ఓరుగల్లులో ఓ రోజు

  • 922 Views
  • 2Likes
  • Like
  • Article Share

    చింతలపల్లి హర్షవర్ధన్‌

  • గట్టుఇప్పలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా
  • 9014897030
చింతలపల్లి హర్షవర్ధన్‌

రాయలకు ముందే ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని చాటిన కావ్యం వినుకొండ వల్లభుడి ‘క్రీడాభిరామం’. తెలుగువారి సామాజిక వివరాలకు ఆధారమనదగ్గ కావ్యాల్లో ముందువరసలో నిలిచేది ఈ కావ్యమే. కాకతీయులు, ముఖ్యంగా రెండో ప్రతాపరుద్రుడి కాలపు విశేషాలకు ప్రధాన సాహితీ ఆధారం ఈ ‘క్రీడాభిరామం’. ఇద్దరు యువకులు వరంగల్లులో పర్యటిస్తూ, ఒక్కరోజులో ఆ నగర వీధుల్లో చూసిన దృశ్యాలే దీనికి నేపథ్యం.
‘క్రీడాభిరామం’
పద్యాల నడక శ్రీనాథుడి పద్యాలను పోలి ఉండటం, శ్రీనాథుడు వీథి రూపకంలో రాసిన కొన్ని పద్యాలు ఉండటంవల్ల ఈ కావ్యకర్త శ్రీనాథుడే అన్నారు సాహితీవేత్తలు. అయితే కావ్యం మొదట వల్లభామాత్యుడి వంశవర్ణన, ఆశ్వాసాంత గద్యలో ‘వల్లభరాయ ప్రణీతము’ అనే ఉంటుంది. కాబట్టి దీన్ని వల్లభరాయడే రాశాడని తేల్చారు. పదిరకాల రూపకాల్లో వీధి నాటకపు ప్రక్రియకు చెందింది ‘క్రీడాభిరామం’. దీనికి మూలం రావిపాటి త్రిపురాంతకుడి సంస్కృత ‘ప్రేమాభిరామం’. ఇది అలభ్యం.
      ఇక వల్లభరాయడు వినుకొండ తిప్పయామాత్యుడు, చందమాంబల కుమారుడు. వీళ్ల పూర్వీకులది వినుకొండ. వల్లభామాత్యుడేమో ములికినాటిలోని (కడప జిల్లా) మోపూరు కరణం. దీని ఆధారంగా... శ్రీనాథుడు విజయనగర పర్యటనకు వెళ్తూ ఆ రాజుల ప్రాపకం ఉన్న వల్లభుని సాయం అర్థించి, మోపూరికి వచ్చి ఉంటాడు. అప్పుడే శ్రీనాథుడి సహకారంతో రసికుడు, పండితుడైన వల్లభామాత్యుడు ‘క్రీడాభిరామం’ రచించి ఉండొచ్చంటారు ఆరుద్ర. 
శ్రీనాథుడికి అనుకరణా?!
వల్లభరాయలది 15వ శతాబ్దం. కావ్యంలో చెప్పిన సమాజం 13, 14 శతాబ్దుల సంధికాలం. 294 పద్య గద్యాలతో ఉన్న క్రీడాభిరామం తొలి తెలుగు నాటకం. గోవింద మంచనశర్మ, టిట్టిభసెట్టి అనే ఇద్దరు యువకులు ఇందులో ప్రధానపాత్రలు. గోవిందమంచనశర్మ పేరులో విష్ణుమూర్తి ఉన్నా... శివభక్తుడు. అతని సఖుడు టిట్టిభుడు సెట్టి కులస్థుడు. శ్రీనాథుడూ అంతే... పేరు విష్ణుమూర్తిది. తత్వం ఈశ్వరార్చనా కళాశీలత్వం. పైగా అవచి తిప్పయసెట్టితో స్నేహం. మంచనశర్మకు మల్లేనే శ్రీనాథుడికీ దేశ పర్యటన ఇష్టం. దాంతో ఈ కావ్యాన్ని శ్రీనాథుడికి పేరడీగా రాశారంటారు బి.వి.సింగరాచార్యులు.
నవ మన్మథుడు
గన్నెరు బూజాయ కరమొప్పు నీర్కావి/ మడుగు ధోవతి పింజె విడిచికట్టి; గొజ్జంగి పూనీరు గులికి మేదించిన/ గంగమట్టి లలాటకమున దీర్చి; వలచేత బంగారు జలపోసనము తోడ/ బ్రన్నని పట్టుతోరము ధరించి; జఱిగొన్న వెలిపట్టు జన్నిదంబు లుంగ/ యంటులు వాయంగ నఱుతవైచి... తళతళలాడే కాషాయపు కోక, పెద్దశిఖ, లేలేత పెదవులమీద చిరునవ్వు తొణికిసలాడుతుండగా, మన్మథుడికి సాటివచ్చే అందగాడైన కాసల్నాటి గోవిందమంచనశర్మ, అనుంగు చెలికాడు టిట్టిభసెట్టితో కలిసి విహారం కోసం అ(ఆ)ంధ్రనగర యాత్రకు బయలుదేరాడు. ఆంధ్రనగరం అంటే ఓరుగల్లు పట్టణం. అదీ పుష్య మాసవేళలో, సంక్రాంతి పర్వదినాల్లో. అప్పటి వాతావరణానికి తగినట్లుగా చలి వణికించడంతోనే మొదలవుతుందీ కావ్యం. అదేరోజు రాత్రి మంచనశర్మ తన ప్రేయసి కామమంజరికి దగ్గరవడంతో ఈ నాటకం ముగుస్తుంది. అంటే కావ్యం నిడివి ఒక్కరోజు. ఆ ఒక్కరోజు ఓరుగల్లు నగరంలో శర్మ, సెట్టిలకు కనిపించిన దృశ్యాలే కావ్య వర్ణనలు. అందుకే ఇందులో వరంగల్లుతో పెనవేసుకున్న సమాజం కనిపిస్తుంది.
ఓరుగంటి వైభవం
‘ఓరుగంటి పురంబు సౌధములపై’ లేత ఈరెండ పరచుకున్న వర్ణన అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రాతఃకాలంలో వెలిపాళెంలోకి ప్రవేశించడంతో నగర సందర్శన ప్రారంభమవుతుంది. తర్వాత అంగడిమార్గంలో తచ్చాడతారు శర్మ సెట్టిలు. ఆ తర్వాత మోహరివాడ (సైనికులవాడ, కంటోన్మెంటు లాంటిది)... అక్కడినుంచి ఉత్తరానికి కొంతదూరం వెళ్లాక బాహ్య కటక వీధిలోకి ప్రవేశిస్తారు. ఆ వీధి చుట్టూ సప్తపాతాళాలను పరివేష్టించేంత పెద్ద అగడ్త ఉందట. ఇక ప్రాకారమైతే నక్షత్ర మండలాన్నే సిగబంతిగా ధరించిందా! అన్నట్లుగా కంటిచూపునకు ఆననంత ఎత్తుగా ఉందట. ఆ కోటగోడ ముందరున్న దారి, భూమి అంతటినీ ఒక్కదగ్గర కుప్ప పోశారా అన్నట్లు జనంతో కిటకిటలాడుతోంది. బాగా మెరుగుపెట్టిన లోహపు తలుపులతో ఆ కోటగోడ ద్వారం మేరు పర్వతాన్ని తలపిస్తోంది. ఆ వైభవాన్ని కళ్లారా తిలకిస్తూ మంచనశర్మ తన సఖుడితో కలిసి రథాలు, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులతో సందడిగా ఉన్న వీధిని చూసి.. ఓహో! అనుకుంటూ, ఆ మార్గంలో వెళ్తే ఇబ్బంది ఎదురవుతుందేమోనని మరో చిన్నమార్గాన్ని అనుసరించారు. అలా అక్కలవాడకు (వేశ్యవాడ) వెళ్తూంటే.. ఒకదగ్గర పల్నాటి వీరగాథా ప్రదర్శన జరుగుతోంది. అక్కడ మగవాళ్లు రకరకాల విన్యాసాలు చేస్తూంటే ఒక స్త్రీ పలనాటి వీరగాథను ఆలపిస్తోంది. నాగమ్మ మంత్రాంగం, బ్రహ్మనాయుడి చాపకూడు, నలగామరాజు- మలిదేవరాజుల మధ్య జరిగిన కోడిపోరు... ఈ మూడే పలనాటియుద్ధానికి కారణాలుగా ఆమెనోట పలికిస్తాడు కవి.
ఏకవీరా దేవి
ఈమె పరుశురాముని తల్లి. కాకతీయుల కులదైవం కాకతమ్మకు సైదోడుగా అభివర్ణించాడు కావ్యకర్త. ఈమెముందు నిలుచుని బవనీలు (బైండ్లవాళ్లు) పరుశురాముడి కథలు పెద్దగా ఆలపిస్తు న్నారట. ఇంకా ఓరుగల్లు పురవీధుల్లో జక్కుల పురంధ్రులు కామవల్లి(లక్ష్మీదేవి)ని స్తుతించడాన్ని నమోదుచేశాడు. ఈ జక్కుల పురంధ్రుల పాటను ఎవరో పెద్దమనిషి సంతానాన్ని కాంక్షించి ఏర్పాటుచేశాడట. జక్కుల పురంధ్రుల గాన కళాభిమానమే యక్షగానానికి నాంది అంటారు సాహితీవేత్తలు. అలా ముందుకు నడవగా మైలారువీరులు నిప్పులగుండం తొక్కుతున్న దృశ్యం మిత్రుల కంటబడుతుంది. అక్కడే ఓ గొరగ యువతి గొండ్లి ఆడుతోంది. అంతేకాదు, ఆ గొరగపడుచు ప్రేక్షకుల్ని కట్టిపడేసే మరో విన్యాసమూ చేసింది. దాని పద్యరూపం ఇది...
వెనుకకు మొగ్గవాలి కడు విన్ననువొప్పగ దొట్టెనీళ్లలో/ మునిగి తదంతరస్థమగు ముంగరముక్కున గ్రుచ్చుకొంచు లే/ చెను రసనా ప్రవాళమున శీఘ్రము గ్రుచ్చెను నల్లపూస పే/ రనుపమ లీల నిప్పడుచు పాయము లిట్టివి యేల నేర్చెనో? 
      ఆ గొరగపడుచు ఒక నీళ్లతొట్టిలోకి వెనక్కి వంగి ముక్కెర తీసుకుని, ముక్కుకు పెట్టుకుని ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. ఇంకా నల్లపూసలను నాలుకతో తీసి దండగా గుచ్చింది. దాన్ని ఆసక్తితో, ఆశ్చర్యంగా తిలకించిన మంచనశర్మ వరంగల్లులో కొలువుదీరిన భైరవుని జోడు మైలారుదేవుణ్ని స్తుతించి ముందుకు వెళ్లాడు. ఆ పయనంలో అతను చూసిన ‘స్వయంభూ దేవాలయం, బౌద్ధ ఆలయం, ముసానమ్మ (గ్రామదేవత) గుడి, మసీదు’లను బట్టి చూస్తే, ఎవరి నమ్మకాలను అనుసరించి వాళ్లు దేవుళ్లను పూజించే ఏర్పాట్లు ఉన్నాయని తెలుస్తుంది. రెండో ప్రతాపరుద్రుడి కాలానికే మహమ్మదీయులు తెలుగునేల మీద స్థిరపడ్డట్టున్నారు!
