ఏనుగుల రాజు ఆసియా యాత్ర!

  • 378 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పెమ్మరాజు సంధ్యారాణి

  • హైదరాబాదు

దండాలయ్యా ఉండ్రాళ్లయ్యా దయుంచయ్యా దేవ... నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ’ అంటూ ఆనందోత్సాహాలతో జరుపుకునే సమష్టి పండగ వినాయక చవితి. ఊరంతా కలిసి పందిరి వేసి, బొజ్జ గణపయ్యను కొలువుదీర్చి మొక్కులుతీర్చే పర్వదినమిది. గణపతి నవరాత్రులు, బహిరంగ వేడుకలు, విగ్రహ నిమజ్జనాలు... ఇవన్నీ స్వాతంత్య్రోద్యమ సమయంలో స్థిరపడిన ఆచారాలు. వీటి సంగతి అలా ఉంచితే, అసలు ఆ ఏకదంతుణ్ని ఓ దేవుడిగా ఆరాధించడం ఎప్పుడు ప్రారంభమైంది? ఆ తర్వాత కాలంలో ఈ వినాయక ప్రభ ఎక్కడెక్కడ వెలుగులీనింది?  
హిందూ
దేవుళ్లందరిలో ప్రముఖుడే కాదు, ప్రత్యేక రూపం కూడా గణపతిది. ఏనుగు తల, గుజ్జురూపం, బొజ్జ... చూడగానే భిన్నత్వాన్ని సూచిస్తాయి. ఇతర దేవతలకంటే కాస్త ఆలస్యంగా వినాయక ఆరాధన ప్రారంభించారు మన పూర్వీకులు. కానీ, ఆ తర్వాత కొద్దికాలంలోనే చాలా ప్రాచుర్యంలోకి వచ్చాడు విఘ్నేశ్వరుడు.  
      ప్రకృతితో కలిసిమెలిసి జీవించిన ప్రాచీన సమాజాలన్నింటిల్లో కొన్ని సారూప్యతలు కనిపిస్తాయి. వన్యప్రాణుల రూపాల్లోని దేవతలను ఆరాధించడం అందులో ఒకటి. గజాననుడి ఆరాధనా అలాగే మొదలైంది. దీనికి సంబంధించి వాదప్రతివాదాలు చాలా ఉన్నాయి. అయితే, ఏనుగు తలతో కూడిన ఓ గ్రామదేవతగానే వినాయక ప్రస్థానం ప్రారంభమైందన్నది మాత్రం వాస్తవం. గుప్తుల కాలంలో అంటే క్రీ.శ.నాలుగైదు శతాబ్దాల నాటికి, ప్రధాన స్రవంతి హిందూ దేవుళ్లలో ఒకడిగా గజాననుడు కొలువుదీరాడు. తదననుగుణంగా పురాణాలు, ఇతర రచనలూ ఆయన ప్రాభవాన్ని గానం చేశాయి. ఆరో శతాబ్ది తొలినాళ్ల నాటి వరాహమిహిరుడి ‘బృహత్సంహిత’లో సైతం గణపతి వర్ణన కనిపిస్తుంది. అయితే, పర్షియా(ఇరాన్‌)లో క్రీస్తుపూర్వం నాటి ఓ ‘ఏనుగు తల దేవుడి’ చిత్రం లభ్యమైంది. ఇందులో ఆయన ఓ యుద్ధవీరుడిగా దర్శనమిస్తాడు. ఈ చిత్రం గణపతిదేనన్నది ఓ వాదన. శ్రీలంకలోని అనురాధపురానికి సమీపంలోని మహిన్‌టేల్‌ కంటక చైత్యం శిల్పాల్లోనూ ‘ఏనుగు తల దేవుడు’ కనిపిస్తాడు. ఈ చైత్యమూ క్రీస్తుపూర్వం నాటిదే. ‘‘క్రీ.పూ 1- క్రీ.శ. 2 శతాబ్దాల మధ్య ఈ ఆదివాసీ దేవుడు పౌరాణిక దైవమయ్యాడు. 3- 4 శతాబ్దాల మధ్య కూర్చిన శివపురాణంలో వినాయక కథలు ఉండటాన్ని బట్టి ఈ విషయం చెప్పొచ్చు. ఆ తర్వాత ఏడో శతాబ్దం వరకూ కొనసాగిన పురాణ రచనలన్నీ గణపతిని కీర్తించాయి’’ అంటారు డాక్టర్‌ మధుమిత దత్తా. కోల్‌కతాలోని బెహలా కళాశాల తత్వశాస్త్ర విభాగంలో సహాయ ఆచార్యులైన ఆమె, గణేశుడికి సంబంధించిన పౌరాణిక, చారిత్రక ఆధారాలను పరిశోధించి ‘‘మైథాలజీ అండ్‌ ఐకనోగ్రఫీ ఆఫ్‌ గణేశా’’ పుస్తకం వెలువరించారు.
ఆనాటి ఆలయాలు
ప్రాచీన గణపతి దేవాలయాల్లో ప్రధానమైనవి రెండు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. పన్నా జిల్లాలోని భుర్మా, ఉదయగిరి కొండల దగ్గర కొలువైన ఈ ఆలయాల్లోని విగ్రహాలు గుప్తుల కాలానివి. అలాగే, రాతిని తొలిచి నిర్మించిన తమిళనాడులోని పిళ్లయార్‌పట్టి ‘కర్పగ వినాయగర్‌ కోయిల్‌’కూ 1600 ఏళ్ల చరిత్ర ఉంది. ఇదే రాష్ట్రంలోని తిరుచరాపల్లిలోని ‘ఉచ్ఛి పిళ్లయార్‌ కోయిల్‌’ ఏడో శతాబ్దపు నిర్మాణం. రాజస్తాన్‌లోని జోధ్‌పుర్‌ దగ్గరున్న ఘాటియాలలో క్రీ.శ.862 నాటి శాసనం ఒకటి బయటపడింది. ఈ శాసనం ఉన్న స్తంభం చుట్టూ నాలుగు దిక్కుల్లో నాలుగు గణపతి విగ్రహాలుంటాయి. తలపెట్టిన పనిలో విఘ్నాలు ఎదురుకాకూడదని కోరుకోవడమే ఈ విగ్రహ ప్రతిష్ఠాపనలోని ముఖ్యోద్దేశం. ఎలిఫెంటా, అజంతా ఎల్లోరా గుహల్లోనూ గజాననుని శిల్పాలు కనిపిస్తాయి.
      పదో శతాబ్దం నాటికి వినాయక ఆలయాల నిర్మాణం ఊపందుకుంది. గణపతినే దేవదేవుడిగా కొలిచే ‘గాణపత్య’ సంప్రదాయమూ వేళ్లూనుకుంది. ‘సత్యప్రమాణాల’ వరసిద్ధి వినాయకుడి కాణిపాకం ఆలయాన్ని 11వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళుడు నిర్మించాడు. విఘ్నాధిపతిగా గణపతి కొలువుదీరాక ఏ సందర్భంలోనైనా తొలిపూజ ఆయనకే చేయడం ఆచారమైంది. తలపెడుతున్న పనిలో విజయాన్ని కోరుకుంటూ ఆయనకు మొక్కడం సంప్రదాయమైంది. దీనికి అనుగుణంగా తెలుగు కావ్యాల్లో సైతం వినాయక స్తుతి కనిపిస్తుంది. నన్నెచోడుడు, తిక్కన, ఎర్రన, కేతన, పోతన, శ్రీనాథుడు, పెద్దన తదితర కవిదిగ్గజాలందరూ గణపతికి దండంపెట్టినవారే. మరోవైపు బౌద్ధులతో కలిసి దాదాపు ఆసియా ఖండాన్ని చుట్టేశాడు బొజ్జ గణపయ్య. 
ఆఫ్ఘనిస్తాన్‌లో అతిప్రాచీనం
గుప్తుల కాలం నాటివిగా భావించే గణేశ విగ్రహాలు కొన్ని ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాయి. గార్డెజ్‌లో కనుగొన్న వినాయకుణ్ని కాబూల్‌కి తరలించారు. అక్కడి హిందువులు ఆ విగ్రహాన్ని కొలుస్తున్నారు. పాలరాతితో తయారుచేసిన ఈ విగ్రహం 60 సెం.మీ. ఎత్తు, 35 సెం.మీ. వెడల్పు ఉంటుంది. ‘‘షాహిరాజు ఆధ్వర్యంలో ఈ అందమైన వినాయకుడి విగ్రహం రూపుదిద్దుకుంది’’ అన్న మాటలు దాని పాదాల దగ్గర కనిపిస్తాయి. ఈ రాజు పేరునిబట్టి చూస్తే, ఈ ప్రతిమ ఆరో శతాబ్దం తొలినాళ్లది. నిలబడి ఉండే ఈ వినాయకుడి కండరాలు బలంగా ఉంటాయి. తొండం పగిలిపోయింది. తలమీద చిన్న కిరీటం, మెడలో ఓ హారం, యజ్ఞోపవీతం ఉంటాయి. ధోవతి మీద సింహం తల, తామర మొగ్గల్లాంటివి కొలువుదీరాయి. ఇవన్నీ మగధ స్ఫూర్తిగా అనిపిస్తాయి.
      కాబూల్‌కి పదిమైళ్ల దూరంలోని శంకర్‌ధార్‌ జిల్లాలో మరో ప్రత్యేక గణపతి విగ్రహం లభ్యమైంది. ఈ గణపతీ నిల్చునే ఉంటాడు. కాకపోతే ధోవతి కొంచెం కిందకు జారింది. బొజ్జ ఉండదు. ఈ నాగ యజ్ఞోపవీతధారి తొండం ఎడమవైపునకు తిరిగి ఉంటుంది. వంకీల జుట్టు, చెవుల కుండలాలు గుప్తుల శిల్పకళని గుర్తుచేస్తాయి. నాలుగో శతాబ్దం నాటిదిగా భావిస్తున్న ఈ విగ్రహం... తొలినాటి గణపతి రూపానికి ఆనవాలు. 
అక్కడ బౌద్ధులకూ ఇష్టుడే
అశోకుడి కుమార్తె చారుమతి నేపాల్‌లో గణేశుడి గుడి కట్టించిందంటారు. కానీ, దానికి ఆధారాలు లేవు. ఎనిమిదో శతాబ్దం నుంచి మాత్రం ఇక్కడ విఘ్నేశ్వర పూజలు జరుగుతున్నాయని కచ్చితంగా చెప్పవచ్చు. ‘గణపతి హృదయం’ అనే ప్రత్యేక ప్రార్థనా మంత్రాలూ వినిపిస్తాయి. నేపాల్‌ హిందువులతో పాటు బౌద్ధులూ గణపతిని అర్చిస్తారు. వినాయకుడు ‘సిద్ధిదాత’ కాబట్టే బౌద్ధులకు ప్రీతిపాత్రుడయ్యాడు. 
      నేపాల్‌లో గణపతి ప్రాచీన విగ్రహాలెన్నో లభ్యమయ్యాయి. ఖాట్మండు దగ్గర రెండు విగ్రహాలున్నాయి. వీటికి తల ఒక్కటేగానీ ఓ శిల్పానికి నాలుగు, మరోదానికి పదహారు చేతులు ఉంటాయి. ఎనిమిది చేతుల కంచు ప్రతిమ కూడా నేపాల్‌లో దొరికింది. ఇది నృత్యగణపతి విగ్రహం. శివుడి చిహ్నాలే ఈ వినాయకుడికీ కనిపిస్తాయి. నేపాల్‌ వినాయకుడు పాముని ధరిస్తే... టిబెట్, మంగోలియాల్లోని కొన్ని గణేశ విగ్రహాలు త్రిశూలాన్ని చేబూని ఉంటాయి. జావాలోని వినాయకుడు పుర్రెని ధరించి కనిపిస్తాడు. సింహ వాహనుడైన అయిదు తలల హేరంభ గణపతి నేపాల్‌లో సుప్రసిద్ధుడు. భట్‌గాన్‌ ప్రాంతంలో 1695 నాటి హేరంభ గణేశ విగ్రహం లభ్యమైంది. అయితే, ఈయనకు వాహనంగా సింహం బదులు ఎలుక ఉండటం విశేషం. ఈ విగ్రహం కంటే ప్రత్యేకమైంది వోల్కెర్‌కుండె ప్రాంత విఘ్నేశ్వరుడి కంచు బొమ్మ. దీనిలో ఓ పాదం దగ్గర సింహం, మరో పాదం దగ్గర ఎలుక ఉంటాయి. ఎనిమిదో శతాబ్దానికి చెందిన జింపితాండు దేవాలయం, శంక ప్రాంతంలోని సిద్ధి వినాయక ఆలయాలు ప్రఖ్యాతం. థాంకోట్‌ గణపతి గుడిలో సప్తమాతృకలూ ఉన్నాయి.
స్త్రీ రూపంలో...
మహాయాన బౌద్ధస్థావరమైన టిబెట్‌లోనూ కొన్ని విఘ్నేశ్వర శిల్పాలు దొరికాయి. దుష్టశక్తులను తరిమేయడానికి ఇక్కడ గణపతిని కొలుస్తారు. విర్మండ్‌లోని శివాలయం, టాబో బౌద్ధాలయాల్లో వినాయకుడు కనిపిస్తాడు. విర్మండ్‌ గణేశుడికి రెండు చేతులు. ఓ చేతిలో తినుబండారాలుంటాయి. టాబోలోని మహాయాన బుద్ధారామం తలుపుల మీద గణపతి బొమ్మల్ని చెక్కారు. ముఖద్వారం దగ్గరా వినాయక రూపాలు కనిపిస్తాయి.
      గణేశ రూపచిత్రణలో టిబెట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడి స్త్రీ రూపాలు కనిపిస్తాయి. మధ్యప్రదేశ్‌లోని భెరాఘాట్‌ గుడిలో ఉండే 64 యోగినుల విగ్రహాల్లో గణేశ ప్రతిమ కూడా ఒకటి! మరోవైపు, బౌద్ధంతో పాటే మంగోలియాకు చేరాడు వినాయకుడు. నృత్యగణపతిగా వెలిశాడు. నోట్లో ఆభరణాన్ని పట్టుకుని, నాలుగు చేతులతో ఉంటాడు. ఓ చేతిలో గొడ్డలి కనిపిస్తుంది. శ్రీలంకలోని కంటక చైత్యంతో పాటు పొలున్నారువా స్తూపం మీదా గజాననుడు కొలువుదీరాడు.  
అక్కడ పద్మాసనం... 
మహాయాన బౌద్ధకాలానికి చెందిన ఎన్నో గణేశ విగ్రహాలు బర్మాలో బయటపడ్డాయి. విఘ్నాలు తొలగించే దేవుడిగా ఆయన్ను ఇక్కడ కొలుస్తున్నారు. రంగూన్‌ పురావస్తు ప్రదర్శనశాలలో రెండు గణేశమూర్తులు ఉన్నాయి. రెండూ చిన్నవే. ఓ గణేశుడు ఆరు చేతులతో పద్మాసనంలో ఉంటాడు. రెండో ప్రతిమకు నాలుగు చేతులు.  
      హిందూ మత ప్రభావంతో ఆరో శతాబ్ద ప్రారంభంలో థాయిలాండ్‌కు వచ్చాడు గణపతి. బ్యాంకాక్‌లోని కంచు వినాయకుడు నాగ యజ్ఞోపవీతధారి. కుడిచేతిలో విరిగిన దంతం ఉంటుంది. ఇక కంబోడియాలో అడుగడుగునా శైవాలయాలు, విఘ్నేశ్వరాలయాలు కొలువుదీరాయి. పదో శతాబ్దానికి చెందిన ప్రసాద్‌బాగ్‌ గణపతి కోవెల సుప్రసిద్ధం. రెండు చేతులతో, బాసింపట్టు వేసుకుని ఉండే ఈ గణపయ్యకు పెద్ద బొజ్జ ఉండదు. తొండం పొడవుగా ఉండి, చివర్లో మెలితిరిగి కనిపిస్తుంది. తలమీద ఎలాంటి ఆభరణాలూ ఉండవు. సర్వాలంకృత శోభితుడైన గణేశుడు విడిగా కనిపిస్తాడు. ఆ మూర్తిది ఎనిమిదో శతాబ్దం. ఇక చంపా గణేశుడి తలమీద ఎత్తు ఉంటుంది. అది మహాపురుష లక్షణం. బుద్ధుడి విగ్రహాల్లో ఈ శైలి చూడవచ్చు. 
ద్వీపాల్లోనూ అదే ప్రభ
ఇండోనేషియాలోని జావా, బాలి ద్వీపాల్లో పూర్తికాని పురాతన గణేశ శిల్పాలు దర్శనమిస్తాయి. శిల్పకళ అంతగా వృద్ధి చెందని కాలానికి చెందినవిలా తోస్తాయి. స్థానిక దేవాలయాల్లో వినాయకుడి చిన్న కంచు విగ్రహాలు కనిపిస్తాయి. తలకి ఎలాంటి ఆభరణాలూ లేని రెండు చేతుల గణేశుల్ని ఇక్కడ చూడవచ్చు. జావాకు వెళ్తే నిలుచున్న నాలుగు చేతుల విఘ్నేశ్వరులనూ దర్శనం చేసుకోవచ్చు. 
      ఎనిమిదో శతాబ్దానికి చెందిన గణేశ విగ్రహం బోర్నియో ద్వీపంలో (దక్షిణ చైనా సముద్ర హద్దుల్లో ఉంటుంది) ఉంది. కూర్చుని కనిపించే పెద్ద చెవుల గణేశ ప్రతిమలూ ఇక్కడున్నాయి. పొడవాటి తొండం, గుండ్రంగా దువ్విన తలకట్టులతో కనుబొమ్మల మధ్య ఎత్తుగా ఉంటుంది. ఇదీ బౌద్ధులు మహాపురుష లక్షణంగా భావించేదే.
ఉత్తరీయంతో సహా...
రాతి గణేశ శిల్పాలు చైనాలో చాలా ఉన్నాయి. రెండు చేతులతో, బాసింపట్టు వేసుకుని కూర్చున్న క్రీ.శ.531 నాటి ఓ శిల్పం కుంగ్‌సిన్‌లో ఉంది. కుడిచేతిలో తామర పువ్వు, ఎడమచేతిలో ఆభరణాలు కనిపిస్తాయి. దాని కింద ‘‘ఏనుగులకు రాజు’’ అని ఉంటుంది. కొన్ని వినాయక శిల్పాలు తామర పువ్వులతోబాటు గొడ్డలినీ ధరించి దర్శనమిస్తాయి. 
      ఖోటాన్‌లోనూ (ప్రస్తుత పశ్చిమ చైనాలోని హోటాన్‌) ఎన్నో పురాతన కంచు వినాయక విగ్రహాలు బయటపడ్డాయి. ఇక్కడి గణేశుడూ బాసింపట్టు వేసుకుని ఉంటాడు. గజాననుడి వర్ణచిత్రం ఒకటి ఖాక్లిక్‌లో లభ్యమైంది. ఇందులో ఆయన నాలుగు చేతులతో... తినుబండారాలు, అంకుశం, దంతం ధరించి కనిపిస్తాడు. ధోవతి, పైన ఉత్తరీయం ధరించినట్లు చిత్రించారు. 
      పదో శతాబ్దం నుంచి జపాన్‌లో వినాయకుడు వాసికెక్కాడు. సాధారణంగా ఇక్కడ నాలుగు/ ఆరు చేతులతో, నిల్చున్న భంగిమలో కనిపిస్తాడు. ముఖం ప్రసన్నం. కాకు-జెన్‌-చోలోని ఓ కొండ మీద త్రిముఖ గణపతి కనిపిస్తాడు. ఒక్కో తలకు మూడేసి కళ్లు... చేతుల్లో కత్తి, ఉండ్రాయిలాంటివి ఉంటాయి. ఈయన్నూ ‘‘ఏనుగుల రాజు’’గానే పిలుస్తారు. 
      విఘ్నాలు ఎదురుకాకుండా కాయమని కోరుకుంటూనే అన్నిచోట్లా గణపతిని కొలుస్తున్నారు. అలా రక్షించగలడన్న నమ్మకంతోనే బౌద్ధులూ ఆయన్ను స్వీకరించారు. కాకపోతే వాళ్లు మహాపురుష లక్షణాలుగా భావించే వాటిని వినాయకుడిలో చూపించడానికి ప్రయత్నించారు. మొత్తమ్మీద మన విఘ్నరాజే విభిన్న రూపాలలో ఆసియా అంతటా కొలువుదీరాడు.


వెనక్కి ...

మీ అభిప్రాయం