నవ వసంతాల వెలుగు...తెలుగు!

  • 334 Views
  • 0Likes
  • Like
  • Article Share

    యువశ్రీ మురళి

  • కార్యదర్శి, ధూర్జటి రసజ్ఞ సమాఖ్య
  • శ్రీకాళహస్తి
  • 9491312522
యువశ్రీ మురళి

నూటయాభై మందికి పైగా కవులు ఒకేచోట కలిస్తే... అనేక ప్రాంతాల తెలుగు నుడికారాన్ని తమ కలంలోకి ఆవాహన చేసుకుని కవితలు అల్లితే... వాటిని సుమధురంగా వినిపిస్తే... కవితా వసంతం వెల్లివిరిసినట్లుండదూ! చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఇటీవల ఇదే దృశ్యం హృద్యంగా ఆవిష్కృతమైంది. ఆలోచనాత్మక కవితలతో పాటు తెలుగు భాషోద్యమ శంఖారావాన్నీ వినిపించిన ఈ కవిసమ్మేళనం విశేషాలు...
తెలుగు
భాషకు ప్రాచీనహోదా స్థిరపడిన నేపథ్యంలో భాషాభివృద్ధిలో భాగంగా కవుల కలాలకు పదునుపెట్టేలా జాతీయ తెలుగు కవిసమ్మేళనం నిర్వహించాలని తలపోసింది శ్రీకాళహస్తిలోని ధూర్జటి రసజ్ఞ సమాఖ్య (సాహితీ కళావేదిక). ఆగస్టు 28న 152 మంది కవులతో ఈ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించింది. సమాఖ్య అధ్యక్షులు లగడపాటి భాస్కర్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ సమావేశానికి మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సాకం నాగరాజ, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు పోతుగుంట గురవయ్యనాయుడు, సభ్యులు లోకనాథం నాయుడు, ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ తదితరులు హాజరయ్యారు. మహాశివరాత్రిలోపు శ్రీకాళహస్తిలో ధూర్జటి విగ్రహం, ధూర్జటి సాహితీ సాంస్కృతిక కళా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా పెద్దలు భరోసా ఇచ్చారు.
     విశిష్ట అతిథి ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ ‘అ ఆలను విస్మరిస్తే కన్నతల్లిని విస్మరించినట్లే. వాటిని నేర్చుకోకుండానే ఉన్నతవిద్యను పూర్తిచేయగల విద్యావ్యవస్థ ఉండటం దురదృష్టకరం. తెలుగు భాషోద్యమం ఇంటి నుంచే రావాలి. దీనికోసం భాషా సైనికులు తయారుకావాలి. తెలుగు భాషాభివృద్ధికి సంబంధించి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను పాలకులు నిలబెట్టుకోవాలి’ అని చెప్పారు. కవి సమ్మేళనం ముందురోజు ‘తెలుగుమాట వెలుగుబాట’ అని నినదిస్తూ శ్రీకాళహస్తి చతుర్మాడ వీధులలో పాఠశాల విద్యార్థులు, కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు ప్రదర్శన నిర్వహించారు. భాషాభివృద్ధికి పాలకులు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ కవిసమ్మేళనంలో వివిధ తీర్మానాలను ఆమోదించారు. 
ఉద్యోగులు... విద్యార్థులు...
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన కవిసమ్మేళనంలో వివిధ ప్రాంతాల కవులు కవితాసుమాలను విరబూయించారు. వృత్తిరీత్యా వివిధ రంగాల్లో పనిచేస్తున్నా, సాహితీ రచనను ప్రవృత్తిగా మార్చుకున్న వారి కవితాపఠనానికీ ఈ కార్యక్రమం వేదికైంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఆబ్కారీ సీఐ ఎం.శ్రీరామ్‌ప్రసాద్‌ ‘నవజీవన వేదం’ వినిపించారు. ఆకాశాన్ని అంగవస్త్రంగా.. నేల పుప్పొడిని మేని పరిమళంగా... దిక్కులే నేస్తాలుగా... అంటూ కవితా మాధుర్యాన్ని పంచారు. వైద్యారోగ్య శాఖలో ఆరోగ్య పర్యవేక్షకులు ఎస్‌.ఎన్‌.రసూల్‌ నంద్యాల వాసి. ‘చావు దరువు’ పేరిట అన్నదాతల అగచాట్లను వివరించారు. అలాగే, తన కవితా సేద్యంలోని కష్టాలన్నీ స్వేదబిందు జ్ఞాపకాలై రాలేవని కవితాత్మకంగా చెప్పారు. 
      శ్రీకాళహస్తికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి కిరణ్‌కుమార్‌ ‘కన్నీరు కార్చిన కలం’ ఘోషను వినిపించాడు. ‘నా పేరు కలం... మాటలు రావు రాతలు తప్ప... కనిన దృశ్యాన్ని కదిలిస్తూ సాగుతుంటాను నిరంతరం తరం.. తరం..’ అంటూ సమాజంలో జరుగుతున్న వికృతచేష్టలను తన కవితాఖడ్గంతో ఖండించాడు. మరో ఇంజినీరింగ్‌ విద్యార్థి పున్నప లక్ష్మీకాంత్‌ ‘నా మనోవేదన’ అంటూ లంచగొండితనం లాంటి సమకాలీన సామాజిక సమస్యలను సృశించాడు. 
      ‘నా తెలుగు నవ వసంతాల వెలుగు... నా తెలుగు వెలుగును పంచే అరుణ కిరణం’ అని అమ్మభాషాభిమానాన్ని తన అక్షరాల్లో రంగరించారు కరీంనగర్‌ జిల్లాకు చెందిన వైరాగ్యం ప్రభాకర్‌. ‘ఆడపిల్లను కాను... నేను ఈడపిల్లనే, నిన్ను పెంచిన అమ్మను పోలిన మరో అమ్మను’ అంటూ ఆడబిడ్డల మీద అఘాయిత్యాలను నిరసించారు నూనె శ్రీనివాసులు. ఆయన కడప వాసి. కర్నూలు జిల్లా కవయిత్రి విజయలక్ష్మి ‘మత్తువీడండి’ అంటూ యువత బాధ్యతను గుర్తుచేశారు. దురలవాట్లకు దూరంగా ఉండాలని ఆకాంక్షించారు. బెంగళూరు చెందిన చండీశ్వర్‌ తన ‘కవిసేన’లో కలం సైనికుల సాహితీ ఘనతలను కొనియాడుతూ, అభ్యుదయాన్ని ఆకాంక్షించే వారి స్ఫూర్తికి జోతలు పట్టారు. ఇలా విభిన్న వస్తువులతో శతాధిక కవులు వినిపించిన కవితలన్నీ భాషామాధుర్యంతో భావచైతన్యాన్నీ పంచాయి. 
పాలకులూ ఆలకిస్తారా!
అమ్మభాష కోసం నినదిస్తూ కవిసమ్మేళనంలో ఆమోదించిన తీర్మానాలు.... 
* తెలుగుభాషా రక్షణ, భాషాభివృద్ధికి ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖను, దానికి అనుబంధంగా ‘తెలుగు అభివృద్ధి సాధికారిక సంస్థ’ను తగిన నిధులతో ఏర్పాటు చేయాలి.
* రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకు కార్యకలాపాలన్నీ తెలుగులోనే జరగాలి.
* అన్ని పోటీ పరీక్షల్లో తెలుగు మాధ్యమ అభ్యర్థులకు అయిదు శాతం అదనపు మార్కులు కలపాలి. ప్రశ్నపత్రాలను తెలుగులోనూ ఇవ్వాలి.
* వృద్ధ కవులు, కళాకారులకు పింఛన్లు ఇవ్వాలి. పుస్తక ప్రచురణకు సాహితీవేత్తలకు ఆర్థిక సాయం చేయాలి. 
* గ్రంథాలయాల పన్ను గ్రంథాలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టాలి.
* సూర్యరాయాంధ్ర నిఘంటువును సవరణలతో పునర్ముద్రించాలి.
* తెలుగు ప్రాచీన హోదాకు అడ్డంకులు తొలగిన నేపథ్యంలో భాషాభివృద్ధి కోసం వచ్చే నిధుల మీద రెండు రాష్ట్రాలూ సమన్వయంతో చర్చించుకోవాలి. ఆమేరకు నిధులను పంచుకోవాలి. 
* ‘ప్రాచీన తెలుగు అధ్యయన సంస్థ’ను తెలుగునాట ఏర్పాటుచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. 
* పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు తెలుగు భాషను ఒక పాఠ్యాంశంగా తప్పనిసరి చేయాలి. 1-5 తరగతుల వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి.
* అధికార భాషా సంఘానికి అధికారాలు, విధులు, నిధులు ఇవ్వాలి. స్వయంప్రతిపత్తి కల్పించాలి.
* తెలుగు జానపద కళారూపాలను ప్రోత్సహించాలి. గ్రామాల నుంచి నగరాల వరకూ అన్ని చోట్లా ప్రదర్శనలు ఏర్పాటు చేయించాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం