దాశరథి ఆగ్రహజ్వాల

  • 607 Views
  • 4Likes
  • Like
  • Article Share

    సమీర్‌ చక్రవర్తి

  • హైదరాబాదు

కృతికర్తలకంటే ఎక్కువగా వాళ్ల కృతులు ప్రచారంలోకి రావడం, పాఠక ప్రపంచానికి అవే ఎక్కువ జ్ఞాపకం ఉండటం విశేషం. ఆధునిక తెలుగు సారస్వత రంగంలో ఇలాంటి కృతులు కొన్ని పంచతంత్రం, ప్రతాపరుద్రీయం, కన్యాశుల్కం, మాలపల్లి, వేయిపడగలు, పాండవోద్యోగ విజయాలు, అనుభవాలూ జ్ఞాపకాలు, మహాప్రస్థానం, నా గొడవ, అగ్నిధార. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఈ రచనల గురించి తెలియని, వినని, చదువని తెలుగువాళ్లు ఉండరు. వీటిలో ‘అగ్నిధార’ కవితా సంకలనం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆధునిక తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా స్వాతంత్య్రానికి ముందటి సాహిత్యంలో ‘అగ్నిధార’ది ఓ విశిష్ట స్థానం. 
‘అగ్నిధార’ గీతాలు
దాశరథి (దాశరథి కృష్ణమాచార్యులు) తూగుటుయ్యెలలో ఊగుతూ ఉల్లాసంగా రాసినవి కావు; తూటా దెబ్బల మోతలు వింటూ, కొరడా దెబ్బలు తింటూ ఉద్యమ ఉద్వేగంతో రాసినవి. వీటి విలువను, ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోవాలన్నా, ఆ గీతాల్లోని కావ్య పరిమళాలను ఆస్వాదించాలన్నా ముందు కవి దాశరథి వ్యక్తిత్వాన్ని, నేపథ్యాన్ని తెలుసుకోవాలి. దాశరథి పుట్టుక ఓ శిష్టాచార, సంప్రదాయ, పండిత కుటుంబంలో. తండ్రి దగ్గర కఠిన క్రమశిక్షణలో, నిత్యానుష్టానంలా పాఠాలు నేర్చుకోవడంతో ఉగ్గుపాలతోనే దాశరథి పాండిత్యాన్ని, వైదుష్యాన్ని జీర్ణించుకున్నారు. 
      బయటి వాతావరణంలో, సాంగత్యంతో బాల్యంలోనే దాశరథి ఆధునిక, అభ్యుదయ భావాలు ఆవహించాయి. చిన్నప్పుడే దాశరథి మీద భారత స్వాతంత్య్ర జాతీయ ఉద్యమాల, గాంధీజీ సిద్ధాంతాల, వామపక్ష భావాల ప్రభావం ప్రసరించింది. నిజాం నిరంకుశ పరిపాలనకు, నిజాం ప్రోత్సహించిన మతోన్మాదుల రాక్షసకృత్యాలకు వ్యతిరేకంగా కలం నడిపిన, కలానికి సంకెళ్లు వేస్తే గళం విప్పిన మహాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు దాశరథి. ఆకారంలో వామనమూర్తి అయినప్పటికీ అత్యంత శక్తివంతమైన లేఖినితో ఆయన తెలుగు సాహిత్యరంగంలో విరాట్‌ స్వరూపం ధరించారు. దాశరథి లేఖిని నుంచి వెలువడిన గీతాలు, పద్యాలు, ఇతర రచనల సంకలనాలు అనేకం. వాటిలో మొదటి సంకలనం ‘అగ్నిధార’. 
జనం మనం మనం జనం
‘సాహితీ మేఖల’ సంస్థ పక్షాన 1949లో ఇది మొదటి ముద్రణ (మొదటి ప్రచురణ) పొందింది. తొలి ముద్రణకు 1949 ఆగస్టు 15న, మలి ముద్రణకు 1962 నవంబర్‌ 24న తొలి పలుకులు రాశారు దేవులపల్లి రామానుజరావు. ‘అగ్నిధార’ గీతాల్లో చాలా భాగం దాశరథి కారాగార నిర్బంధంలో (వరంగల్లు, నిజామాబాదు, హైదరాబాదు చంచల్‌గూడ జైళ్లలో) కఠినశిక్షలు అనుభవిస్తూ రాసినవి. నిజామాబాదు జైలులో ఆయనతో కలిసి దండన అనుభవించిన స్వాతంత్య్ర సమరయోధుడు, దాశరథి గీతాలను జైలు గోడలమీద రాసి, గళమెత్తి పాడి పాలకుల గుండెల్లో ప్రకంపనలు పుట్టించిన సన్నిహితుడు వట్టికోట ఆళ్వారుస్వామి. ‘అగ్నిధార’ను వట్టికోటకి అంకితం ఇస్తూ ‘అసలు ఆళ్వార్లు పన్నెండు మందే, పదమూడో ఆళ్వారు మా వట్టికోట ఆళ్వారుస్వామి’ అన్నారు దాశరథి.
      ‘పోరాటంలో నుంచి కళ పుడుతుందని నమ్ముతున్నాను. నా జీవితమే పోరాటం. ఎన్నో ప్రతీపశక్తులతో పోరాడాను. నా గమ్యం ప్రపంచ శాంతి. నా ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదం. జనం మనం మనం జనం, జనం లేక మనం లేము’ అని దాశరథి ఉద్ఘోషించారు. ‘అగ్నిధార’ సంపుటిలోని 49 గీతాల్లో ఇదే ఉద్ఘోష ప్రతిధ్వనిస్తుంది. ‘...దాశరథి హృదయమును కుమిలించిన పొగలు, సెగలు పైకి ఉబికి వచ్చిన యీ గ్రంథంలో అక్షర రూపము దాల్చినవి... ఆగర్భ శ్రీనాథునికి అనాథునికి మధ్య చిరకాలము నుంచి జరుగుచున్న సంఘర్షణయే మా దాశరథి కవితావస్తువు... తిరుగుబాటుకు దాశరథి కవిత్వము ఉత్కృష్ట నిదర్శనము...’ అని ‘అగ్నిధార’ తొలిపలుకులలో రామానుజరావు వివరించారు. సందేహం లేదు. నాడు నిజాం పాలనలో విచ్చలవిడిగా చెలరేగిన దౌర్జన్యాలు, పడతుల మానభంగాలు, అమాయకుల అమానుష వధ, గృహ దహనాలు, గ్రామ దహనాలు, హత్యాకాండలను ఖండిస్తూ ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా దాశరథి జరిపిన తిరుగుబాటు, ఆయన గుండెలో రగుల్కొన్న ఆగ్రహజ్వాల అగ్నిధార గీతాల ప్రవాహానికి స్ఫూర్తినిచ్చింది. ‘గాయపడిన గుండెలలో రాయబడని కావ్యాలెన్నో’ అన్నది దాశరథి మాట. తన కళ్లముందు తన ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను చూసినప్పుడు దాశరథి హృదయం నుంచి అగ్నిధార కవితారూపంలో వెలువడింది.
మల్లెలూ మోదుగులూ
‘అగ్నిధార’లో అంగారం, శృంగారం రెండూ కలగలసి ఉన్నాయని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయంతో దాశరథి ఏకీభవించారు. కష్టాలలో కూడా కమనీయమైన తలపులకు తలుపులు తీసిన కవీశ్వరుడు దాశరథి సుప్రసిద్ధ ఉర్దూకవి గాలిబ్‌ నుంచి స్ఫూర్తిపొందారు. (గాలిబ్‌ గజళ్లను ఆయన తెలుగులోకి అనువదించారు) ‘అగ్నిధార’ కవితా సంకలనం పురాస్మృతుల్లో దాశరథి ఇలా చెప్పారు...  .. 
      ‘..నేను జైల్లో ప్రవేశించినప్పుడు నా వయసు సుమారు ఇరవయి. ఆకాశంలోకి తలెత్తి చూస్తే మేఘాలు అందమయిన అమ్మాయిల ఆకారాలు ధరించి పొంగిన వక్షస్థలాలతో నన్ను కవ్వించడానికి వచ్చేవి... నెల్లికుదురు (మానుకోట తాలూకా) గ్రామంలో పోలీస్‌ స్టేషన్‌ నుంచి తప్పించుకుని అడవిలోకి పరిగెత్తినప్పుడు, గుర్రాల మీద నలభయి మంది సైనికులు నన్ను వెదుకుతూ వెంటాడినప్పుడు క్షణం ఆగకుండా అరణ్యంలో పరుగెత్తుతుంటే ఎక్కడో పది గుడిసెల చిన్న పల్లె. అక్కడ కాస్త ఆగి మంచి నీళ్లు అడిగితే ఆప్యాయంగా ముంతతో నీళ్లు అందించిన రైతుపిల్ల ఒయ్యారం, ఆమె కళ్లల్లోని అమాయకత నన్ను మైమరపించాయి. నిజామాబాద్‌ జైల్లో కిటికీలోంచి చూస్తే బయట మామిడి కొమ్మ చిగిర్చి పూలు పూస్తే లక్ష ఉగాదులు ఒక్కసారి హృదయంలో దూకినట్లుండేది. శృంగార వీర రసాలు కలగలసి నాలో పెల్లుబికేవి. వాటికి తార్కాణం అగ్నిధార.’ 
      ‘అగ్నిధార’ గీతాలన్నీ అగ్గిరవ్వలు కావు, వాటిలో రమ్యావలోకనపు శృంగార కళికలు, హవణికలు ఉన్నాయి. మల్లెలూ, మోదుగులూ రెండు తనకు నచ్చినట్లు శృంగార, వీరరసాలు రెండూ తన హృదయాన్ని పొంగింప చేస్తాయని  దాశరథి అన్నారు.
నా తెలంగాణ కోటి రత్నాల వీణ
‘అగ్నిధార’ ఓ సంకలనంగా ప్రచురితం కాకముందే అందులోని కొన్ని గీతాలు బహుళ ప్రచారం పొందాయి. 1948లో శబ్దాను శాసనాంధ్ర భాషా నిలయం వార్షికోత్సవాల సందర్భంగా ఓరుగల్లు కోటలో ఓ కవి సమ్మేళనం ఏర్పాటైంది. ఆ వేదికను మతోన్మాద రజాకార్‌ గూండాలు తగులబెట్టి బుగ్గిచేశారు. ఆ బూడిదపైనే కవి సమ్మేళనం నిర్వహించాలని సురవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామానుజరావు పట్టుపట్టి నిర్ణయించారు. తక్షణం అక్కడే చరిత్రాత్మక కవి సమ్మేళనం జరిగింది. దాశరథి అప్పటికి ఇంకా ప్రచురితం కాని అగ్నిధార గీతాలను చదివి వినిపించి ఉత్తేజాన్ని రేకెత్తించారు. దాశరథి కవిగా సాహసవంతుడు. జైల్లో సహచరులు భయపడుతున్నా ఆయన భయపడకపోయేవాడు. 1948లో నిజామాబాదు (ఇందూరు దుర్గం) జైల్లో, దాశరథి ఓ రోజు ఆగ్రహోదగ్రుడై జైలుగోడ మీద ఈ పద్యం రాశారు... 
ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మా కెన్నడేని
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాల వీణ

వట్టికోట ఆళ్వారుస్వామి దీన్ని కంఠస్థం చేసి జైలులో అందరికీ విన్పించేవారు.
ప్రబంధ మార్గంలోనూ...
ఓ విప్లవ కవిగా, అభ్యుదయ వాదిగా, తన ప్రజల పక్షాన నిలిచి తాడితులు, పీడితుల కాహళిగా సామాజిక స్పృహను వ్యక్తపరచిన దాశరథి ప్రబంధ సంప్రదాయాలను విస్మరించలేదు. ‘కవితా మదిరాను పానమే అతులిత మోహనౌషధ’మని భావించిన ఆయన ‘అగ్నిధార’లో కలకూజితాలను కూడా విన్పించి పాఠకులను చకితులను చేస్తారు. ‘‘పది కావ్యమ్ముల పాటు ప్రేమమయ ది/ వ్య స్వాంత గీతాలు వ్రా/ సెద; కాంతాధర కంపిత ప్రవచన/ శ్రీలే ఉటంకించెదన్‌’’ అని అంటారు దాశరథి! అంతేకాదు- ‘‘నా కలంపు వి/ న్నాణముతో రచింతు లల/ నా నును చెక్కుల పైని కావ్యముల్‌’’ అని కూడా అన్నారు.
      ‘అగ్నిధార’ను ప్రవహింపజేసిన దాశరథి రమ్యావలోకనంలో సకల జగత్తు ఓ సుందర నందనవనం. ఆయన్ను రసిక కవి చక్రవర్తిగా అభివర్ణించడంలో అతిశయోక్తి లేదు. ‘‘ఆకులు రాలిపోయె, దెస/ లన్నిట చీరెలు జారిపోయె, న/ గ్నీకృతయై మహా ప్రకృతి/ నేలకు మోమును వాల్చె’’ లాంటి మనోజ్ఞ వర్ణనలకు అగ్నిధార ఆటపట్టు. 
అకుంఠిత దేశభక్తి
దాశరథి జాతీయ వాది, జాతీయ కవి, దేశభక్తుడు. ‘అగ్నిధార’ కావ్యం ‘జయ భారతీ’ గేయంతో ప్రారంభమవుతుంది. 
ఓ జనతా 
నతాంజలి పుటోజ్వల 
దివ్యకవోష్ణ రక్త ధారా జలసిక్త 
పాద కమల ద్వయ శోభి మనోజ్ఞ దేహ రేఖా 
జయభారతీ!
యుగయుగమ్ముల పున్నెపు పంట వీవు
నీ పూజకు తెచ్చినాడ నిదె 
పొంగిన గుండియ నిండు పద్దెముల్‌..
 
      అంటూ దాశరథి తన అకుంఠిత దేశభక్తిని వ్యక్తపరచారు. ఓ కవిగా, పౌరుడిగా తన కర్తవ్యాన్ని, బాధ్యతను విస్మరించని మహామనీషి దాశరథి. సౌందర్యోపాసనలో తలమునకలై ఆయన కర్తవ్యాన్ని విస్మరించినా, సామాజిక స్పృహను కోల్పోయినా తెలుగు సాహిత్యానికి ‘అగ్నిధార’ అందేది కాదు. రాచరిక నిరంకుశ పాలనలో, మతోన్మాదుల స్వైరవిహారంలో అగ్నిగుండంగా మారిన తెలంగాణం ఆయన గుండెను కదిలించింది, ఆయన కలాన్ని, గళాన్ని ఆవహరంగానికి ఆయత్త పరచింది. అందుకే ‘‘... మధుర/ మంజుల మామక లేఖినీ ముఖం/ బెండకు మండిపోయి రచి/ యించును గ్రీష్మ మహా ప్రబంధముల్‌’’ అంటూ పర్జన్య శంఖం పూరించారాయన. 
ఎముకల్‌ నుసిజేసి పొలాలు దున్ని భో షాణములన్‌ నవాబుకు
స్వర్ణము నింపిన రైతుదే, తెలంగానము రైతుదే...

     అన్నది దాశరథి కవి గర్జన. ఆయన వాక్కు తర్వాత అనతి కాలంలోనే అక్షర సత్యమైంది. 
     దాశరథి ఆశావాది, దార్శనికుడు, మానవతను ఆరాధించిన వ్యక్తి. ‘‘తరతరాల దరిద్రాల/ బరువులతో కరువులతో/ క్రుంగిక్రుంగి కుమిలి కుమిలి/ తలవాల్చిన దీన పరా/ ధీనజాతి శ్రమిక జాతి/ దెబ్బతిన్న బెబ్బులి వలె/ మేల్కొన్నది మేల్కొన్నది’’ అంటూ ఉషోదయపు కిరణాలను ప్రసరింపజేశారు. 
     ఉద్యమాలే ఊపిరులుగా జీవించిన, పోరాటాల ఆరాటాలతో తిరుగుబాటు ధ్వజం ఎత్తిన మహాకవి దాశరథి గొప్ప ప్రబోధకుడు. ‘అగ్నిధార’ గీతాలతో ఆయన యువతరానికి అమూల్య సందేశం అందించారు.
నవ భారత యువకులారా!
కవులారా! కథకులార!
భవిత్యపు హవనానికి
హోతలు, నూతన
భూతల నిర్మాతలు
మీరే మీరే
 
      అంటూ దాశరథి భవిష్యత్‌ పురోగమనానికి బావుటా ఎత్తారు. ‘అగ్నిధార’ డెబ్భై సంవత్సరాల కాలం కరకు రాపిడిని తట్టుకుని నిలిచిన ఉజ్వల కావ్యం. తెలుగు సారస్వత జ్యోతి వెలిగినంత కాలం ‘అగ్నిధార’ కాంతులు ప్రసరిస్తాయన్నది తథ్యం.


వెనక్కి ...

మీ అభిప్రాయం