జంటపదాల కన్నులపంట!

  • 1948 Views
  • 14Likes
  • Like
  • Article Share

    డా.పి.ఎస్‌. ప్రకాశరావు

  • తెలుగు ఉపాధ్యాయులు
  • కాకినాడ.
  • 9963743021
డా.పి.ఎస్‌. ప్రకాశరావు

తెలుగులోని జంటపదాలను వివరించబోతే ‘దారీతెన్నూ’ కనిపించదు! ఇక్కడ ‘దారి’ ఉన్నప్పటికీ ‘తెన్ను’ (దారి, మార్గం) ఎందుకొచ్చిందో! జంటపదాలతో వచ్చే చిక్కే ఇది. ద్రావిడ భాషల్లో ‘తెన్ను’ను ‘దక్షిణదిక్కు’ అనే అర్థంలో వాడేవారట. క్రమంగా ‘వైపు’ అనే అర్థంలో వ్యవహారంలోకి వచ్చాక ‘దారీతెన్నూ’ నానుడిగా పరిణమించిందన్నారు తిరుమల రామచంద్ర. దక్షిణ దేశంలో దొరికే కాయ కాబట్టి ‘టెంకాయ’ అయిందని ఈయన ఉద్దేశం. 
జంటపదాల
వల్ల భాషకు అందం వస్తుంది. వినసొంపుగా ఉండటంతో పాటు కాస్త చమత్కారాన్నీ అద్దుకునే జంటపదాల వల్ల ‘విషయం’ అవతలవాళ్లకి సూటిగా చేరుతుంది. జంటపదాల్లో కొన్నింటికి అసలు అర్థాలు మరుగునపడిపోయాయి. వ్యవహారంలో కొత్త అర్థాలు స్థిరపడ్డాయి. పర్యాయపదాలను జంటలుగా మార్చి కలిపి వాడేయటమూ రివాజైపోయింది. ఇక కొన్ని జంటపదాల్లోని మాటలకు ఏ అర్థమూ ఉండదు. వాటిని ప్రాసకోసమే వాడుతుంటాం. ఇలా వైవిధ్యభరితమైన జంటపదాల పూర్వపరాలు...
అతిరథ మహారథులు
పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారినీ, పలుకుబడి ఉన్న వాళ్లనూ ఇలా సంబోధిస్తుంటారు. ‘రథికుడు’ అంటే రథంమీద వెళ్లేవాడు, రథంమీద ఉండి యుద్ధం చేసేవాడని రెండర్థాలు ఉన్నాయి. పూర్వం యుద్ధం చేసేవాళ్ల సామర్థ్యాన్ని నాలుగు రకాలుగా చెప్పేవారట. ‘అర్ధరథుడు (ఒక్క విలుకాడితోనూ సరిగా పోరాడలేనివాడు); సమరథుడు (ఒక్క విలుకాడితో పోరాడగలిగేవాడు); అతిరథుడు (అనేక మందితో పోరాడగలిగేవాడు); మహారథుడు (తననూ, తన సారథినీ, గుర్రాలనూ కాపాడుకుంటూ వేలమంది విలుకాళ్లతో పోరాడగలవాడు). ఇతని కంటే గొప్పవాడు ‘అతిరథశ్రేష్ఠుడు’. అర్జునుడు ‘అతిరథశ్రేష్ఠాతి శ్రేష్ఠుడు’. పది దిక్కుల్లో రథం నడపగలిగేవాడు ‘దశరథుడు’. ఈ బిరుదులు వారి శక్తిసామర్థ్యాలనుబట్టి ఇచ్చేవారట. నేడు రథాలు, పోరాటాలు లేవు. విలుకాళ్లూ లేరు. అయినా ఈ మాటలు వాడుకలో ఉండిపోయాయి.
నదీనదాలు
‘నదీనదాలూ, అడవులు, కొండలు ఎడారులా మనకడ్డంకి?’ అన్నారు శ్రీశ్రీ. ‘నది’ విడిగా వాడుకలో ఉన్నా ‘నదం’ మాత్రం నదిని వెన్నంటే వస్తూ ఉంటుంది. రెండూ సంస్కృత పదాలే. పడమర నుంచి తూర్పునకు ప్రవహించేది ‘నది’. తూర్పు నుంచి పడమరకు ప్రవహించేది ‘నదము’. 
వాగులూ వంకలూ
వరదలు వచ్చినపుడు ‘వాగులూ వంకలూ’ పొంగిపొర్లుతుంటాయి. ఈ రెండూ రూపాంతరాలే కాని స్వల్పభేదం ఉంది. ‘వాగు’ కొండమీది నుంచి ప్రవహించేది. చప్పుడు చేస్తూ వస్తుంది. (‘వాగుడు’ అనే మాట ఇలాగే వచ్చిందేమో!) వాగును ్మ్న౯౯’-్మ  అన్నారు బ్రౌన్‌. ఎత్తు నుంచి నీళ్లు భారీమొత్తంలో పడటమని దీనర్థం.
కూలీనాలీ
రోజువారీ ఇచ్చేది ‘కూలీ’. నెలకి ఇచ్చేది ‘జీతం’. ఇది సామాన్యార్థం. కూలిని ‘భృతి’ అనే అర్థంలోనూ వాడేవారు. కూలికాడు, కూలియాలు, కూలివాడు నిఘంటువుల్లో ఉన్నా మూడోదే వ్యవహారంలో ఉంది. ‘నాలీ’ అంటే చెడ్డపని, నీచమైన పని, మోసంతో కూడిన పని అనే అర్థాలున్నాయి. కడుపు నింపుకునేందుకు తగిన పని దొరక్కపోతే సమాజం ఆమోదించని పనిచేయడానికీ పురికొలుపుతుంది మనసు. అదే నాలీ. ‘‘కూలినాలిజేసి గుల్లాపుపనిచేసి/ తెచ్చిపెట్టనాలు మెచ్చనేర్చు/లేమి చిక్కు విభుని వేమారు దిట్టును/...’’ అన్నాడు వేమన. ‘గుల్లాపు పని’ అంటే దాస్యం.
జీతనాతాలు
సంగం లక్ష్మీబాయి తన ఆత్మకథలో ‘‘ఏ జీతనాతాలూ కట్టకుండానే నన్ను గుంటూరు శారదా నికేతనంలో చేర్చుకుంటామన్నారు’’ అని రాశారు. ‘జీతం’ అంటే వేతనం. సేవకులు బతకడానికి ఇచ్చే సొమ్ము. ‘నాతం’ అంటే ‘బత్తెం’ అని శబ్దార్థచంద్రిక చెబుతోంది. ‘భత్యం’ దీనికి మూలం. దీన్నే ‘బేటా’ అంటూ ‘ధన రూపంలో గానీ ఆహార రూపంలోగానీ రోజూ చెల్లించేది’ అని బ్రౌన్‌ వివరణ ఇచ్చారు.
గొడ్డుగోదా
‘గొడ్డు’ అంటే ఆవు, ఎద్దు తదితర అర్థాలున్నాయి. ‘మృగం’ అనే అర్థమూ ఉందంటూ బ్రౌన్‌ ఎలుగ్గొడ్డు, చిరుతగొడ్డు అని ఉదాహరణలిచ్చారు. పిసినిగొట్టుకి మూలం ‘బిసినిగొడ్డు’ అన్నారు. ‘గోద’ అంటే వృషభం, ఎద్దు. బసవ పురాణంలో కన్నప్ప అడవిలో ఉన్న శివలింగాన్ని చూసి ‘‘ఎక్కుడు గోద నిన్నిక్కడవైచి, యెక్కడబారినో శివుడు’’ అంటాడు. ‘ఎక్కుడు గోద’ అంటే వాహనమైన ఎద్దు. శ్రీనాథుడు శివుణ్ని ‘‘...ముదిగోదనెక్కి భిక్షాటనం చేసేవాడంటాడు. ‘ముదిగోద’ అంటే ముసలి ఎద్దు.
నాందీప్రస్తావనలు
మహాశివుడు ఆకాశంలో నృత్యం చేస్తుంటే, నందీశ్వరుడు ఆయనకి రంగంగా నిలిచాడట. కాబట్టి నాటక ప్రదర్శనకు ముందు రంగాన్ని ఉద్దేశించి చేసే పూజను ‘నాంది’ అంటారు. నాటకాన్ని కానీ ఏదైనా కార్యాన్ని కానీ ప్రారంభించేటప్పుడు దేవతలను స్తుతించడాన్నీ ‘నాంది’ అంటారు. నాటకంలో ‘నాంది’ పూర్తయిన వెంటనే సూత్రధారుడు ప్రవేశించి నాటకం గురించీ, దాని రచయిత గురించీ చెబుతాడు. దాన్ని ‘ప్రస్తావన’ అంటారు. ఈ రెంటినీ కలిపి ‘నాందీ ప్రస్తావనలు’గా వాడుతున్నాం.
పూజ, పునస్కారాలు
‘పూజ’ అంటే దేవతాదులకు చేసే అర్చన, సపర్య అని అర్థం. పురస్కారానికి రూపాంతరం ‘పునస్కారం’. దీనికి ‘ముందుంచుకొను’ అనేది సూటిగా వచ్చే అర్థం. ఆసనం మీద దేవుడి విగ్రహాన్నో, పటాన్నో ముందు ఉంచుకుని పూజ చేస్తారు కదా! ఇప్పుడు పురస్కారాలు, సన్మానాలూ ప్రత్యేక ఆసనం మీద కూర్చోబెట్టే కదా చేస్తున్నారు.
నౌకర్లూ, చాకర్లూ
కన్యాశుల్కంలో గిరీశం బుచ్చమ్మతో ‘‘నువ్వు నన్ను పెళ్లాడితే మనకి ఎంతమంది నౌకర్లు ఉంటారు. ఎంతమంది చాకర్లు ఉంటారు’’ అంటాడు. చార్‌దర్విష్‌ కథలలో ‘‘మరునాడు నౌకర్లూ చాకర్లూ వచ్చి కానుకలు సమర్పించారు’’ అనే వాక్యం కనిపిస్తుంది. కొంతమంది ఈ రెంటినీ పర్యాయపదాలుగా వాడుతున్నారు. రెండూ హిందీ పదాలే. ‘నౌకరు’ అంటే పనివాడు, ఉద్యోగి. ‘చాకరు’ అంటే ఇంటినౌకరు. ‘చాకరీ’ అంటే ఇంటిపని. ‘ఇంటిచాకిరీ’ విస్తృతంగా వాడుకలో ఉంది. 
లంచం పంచం
సౌజన్యారావు పంతులు ‘‘లంచాలూ పంచాలూ మీరు ఇచ్చినట్లైతే మీ కేసులో నేను పనిచెయ్యను’’ అంటాడు లుబ్ధావధాన్లతో. కందుకూరి రాసిన ‘మ్యునిసిపల్‌ నాటకం’ అనే ప్రహసనంలో ‘‘లంచం పంచం తినడం ఉద్యోగ ధర్మమవునా కాదా!’’ అంటాడు వ్యాఘ్రావధానులు. 17వ శతాబ్దికి చెందిన సవరము చిననారాయణ నాయకుడు (కువలయాశ్వ చరిత్ర) కాలం నుంచీ వాడుకలో ఉంది ఈ ‘పంచం’. ఈ రెండూ జంటపదాలు అంది పర్యాయపద నిఘంటువు. కానీ, ప్రస్తుతం లంచంతో పంచం కనిపించట్లేదు. లంచం అంటే తన పని చక్కబెట్టుకోడానికి ఒకరికి రహస్యంగా ఇచ్చే ధనం. పంచం అంటే ఇతరులను వశపరచుకోడానికి బహిరంగంగా చేసే ఉపకారం.
మూటాముల్లె
‘మూటాముల్లె సర్దుకున్నారు’ అంటుంటాం. ‘మూట’ అంటే సరకులు పోగుచేసి కట్టిన ముడి. ఆ సరకులు ఏవైనా కావచ్చు. దీనికి పర్యాయ పదాలు ముల్లియ, ముల్లె. ‘ముల్లె’ అంటే డబ్బు, నగలమూట.
బుద్ధీజ్ఞానం 
ఎవరిమీదైనా కోపం వచ్చినపుడు ‘బుద్ధీజ్ఞానం లేదా?’ అంటాం. తెలివి, ఎరుక, తలపోత వంటివి ‘బుద్ధి’కి సమానమైన తెలుగు మాటలు. ‘ఎరుక’ అంటే జ్ఞానం, తలపోత అంటే ఆలోచన అనే అర్థాలున్నాయి. పుట్టుకతో వచ్చిన తెలివి బుద్ధి. లోకాన్ని చూసి, అనుభవాలు పొంది గడించిన ఎరుక జ్ఞానం. అంటే తెలివి సహజమైంది. ఎరుక సంపాదించుకునేది. 
నయానోభయానో 
‘ఒప్పించడం’ అనే మాటకు ముందు ఈ జంటపదాలను వాడతుంటాం. ‘నయము’ అంటే చాలా అర్థాలు ఉన్నాయి కానీ న్యాయం, ధర్మం, పాడీ అనేవే ఈ సందర్భంలో గ్రహించాలి. ‘‘నయమున పాలు త్రావరు, భయమునను విషమ్మునైన భక్షింతురుగా...’’ అన్నాడు సుమతీ శతకకర్త. ఇక్కడ ‘నయమున’ అంటే ‘బతిమాలితే’ అనే అర్థం చెప్పుకోవచ్చు.
