సింహపురి కళల కోవెల

  • 181 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఎ.బాలభాస్కర్

  • నెల్లూరు.
  • 8008573991
ఎ.బాలభాస్కర్

ఘల్లుఘల్లుమనే కాలిగజ్జెలు... ఉత్తుంగ గోదావరిలా సాగే కవితా ప్రవాహాలు... మదిని మురిపించే సాంస్కృతిక వేడుకలు... ఏవైతేనేం అన్నింటికీ అదే వేదిక. తన ఒడిలో ఆడుకునే మువ్వలను చూసి అది మురిసిపోతుంది. తన నీడలో విచ్చుకునే సాహితీ సిరిమల్లెల సువాసనలను తనకద్దుకోవడానికి ఆరాటపడుతుంది. తన భుజాలపై ఆడుతూ... తన గుండెల్లో నిలబడి పాడుతూ... పదిమందిని సంతోషపెడుతున్న వారిని చూసి మనసులోనే ఆశీర్వదిస్తుంది.. అదే వేదిక!  అలా తెలుగు ఘనచరితను, జ్ఞాపకాలనూ గుండెల్లో పొదువుకున్న వేదికల పరిచయాల్లో తొలిదిదీ...
కొన్నిచోట్ల వీటిని పురమందిరాలంటారు. మరికొన్ని చోట్ల కళావేదికలంటారు. పేరేదైనా సరే... సంగీత, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకవే ఆధారం. అవి మన సంస్కృతీ వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యాలు..! కళాకారులకు నిశ్శబ్ద సాహితీ నేస్తాలు...!
      నాట్య విన్యాసం, సంగీత కార్యక్రమం, నాటక ప్రదర్శన, సాహితీ చర్చ, అవధానం, ఆధ్యాత్మికం లేదా ఏదో ఒక ప్రత్యేక సభ, ఏదైనా సరే వీటన్నింటికి ఉమ్మడిగా ఉండాల్సింది మాత్రం వేదిక. దాదాపుగా ఒక మోస్తరు పట్టణాల్లో పురమందిరం, టౌన్‌హాల్‌ అని పిలుచుకునే వేదికలు కొన్ని ఉంటాయి. వాటి చరిత్ర తెలుసుకుంటే హృదయం ఉప్పొంగుతుంది. అక్కడికి వెళ్లినప్పుడు ఆ వేదికలతో ముడిపడిన ఘనమైన అనుభూతుల్లో మనమూ తాదాత్మ్యం చెందుతాం. ‘ఇక్కడికి గాంధీ వచ్చాడట..’, ‘ఇక్కడ ఓ ప్రముఖుడి అవధానం జరిగిందట..’, ‘స్వాతంత్య్రోద్యమ సమయంలో  ఫలానా పెద్దాయన ఇక్కడ ప్రసంగించాడట..’, ‘ఆమె మొదటిసారి నాట్య ప్రదర్శన ఇచ్చింది ఇక్కడే తెలుసా..’ ఇలా ఎన్నో విశేషాలు మన చెవిన పడుతుంటాయి. పేరు వినగానే భావోద్వేగానికి లోనయ్యే వేదికల ఘనత తెలుసుకుంటే, తలచుకుంటే ఆ జ్ఞాపకాలు సుడులు తిరుగుతాయి. తెలుగువాళ్లకు అలాంటి వేదికలు కోకొల్లలు. అలాంటి వాటికి వేదికగా నిలిచిన సింహపురి పురమందిరం వివరాలు, విశేషాలూ తెలుసుకుందామా...
నెల్లూరు తాజ్‌మహల్‌
సింహపురి అంటే మరేంటో అనుకుంటారేమో... అది నెల్లూరుకు మరోపేరు. కళకళలాడే వరిమళ్లు, మత్స్య సంపద పుష్కలంగా లభించే జలసిరులు, వ్యాపార రంగంలో ప్రముఖలకు పెట్టిందిపేరు నెల్లూరు జిల్లా. అసలు తమిళంలో నెల్లి అంటే వరి అని అర్థం. అంటే ఇది వరికి- పంటలకు ప్రసిద్ధి చెందింద‌న్న‌ అర్థంలోనే ఈ పేరు వచ్చింది. ఇక్కడ రేబాలవారి లక్ష్మీనరసారెడ్డి అభ్రకం వ్యాపారంలో వెలుగొందుతూనే కవి పండితుల పుస్తకాలు వెలుగులోకి వచ్చేందుకు విరాళాలిచ్చిన వదాన్యుడు. ఓసారి కొంతమంది మిత్రులు చర్చిస్తూ.., ‘మన పట్టణంలో సాహితీ చర్చలకుగానీ, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమాల నిర్వహణకుగానీ, సాంస్కృతిక ప్రదర్శనలకు గానీ ఒక స్థలం ఉంటే బాగుండేది’ అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంతే సభామందిరం నిర్మాణానికి తన సమ్మతిని తెలియజేశారు నరసారెడ్డి. అది మద్రాసులోని విక్టోరియా పబ్లిక్‌ హాలు నమూనాలో ఉండాలని అనుకున్నారు. డబ్బుకి వెనుకాడలేదు. నెల్లూరు నడిబొడ్డున, గ్రాండుట్రంకు రోడ్డు సమీపంలో అంకణం యాభై పైసలకు రెండన్నర ఎకరాల స్థలాన్ని ఖరీదు చేసి స్థలాన్ని విరాళంగా ఇచ్చాడాయన. అనంతరం అప్పటి ఆంధ్ర రాష్ట్రంలోని ప్రముఖ ఇంజినీర్లను పిలిపించారు. 
      అలా నూటమూడేళ్ల క్రితం... 1911 డిసెంబరు 12న ఈ పురమందిరానికి అప్పటి నెల్లూరు కలెక్టరు జ్యోతీంద్రనాథ్‌ రాయ్‌ శంఖుస్థాపన చేశారు. మూడున్నరేళ్లు తిరిగేసరికి అందమైన భవనం రూపుదిద్దుకుంది. దీని నిర్మాణానికి అప్పట్లో అయిన ఖర్చు 60వేలు! కవులు, పండితులు, సాహితీ ప్రముఖులు, ఇతర ముఖ్యుల సమక్షంలో... 1915 ఏప్రిల్‌ 9న పురమందిరం ప్రారంభోత్సవం వైభవంగా చరిత్రకెక్కింది. ఈ కార్యక్రమానికి అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్‌ కార్యనిర్వాహక మండలి సభ్యులు సర్‌ సుందరం అయ్యర్, శివస్వామి అయ్యర్‌లు కూడా హాజరయ్యారు. రేబాల లక్ష్మీనరసారెడ్డి దానశీలతకు గౌరవంగా బ్రిటిష్‌ ప్రభుత్వం 1916లో రావు బహద్దర్‌ బిరుదును ప్రదానం చేసింది. అంతేకాదు, రెడ్డి తాను సంపాదించిన ఆస్తిపాస్తులను దాన ధర్మాలకు వినియోగించమని ఒక ట్రస్టు చేతిలో పెట్టారు. ఆయన 1917 అక్టోబరు 30న మరణించారు. ఆయన స్మారకంగా దీనికి ‘రేబాల లక్ష్మీనరసారెడ్డి పురమందిరం’ అని పేరుపెట్టారు. 
      ఇక ఈ భవనం ఎంత పటిష్ఠమో చెప్పాలంటే... 1927 నవంబరు 2న పెనుతుఫాన్‌ తాకిడికి నెల్లూరు తల్లడిల్లింది. తుఫాన్‌ ధాటికి చుట్టు పక్కలున్న అన్ని నిర్మాణాలు ధ్వంసమైనా... పురమందిరం మాత్రం చెక్కు చెదరకుండా నిలిచింది. ఈ విశేషం చూసేందుకు అప్పట్లో చుట్టుపక్కల ఊళ్ల నుంచి జనం తండోపతండాలుగా వచ్చేవాళ్లట. మందిర విశిష్టత తెలుసుకున్న నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం 1938లో తమ రాజపత్రంలోనూ దీని గురించి పేర్కొంది. అందుకే నిత్యమూ కళా ప్రదర్శనలతో నగరానికి ప్రత్యేకంగా నిలిచిన ఈ మందిర నిర్మాణాన్ని స్థానికులు ‘నెల్లూరు తాజ్‌మహల్‌’ అని పిలుచుకుంటారు.
మరపురాని ఘట్టాలు...
