారు. ఆ తర్వాత సొంతంగా ‘కాపరి’ పత్రికను నెలకొల్పారు. ఏప్రిల్‌ 5, 1990న పరమపదించారు. ఆయన పాటలు, ప్రసంగాలు, ఇతర రచనలు ‘ప్రసంగ తరంగాలు, ప్రసంగమాల, కనువిప్పు, కిటికీలు’ తదితర పుస్తకాలుగా వచ్చాయి.  
      ‘‘ప్రభు యేసుని శిష్యుడనై- ప్రభు ప్రేమలొ పాదుకొని/ ప్రకటింతును లోకములో- పరిశుద్ధుని ప్రేమకథ/ పరమాత్మ ప్రోక్షణతో- పరిపూర్ణ సమర్పణతో/ ప్రాణంబును ప్రభు కొరకు- పానార్పణము జేతు’’... ఇది ‘నడిపించు నా నావ’ పాట చివరి చరణం. ఆనాడు తన అంతరంగాన్ని అలా వ్యక్తీకరించిన మాసిలామణి కడవరకూ ప్రభుసేవలోనే తరించారు. సులువైన భాషలో, చక్కటి శైలితో ప్రబోధాత్మక గీతాలను సృజించి.. తెలుగు భక్తి సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూనే... వెళ్లిపోయారు!!


వెనక్కి ...

మీ అభిప్రాయం