మాచల్దేవి ఘనత
మధ్యాహ్న వేళయ్యేసరికి శర్మ, సెట్టిలకు కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. అప్పుడు లక్ష్మణవజ్ఝ ఇంట్లో ఒక రూపాయికి దొరికిన ‘కప్పురభోగి వంటకం...’ రుచి తెలుగువారికి బాగా తెలిసిందే. అంతేనా తాలింపుల ఘుమఘుమలు, తాంబూల సేవన ప్రస్తావనా ఉందిక్కడ. అక్కడినుంచి అలావెళ్తూ ప్రతాపరుద్రుడి భోగపత్ని మాచల్దేవి సదనాన్నీ సందర్శించారు మిత్రులిద్దరూ. ఆమెను చూసి... ‘అమ్మా మాచల్దేవీ! మేం అబద్ధమాడటం లేదు. నీకున్న ప్రసిద్ధి ఢిల్లీ సుల్తాను పట్టమహిషికి కూడా లేదు. ఆదిలక్ష్మికి నీకు భేదమేముంది? సముద్రంలో జన్మించటం ఒకటి తప్ప’ అంటాడు. మాచల్దేవి, మంచనశర్మలు ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నాక... ఆమె చిత్రశాలలో ప్రవేశించి, అక్కడి చిత్రాల్ని చూసి చిత్రకారుని నైపుణ్యాన్ని పొగుడుతాడు. 
ముకురవీక్షణం
మంచనశర్మ, టిట్టిభుడు అక్కలవాడలోకి వెళ్తుండగా ఒకదగ్గర ఏదో వేడుక జరుగుతుంటుంది. అది మదనరేఖకు అద్దం చూపించే వేడుక. ఆమె మంచనశర్మకు కామమంజరి ద్వారా జన్మించింది. మదనరేఖకు వయసొచ్చిందని సూచించేందుకు జరిపే వేడుక ఈ ముకురవీక్షణం. అక్కడ ఒక గాంధర్వి ‘మీరిన్నాళ్లు ఎక్కడున్నారు?’ అని అడగ్గా, మంచనశర్మ శ్రీకాకుళంలో ఆంధ్రవిష్ణువు తిరునాళ్ల విషయం, ఆ జాతరలో చెలరేగిన విశృంఖలత్వం గురించి వ్యంగ్యంగా చెబుతాడు. తర్వాత మాచల్దేవి మొదలుగా అక్కడున్న వేశ్యలందరినీ తనదైన రసికత్వాన్ని మేళవించి దీవించి నగరంలోకి బయలుదేరతాడు. అలా వెళ్తూంటే వాళ్లకు పాములమెంగని నాగస్వరం వినిపిస్తుంది. ఈ సందర్భంలో పాములు ఆడించేవాడి వర్ణన స్వభావోక్తి. ఇక నాగుపాములు ఆడుతూంటే వర్ణించిన స్వరాలు నాగసింధు, వరాట లాంటి ప్రేమ సంబంధ రాగాలు కావడం వైచిత్రి. ఇంకా తూర్పునాటి గడిడు (గడెకట్టి ఆడేవాడు), పొట్టేళ్లు, కోడి పందేలను చూసి వాటిగురించి వ్యంగ్యంగా వేళాకోళమాడతాడు మంచనశర్మ. ఇవి ఆనాటి సజీవ ద్యూతాలు. 