ఈ పురమందిరాన్ని మహాత్ముడు రెండుసార్లు (1917, 1921) సందర్శించడం విశేషం. 1921లో తన రెండో సందర్శనలో మహాత్ముడు ఇక్కడ లోకమాన్య తిలక్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఇంకా ఆయా రంగాల్లో ప్రముఖులైన బెజవాడ గోపాలరెడ్డి, ఆత్రేయ, సమగ్రాంధ్ర సాహిత్యం రాసే ప్రయత్నంలో కొన్నిరోజులు ఆరుద్రకు, నాగభైరవ, ఉండేల మాలకొండారెడ్డి, రమణారెడ్డి, నాగభూషణం, అంజలీదేవి, మల్లెమాల సుందరరామిరెడ్డి, పి.బి.శ్రీనివాస్, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం లాంటి ప్రముఖులకు అనుబంధం ఉంది.
      ఈ మందిరంలో కన్యాశుల్కం, పడమటిగాలి, చింతామణి, సత్యహరిశ్చంద్ర లాంటి నాటకాలు ఇప్పటివరకు కొన్ని వందలసార్లు కళార్చన చేశాయి. సత్యహరిశ్చంద్ర, చింతామణి నాటకాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. ‘రక్తకన్నీరు’ నాగభూషణానికీ, హాస్యనటుడు రమణారెడ్డి (తుపాను నాటకం) నాటక ప్రదర్శనలకు వేదికగా నిలిచింది టౌన్‌హాల్‌. ఇవి ప్రముఖుల వివరాలు. స్థానిక కళాకారులు చాలామంది తమ ప్రదర్శనలకు పురమందిరాన్ని వేదికగా చేసుకున్నారు. అలా ఇక్కడ ఓనమాలు దిద్దుకుని సాధారణ  స్థాయినుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగిన కళాకారులెందరో.
      ఇక్కడ శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి (ఎస్పీ బాలు తండ్రి), యనమండ్ర వేంకటేశ్వరశాస్త్రి తదితరులు ప్రారంభించిన త్యాగరాజు స్మరణోత్సవాలు ఇప్పటికీ కీర్తనలాలపిస్తున్నాయి. కవిబ్రహ్మ తిక్కన, పోతన, కాళిదాసు, అన్నమయ్య, శ్రీకృష్ణదేవరాయల సంస్మరణోత్సవాలకు జ్యోతులు వెలుగుతున్నాయి.. ఇంకా వేదం వేంకటరాయశాస్త్రి, దువ్వూరి రామిరెడ్డి, గుర్రం జాషువా లాంటి సాహితీ దిగ్గజాల జయంత్యుత్సవాలు నిర్వహించిన ఘనత ఈ పురమందిరానిది. వై.కామేశ్వరరావు కళా పరిషత్‌ ఆధ్వర్యంలో కవి వెన్నెలకంటి సహకారంతో, ప్రసిద్ధ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో ప్రదర్శించే నాటక ప్రదర్శనలకు మంచి స్పందన లభించింది. ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలకూ జ్యోతిగా నిలిచింది ఈ పురమందిరం. దీని విశిష్టతను మద్దూరి శ్రీనివాస్‌ అనే స్థానిక కవి ‘మందిరం... మందిరం...’ అంటూ రాగాల మాల కట్టాడు.
      ఈ పురమందిరంలో ఇప్పటివరకు దాదాపుగా 11 వేల సాంస్కృతిక ప్రదర్శనలు, 8 వేలకుపైగా నాటక ఇతర కళా ప్రదర్శనలు, 10 వేల సాధారణ సమావేశాలు, 150 సాహిత్య సమావేశాలు, 80 పుస్తకావిష్కరణలు జరిగాయి. ఈ సముదాయంలోనే వర్ధమాన సమాజ గ్రంథాలయం ఎన్నో పుస్తకాలతో ఇప్పటికీ మూడుపువ్వులూ ఆరుకాయలుగా అలరారుతోంది. ఇక్కడి రేబాలవారి జ్యోతివినాయక దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఇప్పటి అవసరాల దృష్ట్యా ఈ పురమందిరాన్ని 2013లో నవీకరించి ఓపెన్‌ ఆడిటోరియం, ఆధునిక సౌండ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. 
      ఈ టౌన్‌హాల్‌ నిర్వహణ బాధ్యత స్థానిక ప్రముఖులతో ఏర్పడిన కమిటీ చూసుకుంటుంది. ఎన్నో మధురానుభూతులు, అనుభవాలతో వంద వసంతాలుగా శోభిల్లుతున్న నెల్లూరు టౌన్‌హాల్లో మరో వెయ్యేళ్లు మల్లెల మాలలూగాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం