మనసు భాషా నిపుణుడు

  • 22 Views
  • 0Likes
  • Like
  • Article Share

    బనిశెట్టి మోహనరావు

  • రాజమహేంద్రవరం.
  • 9908418017
బనిశెట్టి మోహనరావు

ఆయన మానసిక వైద్య నిపుణులు. ఆ శాస్త్రానికి సంబంధించి విస్తృతంగా రచనలు చేశారు. వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్య పరిరక్షణ మీద వేలాది శిక్షణా తరగతులు నిర్వహించారు. అంతేనా! నిరంతర చదువులతో 24 పట్టాలు అందుకున్నారు. ఆయనే రాజమహేంద్రవరానికి చెందిన డా।। కర్రి రామారెడ్డి. ఉత్తమ వైద్యులకు జాతీయ స్థాయిలో అందించే బీసీ రాయ్‌ పురస్కారాన్ని (2014 సంవత్సరానికి గానూ) ఆయన ఇటీవలే అందుకున్నారు. ‘‘ఏ వ్యక్తి వృద్ధిలోకి రావాలన్నా మాతృభాష మీద పట్టు తప్పనిసరి’’ అని చెప్పే ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రస్థానమిది...
మూడు
పుస్తకాలు, 3500 వ్యాసాలు, అప్పుడప్పుడూ కథలు, హైకూలు... ఇదీ డా।। కర్రి రామారెడ్డి రచనా వ్యాసంగం. విద్యార్థులు, మహిళల్లో మానసిక దృఢత్వాన్ని పెంచేలా రెండు వేలకు పైగా శిక్షణ తరగతుల నిర్వహణ, 17 వేల పుస్తకాలతో సొంత గ్రంథాలయం... ఆయన పేరు చెప్పగానే ఇలాంటివెన్నో జ్ఞప్తికి వస్తాయి. అయినా ఆయన ఇప్పటికీ ఉదయం ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఆస్పత్రిలోనే ఉంటారు. రోజుకు వంద మంది పాత, కొత్త రోగులకు వైద్యసేవలు అందిస్తారు. ఈ అంకితభావమే ‘బీసీ రాయ్‌ పురస్కారాన్ని’ సాధించి పెట్టింది. 
      అఖిల భారత స్థాయిలో ప్రచురితమయ్యే ‘జర్నల్‌ ఆఫ్‌ సైకలాజికల్‌ మెడిసిన్‌’కు పన్నెండేళ్ల పాటు సంపాదకుడిగా వ్యవహరించారు రామారెడ్డి. దక్షిణాది రాష్ట్రాల స్థాయిలో మానసిక వైద్యుల సంఘాలకు అధ్యక్షుడిగా బాధ్యతలు వహించారు. చిన్నప్పటి నుంచి పుస్తక పఠనానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే రామారెడ్డి, తన ఇంట్లో ఓ గదిని గ్రంథాలయంగా మార్చుకున్నారు. అందులోని 12 వేల పుస్తకాలు కొలువుదీరాయి. వీటితో పాటు అయిదు వేల పుస్తకాలతో డిజిటల్‌ గ్రంథాలయాన్నీ ఏర్పాటుచేసుకున్నారు. రోజూ సాయంత్రం ఎనిమిదింటి నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకూ ఆయన ఈ పుస్తకాలతోనే సహవాసం చేస్తారు. ఆ సమయంలోనే రచనలు చేస్తుంటారు.  
అప్పట్లో ఆయనొక్కరే
తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన రామారెడ్డి 1954లో జన్మించారు. తెలుగు మాధ్యమంలోనే పాఠశాల విద్య పూర్తిచేశారు. వైద్యుడైన సోదరుడి స్ఫూర్తితో ఆ రంగాన్ని ఎంచుకున్నారు. అయితే, సాధారణ వైద్యానికి పరిమితం కాకూడదనుకుని మానసిక వైద్యాన్ని అభ్యసించారు. బెంగళూరులో సంబంధిత విద్యాభ్యాసం తర్వాత 1980లో రాజమహేంద్రవరంలో 19 పడకలతో ఆస్పత్రిని ప్రారంభించారు. అప్పటికి ఉభయగోదావరి, కృష్ణ, ఖమ్మం జిల్లాల పరిధిలో ఏకైక మానసిక వైద్యుడు ఆయనే. దాంతో రెండేళ్లకే ఆస్పత్రి 50 పడకలకు విస్తరించింది. తన 36 ఏళ్ల వైద్యప్రస్థానంలో లక్షకు పైచిలుకు కుటుంబాలతో అనుబంధాన్ని పెంచుకున్నారు. 


వైద్యశాస్త్రానికి సంబంధించిన అంశాలన్నీ ఆంగ్లంతోనే ముడిపడి ఉన్నాయి. ఆ రంగంలో ఏదైన పరిశోధన జరిగితే దాన్ని తర్జుమా చేసి తెలుగులో కొన్ని ప్రచురణలు వస్తున్నాయే తప్ప వ్యవహారిక భాషలో రావట్లేదు. మక్కీకిమక్కీగా చేసే అనువాదాల వల్ల ఉపయోగం ఉండదు. మనదైన భాషలో వాటిని చెప్పగలగాలి. అయితే, కొన్ని వ్యాధులకు సమానార్థకాలైన తెలుగు పదాలు ఎంపిక చేయడం కష్టమవుతోంది. భాష అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ అడ్డంకులు తొలగిపోతాయి. నేర్చుకున్నవన్నీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాయి అన్న విశ్వాసమే నేను అన్ని పట్టాలు సాధించడానికి ప్రేరణ. వైద్యరంగంలో అత్యున్నతమైన బీసీ రాయ్‌ పురస్కారం  నన్ను వరించడం ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ ఉంది. ఇది వస్తుందని ఊహించలేదు. 

- డా।। కర్రి రామారెడ్డి 


వైద్య పట్టాను బంగారు పతకంతో సహా సాధించిన రామారెడ్డి... ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం- ఇలా ఇప్పటివరకూ 24 పట్టాలు అందుకున్నారు. 58 ఏళ్ల వయసులో బీఈడీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంఈడీతో పాటు బీఎల్‌ఐసీ తదితరాలనూ అభ్యసించారు. ప్రస్తుతం విద్యారంగం మీద కోయంబత్తూరు భారతీయార్‌ విశ్వవిద్యాలయం, న్యాయశాస్త్రం మీద విశాఖపట్నం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేస్తున్నారు. ఇలా విభిన్న రంగాల్లో ఆయన చదువులు ‘లిమ్కా బుక్‌్ ఆఫ్‌ రికార్డ్స్‌’లో నమోదయ్యాయి.  
ఆ కలానికి విశ్రాంతి లేదు
వృత్తిపరంగా నిత్యం రోగులతో మమేకమయ్యే ఆయన రచనా రంగంలోనూ తనదైన ముద్రను వేసుకున్నారు. వివిధ పత్రికల్లో మానసిక వైద్యం, రాజకీయ, వర్తమాన విషయాలకు సంబంధించి 3500పైగా వ్యాసాలు రాశారు. రాజకీయాల మీద వ్యంగ్య రచనలు చేయడంలో ఆయనది అందెవేసిన చేయి. వీటితో పాటూ అప్పుడప్పుడూ సృజనాత్మక రచనలూ చేస్తుంటారు. వివిధ వారపత్రికల్లో కథలు, హైకూలు ప్రచురితమయ్యాయి. తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ వ్యాసాలు, కథలు రాయడం రామారెడ్డికి అలవాటు. పది ఆంగ్ల కథల సంపుటి ప్రచురణకు సిద్ధమైంది. సీవీ సర్వేశ్వరశర్మతో కలిసి ‘మనిషి మనసు’ పుస్తకాన్ని రచించారు. తొమ్మిది నెలల కిందట ‘మనలో ఒకరు’ అనే పుస్తకాన్ని తెచ్చారు. ఇప్పుడు దానికి మలి ముద్రణ జరుగుతోంది. ‘‘మానసిక వైద్యానికి సంబంధించి తెలుగులో అనేక పుస్తకాలున్నాయి. కానీ, వాటిలో ఆంగ్లం నుంచి మక్కీకి మక్కీ అనువదించినవే ఎక్కువ’’ అనే రామారెడ్డి తన మానసిక వైద్యశాస్త్ర సంబంధిత రచనలనూ చక్కటి వ్యవహారిక భాషలోనే చేస్తారు. 
      ఎవరూ సాధించలేని వాటిని తాను ఒడిసిపట్టుకోవాలన్న తపన రామారెడ్డిలో ఎక్కువ. అందుకే వైద్యం, చదువు, రచనలతో పాటు సామాజిక సేవారంగంలోనూ కృషిచేస్తున్నారు. సహచర వైద్యులతో కలసి ‘ఫ్రెండ్స్‌ సొసైటీ సర్వీస్‌’ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. రెండు విద్యా సంస్థలను దత్తత తీసుకుని, అక్కడి విద్యార్థులకు ఉపకరణాలు అందిస్తున్నారు. వాళ్ల ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తున్నారు.
      ‘‘మాతృభాషలో పట్టు ఉంటే ఆలోచనా శక్తి బాగుంఉటంది. వ్యక్తి అభివృద్ధికి అది కీలకం. పిల్లలను ప్రాథమిక విద్య వరకైనా తెలుగు మాద్యమంలో చదివించడం ఉత్తమం’’ అనే రామారెడ్డి జీవత ప్రయాణం... నిత్య స్ఫూర్తిదీప్తుల మాలిక. 
      (డా।। కర్రి రామారెడ్డి: 0833 2469386)


వెనక్కి ...

మీ అభిప్రాయం