ఆయన వ్యాసుడూ, వాల్మీకీ

  • 282 Views
  • 1Likes
  • Like
  • Article Share

    ఎర్రాప్రగడ రామకృష్ణ

  • రాజమహేంద్రవరం,
  • 9397907344
ఎర్రాప్రగడ రామకృష్ణ

ఓ కవి, అందులోనూ 94 ఏళ్ల వ్యక్తి మరణిస్తే, సంతాపసూచకంగా ఆ నగరంలోని వాణిజ్య సముదాయాలన్నీ మూతపడటం, ప్రజలంతా నివాళులు అర్పించడం ఈ రోజుల్లో ఊహించడానికే సాధ్యం కాదు. ఊళ్లోని పురపాలక సంస్థ మాత్రమే కాదు, ఆనాటి రాజధాని నగరం హైదరాబాదు మహానగర పాలక సభ్యులు సైతం సంతాప తీర్మానం చేశారంటే నమ్మబుద్ధి కాదు. కానీ అది నిజం! ఈ గౌరవం శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రికి దక్కింది. ఈ ‘అభినవ శ్రీనాథుడి’ 150వ జయంత్యుత్సవాల వేళ అక్షర నీరాజనమిది...  
తూర్పుగోదావరి
జిల్లా దేవరపల్లిలో 1866 అక్టోబర్‌ 29న జన్మించిన కృష్ణమూర్తి శాస్త్రి సాహితీసేవ ఎనిమిది దశాబ్దాలకుపైగా కొనసాగింది. 1960 డిసెంబరు 29న దేహయాత్ర చాలించే వరకు ఆయన సాహిత్య వ్యవసాయం సాగుతూనే ఉంది. సాహితీ రంగంలో ప్రతిభావంతులు చాలామంది ఉంటారు కానీ, కారణ జన్ముడిగా గుర్తింపు పొందినవారు అరుదు. ఆదిభట్ల, కొప్పరపు కవి సోదరుల మాదిరిగా శ్రీపాదని సైతం కారణజన్ముడిగా లోకం సంభావించింది. దీనికి కారణం... భారత భాగవత రామాయణాలను, శంకర వాఙ్మయాన్ని తెలుగులోకి ఒంటిచేత్తో అనువదించిన ఆయన ప్రజ్ఞ. 225కు పైగా బృహత్‌ కావ్యాలను రచించిన శ్రీపాద... ‘కవి సార్వభౌమ, మహామహోపాధ్యాయ, కళాప్రపూర్ణ, ఆంధ్ర వ్యాస, అభినవ శ్రీనాథ,  వేదవిద్యా విశారద, ప్రసన్న వాల్మీకి’ బిరుదాంకితులు.
      ‘‘శ్రీయుతువెట్లో యాకవి విరించులు మూవురు భారతమ్మాత/ శ్రీయనిపించి చచ్చి చెడి చేసిన విన్నప మన్నటుల్‌ యశః/ శ్రీయుతులైర దెంతటి విశేషము? నీవసహాయ శూరతన్‌/ శ్రీయుత కృష్ణ భారతము చేయ దొడంగితి వెంత వాడివో!’’ అంటూ ఆనాటి ఆనాటి పండిత కవులందరి పక్షాన చేసిన శ్రీపాద కీర్తిగానం చేశారు కాశీ కృష్ణాచార్యులు. ‘సాహిత్యమే జీవితంగా, జీవితమే సాహిత్య రంగంగా నిండుగ జీవించి, దండిగ రచనలొనర్చి పండి రాలిపోయిన ధన్యజీవి’ అని పత్రికలు శ్రీపాదకు నివాళులు అర్పించాయి. 
      శ్రీపాద అశేష శేముషిని విద్వాంసులు గుర్తించడమే కాదు, దానికి ప్రజలు అబ్బురపడ్డారు. సమకాలీన పండిత కవులు అవునని తలలు పంకించారు. పత్రికలు ప్రశంసించాయి. ప్రభుత్వాలు గౌరవించాయి. చరిత్ర దాన్ని నమోదు చేసింది. ఆనాటి భారత ప్రభుత్వం ‘యావద్భారత గైర్వాణివాణీ దురంధరుడి’గా శ్రీపాదను ఎంపిక చేసింది. ఒడిశాలోని మయూర్‌ధంజ్‌ సంస్థానం గజారోహణతో సత్కరించింది. నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయన్ను ‘ఆస్థానకవి’ని చేసింది. ఓ నిజమైన పండితునికి, అర్హుడైన ప్రతిభావంతునికి దక్కిన గౌరవాలివి.
మనసు నవనీతం
కిట్టనివారు శ్రీపాదను దూర్వాసుడి  అంశగా విమర్శించేవారు. ఆయనంటే ఇష్టపడేవారు దానికి సమాధానంగా ‘నిండు మనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణాఖాండల శస్ర తుల్యము’ పద్యాన్ని వినిపించేవారు. భాషా విషయకంగా ఆయన పరమ ఉగ్రుడిగా కనిపించారన్నది వాస్తవం. 1923లో గిడుగు సీతాపతి- శ్రీపాద గ్రాంథిక భాషాభిమానాన్ని తీవ్రంగా విమర్శిస్తూ పద్యాలు ప్రచురించారు. తర్వాత రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో ఇద్దరూ ఓసారి తటస్థపడ్డారు. ‘‘నిన్ను ఏమి చేయాలో తెలుసునా?’’ అని శ్రీపాద ఆగ్రహావేశంతో గిడుగును ప్రశ్నించారు. ‘‘మీ వజ్రాయుధంతో పొడవండి’’ అని గిడుగు బదులిచ్చారు. అంతే! తాటాకు మంటలాంటి శ్రీపాద కోపం చప్పున చల్లారిపోయింది. సీతాపతిని ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు. ‘వజ్రాయుధం’ శ్రీపాద నిర్వహించిన పత్రిక కావడమే ఇక్కడి చమత్కారం! 
      శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి శిష్యకోటిలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి ఒకరు. కుమార సంభవం, మేఘసందేశాల్లో కొన్ని భాగాలతో పాటు చదరంగంలో ఆయన ప్రవేశానికీ శ్రీపాద శిష్యరికం కారణం. ఆ గురుశిష్యులు సైతం తగాదాలు పడ్డారు. న్యాయస్థానాలకు వెళ్లారు. అయినా వారిద్దరి మధ్యా ప్రేమాభిమానాలకు లోటుండేది కాదు. కడియంలో బయల్దేరిన చెళ్లపిళ్ల ధవళేశ్వరంలోని శ్రీపాద వారింట్లో భోజనం చేసేవారట. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే గుర్రపు బండిలో రాజమండ్రి వచ్చి, న్యాయస్థానంలో తగాదాలు పడేవారట. భాషా సాహిత్యాలకు సంబంధించిన వైరం వాళ్ల హృదయాలను కలుషితం చేయలేదని చెప్పడానికీ, ఆనాటి విద్వాంసుల భాషాభిమానాన్ని అర్థం చేసుకోవడానికీ, వాళ్ల హృదయ వైశాల్యాన్ని గుర్తించడానికీ ఇలాంటి ఉదంతాలు ఉపకరిస్తాయి. గురువును గండపెండేరంతో సత్కరిస్తూ చెళ్లపిళ్ల చెప్పిన ఈ ఆశు పద్యం వారి అంతరంగ స్వచ్ఛతకు అద్దం పడుతుంది...
అనితర సాధ్యమైన భరతాన్వయ పుణ్య చరిత్ర తెల్గు బా/ సను వెలయించినార్ముగురు సత్కవులు! ఈ కవి సార్వభౌముడో/ తన యొక చేతి మీదుగనె తత్కృతి నిర్వహణం బొనర్చి మిం/ చెను కవి గండపెండెరము చేతికొసంగుదమొక్కొ వేలికో!
      కృష్ణాచార్యుల పద్య భావం చెళ్లపిళ్ల హృదయం ఒకటే కావచ్చు గానీ, శ్రీపాద సాహిత్య కృషి పట్ల ఇద్దరు ఉద్ధండ పండితులు ఒకేలా స్పందించడం, సంభావించడం విశేషం. ఆ సాహిత్య స్వర్ణయుగం స్వరూప స్వభావాన్ని అధ్యయనం చేయడానికి, ఆ రోజుల్లో దాని వైభవాన్ని అవగతం చేసుకోవడానికి ఈ ఘట్టాలు దారి చూపిస్తాయి. 
‘సహపఠనం’లో సాటెవ్వరు?
సాహితీ సంపద్విశిష్టతలో శ్రీపాద ‘శ్రీకృష్ణ భారతం’- కవిత్రయ భారతంతో సరితూగలేదు. కానీ, వ్యాస మహాభారతానికి ధారాళమైన శైలిలో ఆవిష్కృతమైన సర్వ సమగ్ర అనువాదంగా అది చరిత్రలో నిల్చిపోయింది. శ్రీపాద ‘బొబ్బిలియుద్ధం’ నాటకం రసజ్ఞుల నాలుకల మీద నర్తించింది. తన పన్నెండో ఏట ‘‘తొర్రేటి గ్రామమందున/ కుర్రా! సంభావనిచ్చి కుదురుగ నీకున్‌/ బర్రెల పెరుగుతొ నన్నము/ జుర్రంగా పెట్టగలరు చక్కంబోరా!’’ అన్న చిన్న కంద పద్యంతో శ్రీపాద కవితాధార మొదలైంది. కావ్యాలు, ప్రబంధాలు నవలలు, నాటకాలు, ప్రహసనాలు, నిఘంటువులు, శతకాలు, అష్టకాలు, ఛందోవ్యాకరణ గ్రంథాలు... ఒకటేమిటి, సమస్త సాహిత్య ప్రక్రియల్లోనూ అది తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. 
      ఆ రోజుల్లో చిత్ర, బంధ, గర్భ కవిత్వాల్లాంటి విన్యాసాల మీద ప్రజలకు మోజుండేది. శ్రీపాద కలం నుంచి అలాంటి వాటితోపాటు నిరోష్ఠ్య గ్రంథాలు సైతం వెలువడ్డాయి. అష్ట, శత, చిత్రావధానాల్లాంటి వాటిని దేశవ్యాప్తంగా ప్రదర్శించి అనేక సన్మానాలు, బహుమానాలు, బిరుదులు అందుకున్నారు. ఆయన అవధానాల్లో ఈ రోజుల్లో కనిపించని ‘సహపఠనం’ అనే అంశం ఉండేదని ఆయనే చెప్పుకున్నారు. ‘సహపఠనం’ అంటే- ఎవరు ఏ భాషలోని గ్రంథాల గురించి చర్చిస్తే వాళ్లతో ఆ భాషలో ఆ రచనల గురించి అవధాని అనుసరించడం. దీనికి బహుముఖీనమైన భాషా పరిజ్ఞానం, విశేష భాషా పాండిత్యం అవసరం. 
జాతి వైభవ దీప్తి
‘నేను పూర్వాచార పరాయణుడ నైనను కాలమును బట్టి సమయోచితముగ ప్రవర్తింతును... ఉత్తమోత్తముడగు మహానుభావుడను, మడిగట్టుకుంటినని చెప్పనుగాని... సర్వ విషయములందును యుక్తాయుక్తములను సాధ్యమైనంతవరకు పాటించి జాగరూకుడనై ప్రవర్తించు చుంటినని మాత్రము చెప్పగలను’ అని ‘నా జీవితం’లో శ్రీపాద ప్రకటించారు. అది ఆయన స్వీయచరిత్ర. విస్తృతంగా సాహితీ సృజన చేస్తూనే ‘కళాభాషిణి మానవసేవ, వజ్రాయుధం, గౌతమి, వందేమాతరం’ లాంటి పత్రికలనూ నిర్వహించారు. వీటిలో ‘గౌతమి’ తొలితరం దినపత్రికల్లో ఒకటి.  
      ‘తమ పూర్వీకుల గొప్పదనాన్ని గుర్తించడం రానివారికి, గర్వించడం రానివారికీ ఘనకార్యాలు సాధించాలనే కుతూహలం సైతం అరుదే’ అన్నది మనస్తత్వ శాస్త్రవేత్తల అభిప్రాయం. మహాకవులు మన ఆత్మ ప్రత్యయానికి ప్రతీకలు. మన సంస్కృతికి ప్రతినిధులు. వారిని స్మరించడం, గౌరవించడం అంటే మన జాతిని మనం గౌరవించుకున్నట్లు. మన సంస్కృతిని మనం గౌరవించినట్లు.


వెనక్కి ...

మీ అభిప్రాయం