నిన్ను త‌ల‌చుకుంటూ...

  • 113 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వై.సందీప్

  • జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠాశాల,
  • బేతవోలు, నల్లగొండ జిల్లా.
  • 7075710769
వై.సందీప్

అమ్మా!
      నవమాసాలు మోసి కని పెంచావు కదమ్మా. ‘అమ్మా’ అని పిలిస్తే వినపడనంత దూరం ఎందుకమ్మా వెళ్లి పోయావు? నాన్నా, నేనూ నిన్ను తలుచుకుని ఎంత బాధ పడుతున్నామో తెలుసా? నేను పుట్టగానే, జామ మొక్క వేశావు కదా. అదిప్పుడు తియ్యటి కాయలు కాస్తోంది. స్నేహితులు వచ్చినప్పుడు కోసిస్తున్నానమ్మా. నువ్వే ఉంటే నీ చేతులతో మా అందరికీ పంచే దానివి కదా!
      కాళ్లకు కడియాలు పెట్టుకుని, ఎర్ర చీర కట్టుకుని ఇంట్లో తిరుగుతుండే దానివి. ఇప్పుడు ఎర్ర చీర కట్టుకుని ఎవరు కనబడ్డా నువ్వే గుర్తొస్తున్నావమ్మా. బాగా ఏడుపొచ్చేస్తుందమ్మా. తలనొప్పి వచ్చినప్పుడు నీ ఒళ్లో తల పెట్టుకుని పడుకునేవాణ్ని. నీ చల్లటి చేత్తో నా నుదురును తాకితే చాలు, ఆ నొప్పంతా మాయమయ్యేది. చేతితో తీసేసినట్టే పోయేదమ్మా. ఆటల్లో ఓడిపోయినప్పుడు బాధపడుతూ ఇంటికి వచ్చి నీకు చెప్పేవాణ్ని. నువ్వు బుగ్గ మీద ముద్దు పెట్టి, ‘‘వచ్చేసారి నువ్వే గెలుస్తావు నాన్నా’’ అని ధైర్యం చెప్పేదానివి. నాకప్పుడు ఎంత బలమొచ్చేదో? నేను తప్పక గెలవగలననే నమ్మకం కలిగేది.
      ఇప్పుడు ఆటల్లో కిందపడి దెబ్బ తగిలినప్పుడు, ‘‘అమ్మా’’ అంటూ బాధతో అరుస్తానమ్మా. ఎంత అరిచినా, ఎంత ఏడ్చినా నువ్వు కనిపించవు కదమ్మా. నాకు జ్వరమొచ్చి మూలుగుతుంటే, మంచంలో పడుకోబెట్టి జోకొట్టేదానివి. ఇప్పుడు నాన్న జోకొడుతున్నాడమ్మా. నీలాగే ప్రేమగా చూసుకుంటున్నాడమ్మా. నువ్వు ఉన్నప్పుడు సారా తాగుతూ ఊరి మీద జులాయిగా తిరిగేవాడు. కానీ నువ్వు పోయాక బుద్ధిగా పనికి పోతున్నాడమ్మా. నన్నే కనిపెట్టుకుని ఉంటూ, నాకోసమే బతుకుతున్నట్లు చెబుతున్నాడమ్మా. మొన్న మామయ్య మా బడికి వచ్చి, ‘‘రేపు ఆదివారం కదా. మా ఊరి పండగ కూడా. అత్తయ్య అడుగుతోంది.. రా.. వెళ్దాం’’ అని, మాధవరాయనిగూడెం తీసుకుపోయాడమ్మా. నేనూ సుజ్జితో ఆడుకోవచ్చు.. దాని కాడ చాలా బొమ్మలున్నాయి అనుకుంటూ ఆనందంగానే వెళ్లానమ్మా. రాత్రి తొమ్మిది గంటలప్పుడు నాన్న నన్ను వెదుక్కుంటూ వచ్చాడమ్మా. ‘‘నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టదు.. చెప్పకుండా ఎటూ వెళ్లకు నాన్నా’’ అని భుజాల మీద కూర్చోబెట్టుకుని, ఏడు మైళ్లు నడుచుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడమ్మా. చెప్పకుండా నన్ను తీసుకెళ్లినందుకు మావయ్యపై కోప్పడ్డాడమ్మా. ‘‘ఐస్‌క్రీం కొనుక్కుంటా రూపాయివ్వు నాన్నా’’ అంటే వీపు వాయగొట్టిన       నాన్నేనా? అని ఆశ్చర్యమేసిందమ్మా. ఎంత మారిపోయాడో! నువ్వుంటే నాన్నను తెగ మెచ్చుకునేదానివి.
మొన్న మన చెరువులో చేపలు పట్టారమ్మా. నాన్న నాకోసమని, ముళ్లు తక్కువుంటాయని కొర్రమట్ట కొనుక్కొచ్చాడు. తోమి, నాన్నే వండాడమ్మా. కానీ, నువ్వు వండినట్లు లేదమ్మా. ‘‘అమ్మయితే ఇంకా బాగా వండేది’’ అన్నాను. ‘‘అవున్రా! మీ అమ్మకు నా మీద కోపం. తను ఉన్నంత కాలం నేను పట్టించుకోలేదు. తను మనల్ని ఎంతగా ప్రేమించేదో, నేను మీ అమ్మకు అంత ప్రేమను ఇవ్వలేకపోయారా. అందుకే మీ అమ్మకు నా మీద కోపం. చెప్పకుండా వెళ్లిపోయింది’’ అని ఏడ్చాడమ్మా. ఇక ఇద్దరం అన్నం సరిగా తినలేక పోయామమ్మా. ఆ రాత్రి నన్ను పక్కలో పడుకోబెట్టుకుని నీ మంచితనం గురించి చాలా చెప్పాడు. నేను ఊ..కొట్టుకుంటూనే నిద్రపోయాను. ఆ నిద్రలో నువ్వు కనబడ్డావమ్మా. నాటుకుపోయొచ్చి, మొత్తల్లో కూర్చుని నాకోసమే ఎదురు చూస్తున్నావమ్మా. నేను బడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, నీ ఒళ్లో వాలిపోయాను ‘‘అమ్మా’’ అంటూ. నా కలవరింతకు నాన్న లేచాడు. ‘‘అమ్మ కల్లోకొచ్చింది’’ అన్నాను. ‘‘తను పోయి అయిదేళ్లవుతోంది. ఒక్కసారన్నా నా కల్లోకి రాలేదురా. నేనంటే అంత కోపం’’ అంటూ మళ్లీ ఏడ్చాడమ్మా.
      రోజూ రాత్రి నీ పక్కన పడుకోబెట్టుకుని మంచి కథలు చెప్పేదానివి. గొప్ప వాళ్ల గురించి, ఇతరులకు సాయం చేయడానికి వాళ్లు చేసిన త్యాగాల గురించి..! ఎంత బాగుండేవో! ‘‘నువ్వూ అంత మంచి మనసుతో ఎదగాలి నాన్నా’’ అనే దానివి. నువ్వు కోరుకున్నట్లే మంచిగా ఉంటానమ్మా. బాగా చదువుకుంటా. నువ్వెక్కడున్నా, నీ దీవెనలు కావాలమ్మా... 

నీ చిట్టి తండ్రి


వెనక్కి ...

మీ అభిప్రాయం