కథల పెన్నిధి

  • 676 Views
  • 6Likes
  • Like
  • Article Share

చిన్నపిల్లలకు చెప్పే నీతి కథలనుంచి లోతైన ఆధ్యాత్మిక కథల వరకూ అన్నీ ఒకేచోట కొలువైతే ఎలా ఉంటుంది? చదవాలన్న కుతూహలం పెరగడంతో పాటుగా తెలియని ఎన్నో విషయాలను తెలుసుకునే వీలుంటుంది కదా! ఇదిగో ఈ వెబ్‌సైట్‌ అలాంటిదే!
గుంటూరు జిల్లా
మంగళగిరికి చెందిన గుర్రం కృష్ణప్రసాద్‌ శ్రీకరి టెక్నాలజీలో హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌. తెలుగు భాషను అందరికీ చేరువచేయాలనే సంకల్పంతో 2013లో ‘తెలుగు పెన్నిధి.కామ్‌’ను ప్రారంభించారు. నీతికథలు, నీతిచంద్రిక, విజ్ఞానం, బాలమాలిక, ధర్మశాస్త్రం, పురాణ ఇతిహాసాలు, పద్యశతకాలు ఇలా ఒక్కో అంశంలో వైవిధ్యభరితమైన కథలూ, కథనాలను పొందుపరిచారు. 
నీతి కథలు
పేదరాశి పెద్దమ్మ కథలు, పిట్ట కథలు ఇలా అనేకం ఉంటాయి. ‘అతి మోహం’ కథలోని ‘ప్రతీదీ తనకు తానుగా ఎదగాలి. అప్పుడే తన సామర్థ్యం తెలుస్తుంది’ అనే వాక్యం ఆలోచింపజేస్తుంది. మనం మాట్లాడే తీరును బట్టే మనకు శత్రువులు తయారవుతారని ‘శత్రువులు- మిత్రులు’ కథ చెబుతుంది. ఒక అమ్మాయిని ఆరాధించే పులి కథ ‘పులి- ప్రేమ’ ఆసక్తికరం. బామ్మలు చెప్పే కమ్మటి కథల్లాంటివి ఇవి. 
నీతి చంద్రిక
నలదమయంతుల చరిత్ర, రామా యణ, మహా భారత, భాగవత కథలను ఇందులో చూడొచ్చు. మార్గశిర మాస వ్రతఫలం, శివరాత్రి మహిమ, మేదినీవలయం, దేవీ భాగవత కథలు ఆద్యంతం చదివిస్తాయి. ఇందులోని ‘శునకతీర్పు’ కథైతే నవ్వు తెప్పిస్తుంది. స్వర్గారోహణ పర్వం కథలో ధర్మరాజు, ఇంద్రాదులు, నారదుల మధ్య సంభాషణ చాలా ఆసక్తిదాయకంగా సాగుతుంది.
బాలమాలిక
‘తెలుగు పెన్నిధి’లోని కథల్లో అత్యధికం చిన్నారులకోసం ఉద్దేశించినవే. దానికి అనుగుణంగా పంచతంత్ర, భట్టి విక్రమార్క, కాశీమజిలీ, తెనాలిరామకృష్ణ, మర్యాద రామన్న కథలన్నీ ఇక్కడ కొలువుదీరాయి. 
విజ్ఞాన భాండాగారం
పిల్లలనుంచీ పెద్దవాళ్ల వరకూ అందరికీ ఉపయోగపడే ఎన్నో ఆసక్తికర విషయాల సమాహారమిది. తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల చరిత్ర, ప్రాచీన గ్రంథాలయాల విశిష్టత అబ్బురపరుస్తాయి. 
మరికొన్ని విశేషాలు..!
వేమన, కుమార, భాస్కర, దాశరథి పద్యశతకాలను, వాటి అర్థాలను ఈ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. వీటితోపాటుగా మన సంస్కృతీ- సంప్రదాయాలు, పండగలు- వాటి విశిష్టత, వ్యక్తిత్వ వికాసం, ధర్మశాస్త్రాలకు సంబంధించిన సమాచారమూ అందుబాటులో ఉంది.


ఎందరో మహాకవులు, రచయితలు తెలుగుభాష మాధుర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఇంతటి ఘనచరిత్రను కలిగిన తెలుగు ప్రాభవం నేడు కొడిగొట్టుకుపోతోంది. విద్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, చివరికి తెలుగు లోగిళ్లలో కూడా అమ్మభాషను చిన్నచూపు చూస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మన భాష కొన్నాళ్లకు కనుమరుగయిపోతుందేమో అనే భయం వేసింది. అందుకే నావంతుగా ఈ వెబ్‌సైట్‌ ప్రారంభించాను. మనదైన జానపద కథాసాహిత్యం, పురాణాలు, ఇతిహాసాలు, భారతీయ విజ్ఞానం, మన జీవనవిధానాలు, సంస్కృతీ-సంప్రదాయాలు మరుగున పడకూడదనే ఉద్దేశంతో స్నేహితులతో కలిసి ఈ సైట్‌ను నిర్వహిస్తున్నాను. భాషాసంస్కృతుల గొప్పదనాన్ని నేటితరానికి చాటడమే మా ఉద్దేశం.

- కృష్ణప్రసాద్‌


 


వెనక్కి ...

మీ అభిప్రాయం