బాపూజీ బాటలో కథల ప్రయాణం

  • 218 Views
  • 0Likes
  • Like
  • Article Share

    మధురాంతకం నరేంద్ర

  • తిరుపతి
  • 9866243659
మధురాంతకం నరేంద్ర

మన దేశానికి స్వాతంత్రం వచ్చాక, దాదాపు 70 ఏళ్ల తర్వాత, ఇప్పుడు, ఆనాటి సంరంభాన్నీ, ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఊహించడం కష్టం. దాని ప్రతిఫలనాన్ని గమనించడానికి ఆనాటి సమకాలీన సాహిత్యాన్ని చదవడమొకటే మార్గం.
      భారత స్వాతంత్య్రోద్యమమంటే గాంధీ అని, గాంధీ అంటే స్వాతంత్రోద్యమమేననీ అప్పుడూ, ఇప్పుడూ భావిస్తూనే ఉన్నారు. భారతదేశంలోని అన్ని భాషా సాహిత్యాలపైనా గాంధీ ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. తెలుగులో తుమ్మల సీతారామమూర్తి చౌదరి ‘బాపూజీ ఆత్మకథ, మహాత్మ కథ’ అన్న కావ్యాలే రాశారు. ఉన్నవ ‘మాలపల్లి’ లాంటి తొలినాటి నవలల్లో గాంధీ ప్రభావం కనపడుతుంది. 1950లకే బలంగా తయారైన తెలుగు కథానికపైనా ఆ ప్రభావం వ్యాపించింది. అలాంటి కొన్ని కథానికలతో ఒక కథా సంకలనాన్ని వెలువరించడం మాత్రం ఒక్కసారే జరిగింది. ఆ పుస్తకం పేరు ‘తాత దిగిపోయిన బండి’. సంపాదకుడు మధురాంతకం రాజారాం. కృష్ణాజిల్లా అవనిగడ్డలోని గాంధేయ సమాజ సేవా సంస్థ (గాంధీ క్షేత్రం) ప్రచురించిన ఈ కథాసంకలనం జూన్, 1987లో మొదటి ముద్రణ పొందింది. 
ఆ ఆదర్శాల వెలుగులో...
పన్నెండు కథల ఈ సంకలనం విశ్వనాథ సత్యనారాయణ ‘జీవుడి ఇష్టము’తో ప్రారంభమవుతుంది. ‘అలిగరీ’ రూపంలో ఆనాటి పాలకులకూ, పాలితులకూ మధ్య ఉండే తేడాను ఆవిష్కరించిన కథ ఇది. పాశ్చాత్య పాలకులు పాశవికంగా మాత్రమే భారతీయులను గెలవగలరనీ, భారతీయుల అభిమానాన్నీ, గౌరవాన్నీ పొందలేని దురవస్థలో ఉన్నామని గుర్తించ లేకపోయారనీ రచయిత నిరూపిస్తారు. ఓ స్త్రీ భర్తనూ, పిల్లలనూ చంపి, ఆమెను అమానవీయంగా వేధించిన రాజు చివరకు పరాజితుడే అవుతాడు. ఆమెనూ చంపేశాక మరో స్త్రీని కూడా అదే మార్గంలో సంపాదించడానికి పూనుకుంటాడు. అది అతడికి తగిన పనే అనీ, అతడి జాతికి జీవుని ఇష్టమంటే తెలియదని ఆమె  చెప్పే మరణిస్తుంది.
