కొంగ కొంగే... హంస హంసే!

  • 296 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఖండాపు మన్మథరావు

  • తెలుగు అధ్యాపకుడు,
  • విజయవాడ.
  • 9440943937
ఖండాపు మన్మథరావు

సమర్థుడైన కవి చెప్పిన ప్రతి మాటా పాఠకుల మనసుల్ని పరవశింపజేస్తుంది. ఎంత బాగా చెప్పాడని పదేపదే అనుకుంటాం. ఆనందిస్తాం, ఆలోచిస్తాం. ఇతివృత్తం ఎలాంటిదైనా కవికి దానితో పనిలేదు. కవి సమాధినిష్ఠుడై వస్తువును చక్కగా భావిస్తే రసభావం పొందని పదార్థం ఈ లోకంలో ఉండదు. రసభావం భావనాధీనమే గానీ వస్తువు అధీనం కాదన్నది కావ్య తత్వవిదుల అభిప్రాయం.
      ధనంజయుడు ‘దశరూపకం’లో చెప్పినట్లు కావ్యవస్తువు రమ్యం, జుగుప్సితం, ఉదారం, నీచం, వికృతం, ఉగ్రం, ప్రసన్నం, గహనం ఇలా ఏదైనా కానీ, చివరికి అది వస్తువు కాకపోయినా సరే భావుకుడైన కవి చేతిలో పడితే దానికి రసభావం సిద్ధిస్తుంది.
      కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా, తలుపుగొళ్లెం, హారతిపళ్లెం, గుర్రపుకళ్లెం- అన్న శ్రీశ్రీ కవిత బాగా పరిచయమున్నదే. జంధ్యాల పాపయ్యశాస్త్రి ‘పాకీపిల్ల’ అందరి హృదయాల్లో ఆకట్టుకుని, మన్ననలు పొందిందే. ఇలాంటి రచనలెన్నో మన సాహిత్యంలో దర్శనమిస్తాయి.
‘ఎవ్వడవీవు? కాళ్లు మొగమెర్రన?’ 
‘హంసను’, ‘నీ నివాసమో!’
‘దవ్వుల మానసంబునను’, ‘వాని 
విశేషములేమి’ తెల్పుమా!
‘మవ్వపు కాంచనాబ్జములు మౌక్తికముల్‌ 
కలవందు’; ‘నత్తలో?’
‘యవ్వియెరుంగ’ యన్న, ‘నహహా! యని 
నవ్వె’ బకంబులన్నియున్‌

      ఒకానొక రోజు ఓ హంస కొంగల మధ్యకు వచ్చింది. కొంగలు, హంసను ఎప్పుడూ చూసి ఉండకపోవడంవల్ల, ఎవ్వడవు నీవు? కాళ్లు, మొగము ఎర్రగా ఉన్నాయి? అని ప్రశ్నించాయి. ‘నన్ను హంస అంటారు’ అని హంస జవాబు చెప్పింది. ‘నివాసం ఎక్కడ?’ మళ్లీ కొంగలు హంసను అడిగాయి. ‘ఇక్కడికి చాలా దూరంగా ఉండే, మానస సరోవరంలో’ అని అంది హంస. ‘వాని విశేషాలు ఏంటట?’ కొంగల ప్రశ్న. ‘బంగారు తామరలు, ముత్యాలు ఆ సరోవరంలో ఉంటాయి’ హంస సమాధానం. ‘మరి నత్తలుండవా?’ అని కొంగలు ప్రశ్నించగా, ‘అవి ఎలాంటివో తెలియదు’ అని హంస జవాబిచ్చింది. ఆ సమాధానానికి కొంగలన్నీ ఒక్కసారిగా నవ్వాయి.
      కొంగలకు కావాల్సినవి నత్తలు. అందుకే మానస సరోవరంలో నత్తలు ఉండవా? అని ప్రశ్నించి ఎగతాళిగా నవ్వుకున్నాయి. మిగిలిన శ్రేష్ఠమైన వస్తువులతోగాని, వాటి గుణాలతోగాని హీనబుద్ధి గలవారికి పని ఉండదు. వాటి స్వభావమే వేరు. ‘హీనుడవగుణంబు మానలేడు’ అన్న వేమన వాక్కు ఇక్కడ గుర్తుకురాక తప్పదు.
      ఈ పద్యాన్ని కవి ఎంత చక్కగా నడిపించాడో. పద్యమంతా ప్రశ్న జవాబుల సమ్మేళనం. ప్రశ్నలు వినడానికి ఎంత బాగున్నాయో, జవాబులు అంతకంటే చక్కగా ఉన్నాయి.
      హంస శ్రేష్ఠమైన పక్షి. అలాంటి హంస, కొంగల సమూహంలోకి వస్తే ఎలా ఉంటుందన్నదే ఈ పద్యానికి ఆలంబన. పది మంది దుర్జనుల మధ్య ఒక సజ్జనుడు ఉండలేడు. ఉత్తముడిలో ఉన్న నీతి, నిజాయతీ లాంటి గుణాలు అందరినీ ఆకర్షిస్తాయి. ఇక్కడ కొంగలు హీనత్వానికి, హంసలు శ్రేష్ఠతకు ప్రతీకలు.
      నాటకీయ శైలిలో సాగిన ఈ పద్యం చాటువుల్లో కనిపిస్తుంది. ఇంత చక్కటి పద్యాన్ని రాసిన కవి పేరు తెలియదు. కానీ ఉత్తముల నాలుకపై ‘ఉసిరిక’లా ఎల్లప్పుడూ ఈ పద్యం నానుతూనే ఉంటుంది. పది కాలాల పాటు నిలువగలిగేదే ఉత్తమ కవిత్వం.


వెనక్కి ...

మీ అభిప్రాయం