అక్కడంతా అమ్మభాషలోనే!

  • 1631 Views
  • 1Likes
  • Like
  • Article Share

    పాలబండ్ల రామచంద్ర,

  • అనంతపురం
  • 8008573001
 పాలబండ్ల రామచంద్ర,

కటిక చీకట్లో వెలుగుపూలు పూయించడానికి చేసే చిన్న ప్రయత్నమైనా గొప్పదే! అనంతపురం కలెక్టరేట్ లోని ‘జిల్లా ప్రభుత్వ వెనకబడిన తరగతుల సేవా సహకార సంఘం’ కార్యనిర్వహణ సంచాలకుల కార్యాలయం ఇలాంటి కృషే చేస్తోంది. పాలనాభాషగా తెలుగును సమర్థంగా అమలుచేస్తూ అందరి ప్రశంసలందుకుంటోంది. ఈ కార్యాలయం పరిధిలో దాదాపు 139 కులాలకు సంబంధించి పది సహకార సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి రూ.కోట్లాది నిధులను ఆరువేల మందికి పైగా ఉన్న లబ్ధిదారులకు రాయితీల రూపేణా అందించడం ఈ కార్యాలయ విధి. ఆ లబ్ధిదారుల్లో చాలామంది సామాన్యులే. వాళ్లందరికీ అర్థమయ్యేలా పాలన సాగించాలని 2008లో ఇక్కడి అధికారులు, సిబ్బంది సంకల్పించారు. లబ్ధిదారులకు ఇచ్చే రాయితీ మంజూరు పత్రాల నుంచి ఉన్నతాధికారులకు పంపే నివేదికల వరకూ అన్నీ తెలుగులోనే రాయడం ఆరంభించారు.
ఇలా మొదలైంది..! 
కార్యాలయాలకు వచ్చే ప్రజలతో తెలుగులోనే మాట్లాడాలని, వాళ్లతో అనునయంగా మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వోద్యోగులకు చెబుతుండేవారు అప్పటి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.సుదర్శన్‌రెడ్డి. తనవంతుగా ఆయన తెలుగులోనే విధులు నిర్వర్తించేవారు. అన్ని దస్త్రాల మీదా అమ్మభాషలోనే సంతకాలు చేసేవారు. స్ఫూర్తిదాయకమైన ఈ కృషికి అప్పట్లో ఆయన అధికారభాషా సంఘం పురస్కారమూ పొందారు. పాలనాభాషగా తెలుగు అమలు మీద సుదర్శన్‌రెడ్డి సూచనలను వెనకబడిన తరగతుల సేవా సహకార సంఘం అందిపుచ్చుకుంది. తెలుగులో కర్తవ్య నిర్వహణ దిశగా అడుగులు వేసింది. ఈ కార్యాలయ సిబ్బంది పన్నెండు మంది. ఈడీ, ఏఈఓ పోనూ మిగిలిన పదిమందీ ఒప్పంద పద్ధతిలో పని చేస్తున్నారు. మొదట్లో తెలుగులో దస్త్రాలను రాయడంలో వీళ్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంప్యూటర్లో ఖతుల (ఫాంట్లు) కొరత నుంచి అధికారిక ఉత్తర్వుల్లో వాడాల్సిన తెలుగు పదజాలం వరకూ వివిధ సమస్యలు ఎదుర్కొన్నారు. సాధారణంగా దస్త్రాల రూపకల్పన మీద జిల్లా శిక్షణా కేంద్రంలో అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తారు. అయితే అక్కడ ఆంగ్లంలో దస్త్రం ఎలా రాయాలన్నది చెబుతారు తప్ప తెలుగు ప్రస్తావన ఉండదు. కాబట్టి, ఈ కార్యాలయ సిబ్బందే సొంతంగా ‘తెలుగులో రాత’ మీద పట్టు సంపాదించుకున్నారు. తెలుగు టైపింగ్‌ తదితర సాంకేతిక నైపుణ్యాలనూ అందిపుచ్చుకున్నారు. అధికార భాషాసంఘం అందించిన ‘తెలుగు భాష పదకోశం, న్యాయపదకోశం’ పుస్తకాల ఆధారంగా పదజాల ఇబ్బందిని అధిగమించారు. ప్రస్తుతం హాజరుపట్టీ నుంచి కార్యాలయ సంబంధిత బోర్డులు, పైఅధికారులకు నివేదికల వరకూ అన్నింటికీ తెలుగే వినియోగిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా వీళ్ల స్ఫూర్తిని అభినందిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికార భాషగా తెలుగు అమలు మీద కలెక్టరేట్‌లోని ‘తెలుగు భాషా విభాగం’ త్రైమాసిక నివేదికలు రూపొందిస్తుంటుంది. ఈ నివేదికల్లో ఈ కార్యాలయానిది ఎప్పుడూ మొదటిస్థానమే. ఈ స్ఫూర్తిని రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ అందిపుచ్చుకోవాలి. అప్పుడే పాలనాభాషగా తెలుగు వికసిస్తుంది. అంతకుమించి పాలన ప్రజాపక్షమవుతుంది.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  అధికార భాష