ఊహలకే రెక్కలొస్తే...

  • 108 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తవుటు నాగభూషణం

  • సిరిసిల్ల, కరీంనగర్
  • 800857354
తవుటు నాగభూషణం

ఆకాశమంత పందిరి... ఆరుబయట మంచం... చల్లనిగాలి... మేఘాల్లో తేలుతున్న చందమామ... తాతయ్య పక్కలో పడుకున్న అల్లరి గడుగ్గాయిలు... ఆ పిల్లలను జోకొట్టడానికి తాతయ్య ప్రయత్నం.... ఆ ప్రయత్నంలోంచి పుట్టినవే అనేక కథలు. పెద్దల నుంచి పిల్లలకు, పిల్లల నుంచి పెద్దలకు... జోకొట్టడం నుంచి ‘ఊ’ కొట్టడం వరకు నిరంతరంగా ప్రవహించిన కథల ప్రవాహం ఇప్పుడేమైపోయింది?
      తరం నుంచి తరానికి చైతన్యం చేరడానికి సాహిత్యం ఓ వారధి. చెట్టుకు నీళ్లు పోస్తే ఆకులేసి పూతపూసి కాతకాసి పండ్లను ఇచ్చినట్లు, సాహిత్యం మనిషికి సృజననిచ్చి విజ్ఞత పెంచుతుంది. యుక్తాయుక్త విచక్షణను అందిస్తుంది. తాతయ్య కథలు, అమ్మమ్మ పొడుపుకథలు, నానమ్మ పాటలు, తోటి పిల్లలతో ఆటలు... వీటి ద్వారా చిన్నారులకు చేరే ఆ విజ్ఞాన ప్రవాహం వట్టిపోయి చాల రోజులయింది. పిల్లలకు, పెద్దలకు మధ్య నిశ్శబ్దం గడ్డకట్టుకుపోయింది. ఈ నిశ్శబ్దాన్ని ఛేదించే ప్రయత్నం కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమి, రంగినేని సుజాతా మోహన్‌రావు ఎడ్యుకేషనల్‌ ఛారిటబుల్‌ ట్రస్టు సంయుక్తంగా సెప్టెంబరు 3, 4 తేదీల్లో పిల్లల కోసమే ప్రత్యేకంగా సాహిత్య శిక్షణా శిబిరం నిర్వహించాయి. కరీంనగర్‌ జిల్లాలోని దాదాపు యాభై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 250 మంది చిన్నారులు, పద్దెనిమిది మంది బాలసాహితీవేత్తలు, యాభై మంది ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారు. 
వాళ్ల మార్గదర్శకత్వంలో... 
బ్యాగుల మోతలేదు... బెత్తం బెదిరింపులేదు... ఇష్టమైన ఊహా ప్రపంచంలో విహరించడమే ఈ శిబిరం పరమోద్దేశం. మొదటిరోజు కథంటే ఏంటి, ఎలా రాయాలి, కవిత ఎలా రాయాలి, ఎందుకు రాయాలన్న అంశాల మీద చర్చలు సాగాయి. రాయడంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలన్న విషయాలను బాలసాహితీవేత్తలు వివరించారు. దీంతో పాటుగా కథలు చెప్పారు. కవితలు, పాటలు వినిపించారు. ఆమాత్రం ప్రేరణకే పిల్లలు ఆవేశంగా కలంపట్టారు. మరునాడు ఉదయం పిల్లలను బృందాలుగా విభజించారు. ఒక్కో బృందం బాధ్యతను ఒక్కో రచయిత తీసుకున్నారు. కథ, కవిత, పాటల రచనలో మెలకువలు నేర్పించారు. చిన్నారులతో రాయించారు. 
      కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకులు ఆచార్య డాక్టర్‌ ఎన్‌.గోపి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి ఎస్‌.పి.మహాలింగేశ్వర్, ఎన్‌బీటీ ఉపసంచాలకులు డాక్టర్‌ పత్తిపాక మోహన్, బాల సాహితీవేత్తలు వాసాల నర్సయ్య, డాక్టర్‌ మలయశ్రీ, భూపాల్, చొక్కాపు వెంకటరమణ, దాసరి వెంకటరమణ, తిరునగరి వేదాంతసూరి, ఆకెళ్ల వెంకటసుబ్బలక్ష్మి, పెండెం జగదీశ్వర్, ఎస్‌.కె.అబ్దుల్‌ హకీం జానీ, పైడిమర్రి రామకృష్ణ, కందేపి రాణీప్రసాద్, వి.ఆర్‌.శర్మ, దార్ల బుజ్జిబాబు, ఎస్‌.రఘు, పెందోట వెంకటేశ్వర్లు, వాసరవేణి పరుశురాములు తదితరులు పాల్గొన్నారు. శిబిరం నిర్వహణలో రంగినేని ట్రస్టు అధ్యక్షులు మోహన్‌రావుతో పాటు సాహితీవేత్తలు జూకంటి జగన్నాథం, డాక్టర్‌ నలిమెల భాస్కర్, పెద్దింటి అశోక్‌కుమార్, మందికుంట లక్ష్మణ్, గరిపెల్లి అశోక్‌ భాగస్వాములయ్యారు.
ఎన్నో ఇతివృత్తాలు...
చిన్నారుల ప్రపంచంలోకి వెళ్లి చిన్నగా కదిపితే చాలు... ఎన్నో ముచ్చట్లు, అనుభవాలు, అనుభూతులు చెవినపడతాయి. వాటన్నింటినీ వాళ్లతోనే కాగితాల మీద పెట్టించే ప్రయత్నం చేసిందీ శిబిరం. ఇక్కడికి వచ్చిన పిల్లల్లో చాలామంది మంచి కథలు, కవితలు, పాటలు రాశారు. అయినా పిల్లలు దేని గురించి ఆలోచిస్తారు? అందాల చందమామ, అత్తరు చల్లే పూలు, అలిగిన మిత్రుడు, అమ్మ ప్రేమ, ఆకలి... ఇలా ‘అ, ఆ’లే అనుకుంటాం! కానీ, ఈ పిల్లలు చాలా ఎదిగిపోయారు. ఇంకిపోతున్న నీరు, ఈతరం మార్పులు, ఉనికి కోల్పోతున్న మనిషి, ఊరిలో వచ్చిన మార్పు... ‘ఇ ఈ ఉ ఊ’లతో కూడా ఆగలేదు. కాలుతున్న జీవితాలు, కూలుతున్న గుట్టలు... ఇలా గుణింతాలూ నేర్చుకున్నారు. ఈ పిల్లల రచనలను వాళ్లు రాసింది రాసినట్లుగా పుస్తకరూపంలో తెస్తామని నిర్వాహకులు ప్రకటించారంటే, వాటిలో ఎంత విషయం ఉందో అర్థం చేసుకోవచ్చు. తాము ఇలా రాయగలమని ఈ పిల్లలూ అనుకోలేదు. వాళ్లలో కలిసిపోయి తామూ పసిపిల్లలమవుతామని ఇక్కడికి వచ్చిన పెద్దలూ అనుకోలేదు. కానీ, చిన్నారులు సాధించారు. ఆ మేరకు వాళ్లలో అనుభవజ్ఞులు స్ఫూర్తినింపారు. తాము తెచ్చిన పుస్తకాలను చిన్నారులకు ప్రేమగా అందించారు.
      ఈ రెండు రోజుల్లో పిల్లల ముఖాల్లో కొత్త వెలుగు కనిపించింది. అది వాళ్లకి బతుకునిచ్చే వెలుగు, సమాజాన్ని బతకనిచ్చే వెలుగు. అన్ని జిల్లాల్లోనూ ఆర్నెల్లకోసారైనా ఇలాంటి శిబిరాలు పెడితే బాగుంటుందనిపించేలా చేసిన వెలుగు. ఈ వెలుగు తెలుగునాడంతా పరచుకుంటే... నవతరం భవిత దేదీప్యమానమవుతుంది.


చిన్నారుల్లో సృజనాత్మకత, ఊహాశక్తి వెల్లివిరియడానికి ఈ శిబిరంలో పాల్గొన్న రచయితలు, విషయ నిపుణులు కొన్ని సూచనలు, సలహా ఇచ్చారు. అవి... 
* సామాజిక విషయాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. అధ్యయనం చేయాలి. 
* రోజూ దినచర్యను, చూసిన విషయాలను డైరీలో నమోదు చేసుకోవాలి. రెండు నెలల తర్వాత మొదటి రోజు రాసింది చదివితే రాతలో వచ్చిన మార్పు మనకే అర్థమవుతుంది
* పాఠ్యపుస్తకాలతో పాటు కథలు, కవితలు, ఇతిహాసాలు, నీతికథలు, పద్యాలు... అన్నింటినీ చదవాలి. దీనికీ రోజులో కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. 
* టీవీ చూడటం తగ్గించి చదవడం, రాయడం మీద దృష్టి పెట్టాలి. పాఠశాల పత్రికలకు, పిల్లల పత్రికలకు కవితలు, కథలు, ఉత్తరాలు రాసి పంపిస్తుండాలి. 
* పఠనాసక్తిని పెంపొందించుకోవడం ముఖ్యం. ఆంగ్లమాధ్యమంలో చదువుతున్నప్పటికీ తెలుగులో రాయడం, చదవడం మర్చిపోకూడదు.


బాలసాహిత్యంలో పురస్కారాలు 
ఏటా ఉత్తమ తెలుగు కథలు, కవితలకు రంగినేని ట్రస్టు పురస్కారాలు అందిస్తోంది. ఇప్పటి నుంచి బాలసాహిత్యంలో వాటిని ప్రదానం చేయనున్నాం. ఈ శిక్షణా శిబిరం పిల్లల్లో పఠనాశక్తిని పెంచింది. మా ట్రస్టు ద్వారా సాహిత్య, కళారంగాలకు వీలైనంత చేయూతనందిస్తాం. 
- రంగినేని మోహన్‌రావు, ట్రస్టు అధ్యక్షులు


మిగిలిన ప్రాంతాల్లోనూ...
అకాడమీ తరఫున ఇలాంటి శిబిరం నిర్వహించడం దేశంలోనే ఇది తొలిసారి. ఈ ప్రయత్నం విజయవంతమైంది. ఇలాంటి శిబిరాలను మిగిలిన ప్రాంతాల్లోనూ నిర్వహిస్తాం. సాహిత్యం పట్ల అవగాహన పెంచుకుంటేనే సామాజిక దృక్పథం, సమాజం పట్ల అవగాహన ఏర్పడతాయి. 
- ఎస్‌.పి.మహాలింగేశ్వర్, అకాడమీ ప్రాంతీయ సంచాలకులు 


అందరూ కలిస్తేనే...
తెలుగు బాలసాహిత్యం అత్యున్నత దశలో ఉంది. కానీ, ఇటీవల కాలంలో పిల్లల్లో పఠనాసక్తి తగ్గిపోతోంది. దాన్ని పెంచడంతో పాటు వాళ్లలో రచనా శక్తిని పెంపొందించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసివస్తేనే చిన్నారుల్లోని నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. 
- డాక్టర్‌ ఎన్‌.గోపి, అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకులు 


వెనక్కి ...

మీ అభిప్రాయం