నిప్పులాంటి భాష

  • 384 Views
  • 3Likes
  • Like
  • Article Share

భాష అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణకి ఉపయోగపడే సాధనం మాత్రమే కాదు... ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞానాన్ని అందించే ప్రవాహం. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట పడితే విలువైన ఆదిమ సంస్కృతికే ముప్పు వస్తుంది. అది ఒకోసారి మానవజాతి మనుగడనే ప్రభావితం చేయవచ్చు. దానికి ఉదాహరణగా ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న ఓ ప్రాజెక్టు గురించి చెప్పుకుని తీరాల్సిందే!
ఆస్ట్రేలియా
ఉత్తరభాగంలోని ఆర్నెంల్యాండ్‌ వైవిధ్యభరితమైన అడవులకు నిలయం. కేవలం అటవీ సంపదకే కాదు, భావసంపదకూ ఇది నిలయమే! వేల సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్న ఆదిమజాతి ప్రజలు, తమ చుట్టూ ఉన్న చెట్టూచేమల్ని మిత్రులుగా మార్చేసుకున్నారు. కొండకోనలతో బంధుత్వాన్ని ఏర్పరచుకున్నారు. కానీ, వలస పాలనలు మొదలవడంతో వారి కష్టాలు మొదలయ్యాయి. ప్రపంచీకరణ ప్రభావంతో తరాల తరబడి అక్కడ నివసిస్తున్న వాళ్లంతా చెదిరిపోవడం మొదలుపెట్టారు. ఆర్నెంల్యాండ్‌ ఆదిమజాతి ప్రజలు ఇలా వలసబాట పడుతున్నా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, 1990ల నాటికి కొన్ని చిత్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఆ దావానలం ధాటికి...
ఏటా ఆర్నెంల్యాండ్‌ను కార్చిచ్చులు కమ్మసాగాయి. వేల ఎకరాల అటవీభూమి బుగ్గిపాలవడం మొదలైంది. దీంతో అటవీసంపద నాశనం కావడమే కాకుండా, అరుదైన వృక్షజాతులూ అంతరించిపోసాగాయి. ఇక ఈ మంటల వల్ల టన్నుల కొద్దీ కర్బన వాయువులు వాతావరణంలోకి విడుదలై, ఆ ప్రాంతమంతా కలుషితమైపోతోంది. ఈ మంటలు, సమీపంలోని ‘కాకడు’ జాతీయ వనంలోకి చొచ్చుకుపోయి, అక్కడి ప్రాకృతిక సంపదనూ నాశనం చేయడం మొదలుపెట్టాయి.
      ఆర్నెంల్యాండ్‌లోని వేల ఎకరాలు ఇలా ఏటా అగ్నికి ఆహుతైపోవడం చూసి ప్రభుత్వ అధికారులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఎలాగోలా మంటలను అదుపులోకి తెచ్చేలోపే అవి దాదాపు 40 శాతం అడవికి తీరని నష్టాన్ని కలిగించేవి. ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా తరచూ తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగడానికి కారణం ఏంటా అని ఆలోచించిన అధికారులకు ఆశ్చర్యకరమైన నిజాలు ఎదురుపడ్డాయి.
అన్యథా శరణం నాస్తి
ఆర్నెంల్యాండ్‌ స్థానికులైన ఆదిమజాతివారికి అక్కడి అడవుల గురించి పూర్తి అవగాహన ఉండేది. నిప్పుకీ అడవికీ మధ్య ఉండే సంబంధం వారికి తెలుసు. కార్చిచ్చులు ఎప్పుడు, ఎలా ఏర్పడతాయి అన్నది వారికి కరతలామలకం. కాలిన గుర్తులను బట్టి మంట తీరుని చెప్పేయగల సమర్థులు. అంతేకాదు, కార్చిచ్చులు వ్యాపించకుండా వారు ముందుగానే కొన్ని చోట్ల మంటలను పెట్టేవారు. దానివల్ల కార్చిచ్చులు ఏర్పడకపోగా, జీవం లేని అటవీభాగం నిప్పులపాలై ఆ స్థానంలో కొత్త చిగుళ్లు వచ్చేవి. ఒకరకంగా చెప్పాలంటే ఆర్నెంల్యాండ్‌ వాసులు నిప్పుతో వ్యవసాయం చేసేవారు.
      నిప్పు గురించి ఆర్నెంల్యాండ్‌ వాసులు ఏర్పరచుకున్న అభిప్రాయం ఈనాటిది కాదు. దాదాపు వెయ్యేళ్లుగా అక్కడి ప్రకృతితో మమేకమై గమనించిన జ్ఞానమది! తరం నుంచి తరానికి చేరుతూ, బలపడుతూ వచ్చిన విజ్ఞానం అది. ఈ విషయాన్ని గ్రహించిన అధికారులు, ఆర్నెంల్యాండ్‌ ఆదిమజాతి పెద్దలను వెనక్కి పిలిపించారు. దుబాసీల సాయంతో ‘గున్‌వింగు’ అనే భాషలో వాళ్లు చెబుతున్న విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. చివరికి కార్చిచ్చుల మీద వాళ్లకి ఉన్న సాధికారత సాయంతో అడవిలో నిప్పుని అదుపుచేసేందుకు ఓ ప్రణాళికను రూపొందించారు. 2006 నుంచి ఈ ప్రణాళిక అమల్లోకి వచ్చింది. 
ఆ భాషే లేకుంటే...
‘ది వెస్ట్‌ ఆర్నెంలాండ్‌ ఫైర్‌ ఎబెట్మెంట్‌ ప్రాజెక్టు’ పేరిట సాగుతున్న ఈ ప్రణాళిక ప్రపంచాన్ని నివ్వెరపరిచేంతటి సత్ఫలితాలను అందిస్తోంది. ఐక్యరాజ్యసమితి అభినందనలతో పాటుగా పలు పురస్కారాలనూ గెలుచుకుంది. అర్నెం ఆదిమజాతి ప్రజలు ఈ ప్రణాళిక అమలు కావాల్సిన విజ్ఞానాన్ని అందించడమే కాదు, ఇందులో ఉద్యోగులుగా పనిచేస్తూ అడవిని కాపాడటంలో ముందుంటున్నారు. వీరి చేతుల్లో అర్నెంల్యాండ్‌లోని 28 వేల చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం సురక్షితంగా ఉంటోంది. ఈ ప్రణాళికను అమలుపరచాక, అక్కడ వాతావరణంలోని కర్బన వాయువుల పరిమాణం లక్ష టన్నులకు పైగా తగ్గిపోయింది.
      2006లో ‘గున్‌వింగు’ భాష మాట్లాడేవారి సంఖ్య 1,200 మాత్రమే! వీళ్లలో ‘నిప్పుతో వ్యవసాయం’ గురించి అవగాహన ఉన్న పెద్దల సంఖ్య బహుశా వేళ్ల మీద లెక్కపెట్టవచ్చేమో. ఒకవేళ వాళ్లతోపాటుగా వాళ్ల భాష, ఆ భాషతోపాటుగా అందులోని విజ్ఞానం అంతరించిపోయి ఉంటే పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న ఊహించడానికే భయం వేస్తుంది. ఆదిమ భాషలు అంటే ఆటవికపు అరుపులు మాత్రమే కాదు... తాము బతుకుతూనే పుడమితల్లిని రక్షించుకునే విజ్ఞానానికి సూచనలు. ‘‘ఏ జాతి నివాసిత ప్రాంతాలకు సంబంధించిన పర్యావరణ సమాచారం ఆ జాతి భాషలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఈ వసుధ మీద ఏ భాష అంతరించినా మానవ మేధలో కొంత భాగం అంతర్థానమైనట్లే’’ అన్న యునెస్కో మాజీ డైరెక్టర్‌ జనరల్‌ కొయిచిరో మత్సర మాటలు మరిచిపోతే మిగిలేది కార్చిర్చుల్లాంటి అనర్థాలే!


వెనక్కి ...

మీ అభిప్రాయం