విప్లవ జ్వాల

  • 57 Views
  • 0Likes
  • Like
  • Article Share

సమసమాజాన్ని కాంక్షించిన ఓ కలం అక్షర సమరం ఆగిపోయింది. అభ్యుదయ రచనలతో అణగారిన వర్గాలకు అండగా నిలిచిన వెలుగు వెంకట సుబ్బారావు పరమపదించారు. ప్రకాశం చీరాలకు చెందిన ఆయన ‘రుద్రజ్వాల’ కలంపేరుతో అనేక  రచనలు చేశారు. కరుణశ్రీ శిష్యుడిగా పద్యకవిత్వంతో ప్రస్థానాన్ని ప్రారంభించి, తర్వాత విప్లవమార్గంలోకి మళ్లారు. ‘విరసం’ సభలు ఎక్కడ జరిగినా వినిపించే ‘‘ఎత్తినాము విరసం జెండా/ అలలలలుగా వరదలెత్తు/ పోరుపోరు జెండా’’ పాట ఆయన రాసిందే. 1994 వరకూ ‘విరసం’లో చురుగ్గా పనిచేసిన రుద్రజ్వాల... మార్పే ధ్యేయంగా ఎన్నో కథలూ, కవితలూ, నాటికలు రచించారు. పెత్తందార్ల వ్యవస్థమీద ‘రాములోరి గుడి’, చేనేత కార్మికుల సమస్యలమీద ‘నాడీ’, మత్స్యకారుల సమస్యలమీద ‘కడలి’, గోండుల జీవితాలను అక్షరీకరిస్తూ ‘పునరంకితం’ నాటకాలు వెలువరించారు. వరకట్నం వేధింపుల నేపథ్యంలో ఆయన రాసిన ‘సమస్య’ దేశవ్యాప్తంగా 150 సార్లు ప్రదర్శితమైంది. రైతుల కష్టాలను చిత్రించిన ‘రుతుఘోష’, పరిసరాల పరిశుభ్రత మీద రాసిన ‘పరిసరం’ నాటికలు బహుమతులు గెలుచుకున్నాయి. శ్రీశ్రీ స్ఫూర్తితో రచనలు చేసిన రుద్రజ్వాల... భాగ్యరేఖ, దైవబలం, కాడెద్దులు ఎకరం నేల తదితర చిత్రాలకూ పాటలు రాశారు. మొదటి నుంచీ ప్రచారానికి దూరంగా ఉన్న ఆయన మలిదిశలో తెలుగు భాషోద్యమంలో కీలక భాగస్వామి అయ్యారు. ‘తెలుగు భాషోద్యమ సమాఖ్య’తో కలిసి పనిచేశారు. ‘తెలుగు పతాకమా!/ నా జాతి పతాకమా/ ఎగరేస్తా మళ్లీ పైపైకీ/ మా గుండెల ఊపిరిపోసీ..’ అంటూ ఆయన రాసిన పాట భాషోద్యమకారుల్లో కొత్త ఉత్సాహం నింపింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం