యాసలెన్నయినా భాష ఒక్కటే

  • 213 Views
  • 0Likes
  • Like
  • Article Share

ప్రతి భాషలోనూ భాషా వ్యవహారంలో ప్రాంతానికి ప్రాంతానికీ భేదాలు ఉంటాయి. స్థూలంగా ఒకే భాష అయినా కొన్ని వస్తు సంబంధిత పదాలో, క్రియాపదాలో, లేదా ఇతర ప్రత్యేక పదాల్లోనో కొంత భేదం కనిపిస్తుంది. దీనినే మాండలికం అని వ్యవహరిస్తున్నాం. తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించిన పరీక్షలు, సివిల్‌ సర్వీసెస్, నెట్‌ లాంటి వాటిలో మాండలికానికి సంబంధించిన ప్రశ్నలూ అడుగుతారు. అందువల్ల ఈ విషయం మీద అవగాహన ఉండటం చాలా అవసరం. 
      మండలం అంటే ప్రాంతం, దేశం. ఒక భాష వ్యవహార ప్రాంతంలో చారిత్రక, ప్రాంతీయ, సాంఘిక కారణాలవల్ల ఆ భాషా వ్యవహర్తల భాషలో వచ్చిన మార్పు మాండలికం. వాడు అని ఇప్పుడు వ్యవహారంలో ఉన్న పదాన్నే తీసుకుంటే, వాఁడు, వాండు, వాణ్డు, వాన్ఱు, అవన్ఱు ప్రాచీనరూపాలు. ఒకప్పటి అవన్ఱు (మూలద్రావిడం) ఇప్పుడు వాడుగా మారిందన్నమాట! ప్రాంతీయంగా తీసుకుంటే వచ్చాడు, వచ్చేడు, వచ్చినాడు, వచ్చిండు... సాంఘికంగా తీసుకుంటే చాప/ సాప ఇలా ఉంటుంది వ్యవహారం. ఉపభాష, ప్రాంతీయ భాష, ప్రాదేశిక భాష పదాలు మాండలికానికి పర్యాయాలు. జర్మనీ భాషావేత్త జార్జి వెంకర్‌ తొలిసారిగా 1881లో మాండలిక పరిశోధన చేపట్టారు. ఆ తర్వాత 1940ల నాటికి మాండలికాల అధ్యయనం పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. మనదేశంలో తొలిసారి మాండలిక పరిశోధన జరిపింది కేరళలో. మాండలికాన్ని గిడుగు రామమూర్తి మాండలీయకం అన్నారు. వివిధ తెలుగు జిల్లాల్లోని ప్రజల వ్యవహారాన్ని పరిశీలించి తెలుగు అకాడమీ జిల్లాల మాండలికాల్ని బూదరాజు రాధాకృష్ణ సంపాదకత్వంలో వెలువరించింది.
      మాండలికంలో... ప్రాంతీయ మాండలికం ప్రధానంగా తీసుకున్నా, వైయక్తిక (ఏ వ్యక్తి భాష ఆ వ్యక్తికి ప్రత్యేకం, దీనిని idiolect అంటారు.), వర్గ, శిష్ట- శిష్టేతర, వృత్తి, లిఖిత- మౌఖిక, సంభాషణ- ఉపన్యాసం ఇలా పలురకాలు ఉంటాయి. తెలుగు భాషను స్థూలంగా నాలుగు ప్రాంతీయ మాండలికాలుగా విభజించారు. (స్థూలంగా నాలుగు మాండలికాలే ఉన్నా... ప్రతి 30- 40 కిలోమీటర్లకు భాష వ్యవహారంలో మార్పులు కనిపిస్తాయి.) అవి:
* పూర్వ (కళింగ) మండలం- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు. 
* మధ్యమండలం- తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు
* దక్షిణ మండలం- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు.
* ఉత్తర మండలం- తెలంగాణలోని పది జిల్లాలు.
కారణాలు
* ప్రజల మధ్య రాకపోకలు తగ్గటం
* ఒకే భాషా ప్రాంతాన్ని ఏక కాలంలో వేర్వేరు భాషల పాలకులు పరిపాలించడం.
* నదులు, కొండలు, దట్టమైన అడవులు లాంటి నైసర్గిక పరిస్థితులు.
* ఒక ప్రాంతంలో ఏర్పడ్డ కొత్త పదాలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకపోవడం.
* ఇతర భాషా వ్యవహార ప్రాంతాలతో సరిహద్దులు కలిగి ఉండటం.
శిష్ట- శిష్టేతర మాండలికం
ఒకప్పుడు కొన్ని కులాలవాళ్లు మాత్రమే చదువుకునేవాళ్లు. అందుకని కుల మాండలికాలు ఉన్నాయని నమ్మేవాళ్లు. దీనికి కారణం చదువుకోవడమే తప్ప కులం కారణం కాదని భద్రిరాజు కృష్ణమూర్తి పరిశోధన వెల్లడించింది. తెలుగులో వృత్తి మాండలికాలు ఉన్నాయని నిరూపించిందీ ఆయనే. చదువుకున్న, చదువుకోనివాళ్ల భాషలో ఉండే భేదాన్ని శిష్ట- శిష్టేతర మాండలికం అని చెప్పొచ్చు.
ఫోకల్‌ ఏరియా... రెలిక్‌ ఏరియా
కొత్త పదం వాడుకలోకి వచ్చి పాతపదం వ్యవహారం తగ్గిన ప్రాంతం ఫోలిక్‌ ఏరియా. ఉదాహరణకు హైదరాబాదు పరిసరాల్లో నారు పదానికి ఉర్దూపదం తుక(ఖం) వాడుతారు. దూరంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ నారు అనే వాడు తున్నారు. ఈ పురాతన పదం వాడుకలో ఉన్న ప్రాంతాన్ని రెలిక్‌ ఏరియా అంటారు. 
మాండలిక వర్గ భేదక రేఖలు
భాష వ్యవహార ప్రాంతంలో మాండలికాలను గుర్తించాక ఆ వ్యవహార ప్రాంతం పటాన్ని మండలాలుగా విభజిస్తారు. ఇవే మాండలికపటాలు. పదాల వ్యవహారంలో భేదాలను గుర్తించాక వాటిని ప్రత్యేక సంకేతాలతో ఆయా మండలాల్లో సూచిస్తారు. సంకేతం మార్ప మండలం మారిందనదానికి సూచిక. సంకేతాలను అనుసరించి పటాల్లో విభజన రేఖలు గీస్తారు. ఇవే మాండలిక వర్గభేదక రేఖలు (isoglosses). సరిహద్దుల్లో మాత్రం భిన్న మండలాల భాష వ్యవహారంలో ఉంటుంది. ఇది మాండలిక సంధి ప్రాంతం. ఉదాహరణకు కర్నూలు- మహబూబ్‌నగర్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో రాయలసీమ, తెలంగాణ రెండు ప్రాంతాల వ్యవహారమూ కనిపిస్తుంది. ఈ పటాల నుంచి ఒక ప్రాంతంలో ఒక ప్రత్యేక పదం వాడుక ఎంతమేర విస్తరించిందో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ‘తుఖం’ హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాడుకలో ఉంది. ఇతర ప్రాంతంలో నారు అనే అంటారు. అయితే కాలక్రమంలో కొత్తగా వచ్చిన పదం పాతపదాలను తోసేసి వ్యవహార విస్త్రృతి పొందవచ్చు, లేదా తగ్గవచ్చు.
ప్రత్యేకతలు
మాండలిక పరిశీలనవల్ల ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా వ్యవహారంలో ఉన్న పదాలు తెలుస్తాయి. కళింగ మాండలికంలో స్థానంలో వినియోగం గమనించవచ్చు. బుగత, కంబారీ, భోగట్టా లాంటి ఒరియా పదాలు ఇక్కడి వ్యవహారంలో ప్రత్యేంగా నిలుస్తాయి. దక్షిణ మండలంలో యాసరిక (బేజారు), కడ్యాయం (తప్పనిసరి),  సంగ్యాలు (ఆచారాలు) లాంటి పదాలు ఈ ప్రాంతానికి ప్రత్యేకం. ఈ మాండలికం మీద తమిళ, కన్నడ భాషల ప్రభావమూ కనిపిస్తుంది. తెలంగాణలో ఉర్దూ, మరాఠీ, కన్నడ భాషల ప్రభావం ఎక్కువ. తమిదె (రాగులు), పుంటికూర, గిర్ర- పయ్య, మొగులు లాంటి పదాలు ఈ ప్రాంతానికి ప్రత్యేకం.
      ఇంకా ప్రాచీన కవులు కావ్యాల్లో ప్రయోగించిన పదాల పరిశీలనవల్ల వాళ్లే ప్రాంతానికి చెందినవారో, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వలస వెళ్లారో తెలుసుకోవచ్చు. భాషగా తెలుగు ఒక్కటే అయినా... ఒక్కో మండలంలో, ఆ మండలంలో మళ్లీ ఒక్కో జిల్లాలో ప్రత్యేక వ్యవహారంగా నిలిచే మాండలికం భాషకు ఆయువుపట్టు. మాండలికాల అధ్యయనంవల్ల భాష మూలాలని, లోతుని అర్థం చేసుకోవడమే కాదు, కొత్తపదాలను సృష్టించుకోవచ్చు కూడా.
మాదిరి ప్రశ్నలు
1. తెలంగాణా మాండలిక పదాలు    

జవాబు (డి)  (2012 యూజీసీ నెట్‌)
(1) గోంగూర   (2)ఆనిగెపుకాయ
(3) పుంటికూర (4) సొరకాయ
ఎ. 1, 4    బి. 1, 2 
సి. 2, 4    డి. 2, 3          
2. గడ్డపలుగు ఏ మాండలిక రూపం?
జవాబు (డి)  (2014 యూజీసీ నెట్‌)   
ఎ. కళింగ    బి. రాయలసీమ
సి. తెలంగాణ  డి. కోస్తా
గతంలో సివిల్స్‌లో వచ్చిన ప్రశ్నలు
1. తెలుగు మాండలికాల భేదసాదృశ్యాలు
2. తెలుగు భాష మాండలిక భేదాలు- ప్రాంతీయ మరియు సామాజిక వ్యత్యాసాలు
3. తెలుగులో మాండలిక భాషా ప్రవిభేదాలు- హేతువులు


వెనక్కి ...

మీ అభిప్రాయం