      ఇందులో కరుణ కుమార కథలు రెండున్నాయి. గాంధీవాదపు ఆదర్శాన్ని బలపరిచేది ‘ఉన్నతోద్యోగాలు’. నీతికీ నియమానికీ కట్టుబడిన ఓ రెవిన్యూ ఇన్‌స్పెక్టరుకు పదోన్నతులు రావు. రైతులకూ, హరిజనులకూ పోట్లాట జరిగినప్పుడు ఆయన సత్యాగ్రహం చేసి, గాంధీ మార్గంలో విజయాన్ని పొందుతాడు. ప్రధానమంత్రే దిగివచ్చి ఆయన్ను జిల్లా కలెక్టర్‌ను చేస్తారు. దీంతో పోలిస్తే రెండో కథ ‘పోలయ్య’ చాలా వాస్తవికంగా ఉంటుంది. ఓ అర్ధరాత్రి రైల్వేస్టేషన్‌ నుంచి తన ఊరికి వెళ్లడం కోసం ఓ ఎద్దుల బండివాణ్ని ప్రాధేయపడి బయల్దేరతాడో పండితుడు. తీరా ఊరిని చేరేముందు ఆ బండివాడు హరిజనుడని తెలుసుకుని మండిపడతాడు. అతణ్ని తాను తాకడానికీ అతనే కారణమని రుద్రుడవుతాడు. ఊరు చేరాక, తనవాళ్లను ఎగదోసి, కాల్చిన ఇనపకడ్డీతో అతనికి వాతలు తీయడానికి పూనుకుంటాడు. ఆ బండివాడు చావు తెలివితో తన పేరు పోలయ్య గాదనీ, పౌలయ్య అనీ, తాను హరిజనుణ్ని కాదనీ, క్రైస్తవుణ్ని అని అనేస్తాడు. దొరలకూ, క్రైస్తవులకూ భయపడే పండితవర్గం అతణ్ని వదిలేస్తుంది. హరిజనులకు మతమార్పిడి తప్ప మరో గత్యంతరం లేని దురవస్థను ఈ కథ నాజూకైన వ్యంగ్య ధోరణిలో ఎండగడుతుంది.
దేశమే ప్రధానం
చలం ‘సుశీల’ ఆయన ఇతర కథలకు భిన్నమైంది. భర్త నారాయణప్ప మీదుండే గౌరవాన్ని, సుశీలకు సులేమాన్‌ మీదుండే ప్రేమ మొదట్లో జయిస్తుంది. అయితే దేశం కోసం, ప్రజల కోసం తన ఆరోగ్యాన్నే అర్పించిన నారాయణప్ప గొప్పతనం ముందు సులేమాన్‌ పట్ల ఆమెకుండే వ్యక్తిగతమైన ప్రేమ వీగిపోతుంది. ‘దేశంలోంచి ఉద్యమం పోతే పోవచ్చు. కానీ నా హృదయంలోంచి పోదు.. ఈ ఉద్యమం, ఈ త్యాగం వృథా కావచ్చు. దేశంలో ఏమీ ఉపయోగం లేకపోవచ్చు. కానీ ఒక జీవితానికన్నా గొప్ప ఉపకారం చేసింది. ఆదర్శాన్నీ, ఆనందాన్నీ, ఆసక్తినీ ఇచ్చింది’ అంటుంది సుశీల.
      కొనకళ్ల వెంకటరత్నం ‘చివరికి మిగిలిన రంగడు’ విషాధ గాథ. హరిజనుల సేవకోసం పెంచుకున్న కొడుకునే త్యాగం చేసిన శివయ్య శాస్త్రిని బ్రిటిషు ప్రభుత్వం ఖండాంతర జైలు శిక్ష పాలు చేస్తుంది. పదహారేళ్ల తర్వాత శివయ్య తిరిగివస్తాడు. తాను ముద్దుగా పెంచుకున్న రంగడు రంగారావై, బ్రిటీషు కొలువులో సబ్‌ఇన్స్‌పెక్టర్‌గా ఉంటూ దేశభక్తుల్ని వేటాడుతున్నట్టు తెలుసుకుంటాడు. దాంతో ఆయన గుండె పగిలిపోతుంది.