సామాజికత
క్రీడాభిరామంలో వర్ణించిన విశేషాలన్నీ నాటి సమాజ ప్రతిబింబాలే. అందుకే సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ నిర్మాణంలో కాకతీయుల కాలపు విశేషాల నమోదుకు ఇతోధికంగా ఉపయోగపడింది. కావ్యంలో ప్రస్తావించిన సమయం సంక్రాంతి పండగప్పటిది. కాబట్టి ఓరుగంటి వీధిలో గొబ్బెమ్మలు పెడుతున్న కాపుటిల్లాలిని ప్రస్తావిస్తూ... ‘గోమయపిండములింటి(గొబ్బెమ్మలు) ముంగిటన్‌’ అన్నాడు కావ్యకర్త. ఇంకా ఓ వనిత ‘సుసరభేత్త’నే రోమహారిణిని అమ్ముతోందట. మరోచోట ఓ వేశ్యని ఓ దర్జీ విషయాసక్తుడై చూస్తుంటాడు. ఇంకోచోట జూదమాడుతుంటారు. ఇంకా పసుపు అమ్మే స్త్రీ, గానుగాడించే పడుచు, కరణదేశపు కాంత, శకునాలు, గ్రామదేవతల కొలుపులు, గారడీవాళ్లు, పూటకూళ్ల ఇళ్లు, నాటకాలు, నారసాలు పొడుచుకునే మైలారభటులు, నగర జనులకు సమయం తెలిసేందుకు కాకతీయ రాజుల కొలువకూటంలో (మొగసాల) గంటలు కొట్టే గడియారం ఏర్పాటు... ఇలా అప్పటి వరంగల్లు నగరం సందడినంతా కళ్లకుకడుతుందీ కావ్యం. తెలుగునేల మీద ఉన్న అప్పటి ప్రసిద్ధ పట్టణాల్లోనూ ఇదే వాతావరణం ఉండొచ్చు. వేశ్యలు తప్పు చేస్తే ఆనాడు శిక్షలు ఎలాగుండేవో మంచనశర్మ తీర్పు నుంచి తెలుస్తుంది. వేశ్యల దగ్గరికి వెళ్లేముందు ‘రోపట్టు’ అనే సుంకం చెల్లించాల్సి ఉండేది. స్త్రీ పురుషులు ఇద్దరూ పూలు పెట్టుకునే వాళ్లేమో! ఓ సందర్భంలో ఒక పడుచు మంచనశర్మకు మొగలిపువ్వు ఇస్తే, దాన్ని తలలో ముడుచుకుంటాడు.
సులభమైన భాష
పద్యాలు సరళంగా, చిక్కటి ధారతో సాగుతాయి. కొన్ని పద్యాలకు కాలదోషం పట్టి ఉండవచ్చు అంటారు. ఏకవీరాదేవిని వర్ణించే సందర్భంలో పరుశురాముడు ‘ముయ్యేడు సార్లు’ రాజులమీదికి దండెత్తిన విషయం ప్రస్తావించాడు. ఇరవై ఒక్కసార్లు అనకుండా, మూడును ఏడుతో హెచ్చించి ‘ముయ్యేడు’ అనడం విశేషం. పూటకూటింటి భోజనం సందర్భంలోని ‘చంకలబంటిదాక మెసవి’... అచ్చ తెలుగు నుడికారం. సుష్టుగా తిన్నారు అనేందుకు ‘చంకలబంటి’, ‘కుత్తుకబంటి’ ప్రయోగాలు వాడుకలో ఉన్నాయి. ‘బంటి’ అంటే దాక, వరకు అని. ఇది లోతును చెప్పేందుకు వాడే పదం. మసీదులో అల్లాను ప్రార్థిస్తారు, ఇక్కడ రూపంలేని దేవుణ్ని చెప్పేందుకు ‘కర్తారుడు’ (సృష్టికర్త), దర్జీని సూచించడానికి ‘సౌచిక పల్లవుండు’ (చేతిలో సూది కలిగినవాడు) అన్న పదాలు వాడాడు వల్లభామాత్యుడు. కావ్యం చివర్లో నవ్వులాట అనేందుకు వర్ణవ్యత్యయం చేసి ‘నవ్వుటాల’ అన్నాడు. ఇది కృష్ణా గుంటూరు జిల్లాల వాడుకలో ఇప్పటికీ నిలిచి ఉంది. అక్కడక్కడా వర్ణనలు శృతిమించినా అది అప్పటి సమాజపు వ్యంగ్యచిత్రణే తప్ప, ‘క్రీడాభిరామం’ అశ్లీలకావ్యం కాదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం