జానపదాలే ప్రాణంగా...ఓ బాటసారి

  • 38 Views
  • 0Likes
  • Like
  • Article Share

    జి.వి.వి.సత్యనారాయణరెడ్డి

  • విజయనగరం.
  • 8008705913
జి.వి.వి.సత్యనారాయణరెడ్డి

ఎద్దులూ తొక్కంగ ఎదిగేను రాశి
కోడెలూ తొక్కంగ కొల్లాయె రాశి
పెయ్యలూ తొక్కంగ పెరిగినే రాశి
పొలిగాడు కొట్టంగ పోగయ్యెనే రాశి..
పొలియో పొలి
హే పొలియో పొలి
మా బాధలన్ని తీరిపోయె
పొలియో పొలి పొలియో పొలి
మా పంటసేను ఇంటికొచ్చె
పొలియో పొలి హే పొలియో పొలి...

      కళింగాంధ్ర గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరించే ఇలాంటి వెయ్యికి పైగా పాటలు... దాదాపు అరవై జానపద కళల గురించిన సాధికారిక సమాచారంతో వచ్చిన పుస్తకాలు ‘కళింగాంధ్ర జానపద గేయాలు’, ‘కళింగాంధ్ర జానపద కళలు’. సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుంటూ పన్నెండేళ్ల పాటు పరిశ్రమించిన ఓ సాధారణ ఉపాధ్యాయుడి స్వేదబిందువులే ఈ పొత్తాలు. అంతటి శ్రమకు ఓర్చి మరీ వాటికి ప్రాణంపోసిన ఆ మాస్టారే విజయనగరం జిల్లాకు చెందిన బద్రి కూర్మారావు. కళలకు కాణాచులైన కళింగాంధ్ర పల్లెలన్నింటినీ గాలించి గాలించి ఆయన వెలుగులోకి తెచ్చిన ఈ రత్నాలు... తెలుగు జానపద సాహిత్యం మీద కొత్త కాంతులు ప్రసరింపజేశాయి.
      ‘ఎటుపోతివో రామ ఎటుపోతివో భద్రాద్రి రామ ఎటుపోతివో’ అంటూ తుంబ పట్టుకుని పాడే ఎరుకలవారు... ‘ఏ ఊరిదానివే చెంచితా ఏ పల్లెదానివే చెంచితా’ అంటూ సాగే చెంచువారి పాటలు... ‘అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు’ అంటూ గంగిరెద్దుల వారి విన్యాసాలు... హరిదాసుల సంకీర్తనలు... తోలుబొమ్మలాటలు, కాటమరాజు కథలు, లక్ష్మమ్మ పాటగాళ్లు, సారంగపురం వీరగున్నమ్మ పాటలు, కోయనృత్యాలు, పగటి వేషాలు, బండ్ల వేషాలు, బుర్రకథలు... ఒక్కటేంటి ఉత్తరాంధ్ర పల్లెలన్నీ రోజూ ఆ పాటలు, నృత్య రూపకాలతో పులకించిపోయేవి. మూడు దశాబ్దాల కిందటి వరకూ ఉత్తరాంధ్ర పల్లెపల్లెలో వీధివీధిలో జానపదం గజ్జె కట్టి ఆడేది. ఆ జానపద గేయాలు, కళారూపకాల ద్వారా పిల్లలకు చిన్నవయసు నుంచే నైతిక విలువలు, కుటుంబ సంబంధాలు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, మంచీ చెడులు అన్నీ తెలిసేవి. వ్యక్తి వికాసానికి ఊతకర్రల్లాంటి ఆ జానపద గీతాలు, కళలు కాలక్రమేణా కనుమరుగైపోతుంటే చూడలేక, వాటిని బతికించుకోవాలని గట్టి ప్రయత్నమే చేశారు కూర్మారావు. జానపద కళలు, పాటలకు పెట్టనికోటలుగా పేరుపడిన గ్రామాలకు వెళ్లి, ఎందరో కళాకారుల్ని కలిశారు. వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. వాళ్ల నుంచి అమూల్యమైన మౌఖిక సాహిత్యాన్ని సేకరించారు. మరుగునపడిపోతున్న కళల పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకున్నారు. అలా సేకరించిన వివరాలతో రెండు పుస్తకాలను ముద్రించారు. 
పాటల ఒడిలో...
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయి గ్రామం బద్రి కూర్మారావు స్వస్థలం. జులై 20, 1962న జన్మించారు.
తల్లిదండ్రులు బద్రి అప్పన్న, లక్ష్మమ్మ, 
అలసట నుంచి ఉపశమనం పొందేందుకు పల్లె ప్రజలు పాడుకునే పాటలు వింటూ పెరిగారు. పనిలో కష్టాన్ని మరిచిపోవడానికి పాడుకునే ఉడుపుల(ఊడ్పుల) పాటలు, దంపుడు పాటలు, కోతల పాటలు, తిరగలి పాటల నుంచి పెళ్లిపాటలు, జోలపాటల వరకూ ఆనాడు ఎన్నో ఉండేవి. జముకుల పాట, తప్పెటగుళ్లు, రుంజ వాయిద్యం, దాసరి పాటలు, జంగాల కథలు, ఒగ్గుకథ, యక్షగానం, భామాకలాపం, చిందు భాగవతం, డప్పు నృత్యం, బుట్ట బొమ్మలు మొదలైనవన్నీ సమాజంలో భాగంగానే ఉండేవి. కొందరు కళాకారులు నెలల తరబడి గ్రామాల్లోనే ఉండి కళా ప్రదర్శనలు ఇచ్చేవారు. వీటన్నింటితోనూ కూర్మారావు మమేకమైపోయేవారు. 
      అప్పట్లో విప్లవోద్యమాల ప్రభావంతో సుబ్బారావు పాణిగ్రాహి రాసిన పాటలు గ్రామాల్లో వినిపిస్తూ ఉండేవి. గైరమ్మ పండగ ఉత్సవాల సందర్భంగా పదకొండు రోజుల పాటు గైరమ్మ పాటలు పాడేవారు. నిరక్షరాస్యుల నోటి వెంట వచ్చే అద్భుత మౌఖిక సాహిత్యమది... ఒక తరం నుంచి మరో తరానికి వంశపారంపర్యంగా అందివచ్చే పల్లె పాటలవి... అవన్నీ గ్రామీణులకు ఎంతో ఆనందాన్నీ, ఉత్సాహాన్నీ ఇచ్చేవి. అన్నిటి కంటే ముఖ్యంగా ఒడిశా నుంచి వచ్చి పురాణేతిహాసాలు చెప్పే టంప రాములు జముకుల పాట (జముకు అనే వాయిద్యం వాయిస్తూ పాడతారు) కూర్మారావు మీద బాగా ప్రభావం చూపించింది. అలా చిన్నప్పటి నుంచే జానపదం మీద ఇష్టం పెంచుకున్నారు. కానీ, కుటుంబ పేదరికం వల్ల చదువంతా ఆర్థిక ఇబ్బందులతోనే సాగింది. ఎవరో ఒకరి సాయంతో చదువుకుంటూ చివరికి దుప్పలవలస సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడిగా 1991లో ఉద్యోగం సంపాదించారు కూర్మారావు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలో పని చేస్తూ, ఇప్పుడు విజయనగరంలో స్థిరపడ్డారు.
అలా మొదలైంది...
1990ల నుంచే టీవీకి ఆదరణ పెరిగి జానపద కళలన్నీ చెల్లాచెదురైపోయాయి. వాటి మీద ఆధారపడిన కళాకారుల పరిస్థితి దయనీయంగా మారింది. అలాంటి కుటుంబాల్లో ప్రస్తుత తరాలన్నీ కళలకు దూరమైపోయి ఇతర వృత్తులకు మళ్లిపోతున్నారు. ఈ పరిస్థితులను గమనిస్తున్న కూర్మారావు మనసులో ఏదో అలజడి! పల్లె కళల్ని, వాటికి సంబంధించిన మౌఖిక సాహిత్యాన్ని బతికించుకోవడానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన ఆయన్ను నిరంతరం వెంటాడేది.
      ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేసేందుకు 2000 సంవత్సరంలో హైదరాబాదు వచ్చారు కూర్మారావు. సెంటర్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌స్టడీస్‌లో చేరారు. ఆ సమయంలోనే మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి రాసిన ‘తెలుగువారి జానపద కళారూపాలు’ పుస్తకం చదివారు. దాని స్ఫూర్తితో ఉత్తరాంధ్రలోని కళారూపాలన్నింటిమీదా పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా పీహెచ్‌డీ సైతం వదిలేసి, జానపద సాహిత్యాన్ని వెతుక్కుంటూ ప్రయాణం ఆరంభించారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్, అండమాన్‌ నికోబార్‌ దీవులకూ వెళ్లి, అక్కడ స్థిరపడ్డ ఉత్తరాంధ్ర వాసులను కలుసుకున్నారు. వాళ్ల దగ్గర ఉన్న ప్రాచీన జానపద సాహిత్యాన్ని తెలుసుకున్నారు. ఒడిశాలోని పర్లాకిమిడి సమీపంలోని జంగాలపాడుకి వెళ్లి తన చిన్ననాటి కథానాయకుడు టంప రాములను (బోనెల రామన్న) కలిశారు. ఒకనాడు జముకుల పాటను ఊరూరా మార్మోగించిన ఆ కళాకారుడు అప్పుడు దుర్భర పేదరికంలో మగ్గిపోతున్నాడు. బరువైన గుండెతో రాములు గుడిసెలోనే జముకుల పాటకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు కూర్మారావు. ఇలాంటి కళాకారులనే వెతుక్కుంటూ తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగించారు.
ఎన్నెన్నో మజిలీలు
శ్రీకాకుళం జిల్లా మందస మండలం భైరిసారంగపురం గంగిరెద్దులవారు ప్రఖ్యాతులు. రణస్థలం మండలం మత్స్య లేశంలో ఎరుకులవారు పేరెన్నికగలవారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి... భారత రామాయణాలు, సన్యాసమ్మ కథలు, బొబ్బిలి యుద్ధం, బాలనాగమ్మ కథలు వినిపించే బుడిగ జంగాలకు పెట్టింది పేరు. బాడంగి మండలం జీఆర్‌కేపురం గ్రామం తప్పెటగుళ్లకు ప్రసిద్ధి. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడుపూడిలో తోలుబొమ్మల కళాకారులు ఉండేవారు. విశాఖపట్టణం జిల్లా పాడేరు మండలం హుకుంపేట థింసా నృత్యానికి చిరునామా. ఉత్తరాంధ్రలోని ఇలాంటి వంద గ్రామాలకు వెళ్లారు కూర్మారావు. పన్నెండేళ్ల పాటు వేసవి సెలవులతో పాటు మిగిలిన సెలవు రోజులన్నింటినీ ఈ ప్రయాణాలకే వినియోగించారు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి మారుమూల ప్రాంతాలకు వెళ్లడం, అక్కడి కళాకారుల్ని వెతికి పట్టుకోవడం, వాళ్లను ఒప్పించి పాటలు పాడించుకుని రాసుకోవడం... ఇదే పనిగా పెట్టుకున్నారు. దీంతో పాటు కళాకారుల స్థితిగతులను పరిశీలించడం జానపద కళావస్తువుల్ని సేకరించడం... ఇదీ ఆయన వ్యాపకం. ఈ కృషిలో భాగంగానే ఆయన వెయ్యి వరకూ జానపద గీతాల్ని నమోదు చేశారు. జముకు, తప్పెటగుళ్లు, డప్పు, తుడుం, కిన్నెర, పిల్లనగ్రోవి, చిన్నపాటి తోలుబొమ్మలు, తంబూర, బుడిగె లాంటివి సేకరించారు. 
వెలకట్టలేని సంపద
ఉత్తరాంధ్రలో తన దృష్టికి వచ్చిన 60 జానపద కళల గురించి వివరిస్తూ 2005లో ‘ఉత్తరాంధ్ర జానపద కళలు’ రచించారు కూర్మారావు. శ్రీకృష్ణదేవరాయ, తెలుగు, ద్రవిడ విశ్వవిద్యాలయాలు, రాజారామ్మోహన్‌రాయ్‌ గ్రంథాలయం తదితరాలు ఈ పొత్తాన్ని సంప్రదింపు గ్రంథంగా గుర్తించాయి. ఇక తాను నమోదు చేసిన పాటలను ఓ చోటకు చేర్చి 2015లో ‘కళింగాంధ్ర జానపద గేయాల’ పేరిట మరో పుస్తకం తెచ్చారు. మొత్తమ్మీద ఈ రెండు పొత్తాల కోసం ఆయన తన శక్తికి మించి ఖర్చుపెట్టారు. ఇంత కష్టం ఎందుకు అంటే ‘జానపదం మీద ప్రేమ’ అని నవ్వేస్తారు. మరోవైపు కళలు, సాహిత్య పరిరక్షణ కోసం 2004లో తన స్వగ్రామంలో ‘గిడుగు రామ్మూర్తి తెలుగుభాష మరియు జానపద కళాపీఠం’ స్థాపించారు కూర్మారావు. దాని తరఫున ఏటా కళావేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన సతీమణి లక్ష్మీఫణిశ్రీ. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.. వెంకట తరుణి, సాయిరామ దీపక్‌. కూర్మారావు  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాల (నందిగాం)లో అర్థశాస్త్ర జూనియర్‌ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.
‘‘రాష్ట్ర విభజన తర్వాత ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు, ప్యాకేజీలు రూపొందుతున్నట్లే ఆ ప్రాంతాల భాష, చరిత్ర, జానపద సాహిత్య సంపదపై అధ్యయనం జరగాల్సి ఉంది. అందుకు బద్రి కూర్మారావు రాసిన కళింగాంధ్ర జానపద గేయాలు గ్రంథం ఒక ఆధార గ్రంథంగా ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు ఆచార్య జయధీర్‌ తిరుమలరావు. కూర్మారావు రచనలకు ఆ శక్తి ఉంది. విశ్వవిద్యాలయాల స్థాయిలో జరగాల్సిన కృషిని ఒంటిచేత్తో పూర్తిచేసిన ఆయన స్ఫూర్తితో మిగిలిన ప్రాంతాల పరిశోధకులూ ముందడుగు వేసినప్పుడే తెలుగు జానపద సుగంధాన్ని భావితరాలు ఆస్వాదించగలవు. 

(కూర్మారావు: 97047 98643) 


వెనక్కి ...

మీ అభిప్రాయం