రెండు పార్శ్వాలు
అడివి బాపిరాజు భావుకత ‘వడగళ్లు’ అనే కథలోనూ కనపడుతుంది. దేశ విభజన తర్వాత పంజాబునుంచి పారిపోయి వచ్చిన కుటుంబంలోని అమ్మాయికీ, ఓ హైదరాబాదు యువకుడికీ మధ్య మొలకెత్తిన ప్రేమను బాపిరాజు సుందరస్వప్నంలాగే పలవరించారు. అమరేంద్ర ‘సమర్పణ’ కథ ఆ భావుకతకు విరుగుడు లాంటిది. నాటి పంజాబు మారణహోమంలో కొడుకునూ, కోడలినీ ఊచకోత కోయడం చూసిన ముసలావిడ, ప్రాణాలు చేతబట్టుకుని, మనవడితో పాటూ దిల్లీకి పారిపోయి వస్తుంది. ఇంతటి దారుణానికి గాంధీనే కారణమనుకుని, ఆయన్ని పట్టుకుని దుయ్యబట్టాలనుకుంటుంది. తీరా ఓ ప్రార్థనా సభలో ఆయన్ని చూసినప్పుడు తాను పొరబడ్డాననీ, గాంధీ కూడా నిస్సహాయుడైపోయాడని తెలుసుకుంటుంది. తన కళ్లముందే గాంధీ హత్య జరిగిపోయినప్పుడు, తనకూ, తన మనవడికీ దిక్కెవరని ఘోషిస్తూ వెనక్కు విరుచుకు పడిపోతుంది.
ఈ సంకలనంలో మిగిలిన అయిదు కథలూ స్వాతంత్య్రం వచ్చాక భారత ప్రజాస్వామ్యంలో జరిగిన దుర్మార్గ పరిణామాలను తూర్పారపడతాయి. క్రమంగా స్వాతంత్య్ర దినోత్సవమనే పండగ కూడా ధనవంతులకూ, స్వార్థ రాజకీయ నాయకులకూ మాత్రమే మేలు చేస్తోంది. అమాయకులూ, పిల్లలూ, స్త్రీలూ దోపీడీకి గురవుతున్నారు. స్వాతంత్య్ర దినం నాడు గాంధీ పటాన్ని ఊరేగించిన ఒంటెద్దు బండే మర్నాడు చెత్తను మోసుకెళ్లడానికి ఉపయోగపడుతోంది. ‘నిన్న బండిలో తాత కూర్చున్నాడు... తాతగారి అడుగుజాడల్లో అందరూ నడిచారు. ఇప్పుడు బండిలో తాతలేడు. మరేముంది? చెత్తా చెదారం, కుళ్లు కంపు.. అది తాత దిగిపోయిన బండి. దాని ప్రతిష్ట తాతతోనే పోయింది’ అని వాపోతారు కథకుడు కలువకొలను సదానంద ‘తాత దిగిపోయిన బండి’లో. 
ఆయనే తిరిగివచ్చినా...
భారతీయులపైన బెంగపెట్టుకుని, స్వర్గంలో సత్యాగ్రహం చేసి, అనుమతి తీసుకుని తిరిగొస్తారు గాంధీ. ధనవంతుల్ని కాదని, సన్మానాల్ని విడిచిపెట్టి మురికివాడల్లో దరిద్రుల సేవలో చేరిపోతారు. మహాత్ముడి వేషంలో ప్రజల్ని మోసగిస్తున్నారని ఆయన్ని అరెస్టు చేస్తారంటూ దాశరథి రంగాచార్య తన ‘మళ్లీ మహాత్ముడు మన మధ్యకు వచ్చాడు’లో నిట్టూరుస్తారు. నగరం మధ్యలో ఉన్న హరిజనవాడకు నిప్పంటించి, కూలీనాలీ చేసుకునే జనాల్ని తరిమిగొట్టి, అక్కడో అందమైన పార్కును నిర్మించాక, దాని పక్కనుండే తన స్థలానికి గిరాకీ పెంచుకున్నాక, సరిగ్గా అక్కడే గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఓ ఊరి ఛైర్మన్‌. వర్షం కురిసినప్పుడు విగ్రహం కంట్లోంచి నీళ్లు కారుతుంటే గాంధీ ఏడుస్తున్నట్టే ఉందంటారు దాదాహయాత్‌ ‘ప్రదర్శన’ కథలో.
      డాక్టర్‌ పి.కేశవరెడ్డి తొలినాటి కథ ‘ది రోడ్‌’లో ఆయన ఆ తర్వాత హరిజనోద్యమం గురించి రాసిన నవలల బీజాలన్నీ స్పష్టంగా కనబడతాయి. గాంధీ జయంతినాడు హరిజనవాడకూ, అగ్రహారానికీ మధ్య రోడ్డు వేయడానికి పూనుకున్న హరిజన సైనికుణ్ని బానిస స్వభావముండే స్వజనులే మోసం చేస్తారు. ఆ యువకుడు అగ్రవర్ణాల దురాగతాల్ని ఎండగట్టే పరిస్థితెప్పుడొస్తుందని ఆక్రోశిస్తాడు. మన ప్రజాస్వామ్యమనే మేడిపండును మధురాంతకం రాజారాం కథ ‘అజ్ఞాతవాసం’ విప్పి చూపుతుంది. రిజర్వేషన్ల పుణ్యమా అని గ్రామ సర్పంచి అయిన ఆసాది గంగడుకు ఒరిగేదేముంది? ఉన్న కూలి పనులకు కూడా అతణ్నెవరూ పిలవరు. దాంతో జిల్లా కేంద్రానికెళ్లి కూలిపనులు వెతుక్కోక తప్పదు. అడ్రసు లేని గంగడికి ఆ ఊర్లో దొరికిన ఏకైక దిక్కు నాలుగు రోడ్ల కూడలిలో శిల్పమై నిలిచిన గాంధీ మాత్రమే.
అలా వచ్చిన ఆలోచనతో...
ఈ కథలకు భూమికగా కొండా వెంకటప్పయ్య పంతులు ‘నేనెరిగిన గాంధీ మహాత్ముడు’ అనే వ్యాసమూ, భారత వాక్యంగా ‘గాంధీ మతం యొక్క భవిష్యత్తు’ అనే డా।। భోగరాజు పట్టాభి సీతారామయ్య వ్యాసమూ నిలిచాయి. 1986 ప్రాంతంలో ఆకాశవాణి వాళ్లు నిర్వహించిన కథా పఠన కార్యక్రమంలో పాల్గొనడం కోసం మధురాంతకం రాజారాం అవనిగడ్డలోని గాంధీ క్షేత్రానికెళ్లారు. అక్కడ మండలి బుద్ధప్రసాద్‌తో మాటల సందర్భంలో గాంధీ ప్రభావముండే తెలుగు కథల ప్రసక్తి వచ్చింది. వెంటనే బుద్ధప్రసాద్‌ ఆ కథలను సేకరించి ఇవ్వమని రాజారాంను అడిగారు. ఆ వ్యవధిలో ఎన్నిక చేసిన కథలతో ఈ పుస్తకం తయారైంది. సదానంద ‘తాత దిగిపోయిన బండి’ ఈ సంకలనానికి సరిగ్గా సరిపోయే పేరైంది. 
      ఈ సంకలనాన్ని బుద్ధప్రసాద్‌ వాళ్ల నాన్నగారు మండలి వెంకట కృష్ణారావుకు అంకితం చేశారు. మండలి వెంకట కృష్ణారావుకు గాంధీపైన ఉండే గౌరవానికీ, తెలుగు కథానికతో రాజారాంకు ఉన్న ప్రగాఢమైన అనుబంధానికి చిహ్నంగా ‘తాత దిగిపోయిన బండి’ మిగిలిపోయింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం