మాతృభాషే పునాది

  • 374 Views
  • 5Likes
  • Like
  • Article Share

‘పిల్లాడు తన మాతృభాష మీద పట్టు సాధించినప్పుడు, మిగతా భాషలను చాలా తేలికగా నేర్చేసుకుంటాడు’ అన్న మాటను తరచూ వింటూనే ఉంటాం. ఇప్పుడు ఆ మాటను రుజువుచేసే పరిశోధన ఒకటి జరిగింది. నెదర్లాండ్స్‌కు చెందిన క్రిస్టియన్‌ వెబర్‌ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో... ఏదన్నా కొత్త భాషను నేర్చుకునే సమయంలో, మన మెదడులో ఎలాంటి చర్యలు జరుగుతాయో పరిశీలించారు. ఇందుకోసం ‘ఫంక్షనల్‌ మాగ్నెటిక్‌ రిసొనెన్స్‌ ఇమేజింగ్‌ (ఎఫ్‌ఎంఆర్‌ఐ) అనే అధునాతన ప్రక్రియను ఉపయోగించారు. మన మెదడులోని రక్తప్రసారంలో కలిగే మార్పులను పరిశీలించడం ద్వారా దాని పనితీరుని గ్రహించేందుకు ఈ ఎఫ్‌ఎంఆర్‌ఐ ఉపయోగపడుతుంది.
      ఈ పరిశోధన కోసం ‘అలియనీస్‌’ అనే ఓ కొత్త భాషను రూపొందించారు. అలా రూపొందించిన భాషలోని పదాలను, వాటితో రూపొందించిన వాక్యాలను కొంతమంది అభ్యర్థులకు నేర్పారు. వాళ్లు ఆ వాక్యాలను పలికేటప్పుడు, మెదడులో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించారు. వారు పలికే వాక్య నిర్మాణం మాతృభాషకు దగ్గరగా ఉన్నప్పుడు, మెదడులో పెద్దగా మార్పులు సంభవించలేదు. మాతృభాషకు భిన్నంగా సాగిన వాక్య నిర్మాణాలను పలికినప్పుడు మాత్రం మెదడులో కొన్ని అనూహ్యమైన మార్పులు సంభవించడాన్ని గమనించారు. ఒక వ్యక్తి ఏదన్నా కొత్త భాషను నేర్చుకునేటప్పుడు, దానిని తన మాతృభాష పునాదిగానే నేర్చుకుంటాడని దీని వల్ల అర్థమైంది. కొత్త భాషలోని క్రియాపదాలు, వాక్య నిర్మాణం తన మాతృభాషకు అనుగుణంగా ఉన్నప్పుడు.. మెదడు పెద్దగా కష్టపడదు. దానికి భిన్నమైన పదాలనూ, వాక్యాలనూ నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం దానిని గుర్తుంచుకునేందుకు తగిన వ్యవస్థను రూపొందించుకోవాల్సి వస్తుంది. ఈ పరిశోధన తేల్చి చెబుతోంది ఇదే. 
      ఇటీవల అమెరికాలో జరిగిన మరో పరిశోధన కూడా ఈ విషయాన్ని నిర్ధరించింది. మాతృభాషలో మంచి పట్టు ఉన్న విద్యార్థులే ఆంగ్లాన్ని త్వరగా నేర్చుకోగలుగుతున్నారని అక్కడి విశ్వవిద్యాలయ ఆచార్యులు తేల్చారు. స్పానిష్‌ చిన్నారులను పరిశీలించి వాళ్లు ఈ నిర్ధరణ చేశారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం