వన్నె చిన్నెల వయ్యారి కలంకారి

  • 1276 Views
  • 6Likes
  • Like
  • Article Share

    మడక రామకృష్ణ,

  • విజయవాడ
  • 8008272762
మడక రామకృష్ణ,

కృష్ణాజిల్లా అనగానే గుర్తొచ్చేవి... కూచిపూడి ముద్రలు, కొండపల్లి బొమ్మలు, కలంకారీ వస్త్రాలు. తెలుగు సాంస్కృతిక, హస్తకళా వైభవచిహ్నాలివి.  జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత వీటిది. ఈ మూడు వారసత్వ సంపదల్లో కూచిపూడి అందరికీ కరతలామలకం. కొండపల్లి బొమ్మల కబుర్లూ మాధ్యమాల్లో తరచుగానే కనిపిస్తుంటాయి. ఇక కలంకారీ వస్త్రాలను వినియోగించేవారు ఎక్కువ కానీ, వాటికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు తెలిసినవాళ్లు తక్కువ. నాలుగు రంగులతోనే దుస్తులకు విభిన్న సొబగులను ‘అద్దే’ ఈ కలంకారీ కళా విశేషాలివి... 
అజంతా కుడ్యచిత్రాల శైలిని అందిపుచ్చుకున్న అందమైన అచ్చులు... ఒంటికి హానిచేయని సహజసిద్ధమైన రంగులు కలంకారీ ప్రత్యేకత. పచ్చని చిలుకలు.. పాడే కోయిలలు.. వయ్యారి భామలు.. హంస నడకలు.. నెమలి నాట్యాలు.. రాజుగారి వూరేగింపులు... ఒకటేమిటి! కలంకారీ వస్త్రాల మీద కనిపించని రూపం అరుదు. అందుకే ఇవి తెలుగుదనం ఉట్టిపడే కళారూపాలుగా పేరుగాంచాయి. లండన్‌ విక్టోరియా ప్రదర్శనశాలలోనూ కొలువుదీరాయి.
      కలంతో పనిచేసే కార్మికుణ్ని గుర్తుచేసేది ‘కలంకారి’ పేరు! పర్షియా నుంచి వచ్చిన పదమిది. అయితే, దుస్తుల మీద కలంతో బొమ్మలు చిత్రించే పద్ధతి శ్రీకాళహస్తిది. మచిలీపట్నం కలంకారీలో మాత్రం చెక్క అచ్చుల సాయంతో వస్త్రాలకు వన్నెతెస్తారు. మచిలీపట్నం కేంద్రంగా పదిహేనో శతాబ్దంలో కలంకారీ ఆవిర్భవించిందన్నది ప్రచారంలో ఉన్న అభిప్రాయం. కానీ, ‘రంగుల అద్దకం కళ’గా ఇది కాకతీయుల కాలంలోనే ప్రఖ్యాతి పొందిందంటారు డా॥ కురుగంటి శ్రీలక్ష్మి. ‘‘కాకతీయుల కాలంలో అత్యున్నత స్థితిలో ఉన్న ఈ కళ పర్షియాకు మనకు గల ఆదాన ప్రదానాల వలన మరింత వృద్ధి పొందింది. ప్రాచీన కాలం నుంచి ఇండియాకు పర్షియాకు సాహిత్యపరంగా ఏకత కనిపిస్తుంది. వారి కథల్లోనూ పురాణాల్లోనూ ఒకే రకమైన మూలాంశాలు కనిపిస్తాయి. వారితో వాణిజ్యం ఇనుమడిం చాక రంగుల అద్దకాలనే పేరు రూపుమాసి ‘కలంకారీ’గా ప్రాచుర్యం పొందిందీ కళ’’ అంటారావిడ. శ్రీలక్ష్మి రచించిన ‘బందరు కలంకారి’ పుస్తకం రామరాజు జానపద విజ్ఞాన బహుమతిని పొందింది.
ఆ ప్రాంతాల్లో ఉన్నా...
గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, శ్రీకాళహస్తిల్లోనూ కలంకారీ వస్త్రాలు తయారవుతుంటాయి. కానీ, అచ్చుల్లో ప్రాకృతిక దృశ్యాలకు పెద్దపీట వేసే మచిలీపట్నం కలంకారీకే ప్రాచుర్యమెక్కువ. స్థానికులతో పాటు పర్షియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ కొన్ని కుటుంబాల చేతుల్లో ఈ కళ విస్తరించింది. మచిలీపట్నంలోని ఇంగ్లీషుపాలెం, దేశాయిపేట, నిజాంపేట, బల్లాలగూడెం ప్రాంతాల్లో ఆనాడు కలంకారీ వస్త్రాలు తయారయ్యేవి. స్థానికంగా లభించే ఆకులు, పువ్వులతో రంగులను రూపొందించుకుని, అందమైన వస్త్రాలను సృష్టించేవారు ఇక్కడి కళాకారులు.
      అచ్చులో పర్షియన్‌ ఆకృతులను (ఆకులు, మొగ్గలు, పువ్వులు, తీగలు) ప్రవేశపెట్టిన తర్వాత పరిశ్రమ విశ్వవ్యాప్తమైంది. పదహారో శతాబ్దంలో మచిలీపట్నం వచ్చిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రతినిధులు ఈ కళను చూసి పులకించిపోయారు. ఆ కాలంలో బందరు ఓడరేవు నుంచి విదేశాలకు కలంకారీ ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. ఆ సమయంలోనే అందానికి పర్యాయపదంగా సాహిత్యంలోనూ స్థానం సంపాదించుకుంది కలంకారి. ‘‘అలరారు నవ్వ సంతాగమవేళ/ పల్లవ కుసుమ సరసకుంజములుస్మరు కలంకారి/ పనిగుడారులనగ భాసిల్లెనపుడు’’ అంటూ వర్ణించాడు ‘మృత్యుంజయ విలాసం’ కావ్యకర్త గోగులపాటి కూర్మకవి. అయితే, తర్వాత కాలంలో ఆంగ్లేయ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో ఈ కళ దాదాపు అంతరించిపోయింది.
మళ్లీ ప్రాణం పోసుకుంది!
స్వాతంత్య్రం అనంతరం కలంకారి తిరిగి పుంజుకుంది. అప్పటి భారత హస్తకళల సంస్థ అధ్యక్షురాలు కమలాబాయి చటోపాధ్యాయ అనుకోకుండా లండన్‌ విక్టోరియా ప్రదర్శనశాలలోని కలంకారీ ఉత్పత్తులను చూశారు. చూపుతిప్పుకోనివ్వని వాటి అందం ఆమెను ఆకర్షించింది. ఈ కళ మన దేశానిదేనని తెలియడంతో ఆమె ఆశ్చర్యపోయారు. వివరాలు తెలుసుకుని మచిలీపట్నం వచ్చారు. పరిశ్రమ పునరుద్ధరించడానికి ఆమె విశేష కృషి చేశారు. స్థానికులైన       విన్నకోట వెంకటస్వామినాయుడు అధ్యక్షతన బల్లాలగూడెం కలంకారీ పారిశ్రామిక సహకార సంఘాన్ని ప్రారంభింప జేశారు. ఆ సంఘం ద్వారా వందలాదిమంది కార్మికులు శిక్షణ పొందారు. ఇలా తిరిగి వూపిరిపోసుకున్న పరిశ్రమ... 1960 చివర్లో ఇక్కడికి ఏడు కిలోమీటర్ల దూరంలోని చేనేత గ్రామం పెడనకు విస్తరించింది. ప్రస్తుతం ఇక్కడే ఎక్కువగా కలంకారీ వస్త్రాల ఉత్పత్తి జరుగుతోంది.
విన్నకోట వెంకటస్వామినాయుడు కుటుంబం తరతరాల నుంచి కలంకారీ పనిలోనే ఉండేది. వాళ్లతో పాటు అనుమకొండ వెంకటరంగయ్య నాయుడు, రేకపల్లి పార్థసారథి కుటుంబాలూ బందరులో కలంకారిని నిలబెట్టాయి. వడ్లమూడి కుటుంబీకులూ ఇందులో సిద్ధహస్తులే. ‘‘కళ అనువంశికంగా అభివృద్ధి చెందుతుందనడానికి వీరి కుటుంబాలు తార్కాణం. పెద్దవారి ద్వారా పిన్నలు నేర్చుకోవడం, దాన్ని కేవలం జీవనోపాధికి వృత్తిగా స్వీకరించకుండా, ఆ కళలో తమంత వారు లేరని అందరి చేత మన్ననలందుకున్న ప్రఖ్యాత కళాకారుల కుటుంబాలివి’’ అంటూ వీళ్ల ఘనతలను చరిత్రకెక్కించారు డా॥ శ్రీలక్ష్మి.
నాలుగు రంగులే
కలంకారీ వస్త్రాల తయారీలో బోలెడు దశలు ఉంటాయి. ముందుగా తమిళనాడు నుంచి తెల్లని నూలు, ఉజ్జయిని నుంచి సిల్క్‌ వస్త్రాలను పెడనకు తీసుకొస్తారు. ఒకేసారి దాదాపు పదివేల మీటర్ల వస్త్రాన్ని తెస్తారు. దాన్ని వివిధ పరిమాణాల్లో కత్తిరించి, బాగా ఉతుకుతారు. బ్లీచింగ్‌ చేస్తారు. తర్వాత దాన్ని ఆవుపేడలో నానబెడతారు. రాత్రంతా ఉంచితే వస్త్రంలో ఉన్న జిగురు పోతుంది. దానికి కరక్కాయ ద్రావణం అద్దుతారు. తర్వాత వస్త్రాన్ని నీటిలో ముంచుతారు. అందులో నాణ్యమైన పాలు కలుపుతారు. అప్పుడు వస్త్రం లేత పసుపు రంగులోకి మారి, సహజసిద్ధ కలంకారీ అద్దకానికి సిద్ధమవుతుంది.
కలంకారీలో అద్దే రంగుల్లో ముఖ్యమైంది నలుపు రంగు. స్థానికులు వాడుక భాషలో దీన్ని ‘కసిం’ అంటారు. ఎరుపు, నీలం, హల్దీ (పసుపు) రంగులవి తర్వాతి స్థానాలు. రసాయనాలు వినియోగించకుండా చెట్ల వేర్లు, ఆకులు, పువ్వులతో ఈ రంగులను తయారుచేస్తారు. హలిజరిన్‌, ఆలం, నల్లబెల్లం, తుప్పురేకులు, కరక్కాయలు, జాజి ఆకులు, దానిమ్మకాయ తొక్కలు, ఇండిగోబ్లూ కేక్‌ తదితరాలతో ఈ రంగులు తయారవుతాయి.
చీరల నుంచి...
రంగులు తయారయ్యాక అద్దకం పని మొదలవుతుంది. దీనికోసం వివిధ ఆకృతుల్లో తయారైన కర్ర అచ్చులను ఉపయోగిస్తారు. వాటిని అనుకున్న రంగుల్లో ముంచి వస్త్రం మీద మొదటి అచ్చు వేస్తారు. ఆ వస్త్రాన్ని రోజంతా ఆరబెడతారు. తర్వాత పారే నీటిలో ఉంచుతారు. తర్వాత హలిజరిన్‌, జాజాకు వేసి అత్యంత వేడిలో ఉడకబెడతారు. దీంతో రంగులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. వస్త్రాన్ని ఆరబెట్టి... మళ్లీ వినియోగదారులు, వర్తకులు కోరిన మేరకు వస్త్రం మీద తుది రంగులు అద్దుతారు. ఆ తర్వాత వస్త్రాన్ని మళ్లీ నదిలో ఉతికి ఆరపెడతారు. అప్పుడు అనుకున్న సహజసిద్ధ రంగుల్లో వస్త్రం తయారవుతుంది. ఇలా ఇక్కడ చీరలు, దుప్పట్లు, అమ్మాయిల దుస్తులు, సంచులు, చేతిరుమాళ్లు, తువ్వాళ్లు, లుంగీలు తయారుచేస్తున్నారు. ఈ ఉత్పత్తులను అమెరికా, జర్మనీ, జపాన్‌, గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఏడాదికి దాదాపు రూ.5 కోట్ల విలువైన ఉత్పత్తులు విదేశాలకు వెళ్తున్నాయి.
ఆకట్టుకునే అచ్చులు
      కలంకారీ వస్త్రాల మీద వివిధ ఆకృతులను సృజించడంలో కర్ర అచ్చుల పాత్ర కీలకం. కొయ్య బొమ్మల మాదిరిగా వీటిని అంత అందంగా చెక్కుతారు. ఈ అచ్చులకు సంబంధించిన ‘మస (అవుట్‌లైన్‌), ముక్కీ (హ్యాండిల్‌)’ తదితర పదజాలం ఆసక్తిదాయకం. విభిన్న ఆకృతుల్లో అచ్చుల్ని రూపొందించడంలో నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌కు చెందిన కొండ్రు గంగాధర్‌, కొండ్రు నరసయ్య సిద్ధహస్తులు. ఈ అన్నదమ్ములు 1986లో పెడనకు వచ్చి స్థిరపడ్డారు. సున్నితమైన పరికరాలతో టేకు చెక్క మీద కళాఖండాలను ఆవిష్కరించడంలో వీళ్లది అందెవేసిన చెయ్యి. ఈ ప్రతిభే వీళ్లకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. 2005లో ఈ అన్నదమ్ములిద్దరినీ జాతీయ ఉత్తమ కళాకారులుగా సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ కొండ్రు సోదరులకు ముందు బందరుకు చెందిన గుజ్జరు రుక్మాజి ఈ అచ్చుల తయారీలో జాతీయస్థాయిలో పేరుపొందారు. 1960, 62, 85ల్లో ప్రభుత్వ పురస్కారాలనూ అందుకున్నారు.
తెర ముద్రణతో ఇబ్బందులు
కలంకారీలో అన్ని రంగులూ, అచ్చులూ సహజసిద్ధంగా తయారయ్యేవే. తెరముద్రణ (స్క్రీన్‌ప్రింటింగ్‌) నమూనాలు, రసాయన రంగులు కొంత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పైగా తెరముద్రణ ద్వారా ఎలాంటి ఆకృతులనైనా సులువుగా రూపొందించే అవకాశముంది. సహజసిద్ధ విధానం ద్వారా ఓ కార్మికుడు అయిదు చీరలకు అచ్చు ముద్రణ చేసే సమయంలో తెర ముద్రణలో వంద చీరలు తయారవుతాయి. దాంతో కలంకారీ పరిశ్రమకు ఈ తెర ముద్రణ నుంచి సవాల్‌ ఎదురవుతోంది. అలాగే, కలంకారీ వస్త్రాలు తయారైన తర్వాత పారుతున్న నీటిలో ఉంచితే నాణ్యత పెరుగుతుంది. కానీ, పెడనలో నీటికొరత ఉంది. ప్రభుత్వమే ప్రత్యేకంగా ట్యాంకులు నెలకొల్పి, నీటిని పారించేలా ఏర్పాటుచేయాలని కళాకారులు కోరుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థల ద్వారా కలంకారీ కళాకారులకు ప్రోత్సాహకాలను కల్పిస్తే ఎగుమతులు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. క్లస్టర్ల ఏర్పాటు, శిక్షణ, ఎగుమతి రాయితీలు కల్పిస్తే ఈ కలంకారీ కలకాలం కాంతులీనుతుందన్నది ఆ కళాకారుల ఆశ. అది నెరవేరాలి. ఎందుకంటే... కలంకారీ కళ తెలుగు సంస్కృతిలో అంతర్భాగం. దాన్ని సంరక్షించుకోవడమంటే మన సంస్కృతిని మనం గౌరవించుకోవడమే.

*   *   *


వెనక్కి ...

మీ అభిప్రాయం

  హస్తకళలు