పదవులు కోరని పావనమూర్తి

  • 173 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ... మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తీ’... మహాత్మ చిత్రం కోసం బాపూజీ వ్యక్తిత్వాన్ని బొమ్మకట్టిస్తూ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన మాటలివి. సామాన్యుడిగా జన్మించి అసామాన్యుడిగా మారిన మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ ప్రస్థానం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. దేశ దాస్య శృంఖలాలను తెంచడానికి ఒకవైపు పోరాడుతూనే... ఆధునిక యుగంలో కాసుకు చెల్లని పురాతన భావజాల సంకెళ్ల నుంచి స్వజాతిని విముక్తం చేయడానికి అహరహం శ్రమించిన నిజమైన నాయకుడు గాంధీజీ. అందుకే ఆయన జాతిపిత అయ్యారు.
      ఆయన బోధించిన విలువలు, ప్రబోధించిన మానవత, కాంక్షించిన సర్వమానవ సమానత్వంతో స్ఫూర్తిపొందిన తెలుగు సినీకవులు- గాంధీజీ సందేశాన్ని వెండితెర వేదికగా వినిపించారు. నాటి సీనియర్‌ సముద్రాల నుంచి నేటి సుద్దాల అశోక్‌తేజ వరకూ అవకాశం వచ్చినప్పుడల్లా బాపూజీ బోధలకు పాటల రూపమిచ్చారు. వీళ్లందరి కంటే ముందే, గాంధీ జీవిత చరిత్ర నేపథ్యంగా 1941లో తీసిన ఓ డాక్యుమెంటరీలో ‘పాడవే రాట్నమా ప్రణవ భారతి గీతి’ అన్న పాట రాశారు శంకరంబాడి సుందరాచారి. రాట్నం  నేపథ్యంగా గాంధీజీని స్తుతిస్తూ దీనికి అక్షరాలను కూర్చారాయన. 
      ‘...గాంధీ జవహరు పటేలు గారు/ మహారథులు మన నేతలురా..’ అంటూ భారతీయ యువతను వాళ్ల అడుగుజాడల్లో నడవమని పిలుపునిచ్చారు ‘మనదేశం’ చిత్రంలో సీనియర్‌ సముద్రాల. ఆయనదే మరో పాట.. ‘భలే తాత మన బాపూజీ.. బాలల తాత బాపూజీ’. ‘దొంగరాముడు’ చిత్రంలోనిది. ‘కులమత బేధం వలదన్నాడు/ కలిసి బతికితే బలమన్నాడు/ మానవులంతా ఒకటన్నాడు/ మనలో జీవం పోశాడు’ అంటూ ఇందులో గాంధీజీ సిద్ధాంతాలను చిన్న చిన్న మాటల్లో చెప్పేశారు సముద్రాల. ‘మానవ ధర్మం బోధించాడు/ మహాత్ముడై ఇల వెలిశాడు’ అని ముక్తాయించారు. ‘కోడలు దిద్దిన కాపురం’లో ‘నీ ధర్మం నీ సంఘం.. నీ దేశం నువు మరవద్దు’ అంటూ జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులను గుర్తుచేశారు సినారె. ‘సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చె బాపూజీ’ అంటూ ప్రణతులర్పించారు. ‘అమెరికా అబ్బాయి’ కోసం ఆయనే రాసిన మరో పాటలోనూ ‘గాంధీ చూపిన మార్గాన్ని విడవద్ద’ంటూ సత్యం, అహింస, శాంతి బాటల్లో పయనించేందుకు దీక్షబూనాలన్నారు.  
      ‘బడిపంతులు’లో ‘భారతమాతకు జేజేలు.. బంగరు భూమికి జేజేలు’ పలుకుతూ ‘శాంతిదూతగా వెలసిన బాపు’ అని కొనియాడారు ఆత్రేయ. ‘కుల మత భేదం మాపిన త్యాగి/ అమరబాపూజి వెలసిన దేశం’ అని భరతభూమికి కైమోడ్పులర్పించారు ‘నేనూ నా దేశం’లో గీత రచయిత అంకిశ్రీ. ‘గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం.. సాధించే సమరంలో అమరజ్యోతులై వెలిగే ధ్రువతారల’ను ‘మేజర్‌ చంద్రకాంత్‌’లో మనసారా తలచుకున్నారు జాలాది.   
       ‘దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు/ గాంధీ మహాత్ముడు కలగన్న రోజు...’ కోసం స్వప్నించారు శ్రీశ్రీ. ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా’ అంటూ ‘రాముడు భీముడు’లో ఆయన ఈ పాట రాసి యాభై ఏళ్లు దాటిపోయాయి. అయినా ఆ మంచి కాలం ఇంకా రాలేదు. అందుకే కాబోలు ‘ఓ బాపూ నువ్వే రావాలి... నీ సాయం మళ్లీ కావాలి’ అంటూ అర్థించారు సుద్దాల అశోక్‌తేజ ‘శంకర్‌దాదా జిందాబాద్‌’లో. ఏది ఏమైనా... గాంధీజీ జీవితమే ఓ పాఠశాల. ఆయన మాటలే పాఠ్యపుస్తకాలు. వాటిని ఆపోసన పట్టిన వ్యక్తులే నవ సమాజ నిర్మాతలు కాగలరు. ఈ సందేశాన్నే బలంగా వినిపిస్తూ ‘మహాత్మా’ చిత్రంలో సీతారామశాస్త్రి రాసిన పాట... ‘కొంతమంది ఇంటిపేరు కాదురా గాంధీ’. ఇందులో ‘పదవులు కోరని పావనమూర్తీ/ హృదయాలేలిన చక్రవర్తీ...’ అంటూ నేటి నేతలకూ, ఆయనకూ ఉన్న హస్తిమశకాంతరాన్ని అర్థవంతంగా చెప్పారు. గుప్పెడు ఉప్పుతోనే నిప్పుల వాన సృష్టించి, దండియాత్రను దండయాత్రగా మార్చిన ఇలాంటి నరుడొక ఇలాతలంపై నడయాడిన ఈనాటి సంగతీ/ నమ్మరానిదని నమ్మకముందే ముందుతరాలకు చెప్పండీ..  అంటూ మన బాధ్యతను గుర్తుచేశారు. అవును... జాతిని వెలుగుదారుల్లోకి నడిపించిన మహనీయుల స్ఫూర్తి భావితరాలకు చేరినప్పుడే దేశ భవిష్యత్తూ సురక్షితంగా ఉంటుంది. గాంధీజీని ప్రస్తుతిస్తూ మన కవులు, రచయితలు చేసిన అక్షరార్చనల్లోని అంతఃసందేశమిదే.


వెనక్కి ...

మీ అభిప్రాయం