పనీపాటా
ఖాళీగా తిరుగుతున్న వాళ్లను ‘పనీపాటా లేకుండా తిరుగుతున్నారు’ అంటుంటారు. శ్రామికులు అలసటను మరిచిపోవడానికి పాటలు పాడుతూ ఉంటారు. అక్కణ్నుంచే ఈ ప్రయోగం వచ్చింది. మన జానపద గీతాలన్నీ అలా పురుడుపోసుకున్నవే. 
నోరూవాయీ 
ఈ జంటలోని ‘వాయి’ ద్రవిడ భాషా పదం. వాయిముడు, వాయిమూసుకోవడం అనే ప్రయోగాల్లో కనిపిస్తుంది. ‘చేదోడు, వాదోడు’ (చేయితోడు వాయితోడు) అనే జంటపదాల్లో రెండో అక్షరం లోపిస్తుంది. ‘వా’ అంటే నోరు, మాట అనే అర్థాలున్నాయి. ‘వాచాలుడు’, ‘వాగుడుకాయ’ మనకు వాడుకలో ఉన్నాయి. వాపోవడం అంటే అరవడం, గొంతెత్తి ఏడవటం. వాతపడటం అంటే నోటికి చిక్కడం. విషయాన్ని నొక్కిచెప్పడం కోసమే ఇలా ‘నోరూవాయీ’ అంటూ ఒకే అర్థం ఉన్న రెండు మాటలను వాడుతుంటామన్నారు బూదరాజు రాధాకృష్ణ.
దిక్కూ దివాణం 
‘దిక్కు’కి పొద్దు, వైపు, ఆశ్రయం అనే అర్థాలున్నాయి. ‘నీకు దిక్కున్నచోట చెప్పుకో’ అనేది ప్రయోగం. నీకు ఎవరు ఆశ్రయం ఇస్తారో వారికి చెప్పుకో అని అర్థం. అదే అర్థం ‘దివాణం’ అనే మాటకూ ఉంది. మొగల్‌ చక్రవర్తుల కాలంలో రెండు దర్బారులుండేవి.  చక్రవర్తీ, మంత్రులూ మంతనాలు జరిపేది ‘దీవానే ఖాస్‌’. ప్రజల సమస్యలు, వివాదాలను విని చక్రవర్తి తీర్పులు చెప్పేది ‘దీవానే ఆమ్‌’. ఈ సంప్రదాయాన్నే తెలుగు సంస్థానాధీశులూ అనుసరించారు. బాధిత ప్రజలు తమ కష్టాలను మొరపెట్టుకొనేచోటు (వారికి ఆశ్రయం దొరికేచోటు) దివాణమే కదా! అయితే,  ‘‘దీవానే ఆమ్‌ మరాఠీలో దివాణే ఆమ్‌ అయి, నేడు హైదరాబాదులోని ‘బాగేఆం’ (పబ్లిక్‌ గార్డెన్స్‌) బాగయాం, బాగాం అయినట్టు దీవాణం, దివాణం అయింది’’ అన్నారు తిరుమల రామచంద్ర.
వావీ వరసా 
‘వావి’ అంటే బంధువరస, శాస్త్రీయ సంబంధమైన యోగ్యత, అనుకూలమైన సంబంధ యోగ్యత. ‘వరస’ అంటే బంధుత్వం. కంకంటి పాపరాజు ‘ఉత్తర రామ చరిత్ర’లో ‘‘...మిమ్మువంటి పెద్దవె తగు వావియువ్వరుస దప్పి చరించిన నమ్మచెల్లగా...’’ అనే పద్యం దీన్ని బలపరుస్తోంది. ‘వలచి వస్తే మేనమామ కూతురు వావి కాదన్నట్టు’, ‘వాడ వదినెకేల వావి వర్తనములు’ అనే లోకోక్తులను ‘ఆంధ్రలోకోక్తిచంద్రిక’ పేర్కొంది.
చీకూ చింతా 
జీవితం చీకూ చింతా లేకుండా సాగిపోవాలని కోరుకుంటాం. ‘చీకు’కి గుడ్డితనం, చీకిపోవడం, చప్పరించడం వంటి అర్థాలు ఉన్నాయి. అవి ఇక్కడ సరిపోవు. కాబట్టి ‘చీకు’కి మూలం ‘చీకాకు’ కావచ్చు. ‘చింత’కి చింతచెట్టు, తలంపు, స్మృతి, దుఃఖం, ఆలోచన వంటి అర్థాలు ఉన్నాయి. కానీ విచారం, దుఃఖం అర్థంలో ఈ జంట పదాలను వాడుతున్నాం. కాబట్టి చీకూ చింతా పర్యాయపదాలే.
అలుపూ సొలుపూ
‘‘ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూసొలుపేమున్నది?’’ అన్నాడో సినీకవి. అలుపు అంటే అలసిపోవడం, శ్రమపడటం, ఆయాసపడటం, విసుగు, వేసారు మొదలైన అర్థాలూ ఉన్నాయి. సొలుపు అంటే సారహీనంకావడం, నిస్త్రాణం, బడలిక.
మానూ మాకూ
 ‘చెట్టు’ సాధారణంగా వాడే పదం. పెద్ద చెట్టు గట్టిబోదెతో ఉంటే దాన్ని ‘మాను’ అంటారు. దీనికి పర్యాయపదమే ‘మాకు’. పూర్వం వీటిని మ్రాను, మ్రాకు అనేవారు. ప్రాత, క్రొత్తలలో రేఫం లోపం జరిగి పాత, కొత్త అయినట్టు మాను, మాకు వచ్చాయి.
శుచీ శుభ్రతా
ఈ సంస్కృత పదాలు జంటగా వాడుకలో ఉన్నాయి. శుచికి మడి అనే అర్థం ఉంది. కానీ వ్యవహారంలో మాత్రం శుభ్రత అనే అర్థమే ఉంది. మరుగుదొడ్ల మీద శౌచాలయం/శౌచశాల అని రాసి కనిపిస్తుంది. శుచికి శుభ్రతతోపాటు మరో ఇరవై అర్థాలు ఉన్నాయి.
చెట్టూ చేమా
‘చేమ’ అంటే శాక భేదం. కూరగా ఉపయోగించే కాయ, దుంప, పండు, ఆకుకూర వంటివాటిని శాకం అంటారు. చెట్టూ చేమలు అంటే ‘చెట్టూ మొదలైనవి’ అన్నారు బ్రౌన్‌.
డాబూ దర్పం
డాబు, డాబుసరి, బడాయి అనేవి దర్పానికి సమానమైన తెలుగు మాటలు. బడాయి హిందీ. డాబుకి ఇంకా అతిశయం, పట్టీ, డాబా, మొలతాడు, పక్షివిశేషం, యోధులు జంధ్యంలా వేసుకునే తోలుపట్టె అనే అర్థాలున్నాయి.
ఇరుగూ పొరుగూ
దీనికి ఇరువు పొరువు అనేది పర్యాయపదం. ఇరుగుకు పక్కనున్నది, సమీపంలో ఉన్నది అనే అర్థాలూ ఉన్నాయి. ఈ అర్థాల్లోనే పొరుగు, పొరువు, పొర్వు అనే రూపాంతరాలున్నాయి. ఇరుగింటివాళ్లు, పొరుగింటివాళ్లను కలిపి తెల్లవాళ్లు ‘నైబర్స్‌’ అంటారు.  
ప్రాసే పరమార్థం
‘పిల్లాజెల్లా’ అనేది పిల్లలను ఉద్దేశించి వాడే మాట. పిల్ల అంటే ఆడశిశువు, చిన్న, అల్పం వంటి అర్థాలున్నాయి. జెల్ల అంటే పిల్ల అని శబ్దార్థచంద్రికలో ఉంది. ఇంకే నిఘంటువు దీన్ని చెప్పలేదు. కాబట్టి జెల్ల ప్రాసకోసమే. ‘ఢక్కామొక్కీ’ అని ఇంకో వాడుక ఉంది. దీనికి ఢక్కాముక్కీలు అనే రూపం కూడా కనిపిస్తుంది. ‘ఢక్కా’ శబ్దానికి కయ్యం, కష్టం, హాని, చెరుపు వంటి అర్థాలు ఉన్నాయి. రెండో పదానికి అర్థం అస్పష్టం. పెళ్లిగిళ్లిలో గిళ్లికి అర్థంలేదు. చుట్టాలు పక్కాలు, అప్పోసప్పో లాంటి వాటిల్లో కూడా రెండో పదానికి సరైన అర్థాలు కనిపించవు.                              
      ఇలా ఓ భావాన్ని మరింత స్పష్టంగా, ఎదుటివాడి గుండెల్లో నాటేటట్టు చెప్పడానికి... సమానార్థకమైన, చాలావరకు సమానోచ్చారణగల రెండు పదాలు కలిపి జంటగా వాడటం భారత భాషలన్నిటిలోనూ ఉంది. ఇలాంటి జంటపదాలు ఎప్పటికీ తెలుగుకు సిరిసంపదలే. 


వెనక్కి ...

మీ అభిప్రాయం